Indian Presidential Election: రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు, ఎలక్ట్రోరల్ కాలేజ్ అంటే ఏంటి?

ఫొటో సోర్స్, Facebook/President of India
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాష్ట్రపతి ఎన్నికలు ఎన్నికకు జులై 18 సోమవారం ఉదయం నుంచి పోలింగ్ జరుగుతోంది. 2017 జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం త్వరలో పూర్తి కానుంది.
అధికార ఎన్డీయే ద్రౌపది ముర్మును తమ అభ్యర్ధిగా ప్రకటించగా, ప్రతిపక్ష పార్టీలు యశ్వంత్ సిన్హాను బరిలో నిలిపాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారో ఒకసారి చూద్దాం.
భారత రాష్ట్రపతి పదవీ కాలం అయిదేళ్లు. అంటే ప్రతి అయిదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది.

ఫొటో సోర్స్, Facebook/President of India
ఎలక్టోరల్ కాలేజీ అంటే ఏమిటి?
దేశంలోని పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉండేదే ఎలక్టోరల్ కాలేజీ.
పార్లమెంటులోని రెండు సభలు లోక్‌సభ, రాజ్యసభల సభ్యులకు ఓటు వేసే హక్కు ఉంటుంది.
అసెంబ్లీల విషయంలో ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది కానీ ఎమ్మెల్సీలకు ఉండదు.
ఎలక్టోరల్ కాలేజీలో ఉండే సభ్యుల ఓటుకు ఒక విలువ ఉంటుంది.
ఈ విలువ ఎంపీలకు ఒక విధంగా ఎమ్మెల్యేలకు మరో విధంగాను ఉంటుంది.
2017 నాటి లెక్కల ప్రకారం ఎలక్టోరల్ కాలేజీలో 4,896 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు.

ఫొటో సోర్స్, Getty Images
ఎమ్మెల్యేల ఓటు విలువను ఎలా లెక్కిస్తారు?
మొదట ఒక రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించాలి. అలా వచ్చే విలువను 1000తో భాగించాలి. అప్పుడు వచ్చే సంఖ్యే ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఓటు విలువ.
దీనికోసం 1971 జనాభా లెక్కలను పరిగనణలోకి తీసుకుంటారు.

ఆంధ్రప్రదేశ్‌లో....
1971 జనాభా లెక్కల ప్రకారం ఏపీ జనాభా 2,78,00,586. ఏపీ శాసనసభ సీట్ల సంఖ్య 175.
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ= 2,78,00,586 ÷ 175 = 158860.491429 ⇒ 158860.491429÷1,000 = 158.86 ⇒ 159
ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని ఎమ్మెల్యేల అందరి ఓటు విలువ = 159X175= 27,825
అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల ఓటు విలువ 27,825.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో..
తెలంగాణ జనాభా 1972 లెక్కల ప్రకారం 1,57,02,122.. ఆ రాష్ట్రంలోని మొత్తం శాసనసభ స్థానాలు 119.
తెలంగాణలో ఎమ్మెల్యే ఓటు విలువ = 1,57,02,122 ÷ 119 = 131950.605042 ⇒ 131950.605042 ÷ 1000 = 131.95 ⇒ 132
తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 132.
ఈ లెక్కన తెలంగాణ మొత్తం ఓటు విలువ 132 X 119 = 15,708.

ఫొటో సోర్స్, Getty Images
ఎంపీల ఓటు విలువను ఎలా లెక్కిస్తారు?
దేశంలోని అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువను మొత్తం ఎంపీల సంఖ్యతో భాగిస్తే ఎంపీల ఓటు విలువ వస్తుంది.
ఎంపీ ఓటు విలువ= అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ÷ ఎన్నికైన మొత్తం ఎంపీల సంఖ్య
2017 రాష్ట్రపతి ఎన్నికల నాటికి దేశంలో 4,120 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. వీరి మొత్తం ఓటు విలువ 5,49,495.
పార్లమెంటులో లోక్‌సభ ఎంపీల సంఖ్య 543. రాజ్యసభ ఎంపీల సంఖ్య 233. రెండూ కలుపుకొని మొత్తం ఎంపీల సంఖ్య 776.
ఎంపీల ఓటు విలువ= 5,49,495 ÷ 776 = 708
(ఇది 2017 నాటి ఎంపీల సంఖ్య ప్రకారం వేసిన లెక్క. ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓటు విలువ కాస్త తగ్గే అవకాశం ఉంది. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్ముకశ్మీర్‌లో ఇంకా ఎన్నికలు జరగకపోవడమే ఇందుకు కారణం)
ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఓటు విలువ..
ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ స్థానాలు 25. రాజ్యసభ స్థానాలు 11.
ఈ లెక్కన ఏపీలో మొత్తం ఎంపీల సంఖ్య 36. అంటే వీరందరి ఓటు విలువ మొత్తం = 25,488

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓటు విలువ: 27,825 + 25,488 = 53,313

తెలంగాణ ఎంపీల ఓటు విలువ
తెలంగాణ లోక్‌సభ స్థానాలు 17. రాజ్యసభ స్థానాలు 7.
ఈ లెక్కన తెలంగాణలో మొత్తం ఎంపీల సంఖ్య 24.
వీరందరి ఓటు విలువ 24 X 708 = 16,992

తెలంగాణలోని ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓటు విలువ: 15,708 + 16,992 = 32,700


