ఆంధ్రప్రదేశ్: తెలుగు మీడియం తెరమరుగు, 175 ఏళ్ల ఇంగ్లిష్ కల సాకారం కానుందా

ఫొటో సోర్స్, iStock
- రచయిత, జింకా నాగరాజు
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరం నుంచి తెలుగు మీడియం మాయమవుతుంది. ఆ ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలన్నీ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మారుతాయి.
ఒక రాష్ట్రం నుంచి ఇలా పూర్తిగా మాతృభాష బోధనాభాషగా మాయం కావడమనేది భారతదేశంలో ఎక్కడా జరగలేదు.
రాష్ట్రంలో తెలుగు మీడియం రద్దు చేసే ప్రక్రియ రెండేళ్ల కిందట మొదలయింది. ఒక్కో ఏడాది ఒక్కొక్క తరగతి నుంచి తెలుగు మీడియం రద్దు అవుతూ ఉంది.
ఇప్పుడు హైస్కూళ్లలో ఆరో తరగతికి జరుగుతున్న అడ్మిషన్లన్నీ ఇంగ్లిష్ మీడియంలోనే. రెండేళ్ల కిందట ఆరో తరగతిలో చేరిన వాళ్లంతా వచ్చే రెండేళ్లలో పదో తరగతికి వస్తారు.
వాళ్లు పాసయి బయటకు పోగానే 2024-25 నుంచి తెలుగు మీడియం రద్దు అవుతుందని విద్యాశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు ‘బీబీసీ తెలుగు’తో చెప్పారు.
దీనికి తల్లితండ్రుల నుంచి సంపూర్ణ మద్దతు ఉందని కూడా ఆయన తెలిపారు.
దేశంలో రాష్ట్రాలన్నీ ఇంగ్లిష్ మీడియం వైపు మళ్లుతున్నాయి. మాతృభాషలో విద్యాబోధన తప్పనిసరి చేసిన తమిళనాడు వంటి రాష్ట్రాలలోనూ ఇంగ్లిష్ మీడియం ప్రాధాన్యం పెరుగుతూ ఉందని లెక్కలు చెబుతాయి. దేశంలోని మేటి ఉద్యోగాలలో ఎక్కువ శాతం ఉన్నది ఇంగ్లిష్ విద్యతో లబ్ధిపొందిన కుటుంబాల పిల్లలే అనే సత్యం అందరికి తెలిసిందే.

ఫొటో సోర్స్, FACEBOOK/YS JAGAN MOHAN REDDY
ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే..
ఆ మధ్య ఎన్‌సీఈఆర్‌టీ(NCERT) నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే జరిపింది. అన్ని రాష్ట్రాల స్కూల్ బోర్డులలోని పదో తరగతి విద్యార్థులకు ఒక కామన్ పరీక్ష నిర్వహించి విద్యార్థుల పనితీరును పరిశీలించాలనుకుంది ఈ సంస్థ.
ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్, ఆధునిక ప్రాంతీయ భాష సబ్జెక్టులలో పరీక్ష నిర్వహించారు.
ఇందులో 15 భాషల్లో నుంచి 2,77,416 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్ష పత్రాలను అన్ని ప్రాంతీయ భాషల్లో అందించారు.
ఈ పరీక్షలో అగ్రభాగన నిలబడిన విద్యార్థులంతా కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్‌సీఈ) విద్యార్థులే.
ఈ బోర్డు తొలినుంచి ఇంగ్లిష్ మీడియంలోనే బోధన జరుపుతోంది. ఈ పరీక్షలో రాష్ట్రాల బోర్డుల విద్యార్థులలో 75 శాతం మార్కులు సాధించిన వారు అయిదు శాతం మించరు. కానీ సీఐఎస్‌సీఈ విద్యార్థులు అందరి కంటే చాలా ముందున్నారు. పనితీరులో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు ప్రాంతీయ భాష విద్యార్థులకంటే ముందుంటున్నారని ఈ సర్వే నిరూపించింది.
అయితే, ఏ రాష్ట్రం మాతృభాష మాధ్యమం తొలగించలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే అది జరుగుతోంది.
