పంది, జింక వృషణాలను పొడి చేసుకుని తింటే మగాళ్లలో సంతాన శక్తి కలుగుతుందా, మధ్య యుగాల నాటి వైద్య గ్రంథాల్లో రాసి ఉన్నది ఎంత వరకు నిజం?

సంతానలేమి సమస్య

ఫొటో సోర్స్, WELLCOME IMAGES

ఫొటో క్యాప్షన్, మధ్య యుగాలలో స్త్రీలు, పురుషుల్లో కూడా సంతానలేమి సమస్య ఉంటుందని వైద్యులు భావించేవారు
    • రచయిత, లారా ప్లిట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సంతానం కలిగించే శక్తి లేని మగవాళ్లు పంది, జింక వృషణాలను తింటే ఆ శక్తి కలుగుతుందని, ఇదే మేలైన చికిత్స అని మధ్య యుగాల కాలంలో నమ్మినట్లు ఆధారాలు ఉన్నాయి.

వృషణాలను ఎండబెట్టి, మెత్తగా పొడి చేసి, వైన్‌లో కలుపుకుని తాగడం, క్యాట్‌నిప్ లాంటి ఆకులు, సహజ మూలికలతో తయారైన కషాయాలను పురుషులలో సంతాన లేమికి చికిత్సగా మధ్య యుగాలలో పశ్చిమ ఐరోపా వైద్యులు సూచించేవారు.

పురాతన వైద్య గ్రంథాల్లో ప్రతిపాదించిన ఈ చికిత్సలు చూస్తుంటే గర్భధారణ, సంతాన లేమి పూర్తిగా మహిళలకు సంబంధించిన విషయం కాదని, పురుషులలో కూడా సంతాన లేమి ఉండవచ్చని అప్పటి వైద్యులు గుర్తించారన్న విషయం తెలుస్తోందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్‌లో చరిత్ర ప్రొఫెసర్ కేథరీన్ రైడర్ అన్నారు.

వీడియో క్యాప్షన్, కామసూత్ర: అరబ్ సెక్స్ సాహిత్యంలో ఏముంది?

రైడర్ అధ్యయనం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురించే 'సోషల్ హిస్టరీ ఆఫ్ మెడిసిన్ జర్నల్‌'లో పబ్లిష్ అయింది. దీని కోసం ఇంగ్లిష్, లాటిన్ భాషల్లో ఉన్న అనేక గ్రంథాలను రైడర్ విశ్లేషించారు. యూనివర్సిటీ విద్యార్థులు లేదా పెద్ద చదువులు చదువుకున్నవారు ఈ రెండు భాషలనే విరివిగా ఉపయోగిస్తారు.

రైడర్‌కు ఆశ్చర్యం కలిగించే విధంగా ఈ అంశానికి సంబంధించి అనేక అధ్యయనాలు కనిపించాయి.

"చరిత్ర పుస్తకాల్లో రాజులు, రాణుల గురించి మాట్లాడేటప్పుడు స్త్రీలకే సంతాన లేమి సమస్య ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ వైద్య గ్రంథాల్లో అలా లేదు. పురుషులలో సంతాన లేమి గురించి చర్చించిన అనేక గ్రంథాలు, పత్రాలు కనిపించడం చాలా ఆశ్చర్యం కలిగించింది. పూర్వం ఈ నింద పూర్తిగా స్త్రీల పైకే నెట్టేవారని అనుకునేదాన్ని" అని రైడర్ బీబీసీతో చెప్పారు.

సంతానలేమి సమస్య

ఫొటో సోర్స్, WIKICOMMONS

ఫొటో క్యాప్షన్, రాణి తల్లి కాకపోతే, ఆమెలోనే ఏదో సమస్య ఉందని నింద వేసేవారు

మూత్రంలో పురుగుల పరీక్ష

జంటలో ఎవరికి సంతాన లేమి సమస్య ఉందో తెలుసుకోవడం కోసం వైద్యులు మూత్రానికి సంబంధించిన పలు రకాల పరీక్షలు నిర్వహించేవారు.

