ఆంధ్రప్రదేశ్: రాయలసీమలో 50 ఏళ్లలో ఎన్నడూ చూడని విపత్తు, నష్టం అంచనా రూ.6వేల కోట్లకు పైనే, అసలేం జరిగింది?

చిత్తూరు జిల్లా చిగురువాడ దగ్గర తెగిపోయిన రోడ్డు మార్గం
ఫొటో క్యాప్షన్, చిత్తూరు జిల్లా చిగురువాడ దగ్గర తెగిపోయిన రోడ్డు మార్గం
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ చూడని విపత్తును చూసింది రాయలసీమ. చిత్తూరు తల్లడిల్లిపోయింది. అనంతపురం జిల్లా అల్లాడిపోయింది. కడప కకావికలమయ్యింది. వాటితో పాటుగా నెల్లూరు కూడా వణికిపోయింది.

వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలకు తోడు డ్యాముల నిర్వహణలో వైఫల్యం సీమ జిల్లాలకు కష్టాలు తెచ్చాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అనూహ్య వర్షాలే ఇంత పెద్ద నష్టానికి కారణమని ప్రభుత్వం చెబుతోంది.

యాభై ఏళ్లలో ఎన్నడూ చూడలేదు

సహజంగా రాయలసీమలో వర్షాభావం సమస్య ఉంటుంది. కానీ గడిచిన కొన్నేళ్లుగా సీమలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతోంది. అయినా చిత్తూరు జిల్లాలో లోటు వర్షపాతమే కనిపించేది.

కానీ ఈసారి దానికి పూర్తి భిన్నంగా ఏకంగా 10 రోజుల పాటు వర్షాలు కురిశాయి. అందులోనూ నవంబర్ 16న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో కుండపోతగా వర్షాలు కురిశాయి.

తిరుమలలో రికార్డు స్థాయిలో 20 సెంటిమీటర్ల వర్షం పడిందని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. గడిచిన ఆరు దశాబ్దాల్లో అంతటి వర్షాలు చూడలేదని టీటీడీ ఈవో వెల్లడించారు.

18వ తేదీ నాటికి తిరుపతితో పాటుగా చిత్తూరు జిల్లాలో వరదలు వచ్చాయి. చిత్తూరుతో పాటుగా ఎగువన తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి.

పెన్నా నదికి ఉన్న ఉపనదులన్నీ ఉప్పొంగాయి. పాపాఘ్ని, బహుదా, మాండవ్య, పింఛా, చెయ్యేరు, సోమశిల ఇలా నదులన్నీ ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించాయి. ఆనకట్టలు పొంగిపొర్లాయి. అన్నీ కలిసి పెన్నా నదిని ఊహించని వరదతో ముంచెత్తాయి.

వీడియో క్యాప్షన్, కడప వరదలు: ‘ఒక్క నిమిషంలో ఊరంతా కొట్టుకుపోయింది’

డ్యాములు తెగిపోవడం తొలిసారి

ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న రెండు డ్యాముల కట్టలు ఈ వరదల కారణంగా కొట్టుకుపోయాయి. తొలుత పింఛా డ్యామ్, దానికి దిగువన ఉన్న అన్నమయ్య డ్యామ్ కట్టలు తెగిపోయాయి.

ఇలా ఏపీలో ఒకేసారి రెండు డ్యాముల కట్టలు తెగిపోవడం ఇదే తొలిసారని నీటిపారుదల శాఖలో పనిచేసిన రిటైర్డ్ ఇంజనీర్ శ్యామలరావు బీబీసీకి తెలిపారు. డ్యాముల కట్టలు తెగిపోవడానికి ప్రధాన కారణం నిర్వహణ లోపమనే విమర్శలున్నాయి. ప్రభుత్వ వాదన మాత్రం భిన్నంగా ఉంది.

చరిత్రలో ఎప్పుడూ చూడని రీతిలో ఏకకాలంలో భారీ వర్షాలు కురిశాయి. జిల్లావ్యాప్తంగా ఏక కాలంలో, అతి తక్కువ సమయంలో భారీ వర్షపాతం నమోదయ్యింది.

నవంబర్‌ 18వ తేదీ, గురువారం ఉదయం 8:30 గంటలకు పింఛా ప్రాజెక్టు ఇన్‌ఫ్లో కేవలం 3,845 క్యూసెక్కులు మాత్రమే. కానీ అదే రోజు సాయంత్రం 6నుంచి 8:30 గంటల ప్రాంతంలో ఇన్‌ఫ్లో ఒకేసారి 90,464 క్యూసెక్కులకు చేరింది.

