ఆంధ్రప్రదేశ్: డ్యామ్‌లు, బ్యారేజీల వద్ద ప్రమాద హెచ్చరికలు.. లక్షల ఎకరాల్లో పంట నష్టం

పశ్చిమ గోదావరిలోని కైకరం వద్ద పీకల్లోతు నీళ్లలో రైతులు
ఫొటో క్యాప్షన్, పశ్చిమ గోదావరిలోని కైకరం వద్ద పీకల్లోతు నీళ్లలో రైతులు
    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ వరద తాకిడితో తల్లడిల్లుతున్నాయి. భారీగా పెరుగుతున్న వరద తాకిడితో కొన్ని ప్రాంతాలు కలవరపడుతున్నాయి. కృష్ణా నదీ ప్రవాహ ఉద్ధృతి పెరుగుతోంది. దాని ప్రభావంతో కృష్ణా-గుంటూరు జిల్లాల్లో పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి.

ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద ప్రవాహం కనిపిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో 7,20,701 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను యథాతథంగా దిగువకు వదులుతున్నారు. ఫలితంగా విజయవాడ నగరంలోని భవానీపురం, కృష్ణలంక, రాణీ గారి తోట సహా పలు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు జిల్లాల పరిధిలోని సమీమ గ్రామాల్లో వరద నీరు చేరుతోంది. లంకల్లో సాగు చేస్తున్న పంటలన్నీ నీటి పాలయ్యాయి.

పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర నగరం ఏలూరుతో పాటుగా అనేక చోట్ల వరద తాకిడి కనిపిస్తోంది. ఏలూరులో తమ్మిలేరు పొంగిపొర్లుతోంది. పలు డివిజన్లలో నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఆర్టీసీ కాంప్లెక్స్ మోకాలి లోతు నీటిలో కనిపిస్తోంది. ఆర్‌ఆర్‌పేట, శనివారపుపేట, అశోక్ నగర్, వైఎస్సార్ కాలనీ సహా టూ టౌన్‌లోని పలు ప్రాంతాల్లో వరద జలాలు చేరుతున్నాయి.

ఏలూరులో వరద నీరు

ఫొటో సోర్స్, Karun

ఫొటో క్యాప్షన్, ఏలూరులో వరద నీరు

చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో ఉన్న తమ్మిలేరు జలాశయం నిండుకుండలా మారింది. 3 టీఎంసీల సామర్థ్యంగాగల ఈ ప్రాజెక్టులో 2.8 టీఎంసీల వద్ద అధికారులు నీటిని నియంత్రిస్తున్నారు. గత 15 సంవత్సరాల కాలంలో తమ్మిలేరుకి ఇదే భారీ వరదగా ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. తమ్మిలేరు ప్రభావం తాకిడితో ఏలూరు నగరానికి వరద ముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే తమ్మిలేరు కాలువకు పలు చోట్ల గండి పడడంతో నదీ జలాలు ఏలూరులోని ఆటోనగర్ సహా పలు ప్రాంతాలను ముంచెత్తాయి.

తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఏలేరు జలాశయం నుంచి భారీగా విడుదలవుతున్న వరద జలాల కారణంగా 8 మండలాల్లో వరద ప్రవాహం కనిపిస్తోంది. జగ్గంపేట మండలం రామవరం వద్ద జాతీయ రహదారిపై కూడా వరద నీరు చేరింది. గొల్లప్రోలు ఈబీసీ కాలనీ పరిసరాల్లో వరద నీరు చేరింది.

వీడియో క్యాప్షన్, ఉత్తరాంధ్రను పొంగి పొర్లుతున్న వాగులు... తీవ్రంగా పంట నష్టం

విశాఖ జిల్లాలో కూడా శారదా, గోస్తనీ, వరాహ నదుల ప్రవాహంతో పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది.

శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుత ఇన్‌ఫ్లో 42,980 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 42,916 క్యూసెక్కులుగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ముంపు ప్రాంతాల్లోకి వరద ప్రవాహం చేరుతున్న క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తుగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె కన్నబాబు సూచించారు.

విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో..
ఫొటో క్యాప్షన్, విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో..

పదికి పెరిగిన మృతులు

భారీ వర్షాలు, వరదల మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య పదికి పెరిగింది. వరద ప్రవాహంలో చిక్కుకుని కొందరు మృతిచెందారు. జగ్గంపేట మండలం రామవరం వద్ద ఇల్లు నేలకూలింది. ప్రమాదంలో ఒకరు మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ప్రాణనష్టం నివారించేందుకు యంత్రాంగం దృష్టి పెట్టిందని కన్నబాబు చెబుతున్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

అనకాపల్లి వద్ద
ఫొటో క్యాప్షన్, అనకాపల్లి వద్ద

రైతులకు అపారనష్టం

ఈసారి వాయుగుండం కారణంగా వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోతోంది. ప్రధానంగా వరి పంటకు పెద్ద దెబ్బ తగిలింది. సుమారు 60వేల హెక్టార్లలో పంట నీటి పాలయ్యిందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 40వేల హెక్టార్లలో పాక్షికంగా నష్టం జరిగి ఉంటుందని ఏపీ వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నట్టు ప్రకటించింది. వరితో పాటుగా ఇతర పంటలకు కూడా అపార నష్టం సంభవించినట్టు భావిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

''ఎకరానికి రూ. 30 వేలు ఖర్చు చేశాం. 10 ఎకరాల భూమి కౌలు చేస్తున్నాను. పెట్టుబడి కోసం అప్పులు చేశాం. ఇప్పుడు ఎర్రకాలువకు గండి పడడంతో వరద నీటిలో పంట మొత్తం నానుతోంది. పనికిరాకుండా పోతోంది. చివరి దశలో ఉన్న పంట చేతికి రాకుండా పోతోంది. నష్టం చాలా ఎక్కువగా ఉంటోంది. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా పథకం అందించాలని కోరుతున్నాం''అని పశ్చిమ గోదావరి జిల్లా కైకరం గ్రామానికి చెందిన కే సత్యనారాయణ బీబీసీతో అన్నారు.

మరోవైపు వీలైనంత త్వరగా పంట నష్టం అంచనాలు వేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సిబ్బందిని ఆదేశించారు. పంటల నష్టంపై వీలైనంత త్వరగా అంచనాలు పూర్తి చేసి పంపించే ప్రయత్నం చేయాలని ఆమె జిల్లాల కలెక్టర్లను కోరారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పటికీ ధాన్యం సేకరణ యథావిథిగా కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఆ మేరకు ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్‌ కొనసాగుతోందని అన్నారు.

వరదలు
ఫొటో క్యాప్షన్, ఏలూరులో శిబిరాలకు తరలివెళ్తూ..

''గతంలో ప్రకటించిన సహాయమే అందలేదు''..

నీలమ్ తుఫాన్ తర్వాత గడిచిన కొన్నేళ్లుగా ప్రభుత్వాలు సహాయం ప్రకటించడమే తప్ప రైతులకు ప్రయోజనం అందించడం లేదని ఏపీ రైతు సంఘం నాయకుడు కే శ్రీనివాస్ అన్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ''ఈసారైనా ప్రభుత్వం స్పందించాలి. ఎకరాకు రూ.25 వేలు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వాలి. పంటల బీమ, రైతు భీమా అని ప్రకటించారు. కాబట్టి బీమా సొమ్ములు రైతులకు దక్కేలా చూడాలి. గతంలో పలు తుఫాన్ల సందర్భంగా ప్రకటించిన ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. ఈసారి అలాంటి తాత్సారం జరగకూడదు. ప్రస్తుతం అప్పులతో సాగు చేసిన వారికి పంట చేతికొచ్చే వేళ వరదలతో నష్టం తీవ్రంగా ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే సామాన్య రైతులు, కౌలుదారులు కష్టాల్లో పడతారు''అంటూ వివరించారు.