ఆ కాలపు గ్రంధాల్లో ఎక్కువగా ప్రస్తావించిన పరీక్ష ఏంటంటే, ఇద్దరు మూత్రాలను విడిగా సేకరించి, అందులో ఓట్స్ ఊక వేసేవారు. అలా వాటిని 10 నుంచి 14 రోజులు కదపకుండా ఉంచేవారు.

ఎవరి మూత్రంలో పురుగులు కనిపిస్తే వారికి సంతాన లేమి సమస్యలు ఉన్నట్టు గుర్తించేవారు.

పంది వృషణాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జంతువుల వృషణాలను మెత్తగా పొడి చేసి, వైన్‌లో కలుపుకుని తాగేవారు

మెడిసినా? మ్యాజిక్కా?

పంది లేదా జింక వృషణాల పొడిని పురుషులకు మందుగా సూచిస్తే, వాటిల్లోనే ఆడ జంతువుల జననేంద్రియాల పొడిని స్త్రీలకు చికిత్సగా సూచించేవారు. ఈ పొడిని కషాయంలా తాగడమే.

ఈ కాలంలో కషాయాల విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో, ఆ కాలంలో కూడా అలాంటి జాగ్రత్తలే సూచించేవారు. మరీ ఎక్కువ కషాయం తాగకూడదు, శరీర బరువు సమతుల్యత (మరీ లావుగా లేదా మరీ సన్నంగా ఉండకూడదు), అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కువ సెక్స్ చేయకూడదు, అలాగని తక్కువా కాదు.

అయితే, ఇది నిజంగా మందేనా లేక మంత్రాలకు చింతకాయలు రాలడం లాంటిదా?

"దీనికి కచ్చితమైన జవాబు చెప్పలేం. ఇప్పటి ప్రజలకు ఇవి మూఢనమ్మకాల్లా కనిపించినా, వాటిలో కొంతవరకు వైద్య సంబంధ అంశాలు ఉండి ఉండవచ్చు" అని రైడర్ వివరించారు.

"మూలికా వైద్యంతో పాటు ఈ చికిత్సా విధానాలు కూడా పూర్వ కాలపు గ్రంథాల్లో కనిపిస్తాయి. మధ్య యుగాలలో శాస్త్రీయ జ్ఞానం నాలుగు ద్రవాల సిద్ధాంతంపై ఆధారపడి ఉండేది.

దీని ప్రకారం, మానవ శరీరంలో ముఖ్యంగా నాలుగు ద్రవాలు ఉంటాయి. ఈ ద్రవాల్లో సమతుల్యం మనిషి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. మూలికా వైద్యం ఈ సమతుల్యాన్ని సాధించడానికి తోడ్పడుతుందని, తద్వారా సంతోనోత్పత్తి సమస్యలనూ అధిగమించవచ్చన్నది అప్పటివారి ఆలోచన కావచ్చు" అని రైడర్ అన్నారు.

అయితే, ఈ చికిత్సలు ఎంతవరకు సఫలీకృతమయ్యాయో తెలిపే అధ్యయనాలు అందుబాటులో లేవు.

"ఇది చాలా నిరాశ కలిగించే విషయం. ఈ గ్రంథాల్లో ఇలా చేయి, అలా చేయి అని చెప్పారు. చేస్తే ఫలితం ఉంటుందన్న నమ్మకాన్ని కలిగిస్తారు. కానీ, వీటి ప్రభావాన్ని సూచించే ఉదాహరణలు మాత్రం లేవు. ఎక్కడో, ఒకటి రెండు చోట్ల మాత్రం ఈ చికిత్సా విధానాలు చాలామందికి పని చేశాయని రాసి ఉంది. మళ్లీ కొన్నిచోట్ల సంతానలేమికి చికిత్స చాలా కష్టమని కూడా రాశారు" అని రైడర్ వివరించారు.

వీడియో క్యాప్షన్, ఆండ్రోపాజ్: మగవాళ్లలో సెక్స్ కోరికలు తగ్గడానికి కారణం ఇదేనా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)