Crypto Currency: క్రిప్టోకరెన్సీ మార్కెట్ కుప్పకూలేందుకు కారణం ఇతనేనా? ఈయన కథేంటి?

- రచయిత, సెసెలియా బారియా
- హోదా, బీబీసీ ముండో
ఒక్క రోజు రాత్రిలోనే 40,000 మిలియన్ డాలర్లు (రూ.3.11 లక్షల కోట్లు) ఆవిరి అయ్యాయి.
ఇది హోండురాస్, ఎల్ సాల్వడార్, బొలివియా లాంటి దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కంటే చాలా ఎక్కువ.
‘‘లూనా’’, ‘‘టెర్రా’’ల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులు మే 13న ఒక్కరోజే ఇంత మొత్తాన్ని కోల్పోయారు. ఈ రెండు క్రిప్టోకరెన్సీలను 30ఏళ్ల దక్షిణ కొరియా టెక్ దిగ్గజం డో క్వాన్ సృష్టించారు.

ఫొటో సోర్స్, Getty Images
స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో..
భవిష్యత్‌తరం టెక్నాలజీలతో మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులను తీసుకురావాలనే కలతో సిలికాన్ వ్యాలీలో అడుగుపెట్టే విద్యార్థుల్లానే క్వాన్ కూడా అమెరికాకు వచ్చారు.
ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో క్వాన్ డిగ్రీ పట్టా పొందారు. మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి సంస్థల్లో ఆయన పనిచేశారు. అ తర్వాత టెక్నాలజీ సంస్థ ‘‘ఎనీఫై’’ను ఆయన స్థాపించారు.
అయితే, 2018లో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. సింగపూర్ కేంద్రంగా ఆయన ‘‘టెర్రాఫామ్ ల్యాబ్స్’’ను స్థాపించారు.
డేనియల్ షిన్‌తో కలిసి ఈ సంస్థను ఆయన స్థాపించారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే చెల్లింపుల వ్యవస్థను తీసుకొచ్చేందుకు టెర్రాఫామ్ ల్యాబ్స్ పనిచేసేది.
బ్యాంకులు లేదా ఇతర మధ్యవర్తుల అవసరం లేకుండా పనిచేసే ఆధునిక ఆర్థిక వ్యవస్థ కోసం తాము కృషి చేస్తున్నట్లు అప్పట్లో క్వాన్ చెప్పారు.
అలా క్రిప్టోకరెన్సీ ప్రపంచంలోకి క్వాన్ అడుగుపెట్టారు. క్రిప్టోకరెన్సీల భవిష్యత్‌ను ముందే అంచనా వేసిన బైనాన్స్ లాంటి కంపెనీలు ఆయనకు మద్దతు పలికాయి.
టెక్నాలజీ ప్రపంచంలో గొప్ప విజయాన్ని సాధించిన వారిలో ఒకరిగా క్వాన్‌ను ఫోర్బ్స్ అభివర్ణించింది. చాలా కొద్ది కాలంలోనే ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.

ఫొటో సోర్స్, Twitter
‘‘ప్రపంచాన్ని మార్చే శక్తి’’
తాను మొదలుపెట్టిన క్రిప్టోకరెన్సీ లూనాను ‘‘తన అద్భుత ఆవిష్కరణ’’గా క్వాన్ అభివర్ణించారు. ఈ డిజిటల్ కరెన్సీలకు ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే శక్తి ఉందని ఆయన చెప్పారు.
తన కుమార్తెకు కూడా ‘‘లూనా’’ అని పేరు పెట్టినట్లు ట్విటర్ వేదికగా క్వాన్ వెల్లడించారు.
చాలా కొద్ది కాలంలోనే ‘‘లూనా’’ మదుపరుల విశ్వాసాన్ని గెలుచుకుంది. ఈ క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టేవారిని ‘‘లూనాటిక్స్’’గా పిలిచుకునేవారు.
తమ కొత్త ప్రాజెక్టుల కోసం క్వాన్ కంపెనీ.. వెంచర్ క్యాపిటల్ సంస్థల నుంచి మిలియన్ల డాలర్ల నిధులను సమీకరించింది.
చాలా కొద్ది కాలంలోనే మార్కెట్‌లో దిగ్గజ సంస్థల విశ్వాసాన్ని క్వాన్ సంపాదించారు. తన ల్యాబ్స్ సృష్టించిన అల్గారిథమ్స్‌పై మిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేలా ఆయన ఒప్పించగలిగారు.
బిట్‌కాయిన్లను ఎవరు సృష్టించారో ఎవరికీ తెలియదు. వీటి వెనకున్నది ఎవరో తెలియకుండానే ఈ ప్రాజెక్టులకు నిధులు సమీకరిస్తుంటారు. కానీ, క్వాన్ కాయిన్లు మాత్రం ‘‘క్వాన్’’ పేరుతోనే మార్కెట్లోకి వచ్చేవి.
గ్యాలక్సీ డిజిటల్ సీఈవో మైక్ నోవోగ్రాట్జ్ లాంటి దిగ్గజ వ్యాపారవేత్తలను కూడా లూనాకు మద్దతు పలికేలా క్వాన్ ఒప్పించారు. లూనాకు మద్దతు పలుకుతూ మైక్ తన భుజంపై ఒక పచ్చబొట్టు కూడా వేయించుకున్నారు.
ప్రముఖ మదుపరుల మద్దతు నడుమ టెక్నాలజీ పాడ్‌కాస్ట్ ‘‘మిషన్: డీఫై’’లో క్వాన్‌ను ‘‘కల్ట్ పర్సనాలిటీ’’గా అభివర్ణించారు.

