ఆంధ్రప్రదేశ్ వరదలు: 5 జిల్లాలలో భారీ నష్టం, 18 మంది మృతి

వరదలలో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పోలీసులు

ఫొటో సోర్స్, Nellore Police

ఫొటో క్యాప్షన్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో వరదలలో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో వరద తీవ్ర నష్టం కలిగించింది.

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురిసిన కుండపోతకు వాగులు, నదులు పోటెత్తి ఊళ్లు, పట్టణాలను ముంచేశాయి.

జలాశయాలు, చెరువుల కట్టలు తెగాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాలలో పంట నీట మునిగింది.

బస్సులు నీటిలో కొట్టుకుపోయాయి. స్వర్ణముఖి ఒడ్డున ఓ ఇల్లు నిలువునా కుంగి నదిలో కలిసిపోయింది.

తిరుమల కొండలలో కుంభవృష్టి కురవడంతో ఘాట్ రోడ్డులో రాకపోకలకు ఆటంకమేర్పడింది.

వర్షాలు వరదలకు రైళ్లు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తం18 మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. 50 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యారని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తెలిపారు.

రేణిగుంట-గుంతకల్ రైలు మార్గం
ఫొటో క్యాప్షన్, రేణిగుంట-గుంతకల్ రైలు మార్గం

రేణిగుంట-గుంతకల్ రైలు మార్గంలో కిలోమీటరు మేర రెండు ట్రాక్‌లు కొట్టుకుపోయాయి. పునరుద్ధరణకు వారం రోజులు పట్టొచ్చని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. పునరుద్ధరణ పనులు ఇప్పటికే వేగవంతం చేశారు.

రేణిగుంట-కడప జాతీయ రహదారిపై చెయ్యేరు వంతెన తెగిపోవడంతో 4 రోజులుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అనంతపురం జిల్లా కదిరిలో మూడంతుస్తుల భవనం వర్షాలకు నాని కూలిపోవడంతో ముగ్గురు చిన్నారులు,

ఒక వృద్ధురాలు మరణించారని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

భవనం శిథిలాల్లో మరో నలుగురు చిక్కుకున్నారని.. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక సీఐ సత్యబాబును ఉటంకిస్తూ ఏఎన్ఐ వెల్లడించింది.

వీడియో క్యాప్షన్, ఏపీ వరదలు: నెల్లూరులో నీట మునిగిన 12 గ్రామాలు

సీఎం ఏరియల్ సర్వే

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేపడుతున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో నష్టాన్ని ఆయన పరిశీలిస్తారు.

కడప, రాజంపేట మీదుగా హెలికాప్టర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి తిరుపతి విమానాశ్రయానికి వెళ్తారు.

కడప జిల్లాలో వరదలో చిక్కుకున్న బస్సులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కడప జిల్లాలో ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకోవడంతో ప్రయాణికులు టాప్‌పై చేరి ప్రాణాలు కాపాడుకున్నారు.

1) కడప జిల్లా

గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లా అతలాకుతలమైంది. పాపాఘ్ని, చెయ్యేరు నదులకు వరద పోటెత్తడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అన్నమయ్య, పింఛ రిజర్వాయర్ల ఆనకట్టలు తెగిపోయాయి. గండిపేట, మైలవరం జలాశయాలకూ ప్రమాదకర స్థితి ఉండడంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

చెయ్యేరు పోటెత్తడంతో నందలూరు మండలం తీవ్రంగా దెబ్బతింది. నందలూరు, రాజంపేట మండలాల్లో 30 మందికిపై పైగా గల్లంతవగా 12 మంది మరణించారు. వీరిలో 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని కడప కలెక్టర్ విజయరామరాజు వెల్లడించారు.

సోమశిల జలాశయం నిండి బ్యాక్ వాటర్స్ పోటెత్తడంతో 12 గ్రామాలు మునిగిపోయాయి.

కడప, రేణిగుంట రోడ్డు మార్గం ఇంకా నీటిలోనే ఉంది. ముంబయి-చెన్నై రైలుమార్గం రాజంపేట మండలం కొన్ని చోట్ల వరదకు కొట్టుకుపోయింది.

చక్రాయపేట, గాలివీడు మండలాలలో అత్యధికంగా 19.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 10 మండలాల్లో 15 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురవడం, అన్నమయ్య జలాశయం కట్ట తెగి చెయ్యేరు ఉద్ధృతంగా ప్రవహించడం, సోమశిల బ్యాక్ వాటర్స్ ముంచెత్తడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.

తిరుమల నడకదారి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తిరుమల నడకదారి

2) చిత్తూరు జిల్లా

శుక్రవారం మధ్యాహ్నం నుంచి చిత్తూరు జిల్లాలో వర్షం తగ్గడంతో వరద ఉద్ధృతి తగ్గింది. అయితే, గురువారం నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరద బీభత్సం మాత్రం కొనసాగింది.

తిరుమల ఘాట్ రోడ్లలో విరిగిపడిన కొండ చరియలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించినప్పటికీ సాయంత్రం నుంచి మళ్లీ ఈ మార్గాలను మూసివేశారు. తిరుమల కొండపై 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. శ్రీవారి మెట్ల మార్గం అనేక చోట్ల దెబ్బతింది.

