ఆంధ్రప్రదేశ్: డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ మూడేళ్లుగా ఎందుకు ఆగిపోయింది? రాయలసీమ, మెట్ట ప్రాంత రైతులకు ప్రభుత్వ సమాధానం ఏంటి?

బిందు, తుంపర్ల సేద్యం
    • రచయిత, ఎన్.తులసీ ప్రసాద్ రెడ్డి, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

నీటి వనరులు తక్కువగా ఉన్న రాయలసీమ, ఇతర మెట్ట ప్రాంత రైతుల కోసం తెచ్చిన డ్రిప్ ఇరిగేషన్ పథకం ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు మూడేళ్లుగా పడకేసింది.

రెండు దశాబ్దాల క్రితమే ఉద్యానవన శాఖ ద్వారా మొదలయిన ఈ పథకం కింద భారీగా రాయితీలు రావడం వ్యవసాయదారులకు మేలు చేసింది. కానీ గడిచిన మూడేళ్లుగా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ నిలిచిపోయింది.

ఆశతో ఎదురుచూసిన రైతులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. త్వరలోనే డ్రిప్ ఇరిగేషన్ పథకం పునరుద్ధరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు ప్రకటనలు చేసినా, ఆచరణలో కనిపించడం లేదు.

బిందు, తుంపర్ల సేద్యం

పెరిగిన ఉద్యానవన సాగు

ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన(పీఎంకేఎస్వై) ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సూక్ష్మ సేద్యం కోసం పథకాలు అమలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏపీ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు(ఏపీఎంఐపీ) ద్వారా బిందు, తుంపర సేద్యాన్ని ప్రోత్సహించారు. రైతులకు భారీగా సబ్సిడీ లభించడంతో అత్యధికులు మొగ్గు చూపారు.

ముఖ్యంగా రాయలసీమ, ఇతర మెట్ట ప్రాంతాల్లో సాగునీటి కాలువలు అందుబాటులో లేని రైతులు, ఉద్యానవన పంటల సాగుదారులకు ఇది బాగా ఉపయోగపడింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నివేదికల ప్రకారం.. 2014-15 నుంచి 2019-20 వరకూ 7,38,659 ఎకరాల్లో బిందు, తుంపర సేద్యం పథకం అమలు చేశారు. అందులో అత్యధికంగా 2018-19లో 1.94 లక్షల ఎకరాల్లో ఈ డ్రిప్, స్ప్రింక్లర్లు అందుబాటులోకి వచ్చాయి. 2019-20లో ఇది 1.04 లక్షల ఎకరాలకు పరిమితమయింది.

బిందు, తుంపర్ల సేద్యం

రాయలసీమ రైతులకే ఎక్కువ మేలు

ఈ బిందు, తుంపర సేద్యం అధికంగా రాయలసీమ రైతులకు మేలు చేసింది. రాష్ట్రంలో 60 శాతం లబ్ధి ఈ ప్రాంత రైతులకే దక్కింది.

అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలతో పాటుగా ప్రకాశం తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాల్లో రైతులు కూడా ఎక్కువగా డ్రిప్ వైపు మొగ్గు చూపారు.

మిగిలిన జిల్లాల్లో కూడా మెట్ట ప్రాంతంలో వివిధ ఉద్యాన పంటల సాగు కోసం ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్లు పొందినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

ఇజ్రాయెల్ తరహా వ్యవసాయం పేరుతో 2002లోనే ఆంధ్రప్రదేశ్‌లో డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రోత్సాహకాలు అందించడం మొదలయింది. ఆ తర్వాత మరింత విస్తృతమయింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా తోడు కావడంతో ఇది మరింత వేగంగా విస్తరించింది.

ఫలితంగా ఉద్యాన పంటల సాగులో ఆంధ్రప్రదేశ్‌కి మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా అరటి వంటి పంటల సాగులో మొదటి స్థానానికి చేరడంలో ఈ పథకం తోడ్పాటు కూడా ఉంది.