ఫొటో సోర్స్, FACEBOOK/ELECTION COMMISSION OF INDIA
రాష్ట్రపతి ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు?
రాజ్యాంగంలోని ఆర్టికల్-324 ప్రకారం ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తుంది.
ఎన్నికల పద్ధతి ఎలా ఉంటుంది?
రాష్ట్రపతి ఎన్నికలు ప్రపోషనల్ రిప్రెజంటేషన్ పద్ధతిలో సింగిల్ ట్రాన్సఫరబుల్ ఓటింగ్ విధానంలో జరుగుతాయి. అంటే ఎన్నికలో ఓటర్ల అందరికీ ప్రాతినిధ్యం ఉండేలా చూస్తారు. సింగిల్ ట్రాన్సఫరబుల్ ఓటింగ్ విధానంలో ఒకరికంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ప్రాధాన్యతా క్రమంలో అభ్యర్థులకు ఓటు వేస్తారు.
ఉదాహరణకు A,B,C,D అనే నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారని అనుకుందాం. అప్పుడు X అనే ఓటరు, ఆ నలుగురిలో ఒకరికి తొలి ప్రాధాన్యత ఓటు వేయాల్సి ఉంటుంది. X ఒకవేళ Cకి తొలి ప్రాధాన్యత ఓటు వేశారనుకుంటే A,B,Dలలో ఒకరికి రెండో ప్రాధాన్యతా ఓటు వేయాల్సి ఉంటుంది. Aకి రెండో ప్రాధాన్యత ఓటు వేస్తే B,Dలలో ఒకరికి మూడో ప్రాధాన్యత ఓటు వేస్తారు. Bకి మూడో ప్రాధాన్యత ఓటు పడితే Dకి నాలుగో ప్రాధాన్యత ఓటు లభిస్తుంది. ఇలా ప్రతి ఓటరూ తన ప్రయారిటీస్ ప్రకారం ఓటు వేస్తూ పోతారు.
విజేతను ఎలా నిర్ణయిస్తారు?
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు గెలిచినట్లు కాదు. ఒక నిర్దేశిత కోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఈ కోటాను నిర్ణయించేందుకు పోలైన వ్యాలిడ్ ఓట్లను 2తో భాగిస్తారు. ఫలితంగా వచ్చే సంఖ్యకు ఒకటి యాడ్ చేస్తారు.
ఉదాహరణకు 1,00,000 వ్యాలిడ్ ఓట్లు పోలయ్యాయని అనుకుందాం.
కోటా= 1,00,000 ÷ 2 = 50,000 ⇒ 50,000+1 =50,001
అంటే ఈ ఉదాహరణలో ఒక అభ్యర్థి గెలవాలంటే 50,001 కన్నా ఎక్కువ ఓట్లు సాధించాలి.
ఒక అభ్యర్థికి తొలి ప్రాధాన్య ఓట్లు, కోటా కంటే ఎక్కువ వస్తే ఆ అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి విజేతగా ప్రకటిస్తారు. లేదంటే మళ్లీ లెక్కింపు మొదలుపెడతారు.
తొలి ప్రాధాన్య ఓట్లు అత్యంత తక్కువ పొందిన అభ్యర్థిని తొలగించి, ఆ అభ్యర్థికి వచ్చిన ఓట్లను మిగతా అభ్యర్థులకు పంచుతారు.
అప్పుడు ఎవరైతే కోటా కంటే ఎక్కువ ఓట్లు పొందుతారో వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు. లేదంటే ఇంతకు ముందు చెప్పిన పద్ధతిలో మళ్లీ కౌంటింగ్ చేపడతారు. ఇలా ఎవరో ఒక అభ్యర్థి గెలిచే వరకు లెక్కింపు జరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్రపతి పదవికి ఎవరు అర్హులు?
రాజ్యాంగంలోని ఆర్టికల్-58 ప్రకారం రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి ఈ కింది అర్హతలుండాలి...
- భారతీయ పౌరులై ఉండాలి.
- 35 సంవత్సరాలు వయసు పూర్తయ్యి ఉండాలి.
- లోక్‌సభకు ఎన్నిక కాగల అర్హతలుండాలి.
- కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో లేదా వాటి ఆధ్వర్యంలో నడిచే ఎటువంటి సంస్థల్లో కూడా లాభాదాయక పదవుల్లో నిర్వహిస్తూ ఉండకూడదు.
నామినేషన్ ఎలా వేస్తారు?
పోటీ చేసే అభ్యర్థులను ఎలక్టోరల్ సభ్యుల్లో 50 మంది ప్రతిపాదించాలి. ఆ ప్రతిపాదనను మరొక 50 మంది ఆమోదించాలి. ఈ జాబితాను అభ్యర్థులు ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. డిపాజిట్ కింద రూ.15,000 కట్టాలి.
పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తిస్తుందా?
రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు. సభ్యులు వారిక నచ్చినట్లు ఓటు వేయొచ్చు. పార్టీలు విప్ జారీ చేయడానికి లేదు.
నోటా ఉంటుందా?
లేదు.
ఇవి కూడా చదవండి:
- నూపుర్ శర్మ వివాదం: భారత్, అరబ్ దేశాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడనుంది
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్లెట్కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- ఆంధ్రప్రదేశ్: తెలుగు మీడియం తెరమరుగు, 175 ఏళ్ల ఇంగ్లిష్ కల సాకారం కానుందా
- పాకిస్తాన్: గంజాయి సాగును చట్టబద్ధం చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?
- ఆంధ్రప్రదేశ్: డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ మూడేళ్లుగా ఎందుకు ఆగిపోయింది? రైతులకు ప్రభుత్వ సమాధానం ఏంటి?
- సమ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్: భారత చరిత్రను మలుపు తిప్పిన ఈ వీరుడి కథ నిజమా, కల్పనా?
- తాజ్మహల్ ఒకప్పుడు తేజో మహాలయమా... ఆ 22 గదులలో ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