భారీ వ‌ర్షాల‌కు 1,79,553 ఎకరాల్లో పంట న‌ష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. అయితే అన్ని జిల్లాల కంటే ఎక్కువగా ఉభ‌య గోదావ‌రి జిల్లాలు చ‌విచూసినట్టు చెబుతున్నారు. తొమ్మిది జిల్లాల్లో 24 ర‌కాల పంట‌ల‌కు న‌ష్టం కలిగినట్టు చెబుతున్నారు. వ‌రి, ప‌త్తి, మినుము పంట‌లు భారీగా న‌ష్ట‌పోయినట్టు సమాచారం.

1,36,735 ఎకరాల్లో వ‌రి పంట నష్టం జరగ్గా, 30,118 ఎకరాల్లో ప‌త్తి పంట న‌ష్టం సంభవించింది. అలానే 4000 ఎకరాల్లో మినుము పంటకు న‌ష్టం జరిగింది. క‌డ‌ప జిల్లాలో ఇసుక మేట‌లు, భూమి కోత‌తో పంట‌ల‌కు భారీగా న‌ష్టం చేకూరింది.

ఒక్క తూ.గో జిల్లాలోనే 74,857 ఎకరాల్లో పంట నష్టం జరగగా, ప.గో జిల్లాలో 34,940 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అలానే కృష్ణాలో కూడా 31, 165 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది.

వరదలు
ఫొటో క్యాప్షన్, ఏలూరులో

సహాయక చర్యలపై సీఎం సమీక్ష

రాష్ట్రంలో భారీ వర్షాలు-వరదల వల్ల ఏర్పడిన పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి తక్షణ సహాయం కింద రూ.500 చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశాలిచ్చారు. అన్ని చోట్ల విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు, కాల్వల గండ్లు పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై గుంతలు పూడ్చి, అవసరమైన మరమ్మతులు చేయాలని ఆదేశించారు. వరద తగ్గుతోందని, అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలని అన్నారు.

పీహెచ్‌సీలలో అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉంచి, శానిటేషన్‌ పక్కాగా చేయాలన్నారు.

వరద నీరు
ఫొటో క్యాప్షన్, హైవే 16 ఆనుకుని వరద నీరు

పరిస్థితిపై ఆరా తీసిన ప్రధాని

ప్రస్తుత పరిస్థితిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. ఆయన సీఎంకి ఫోన్‌చేసి వివరాలు తెలుసుకున్నారని సీఎంవో ప్రకటించింది. రాష్ట్రంలో వర్షాలు, అనంతర పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాలు, నెలకొన్న పరిస్థితులను సీఎం జగన్ ప్రధానికి వివరించారన్నారు. వాయుగుండం తీరం దాటిందని, మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని వివరించినట్టు వెల్లడించారు. అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారిన సీఎంవో ప్రకటనలో పేర్కొంది.

వరద నీరు

ఫొటో సోర్స్, Karun

ఫొటో క్యాప్షన్, ఏలూరులో

మృతుల కుటుంబాలను ఆదుకోవాలంటూ చంద్రబాబు లేఖ

వరద సహాయక చర్యలపై సీఎం జగన్‌కి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించి ఆదుకోవాలని ఆయన కోరారు. భారీ వర్షాల్లో దెబ్బతిన్న పంటల ఎన్యూమరేషన్ యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. నష్టపోయిన కౌలు రైతులను గుర్తించి, ఆదుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రత్యామ్నాయ సాగుకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా పంపిణీ చేయాలని లేఖలో పేర్కొన్నారు.

ఉపాధి కోల్పోయిన చేనేత, ఇతర చేతి వృత్తుల కుటుంబాలకు సాయం అందించాలని, దెబ్బతిన్న వలలు, పడవల కొనుగోళ్లకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు, కూలిపోయిన, కొట్టుకుపోయిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లుకు సాయం చేయాలన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)