తెలుగు భాషా ప్రాతిపాదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశే కావడంతో ఈ నిర్ణయం చర్చనీయమవుతోంది.
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని చరిత్రను పరిశోధించి, ప్రచారం చేసి, తెలుగు ఐడెంటిటీని నిర్మించుకుని 50 యేళ్ల రాజకీయ సాంస్కృతిక పోరాటం తర్వాత సాధించకున్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం(1953). ఇలాంటి చోట ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు చేసి, స్కూళ్లన్నింటిని ఇంగ్లిష్ స్కూళ్లుగా మారుస్తారా అనేది కొంతమంది పండితుల ఆవేదన.
ఇది తెలుగు భాషను చంపేస్తుందని అంటున్నారు కొందరు తెలుగు పండితులు. పిల్లలు మాతృభాషలో విద్య నేర్చుకుంటే తొందరగా విద్యావంతులవుతారని, వారిలో మేధో శక్తి పెరుగుతుందని చెబుతున్నారు వారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘అలా అనడం సరికాదు’’
ఇంగ్లిష్ నేర్చుకుంటే తెలుగు భాష చచ్చిపోతుందనే వాదనను ఫ్రొఫెసర్ కంచె ఐలయ్య అంగీకరించడం లేదు.
‘అదే నిజమయితే, చాలా కుటుంబాల్లో తెలుగు అంతరించిపోయి ఉండాలి. కేటీ రామారావు, జ్యోతిరాదిత్య సింథియా, రాహుల్ గాందీ, అఖిలేష్ యాదవ్ వంటి వారంతా ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నవారే, వాళ్ల ఇళ్లలో మాతృ భాష చచ్చిపోయిందా’ అని ప్రొఫెసర్ ఐలయ్య ఆ మధ్య ఒక వ్యాసంలో ప్రశ్నించారు.
ఈ చర్చ గురించి ప్రభుత్వ పాఠశాలల పిల్లల తల్లిదండ్రులకు పెద్దగా తెలియనే తెలియదు. తమ పిలల్లు ఏ స్కూళ్లో చదవాలి, ఏ మీడియంలో చదవాలనే దాని గురించి ఈ పండితులు ఎందుకు మాట్లాడుతున్నారో కూడా చాలా మంది తెలియదు’’అని ఆయన అన్నారు.
కుంటుమల్ల నారాయణ ప్రొద్దుటూరులో చేనేత కార్మికుడు. ఆయన తన ఇద్దరు పిల్లలను కాన్వెంట్‌కు పంపేవారు. ఇది ఖర్చుతో కూడుకున్నదే అయినా భరిస్తూ వస్తున్నారు. కాన్వెంట్ ఫీజుతో పాటు వాళ్లని ఆటోలో పంపించాలి. ఆ ఖర్చు భరించాలి. ఈ మధ్య ఆయన తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించడం మొదలుపెట్టారు.
“అంతా పిల్లలను కాన్వెంటుకు పంపిస్తున్నారు. ఇంగ్లిష్ నేర్చుకుంటే, ఉద్యోగాలొస్తాయని చెబుతున్నారు. అందరితో పాటు నేను పిల్లలను ఇంగ్లిష్ స్కూల్ పంపించాను. ఇంగ్లిష్ నేర్చుకుంటే తెలుగు భాష అంతరించి పోతుందనే విషయం నాకు తెలియదు”అని నారాయణ అన్నారు.
నారాయణ లాగే చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లలు ఇంగ్లిష్ నేర్చుకోవాలని, ఇంగ్లిష్ వస్తేనే జీవితంలో ఎదుగుతారని నమ్ముతున్నారు, ఆ భాష నేర్పించేందుకు ఉబలాటపడుతున్నారు. దీని ప్రభావం రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో అంటే ఉత్తరాంధ్ర, సర్కార్, రాయలసీమ స్కూళ్లలో ఎలాంటి ప్రభావం చూపిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఇంగ్లిష్ వైపే..
ఉత్తరాంధ్రలోని విజయనగరం సమీపాన జమ్ము అనే గ్రామం ఉంది. అక్కడ ఒక మండల ప్రాథమిక పాఠశాల ఉంది. ఇది వలస కూలీల కాలనీల మధ్య ఉంటుంది.