బిందు, తుంపర్ల సేద్యం

ఎందుకు ఆగిపోయింది?

ఏపీఎంఐపీ ద్వారా అమలు చేసిన పథకంలో 5 ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరు శాతం సబ్సిడీ కింద డ్రిప్, స్ప్రింక్లర్లు అందించారు.

ఇతర రైతులకు 5 ఎకరాల లోపు అయితే 90 శాతం, 5 నుంచి 10 ఎకరాల భూమి కలిగిన రైతులకు 70 శాతం, ఆ పైన భూమి కలిగిన వారికి 50 శాతం సబ్సిడీకి ఈ పరికరాలు అందించారు. ఒక్కో రైతుకు సుమారుగా రూ.2 లక్షల రూపాయల వరకూ సబ్సిడీకి అవకాశం కల్పించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సబ్సిడీని భరించి రైతులకు అందించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించిన కంపెనీల ద్వారా డ్రిప్, స్ప్రింక్లర్ల ఏర్పాటు జరిగింది.

ఉద్యాన శాఖ వద్ద దరఖాస్తు చేసుకున్న రైతులకు అర్హతను అనుసరించి పథకం వర్తింపజేశారు. దానికి అనుగుణంగా రైతు తన వాటా చెల్లించాల్సి వచ్చేది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రైవేటు కంపెనీకి ఆయా రైతు పొలంలో డ్రిప్ ఇరిగేషన్ కోసం పైపుల నిర్మాణం, అవసరమైన వారికి స్ప్రింక్లర్ల ఏర్పాటు బాధ్యత అప్పగించేవారు. సంబంధిత పొలంలో వాటిని ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం ద్వారా సబ్సిడీ మొత్తాన్ని కంపెనీకి చెల్లించే ప్రక్రియ సాగింది.

బిందు, తుంపర్ల సేద్యం

కొన్నేళ్ల పాటు ఈ ప్రక్రియ సజావుగా సాగింది. కానీ 2020-21 నుంచి ఇది నిలిచిపోయింది. అంతకుముందు ఏడాది కూడా 2018-19తో పోలిస్తే 2019-20లో దాదాపు సగానికి పడిపోయింది. దాదాపు మూడేళ్లుగా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పథకంలో సబ్సిడీ అమలుకావడం లేదు.

అంతకుముందు డ్రిప్ పరికరాలు ఏర్పాటు చేసిన 37 కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆ కంపెనీలు ముందుకు రాలేదు. తమకు సుమారు రూ. 1,260 కోట్ల వరకూ బకాయిలు పెట్టడంతో వెనకడుగు వేయాల్సి వచ్చిందని ఓ కంపెనీ ప్రతినిధి బీబీసీకి తెలిపారు. ఆయన తన సంస్థ పేరు, తన పేరు వెల్లడించేందుకు సంసిద్ధత వ్యక్తంచేయలేదు.

"2018 నుంచే బకాయిలు పేరుకుపోయాయి. 2019-20లో ఇవ్వాల్సిన నిధులు రాలేదు. దాంతో కొత్తగా పైపులు కొనుగోలు చేసి రైతులకు అందించడం సాధ్యం కాలేదు. ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా దఫదఫాలుగా విడుదల చేస్తామని చెప్పారు. అది కూడా కాలయాపన చేశారు.. 2022 మార్చిలో రూ.437.95 కోట్ల బకాయిలు విడుదల చేశారు. ఇంకా కొందరికి పెండింగ్ ఉంది. వాటిని కూడా చెల్లిస్తే కొత్తగా డ్రిప్ అమలు చేసేందుకు అవకాశం ఉంటుంది. రైతుల నుంచి కంపెనీల మీద కూడా ఒత్తిడి ఉంది. కానీ నిధులు రాకుండా ఏమీ చేయలేని పరిస్థితి"అని ఆయన వివరించారు.