ఫొటో సోర్స్, News1
ట్విన్ కాయిన్లు
2018లో లూనాతో క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లోకి క్వాన్ అడుగుపెట్టారు. ఆ తర్వాత రెండేళ్లకు టెర్రాను సృష్టించారు.
మిగతా క్రిప్టోకరెన్సీల కంటే వీటి ధర కాస్త స్థిరంగా ఉండటంతో ఈ రెండింటినీ స్టేబుల్ కరెన్సీ లేదా స్టేబుల్ కాయిన్‌గా పిలుస్తుంటారు.
లూనా, టెర్రాలలు టెర్రా ల్యాబ్స్‌లో అభివృద్ధి చేసిన ప్రత్యేక అల్గారిథమ్‌ల ఆధారంగా పనిచేస్తాయి.
ఈ రెండు కాయిన్ల విలువ ఒకదానిపై మరొకటి ఆధారపడుతుంటాయి. అందుకే వీటిని ట్విన్ కరెన్సీలుగా పిలుస్తారు.
అంతా సవ్యంగా నడుస్తున్నట్లు అనిపిస్తున్న సమయంలోనే కొందరు విమర్శకులు క్వాన్ టెక్నాలజీని ‘‘పొంజీ స్కీమ్’’గా అభివర్ణించారు. ఇది ఎప్పుడైనా కుప్పకూలొచ్చని అంచనాలు వేశారు.

ఫొటో సోర్స్, Twitter
కూప్పకూలడంతో..
ఆ అంచనాలు నిజమయ్యాయి.
వరుసగా క్రిప్టోకరెన్సీల విలువ తగ్గిపోవడం, ఆర్థిక మందగమనం వార్తల నడుమ క్వాన్ అల్గరిథమిక్ ఫార్ములాలపై మార్కెట్ విశ్వాసాన్ని కోల్పోయింది.
ఫలితంగా 118 డాలర్లు (రూ.9100) నుంచి 0.09 డాలర్లకు (రూ.7కు) లూనా పడిపోయింది. టెర్రా విలువ కూడా ఇలానే కుప్పకూలింది.
ఈ రెండు కరెన్సీలు ఒక్కసారిగా కుప్పకూలడంతో మార్కెట్‌లో చాలా మంది తమ క్రిప్టోకరెన్సీలను అమ్మేయడం మొదలుపెట్టారు. దీంతో మొత్తంగా క్రిప్టోకరెన్సీ రంగమే కుప్పకూలింది.
‘‘నా ఆవిష్కరణతో ప్రజలు బాధపడటాన్ని చూస్తుంటే నా గుండె బద్ధలవుతోంది’’అని క్వాన్ ఒక ట్వీట్ చేశారు.
పెద్ద పెద్ద మదుపరులు బిలియన్ డాలర్లలో సంపదను నష్టపోయారు. అయితే, ఈ రంగంలో ఉండే ముప్పుల గురించి వారికి ముందే అవగాహన ఉంటుంది. మార్కెట్ విశ్లేషకులు, క్రిప్టోగ్రాఫర్ల అధ్యయనం తర్వాతే వారు మార్కెట్‌లోకి అడుగుపెడతారు.
అయితే, చిన్న మదుపరులతోనే అసలు సమస్య. ఈ అల్గారిథమ్‌లలో సంక్లిష్టతను అర్థం చేసుకోకపోవడంతోపాటు దీనిలో తేలిగ్గా డబ్బులు సంపాదించొచ్చని వారు భావిస్తున్నారు.
సోషల్ నెట్‌వర్క్ రెడిట్‌లో చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోందని కూడా చెబుతున్నారు.
ఈ రెండు కాయిన్ల విలువ కుప్పకూలడంతో నిరసన తెలిపేందుకు క్వాన్ ఇంటికి వెళ్లిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
తన జీవితం నాశనమైందని ఆయన బీబీసీతో చెప్పారు.
‘‘చాలా కొద్ది సమయంలోనే నేను 2.4 మిలియన్ల డాలర్లు (రూ.18.65 కోట్లు)ను నష్టపోయాను’’అని మరో వ్యక్తి చెప్పారు.
మరికొంతమంది మార్కెట్ పూర్తిగా కుప్పకూలక ముందే పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
హాంకాంగ్‌కు చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ సీఎంసీసీ గ్లోబల్ కో ఫౌండర్ మార్టిన్ బౌమన్ ఒక్కో కాయిన్‌ను వంద డాలర్లు (రూ.7700) చొప్పున విక్రయించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
కొన్ని రోజుల క్రితమే లూనా కొత్త వెర్షన్ లూనా 2.0ను ఆవిష్కరించబోతున్నట్లు క్వాన్ చెప్పారు.
తమ కాయిన్లు విపరీతంగా కుప్పకూలడంతో ఆయన మీడియా ముందుకు రావడం లేదు.
మార్కెట్ కుప్పకూలడంతో బాధితులుగా మారిన కొంతమంది కోర్టులో కేసులు వేస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన కొత్త వ్యూహాలతో ముందుకు రావొచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ‘నా భార్య నగ్న ఫోటోలు అప్పులు ఇచ్చే వారి దగ్గరకు ఎలా వెళ్లాయి’
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్‌లెట్‌కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- పిల్లలు సంతోషంగా ఉండాలంటే తల్లి ఏం చేయాలి? ‘సూపర్ మామ్’గా ఉండటం కరెక్టేనా?
- పుతిన్ కాల్పుల విరమణ ప్రకటిస్తారా? యుక్రెయిన్ గెలుస్తుందా
- నైకా, మామాఎర్త్ వంటి స్టార్టప్స్ భారత్‌లో చర్మ సౌందర్య సాధనాల విప్లవానికి ఎలా నాంది పలికాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