వీడియో క్యాప్షన్, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది... - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

ఆరోజు ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు కడప జిల్లాలోని మొత్తం 50 మండలాల్లో కూడా సగటున 10.7 సెం.మీ వర్షపాతం కురిసిందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శేషాచల పర్వతశ్రేణికి వెనకవైపున కురిసిన భారీ వర్షాలు, ఆ వరద నీరంతా చెయ్యేరు పరీవాహక ప్రాంతానికి చేరుకుంది.

మరోవైపు పీలేరులో, రాయచోటిలో కూడా అధిక వర్షం కురిసింది. ఇదంతా ఏకకాలంలో జరిగింది. దాంతో ప్రధాన ప్రాజెక్టులైన అన్నమయ్య, బుగ్గవంక, వెలిగల్లు, చిత్రావతి, మైలవరం, గండికోటలకు భారీగా నీరు వచ్చి చేరిందంటూ కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు వివరించారు.

పింఛా డ్యాం విడుదల సామర్థ్యం కేవలం 48 వేల క్యూసెక్కులు. కానీ 18వ తేదీ అర్ధరాత్రి పింఛా ప్రాజెక్టుకు 1.17 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. అంటే విడుదల సామర్థ్యం కన్నా రెండున్నర రెట్లు ఎక్కువ వరద నీరు వచ్చింది. రింగ్‌బండ్‌ను ప్రొటెక్ట్‌ చేసినా ఈ నీటిని అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది.

అదే రోజు రాత్రి 1 గంట సమయానికి అన్నమయ్య ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 2.3 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. నవంబర్‌ 19న అన్నమయ్య ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో ఉదయం 5:30 గంటలకు 3.2 లక్షలు దాటింది. పింఛా తెగిపోయి మొత్తం నీరంతా ఒకేసారి అన్నమయ్యకు రావడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. అన్నమయ్య ప్రాజెక్టు విడుదల సామర్థ్యం 2.17 లక్షల క్యూసెక్కులు అయితే, 19వ తేదీ ఉదయం 3.2 లక్షల క్యూసెక్కులు దాటింది. ప్రాజెక్టు కట్టిన తర్వాత గత 50 సంవత్సరాల్లో ఇంత నీరు ఎప్పుడూ రాలేదు. కొన్ని గంటల వ్యవధిలోనే పరిస్థితి చేయిదాటిపోయిందంటూ ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, 'మా కళ్ల ముందే వరదలో కొట్టుకుపోయాడు, శవం కూడా దొరకలేదు'

అత్యధిక నష్టం చెయ్యేరు తీరంలోనే..

ఈసారి వరదల్లో తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు నగరాలు చిక్కుకున్నాయి. ఆయా నగరాల్లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కానీ అత్యధికంగా ప్రాణ, ఆస్తినష్టం మాత్రం చెయ్యేరు నదీ తీరంలోనే జరిగింది.

పరిమితికి మించి వరద రావడంతో కడప జిల్లా రాజంపేట సమీపంలో ఉన్న ఈ చెయ్యేరు నది కట్ట తెగిపోయిందని అధికారులు చెబుతున్నారు. అయితే అందుకు అనుగుణంగా ప్రజలను అప్రమత్తం చేయలేదని స్థానికులు అంటున్నారు.

"వరద వస్తుందని ఊహించాము. కానీ కట్ట తెగిపోయి ఊరు కొట్టుకుపోయేలా ఉంటుందని ఎవరూ అనుకోలేదు. 19వ తేదీ ఉదయం మామూలుగా లేచాము. నదీ ప్రవాహం ఎక్కువగా కనిపించింది. కానీ అంతలోనే 6 గంటల ప్రాంతంలో వరద ఒక్కసారిగా వచ్చిపడింది. అందరం భయపడిపోయాం. పరిగెత్తగలిగిన వాళ్లు పారిపోయారు.

వీడియో క్యాప్షన్, కోవూరులో తెగిన రోడ్లు, తేలిన రైలు పట్టాలు

కానీ కొందరు డాబాల మీద నిలబడి ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నారు. కానీ డాబాలు కూడా వరదలో కొట్టుకుపోయాయి. ఇప్పటికీ వాళ్ల ఆచూకీ దొరకలేదు. మా ఒక్క ఊరిలోనే 12 మంది ప్రాణాలు పోయాయి. నలుగురి ఆచూకీ కూడా దొరకలేదు" అంటూ అన్నమయ్య డ్యామ్ దిగువన ఉన్న పులపుత్తూరు గ్రామానికి చెందిన ఎం పుల్లారెడ్డి బీబీసీకి వివరించారు.

వరదల మూలంగా ఏపీలో 34 మంది మరణించారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరో 10 మంది ఆచూకీ దొరకలేదని వెల్లడించింది. అందులో అనంతపురం, కడప జిల్లాల్లో ఇళ్లు కూలి చనిపోయిన వారితో పాటుగా రాజంపేట, నందులూరు మండలాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు.