ప్రభుత్వం సక్రమంగా నిధులు విడుదల చేస్తే ఈ పథకం అమలు చేసేందుకు కంపెనీలు ముందుకు వస్తాయని ఆయన బీబీసీతో అన్నారు.

బిందు, తుంపర్ల సేద్యం

పదే పదే ప్రకటనలే గానీ...

డ్రిప్ ఇరిగేషన్ అమలుకాకపోవడంతో రైతులు పలుమార్లు ఆందోనలకు కూడా పూనుకున్నారు. వివిధ రైతు సంఘాలు ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించడమే కాకుండా ధర్నాలు కూడా చేపట్టి నిరసనలు కూడా తెలిపాయి.

ఈ సమస్యపై ప్రభుత్వం చాలా సార్లు ప్రకటనలు చేసింది. డ్రిప్ పథకంలో రాయితీలు పునరుద్ధరిస్తామంటూ గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కురసాల కన్నబాబు పదే పదే చెప్పేవారు. శాసనసభలోనూ ప్రకటించారు. 2021-22లో రూ. 1,190 కోట్లను ఈ పథకానికి కేటాయించి, 50వేల హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. 2021లో టెండర్లు కూడా పిలిచి ఈ పథకం అమలుకోసం కంపెనీలను ఆహ్వానించారు. అయినా అడుగు ముందుకు పడలేదు.

ఆ తర్వాత 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్లతో 3.75 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం ప్రాజెక్టును అమలు చేయబోతున్నట్టు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మరో ప్రకటన కూడా చేశారు.

రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా అవసరమున్న ప్రతి రైతుకు బిందు సేద్య పథకం ద్వారా లబ్ధి చేకూర్చేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. సబ్సిడీపై పెద్దఎత్తున డ్రిప్, స్ప్రింక్లర్ల పరికరాలను సమకూరుస్తామని ప్రకటించారు.

బిందు, తుంపర్ల సేద్యం

ప్రభుత్వం చెబుతున్న మాటలకు, ఆచరణకు పొంతనలేదని డ్రిప్ ఇరిగేషన్‌పై ఆశలు పెట్టుకున్న రైతులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. డ్రిప్ పథకం అందుబాటులోకి రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని చిత్తూరు జిల్లా గడ్డంవారి పల్లె గ్రామానికి చెందిన రైతు వెంకట కృష్ణమ నాయుడు బీబీసీతో అన్నారు.

"డ్రిప్ లేకపోవడం వల్ల కడవలతో తెచ్చి చెట్లకు నీళ్లు పోసుకుంటున్నాం. ఆఫీసులో పోయి అడిగితే ఆస్కీమ్ ఇప్పుడు లేదంటున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ట్రాక్టర్‌కి వెయ్యి రూపాయల బాడుగ ఇచ్చి నీళ్లు తోలుకుంటున్నాం. కడవలతో పోవడం వల్ల ఎక్కువ నీళ్లు పడతాయి. నేల గట్టిగా అయి చెట్లకు పెరుగుదల ఉండదు. డ్రిప్ వేయడం వల్ల తక్కువ నీళ్లు పడతాయి. మట్టి వదులుగా ఉండడంతో చెట్లు బాగా పెరుగుతాయి. డ్రిప్ స్కీం ఉంటే సబ్సిడీ వస్తుంది. రైతులకి కష్టాలు లేకుండా ఉంటాయి. ఇప్పటికైనా డ్రిప్ పథకం అందుబాటులోకి తేవాలని కోరుకుంటున్నాం"అని ఆయన విన్నవించారు.

వీడియో క్యాప్షన్, హైటెక్ టొమాటోలు.. ఎలా పండిస్తున్నారో చూడండి

సుధాకర్ రెడ్డి అనే మరో రైతు కూడా తన అనుభవాన్ని బీబీసీతో పంచుకున్నారు. డ్రిప్ పథకంలో పైపుల కోసం చెప్పులరిగేలా తిరిగినా ఫలితం రాలేదని తెలిపారు.