ఈ స్కూల్ ఉత్తరాంధ్రలోనే బెస్ట్ స్కూల్‌గా గుర్తింపు పొందింది. ఇక్కడ చదువు బాగా చెప్పడమే కాదు, ఇంగ్లిష్ బాగానేర్పిస్తారని పేరు. తమ పిల్లలను కాన్వెంటుకు పంపాలని కలగనే పరిసరాల తల్లితండ్రుల కోరిక ఈ స్కూల్ నెరవేర్చింది. ఇంగ్లిష్ ఉన్నందుకే ఈ స్కూల్‌కు పిల్లలను పంపిస్తున్నారు. ఈ స్కూలు ఈ ప్రాంతానికి గర్వకారణమయింది.
ఇలాగే, గుంటూరు జిల్లా ఈపూరు మండలం బోడేపూడివారి పాలెంలో ఆర్‌సీఎం ప్రాథమిక పాఠశాల ఉంది. మొన్న మొన్నటి దాకా ఈ స్కూల్ ఒక చోద్యం. ఈ స్కూల్‌లో 1 నుంచి 5వ తరగతి దాకా చదువు చెబుతారు. అయితే, ప్రతి సంవత్సరం ఉన్నట్లుండి ఒక రోజు ఐదో తరగతి మామమయ్యేది. ఆ క్లాస్ రూం ఖాళీగా అయ్యేది. కారణం, నాలుగు పాసయిన విద్యార్థులందరికి ఇక్కడ మంచి శిక్షణ ఇప్పించి ఇంగ్లిష్ మీడియం, ఉచిత హాస్టల్ వసతి ఉండే గురుకుల పాఠశాలల ప్రవేశం కోసం ఎంట్రెన్స్ రాయించేవారు. దాదాపు అంతా సెలక్ట్ అయ్యే వారు. నాలుగో తరగతి నుంచి ఐదో తరగతికి ప్రమోట్ కావలసిన బ్యాచ్ మొత్తం గురుకులానికి వెళ్లి పోతే, ఏమవుతుంది. అయిదో తరగతి మాయమవుతుంది. ఇలా ఐదో తరగతి గది ఎపుడూ ఖాళీగా ఉంటుంది ఈ స్కూలులో.
గురుకుల ప్రవేశ పరీక్ష పాస్ అయ్యేలా పిల్లలకు కోచింగ్ ఇవ్వాలనే షరతు మీదే తల్లితండ్రులు ఇక్కడ పిల్లలను చేర్పిస్తారు. ఆరో తరగతి నుంచి ప్రయివేటు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చేర్పించడం ఖరీదయిన వ్యవహారం. ఈ స్కూల్‌లో చేర్పిస్తే ఉచిత ఇంగ్లిష్ మీడియం గురుకుల్ సీట్ గ్యారంటీ అని ఈ ప్రాంతంలో నమ్మకం.
కడప జిల్లా ర్యామటలో చిన్న ప్రభుత్వ పాఠశాల ఉంది. ‘నాడు నేడు’ పథకం కింద ఎంపిక కావడంతో ఈ పాఠశాలకు చక్కటి వసతులు సమకూరాయి. మంచినీళ్ల ఆర్‌వో ఫిల్టర్ కూడా ఉంది. శుభ్రమయిన టాయిలెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంగ్లిష్ బోధించడం మొదలుపెట్టారు. దీనితో ఈ పాఠశాల ఇపుడు విద్యార్థులతో నిండుగా కనిపిస్తుంది.

ఒక మంచి టీచర్ కూడా ఉండటంతో ఇంగ్లిష్ మీడియం బాగా పాపులర్ అయింది. ఒక్క సారిగా ఇంగ్లిష్ మీడియంలోకి మారడం టీచర్లకు, విద్యార్థులకు కొంత ఇబ్బందికరమే అయినా, ఇది మంచి ప్రయోగమేనని ర్యామట స్కూల్ టీచర్ ప్రసాద బాబు అన్నారు. ఈ సమస్యను ఉభయ భాషా పాఠ్యపుస్తకాలు కొంతవరకు పరిష్కరిస్తాయని ఆయన చెప్పారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినా, హైస్కూలు దాకా ఉభయ భాష పాఠ్యపుస్తకాలు కొనసాగిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. తమ పాఠశాల పరిధిలోని తల్లితండ్రులంతా ఇంగ్లిష్ మీడియమే కావాలంటున్నారని ఆయన చెప్పారు.