కడప జిల్లాలో 13 మంది మృతి చెందగా, 11 మంది గల్లంతయ్యారని అధికారికంగా ప్రకటించారు. కానీ ప్రభావిత గ్రామాల ప్రజల నుంచి వస్తున్న సమాచారం మాత్రం భిన్నంగా ఉంది. 21 మంది చనిపోగా, 18 మంది గల్లంతయినట్టు అన్నమయ్య ప్రాజెక్టు దిగువ గ్రామాల వాసులు చెబుతున్నారు.

నందలూరు వంతెన సమీపంలో ఒక ఆర్టీసీ బస్సు వరద నీటిలో కొట్టుకుపోయింది. 20 మీటర్ల కింద పడిపోయింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

గుండ్లూరు శివాలయంలో కార్తీక మాస పూజలు చేస్తూ పూజారి కుటుంబంలోని 9 మంది మరణించారు.

వీడియో క్యాప్షన్, కడప వరదలు: ‘మూడు రోజులుగా వరద నీటిలోనే గడుపుతున్నాం’

పెన్నా ప్రవాహానికి అదే కారణం

నెల్లూరు జిల్లాలో పెన్నా ఉధృతికి సోమశిల ప్రాజెక్టు పరిస్థితి మీద సందేహాలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు కూడా వ్యాపించాయి. అయితే, ఇంత పెద్ద స్థాయిలో పెన్నా ప్రవాహం సాగడానికి పెన్నేరుతో సహా పలు నదుల ఉధృతి కారణమని చెబుతున్నారు.

ఎగువన కడప జిల్లాలో బుగ్గవంక, గండికోట, మైలవరం సహా డ్యాములన్నీ నిండిపోయాయి. దాంతో ఒక్క బుగ్గవంక నుంచే 30 వేల క్యూసెక్కుల నీరు పెన్నాలో చేరింది.

వెలిగల్లు నుంచి పాపాఘ్నిలోకి 90 వేల క్యూసెక్కుల నీరు వచ్చింది. అనంతపురం నుంచి చిత్రావతి ద్వారా 80వేల క్యూసెక్కులు వచ్చింది. మైలవరం నుంచి 1.5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది.

మొత్తం ఈ నీరంతా పెన్నాలోకి చేరింది. సుమారుగా 7 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం నెల్లూరు వద్ద సాగడంతో కోవూరు నియోజకవర్గంలో అధిక నష్టానికి కారణమయ్యింది.

వీడియో క్యాప్షన్, ఏపీ వరదలు: నెల్లూరులో నీట మునిగిన 12 గ్రామాలు

ఆస్తి నష్టం ఎంత

ప్రాణ నష్టంతో పాటుగా భారీగా ఆస్తి నష్టానికి కూడా ఈ వర్షాలు, వరదలు కారణమయ్యాయి. అనంతపురం జిల్లాలో 61 మండలాలకు చెందిన 561 గ్రామాల్లో 1.12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆహార, వాణిజ్య పంటలు దెబ్బతిన్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు.

అందులో పప్పు శనగ పంట 54వేల ఎకరాలు, వరి 36వేల ఎకరాల్లో దెబ్బతిందని తెలిపారు. కేవలం ఒక్క అనంతపురంలోనే పంట నష్టం సుమారు రూ. 170 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

ఇక మదిగుబ్బ మండలంలోని యోగివేమన జలాశయ ప్రవాహానికి దొరిగల్లు వంతెన కొట్టుకుపోయింది. రూ. 2 కోట్లతో పదేళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన కూలడంతో 60 గ్రామాలకు రవాణా సమస్య ఏర్పడింది.

చిత్తూరు జిల్లాలో గండ్లు పడడం, చెరువుల కట్టల తెగడం వంటి కారణాల రీత్యా కేవలం జలవనరుల శాఖకే సుమారుగా రూ. 146. 29 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఇరిగేషన్ ఎస్‌ఈ వెల్లడించారు. ఈ ఒక్క జిల్లాలోనే మొత్తం 456 చెరువులకు గండ్లు పడ్డాయి.

పాపానాయుడుపేట- గుడిమల్లం రోడ్డులో కాజ్ వే కొట్టుకుపోయింది. రోడ్లు దెబ్బతినండంతో 300 గ్రామాలకు రాకపోకల సమస్య ఏర్పడింది.

చిత్తూరు జిల్లాలో 26వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరితో పాటుగా, వేరుశనగ, మొక్కజొన్న, కంది, రాగులు వంటి పంటలకు నష్టం వాటిల్లింది.

కడప జిల్లాలో 866 గ్రామాల్లో వరద ప్రభావం ఉందని అధికారులు నిర్ధారించారు. సుమారు 9వేల మందిని వరద బాధితులుగా గుర్తించారు.