"డ్రిప్ కోసం దరఖాస్తు చేశాం. వాళ్లయితే ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ లో స్కీం లేదని చెప్పారు. ముందు గవర్నమెంట్ ఇచ్చేది. మామిడి చెట్లు ఎండిపోతున్నాయి. పాదులు తీసుకొని నీళ్లు కట్టుకుందామని పైపులు వేసుకుంటున్నాం. మూడు సంవత్సరాలుగా డ్రిప్ ఇవ్వడం లేదు. ఎన్నోసార్లు అగ్రికల్చర్ ఆఫీస్‌కు వెళ్లాం. వాళ్లు డ్రిప్ ఆఫీస్‌కి వెళ్ళమన్నారు. అక్కడికీ వెళ్లాం. గవర్నమెంట్ నుంచి సబ్సిడీ లేదు.. ఇవ్వలేమని చెప్పారు. రైతుల కష్టాలు చూసి ప్రభుత్వం కనుకరించాలి"అని ఆయన బీబీసీతో అన్నారు.

బిందు, తుంపర్ల సేద్యం

“రైతులపై పెనుభారం”

సూక్ష్మ సేద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విమర్శించింది. సమీపంలోని కర్నాటక ప్రభుత్వం పెద్ద స్థాయిలో డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రోత్సాహాలు అందించి, ఫలితాలు సాదిస్తే ఏపీలో అందుకు విరుద్ధంగా ఉందంటూ ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి నరసింహరావు బీబీసీతో అన్నారు.

“ఉద్యాన పంటల్లో రైతులు ఎంతో పురోభివృద్ధికి ఈ డ్రిప్, స్ప్రింక్లర్లు ఉపయోగపడ్డాయి. ఫలితాలు కూడా దక్కాయి. నిధులు లేవనే కారణంగా డ్రిప్ పథకం ఆగిపోవడం అందరినీ సమస్యల్లోకి నెట్టింది. సహజంగా డ్రిప్ పథకంలో పైపులు ఎక్కువ కాలం ఉండవు. ప్రైవేటుగా మార్కెట్లో పైపులు కొనాల్సి వస్తోంది. సబ్సిడీపై రూ.100 రూపాయల లోపు ఉండే మీటర్ పైపు మార్కెట్లో ఆరేడు వందలు చెల్లించాల్సి వస్తోంది. ఇది రైతులకు పెనుభారమయింది"అని ఆయన అభిప్రాయపడ్డారు.

తక్షణమే ఈ స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

వీడియో క్యాప్షన్, LED లైట్లతో డ్రాగన్ ఫ్రూట్ సాగు, ఎకరాకు రూ.15 లక్షల వరకు లాభం

తొలి సంతకం చేసిన కొత్త మంత్రి

కన్నబాబు స్థానంలో వ్యవసాయ శాఖ మంత్రిగా వచ్చిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి డ్రిప్ ఇరిగేషన్ పథకం అమలు కాకపోవడంపై ఇటీవల బీబీసీతో మాట్లాడుతూ.. డ్రిప్, స్ప్రింక్లర్లు పంపిణీ చేసే పథకం అమలు కోసమే తాను తొలి సంతకం చేశానని చెప్పారు.

“రాష్ట్ర వ్యాప్తంగా 3.75 లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ పథకాలు అమలు చేస్తాం. అందుకోసం రూ.1,395 కోట్లు వెచ్చిస్తున్నాం. సాంకేతిక సమస్యలన్నీ అధిగమించి, నిధుల కొరత లేకుండా చూస్తున్నాం” అని ఆయన చెప్పారు.

డ్రిప్ ఇరిగేషన్ పథకం కింద రాయితీ కోసం రైతుల నుంచి ప్రభుత్వం ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలను, ప్రక్రియను ఇంతకుముందు కూడా చేసిందని, కానీ ఫలితం మాత్రం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)