PubG ఆడనివ్వలేదని తల్లిని కాల్చి చంపి మృతదేహాన్ని రెండు రోజులు గదిలో దాచిపెట్టిన బాలుడు

పబ్‌జీ

ఫొటో సోర్స్, Getty Images

ఆన్‌లైన్ గేమ్ ‘‘పబ్‌జీ’’కి బానిసైన 16ఏళ్ల బాలుడు తల్లిని హత్య చేశాడు. గేమ్ ఆడకుండా అడ్డుకుందని ఈ నేరానికి పాల్పడ్డాడు.

ఉత్తర్ ప్రదేశ్ లఖ్‌నవూలోని పీజీఐ పోలీస్ స్టేషన్ పరిధిలో యమునాపురం కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అడిషనల్ డీసీపీ కాసిమ్ ఆబిదీ బుధవారం వెల్లడించారు.

‘‘యమునాపురం కాలనీలో ఇద్దరు పిల్లలతో ఒక మహిళ నివాసం ఉంటున్నారు. ఆమె భర్త సైన్యంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(జేసీవో)గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు’’ అని ఆబిదీ చెప్పారు.

‘‘పిల్లల్లో పెద్దవాడైన 16 ఏళ్ల బాలుడు ఆన్‌లైన్ గేమ్ పబ్‌జీకి బానిసయ్యాడు. గేమ్ ఆడకుండా తన తల్లి అడ్డుకునేదని, అందుకే తన తండ్రి పిస్తోల్‌తో ఆమెను కాల్చిచంపానని బాలుడు అంగీకరించాడు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది’’ అని ఆబిదీ వివరించారు.

ఆ బాలుడి నుంచి పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

పబ్‌జీ

ఫొటో సోర్స్, Getty Images

రెండు రోజులపాటు గదిలో దాచిపెట్టి..

‘‘తల్లిని చంపేసిన తర్వాత, ఆమె మృతదేహాన్ని ఒక గదిలో ఆ బాలుడు దాచిపెట్టాడు. తన తల్లిని కాల్చినప్పుడు తొమ్మిదేళ్ల తన చెల్లి కూడా అక్కడే ఉంది. ఎవరికైనా ఈ విషయం చెబితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడంతో ఆ బాలిక కూడా ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదు. మృతదేహం నుంచి వాసన రాకుండా ఇంటిలో ఆ బాలుడు రూమ్ ఫ్రెష్‌నర్‌ను కొట్టాడు’’ అని పోలీసులు తెలిపారు.

‘‘అయితే, మంగళవారం నాటికి మృతదేహం నుంచి వాసన ఎక్కువైంది. దీంతో తల్లి హత్యకు గురైందని తండ్రికి ఆ బాలుడు చెప్పాడు. వెంటనే ఇంటికి పొరుగునున్న వారిని ఆయన అప్రమత్తం చేశారు. వారు పోలీసులకు సమాచారం అందించారు’’ అని ఆబిదీ తెలిపారు.

‘‘మొదట ఈ హత్యపై ఆ బాలుడు కట్టుకథలు చెప్పడానికి ప్రయత్నించాడు. తమ ఇంటికి వచ్చిన ఒక ఎలక్ట్రిషియన్ ఈ హత్య చేశాడని చెప్పాడు. అయితే, అది అబద్ధమని పోలీసులు తేల్చారు. దీంతో నిజాన్ని ఆ బాలుడు అంగీకరించాడు’’ అని ఆయన వివరించారు.

పబ్‌జీ

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ పబ్‌జీ?

రెండేళ్ల క్రితం చైనాలో అభివృద్ధి చేసిన 118 మొబైల్ యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది. ఆ నిషేధిత యాప్‌లలో పబ్‌జీ కూడా ఒకటి.

ఇది ఒక ఆన్‌లైన్ గేమ్. దీని పూర్తి పేరు ప్లేయర్ అన్‌నోన్ బ్యాటిల్ గ్రౌండ్స్. ఇది ఆడటానికి ఫోన్‌తోపాటు ఇంటర్నెట్‌ కూడా అవసరం.

భారత్‌లో ఈ గేమ్‌పై నిషేధం విధించడంతో చాలా మంది తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఈ గేమ్‌కు బానిసలుగా మారారు.

పబ్‌జీకి బానిస కావడంతో చాలా మంది నేరాలకు పాల్పడినట్లు అప్పట్లో వరుస వార్తలు వచ్చాయి.

వీడియో క్యాప్షన్, వీడియో: PUBG… ఈ ఆటకు ఎందుకంత క్రేజ్?

2019లో పరీక్షల గురించి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు ఒక మహిళ మాట్లాడుతూ..

‘‘మా అబ్బాయి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇదివరకు మా అబ్బాయి స్కూలులో ముందుండేవాడు. కానీ, ఇప్పుడు తను ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసయ్యాడు. ఈ ప్రభావం చదువుపై పడుతోంది. మేం ఇప్పుడు ఏం చేయాలి?’’అని ప్రశ్నించారు.

పబ్‌జీ

ఫొటో సోర్స్, Getty Images

‘‘మీ అబ్బాయి పబ్‌జీ ఆడుతున్నాడా?’’అని మోదీ ప్రశ్నించారు. దీనికి ఏడాదిన్నర తర్వాత ఈ గేమ్‌పై నిషేధం విధించారు.

అయితే, పబ్‌జీపై నిషేధం విధించినప్పటికీ దీన్ని పిల్లలు ఆడుతున్నారు.

ప్రస్తుతం మొబైల్ వెర్షన్‌ను మాత్రమే బ్యాన్ చేశారని, డెస్క్‌టాప్ వెర్షన్ అందుబాటులోనే ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్)ల సాయంతో మొబైల్‌లోనూ ఈ గేమ్ ఆడొచ్చని వివరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)