1.39 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని ప్రకటించారు. కడప జిల్లాలో 2,361 పశువులు చనిపోయాయి.

పాపాఘ్ని నదిపై వంతెన కూలిపోయింది. జమ్మలమడుగు, ముద్దూరు వంతెన దెబ్బతింది. రాకపోకలు నిలిపివేయాల్సి వచ్చింది.

రాజంపేట, నందలూరు మధ్య రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఒకటి రెండు రోజుల్లో పునరుద్దరణ పనులు పూర్తవుతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.

వరద బాధిత ప్రాంతాలు

ఫొటో సోర్స్, AP CMO

ఫొటో క్యాప్షన్, వరద బాధిత ప్రాంతాలు

నెల్లూరు జిల్లాలోనూ పెన్నా ప్రవాహం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, ఇందుకూరుపేట, కొడవలూరు మండలాల్లో అనేక గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. మొత్తం జిల్లాలోని 20 మండలాల్లోని 68 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి.

జిల్లాలో ముగ్గురు మరణించారు. జాతీయ రహదారులకు గండ్లు పడ్డాయి. కోల్‌కతా, చెన్నై ప్రధాన రైల్వే లైనులో ట్రాకు ధ్వంసమయ్యింది. మూడు రోజుల పాటు 128 రైళ్లను రద్దు చేయడం గానీ, దారి మళ్లించడం గానీ చేయాల్సి వచ్చింది.

జిల్లావ్యాప్తంగా వరద మూలంగా జరిగిన నష్టం సుమారుగా రూ. 530 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం మూలంగా రైతులు తీవ్రంగా ఇక్కట్లు పాలయ్యారు.

వర్షం

ఏపీకి పెద్ద భారమే

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన ఏడేళ్లలో ఆరు తుపాన్లు తీరం దాటాయి. కానీ వాటి కారణంగా జరిగిన నష్టంతో పోలిస్తే ఈసారి నష్టం చాలా ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. హుద్‌హుద్ తర్వాత ఇదే పెద్ద నష్టం అని లెక్కలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో వరద నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనాలు విడుదల చేశారు. మొత్తం లక్షా 42వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. మొత్తం నష్టం అంచనా రూ .6,054 కోట్లు. ఇందులో రహదారులు ధ్వంసం అవటం వల్ల జరిగిన నష్టం రూ .1,756 కోట్లు. డ్యాములు, సాగునీటి శాఖకు జరిగిన నష్టం రూ .556 కోట్లు. వ్యవసాయ రంగానికి జరిగిన నష్టం రూ .1,353 కోట్లుగా ఉందని అంచనా వేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 95,949 కుటుంబాలను వరద బాధితులుగా ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 430 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. ఒక్క విద్యుత్ శాఖకే సుమారు రూ. 450 కోట్ల మేర నష్టం వాటిల్లింది.

వర్షం

సహాయక చర్యల పట్ల అసంతృప్తి

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ సహాయక చర్యల కోసం నాలుగు జిల్లాల్లోనూ ఇంచార్జీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

మొత్తం నాలుగు జిల్లాల్లో 19,832 మందికి మినహా అందరికీ నిత్యావసరాలు అందాయంటూ బుధవారం సీఎం నిర్వహించిన సమీక్షలో అధికారులు తెలిపారు. వరద బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున అదనపు సహాయం అందిస్తున్నట్టు వెల్లడించారు.

కడప జిల్లాలో ఇంకా 8 గ్రామాలకు విద్యుత్ సరఫరా జరగలేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. రాజంపేట ప్రాంతంలో అన్నమయ్య డ్యామ్‌లో నీటి నిల్వ చేసే అవకాశం లేనందున తాగునీటి సమస్య నివారణ చర్యలు చేపడుతున్నట్టు సీఎంకి అధికారులు వివరించారు.

పూర్తిగా దెబ్బతిన్న, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి పరిహారాన్ని వేగంగా అందించాలంటూ సీఎం ఆదేశించారు.

వచ్చే 3-4 రోజుల్లో ఇళ్లకు సంబంధించి పరిహారం వారికి అందాలి. అంతేకాక పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి కొత్త ఇళ్లను మంజూరు చేయాలి. వారికి రూ.95వేల చొప్పున పరిహారంతోపాటు కొత్త ఇంటికి రూ.1.8లక్షలు మంజూరుచేయాలి. రోడ్లు, విద్యుత్ పునరుద్దరణ పనులు వేగవంతం చేయాలి. ఈనెల 26 తర్వాత మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అంటూ సీఎం సూచించారు.

అయితే వరద సహాయం అందించడంలో ప్రభుత్వ తీరు మీద పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అనేక చోట్ల అధికారులు, మంత్రులను బాధితులు నిలదీస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)