ఆంధ్రప్రదేశ్: దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్ష బీభత్సం, మనుషులు గల్లంతు... కొట్టుకుపోతున్న మూగజీవాలు

తిరుపతిలో రోడ్లపై పొంగిపొర్లుతున్న నీరు
ఫొటో క్యాప్షన్, తిరుపతిలో రోడ్లపై పొంగిపొర్లుతున్న నీరు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం తెల్లవారుజామున తమిళనాడులోని చెన్నై-పుదుచ్చేరి మధ్య తీరం దాటిందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.

తెల్లవారుజామున 3-4 గంటల మధ్య తీరం దాటిన ఈ వాయుగుండం ప్రభావంతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ దక్షిణకోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయానికి ఈ వాయు గుండం తమిళనాడు ఉత్తర తీర ప్రాంతంలో చెన్నైకి ఆగ్నేయంగా, పుదుచ్చేరికి ఉత్తర ఈశాన్యంలో 60 కిలోమీటర్ల దూరంలో ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సూచించారు.

ఇప్పటికే, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.

కొన్ని చోట్ల భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు ఒక ప్రకటనలో కోరారు.

స్వర్ణముఖి నదిపై వంతెన వద్ద పూర్తిగా కొట్టుకుపోయిన రోడ్డు
ఫొటో క్యాప్షన్, స్వర్ణముఖి నదిపై వంతెన వద్ద పూర్తిగా కొట్టుకుపోయిన రోడ్డు

నీట మునిగిన కడప

కడప నగరంలో అప్సర సర్కిల్, పాత బస్‌స్టాండ్ సహా పలు ప్రాంతాల్లో వరద నీరు ప్రవేశించింది.

చిత్తూరు నగరంలో కూడా వరద తాకిడి కనిపిస్తోంది. స్వర్ణముఖి నది అంచున ఉన్న నివాసాలు ప్రమాదంలో చిక్కుకున్నాయి.

అన్నమయ్య ప్రాజెక్టు సమీపంలో ఉన్న గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి

బగ్గెడేపల్లె, పులపుత్తూరు, మందపల్లె, పాపరాజుపల్లె తో పాటు మరికొన్ని గ్రామాలు పూర్తిగా నీటిలో ఉన్నాయి.

రాజంపేట మండలంలోని రామాపురం వద్ద ఆర్టీసీ బస్సు నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడంతో ప్రయాణికులు బస్సు పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.

వరద ప్రవాహంలో పలు చోట్ల మూగ జీవాలు కొట్టుకుపోయాయి.

పెన్నా, చిత్రావతి నదులకు భారీగా వరద నీరు

గండికోట రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని, మైలవరం రిజర్వాయర్‌ నుంచి పెన్నా నదిలోకి నీరు విడుదల చేయడం వల్ల ప్రవాహం ఉద్ధృతంగా మారే అవకాశం ఉందని మైలవరం డ్యామ్ ఏఈఈ వై. గౌతం రెడ్డి ఒక ప్రకటనలో హెచ్చరించారు.

ఉదయం 5 గంటల నుంచి 25-50 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు తెలిపిన గౌతం రెడ్డి, నీటి విడుదల మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

ఈ పరిస్థితుల్లో పెన్నా బేసిన్‌లోని జమ్మలమడుగు, ప్రొద్దటూరు మున్సిపాలిటీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్నా నదిలోకి ఎవరూ వెళ్లకూడదని ఆయన సూచించారు.

దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టు కట్ట
ఫొటో క్యాప్షన్, దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టు కట్ట

సోమశిల వరద

భారీ వర్షాలతో దాదాపు 80,000 క్యూసెక్కుల నీరు సోమశిల ప్రాజెక్టులోకి వస్తోంది. దాంతో, ఈ నీటినీ పెన్నాలోకి వదులుతున్నారు. దీంతో నెల్లూరు నగరానికి వరద ముప్పు ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే చిత్తూరు పశ్చిమ ప్రాంతం, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురస్తున్నాయి.

తిరుపతిలో గురువారం రాత్రి ఓ మోస్తరు వర్షం పడింది. కానీ, ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద తాకిడి పెరుగుతోంది. సాయంత్రం వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు.

వరద సహాయక బృందాలు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

తిరుపతి, కడప, అనంతపురం జిల్లాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం అంతా నెల్లూరు మీద పడుతోంది.

తిరుపతి వరద వాకాడ సమీపంలో దిగువకు వచ్చి సోమశిల ప్రాజెక్టుకి నీరు చేరుతుంది. అనంతపురం, కడప వర్షాల నీళ్లన్నీ పెన్నా నదిలో చేరుతాయి. ఫలితంగా నెల్లూరు వరదల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ జిల్లాలో పంట నష్టం కూడా భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు, ఒంగోలులోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ఆ జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం ప్రజలు 08592-281400 నంబరకు కాల్ చేయవచ్చని తెలిపారు. 24 గంటల టోల్ ఫ్రీ నంబర్ 1077 ఏర్పాటు చేశారు.

కడప జిల్లా పులివెందులలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పులివెందుల బ్రిడ్జికి వరద నీరు పోటెత్తుతోంది. ఈ ఆనకట్టకు దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

తిరుమలలో నీరు

ఫొటో సోర్స్, ANI

తిరుమలకు రాకపోకలు పాక్షికంగా పునరుద్ధరణ

అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాక పోకలను పునరుద్ధరించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలను తొలగించడంతో ఈ మార్గంలో వాహనాలను అనుమతిస్తారు.

గంట పాటు తిరుమల నుంచి అలిపిరి, గంట పాటు అలిపిరి నుంచి తిరుమలకు వాహనాలను ఈ మార్గంలో అనుమతిస్తారు.

భక్తులెవరు ఫోటోల కోసం వాహనాలు దిగడం, వాహనాలను ఆపి ఉంచడం లాంటివి చేసి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని టీటీడీ కోరింది.

భారీ వర్షాల కారణంగా అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్‌లో అనేక చోట్ల కొండ చరియలు విరిగి పడటంతో వాటి తొలగింపు పనులు ఇంకా జరుగుతున్నాయి.

మధ్యాహ్నం తరువాత పరిస్థితి ని అంచనా వేసి ఈ మార్గంలో వాహనాలను అనుమతించే విషయం పై టీటీడీ నిర్ణయం తీసుకుంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.