రేణిగుంట, చెన్నై మార్గంలో కొన్ని చోట్ల పట్టాలు దెబ్బతినడంతో తిరుపతి, రేణిగుంట స్టేషన్లకు రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి.

తిరుచానూరులో స్వర్ణముఖి ఒడ్డున ఒక ఇల్లు నదిలో కొట్టుకుపోయింది. కలిగిరి-సదుం రోడ్డు మార్గం ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

చిత్తూరు జిల్లా పెద్దమండ్యాం మండలంలో అత్యధికంగా 21 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 47 మండలాల్లో 10 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో వర్షాలకు నలుగురు మరణించినట్లు అధికారులు చెప్పారు.

హెలికాప్టర్‌లో వెళ్లి రక్షిస్తున్న వాయుసేన

ఫొటో సోర్స్, Anantauram Police

ఫొటో క్యాప్షన్, చిత్రావతిలో చిక్కుకున్న కూలీలను హెలికాప్టర్‌లో వెళ్లి రక్షిస్తున్న వాయుసేన

3) అనంతపురం జిల్లా:

అనంతపురం జిల్లాలోనూ వాగులు పోటెత్తాయి. చిత్రావతి నదిలో నలుగురు తమిళనాడు కూలీలు చిక్కుకుపోగా వారిని కాపాడేందుకు వెళ్లి మరో ఆరుగురు చిక్కుకున్నారు. వారంతా అక్కడ ఒక జేసీబీపై చేరి ఉండగా వైమానిక దళ సిబ్బంది హెలికాప్టర్లలో వారిని కాపాడారు.

పెన్నా, చిత్రావతి, సువర్ణముఖి నదులు పొంగిపొర్లడంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.

మద్దిలేరు ఉద్ధృతంగా ప్రవహించడంతో కదిరి పట్టణం నీట మునిగింది. చిత్రావతి వరదతో పుట్టపర్తి జలదిగ్బంధంలో చిక్కుకుంది.

శుక్రవారం ఉదయానికే ఈ రెండు పట్టణాలు పూర్తిగా నీటిలో ఉన్నాయి. వీధుల్లో నిలువెత్తున నీరు ప్రవహిస్తుండడం, ఇళ్లలో కిటికీల కంటే ఎత్తుకు నీరు చేరడంతో ప్రజలు మేడపైకి చేరి సహాయం కోసం కేకలు వేస్తూ కనిపించారు.

ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.

యోగి వేమన, చిత్రావతి జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి.

వర్షాలకు రైల్వే ట్రాకులు దెబ్బతినడంతో చెన్నై, అహ్మదాబాద్, కాచిగూడ, ముంబయి, మధురై వెళ్లాల్సిన పలు రైళ్లను దారి మళ్లించారు.

నంబులపూలకుంట మండలంలో అత్యధికంగా 23.72 సెంటీమీటర్ల వర్షం కురవడంతో అనేక గ్రామాలు నీట మునిగాయి.

నెల్లూరు జిల్లా పెరమన వద్ద బైక్ మీద వెళ్తున్న వ్యక్తి వరదలో కొట్టుకుపోవడంతో రక్షించిన స్పెషల్ పార్టీ పోలీసులు

ఫొటో సోర్స్, NellorePolice

ఫొటో క్యాప్షన్, నెల్లూరు జిల్లా పెరమన వద్ద బైక్ మీద వెళ్తున్న వ్యక్తి వరదలో కొట్టుకుపోవడంతో రక్షించిన స్పెషల్ పార్టీ పోలీసులు

4) నెల్లూరు జిల్లా

పెన్నా నది పరీవాహక ప్రాంతమంతా కకావికలమైంది. పెన్నానది పొడవునా ఊళ్లు, పట్టణాలు నీట మునిగాయి.

సోమశిల జలాశయం ఉన్న అనంతసాగరం మండలంలో అత్యధిక ప్రాంతాలు నీట మునిగాయి. నెల్లూరు, సంగం, విడవలూరు, కలువాయి, ఆత్మకూరు, చేజర్ల, పొదలకూరు, బుచ్చిరెడ్డిపాళ్యం తదితర మండలాలలో పంటలు, రోడ్లు, ఇళ్లు దెబ్బతిన్నాయి.

స్వర్ణముఖి వరదతో గూడురు, వెంకటగిరి, సూళ్లూరుపేట.. కండలేరు పొంగడంతో రాపూరు మండలంలో పంటలు దెబ్బతిన్నాయి.

నాయుడుపేట, వెంకటగిరి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

నెల్లూరు నగరంలో అనేక కాలనీలు వరద నీటిలో మునగడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సి వచ్చింది.

నెల్లూరులో వరద
ఫొటో క్యాప్షన్, నెల్లూరు పట్టణంలో వరదలకు రోడ్లు నీట మునిగాయి.

5) ప్రకాశం జిల్లా:

గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

కందుకూర, సింగరాయకొండ, ఉలవపాడు, లింగసముద్రం మండలాలు వర్షాలకు ఎక్కువగా నష్టపోయాయి.

గుండ్లకమ్మ నదికి వరద పోటెత్తడంతో కనిగిరి ప్రాంతంలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి.

రాళ్లపాడు జలాశయం పూర్తిగా నిండడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో లింగసముద్రం మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)