“తల్లితండ్రులంతా అయిదో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం గురుకుల్ పాఠశాలల అడ్మిషన్ సంపాదించాలనే కండిషన్ తోనే మా స్కూలులో పిల్లలని చేర్పిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి గురుకుల ఎంట్రన్స్ కోసం మేం కోచింగ్ ఇస్తాం. దీంతో మా పిల్లలు 95 శాతం మంది గురుకుల్ ఎంపికవుతున్నారు. అక్కడ ఉచితంగా ఇంగ్లిష్ మీడియం చదువు ఉంటుంది. హాస్టల్ ఉంటుంది. దీనివల్ల మా స్కూల్ అయిదో తరగతిలో ఇద్దరు ముగ్గురు పిల్లలే మిగిలేవారు. వాళ్ల కోసం క్లాస్ నడపడం కష్టమయి వారిని మరొక మంచి స్కూల్లో చేర్పిస్తాం. అందుకే మా స్కూల్లో అయిదో తరగతి ఖాళీగా ఉంటుంది”అని బోడేపూడివారి పాలెం ఆర్‌సీఎం స్కూల్ ప్రిన్సిపల్ శిఖా మార్గరెట్ చెప్పారు. ఇంగ్లిష్ మీడియం ఉన్నందునే మా స్కూలుకు పిల్లలను పంపిస్తున్నారని ఆమె చెప్పారు.
విజయనగరం స్కూల్ హెడ్‌మాస్టర్ మంత్రి రామ్మోహన్ రావు కూడా ఇదే విషయాన్ని వివరించారు. “ మా ఏరియాలో తల్లిదండ్రులు పిల్లలను కాన్వెంట్ స్కూల్‌కు పంపడం మానేశారు. మా పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ఉండటం, ఏ ప్రయివేటు కాన్వెంట్‌లోనూ లేని వసతులు ఏర్పాటు చేయడంతో మా మండల ప్రాథమిక పాఠశాల చాలా పాపులర్ అయింది. ఇంగ్లిష్ బోధించడం టీచర్లకు, నేర్చుకోవడం పిల్లలకు అలవాటవుతూ ఉంది” అని రామ్మోహన రావు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
175 సంవత్సరాల నాటి కల
ఆంధ్రప్రదేశ్‌లో 2022-24 నుంచి పూర్తి ఇంగ్లిష్ స్కూళ్లు రాబోతున్నాయనే మాట వింటూనే ప్రముఖ చరిత్రకారుడు రాబర్ట ఎరిక్ ఫ్రైకెన్‌బర్గ్ రాసిన విషయాలు గుర్తుకొస్తాయి.
అయితే, 19వ శతాబ్దం చివర్లో, 20వ శతాబ్దం మొదట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇంగ్లిష్ స్కూళ్ల కోసం తెలుగు, తమిళ ప్రజలు.. ప్రభుత్వం మీద విపరీతంగా ఒత్తిడి తీసుకువచ్చారు.
మద్రాసు ప్రెసిడెన్సీలో ఇంగ్లిష్ విద్యాబోధన ఎలా ప్రారంభమయింది? దాని కోసం కోసం తెలుగు, తమిళ ప్రజలు ఎలా ప్రయత్నాలు చేశారు? ముఖ్యంగా గుంటూరు జిల్లాలో జరిగిన నాటి పరిణామాల మీద ఎరిక్ ఫ్రైకెన్‌బర్గ్ బాగా పరిశోధన చేశారు.
ఇంగ్లిష్ స్కూళ్లు కావాలనేది ఆ రోజు ప్రధాన డిమాండ్. తమ పిల్లవాడు నాలుగు ముక్కలు ఇంగ్లిష్ నేర్చుకుని కచేరిలో చిన్న ఉద్యోగం సంపాదించాలని చాలా మంది కలలు కనేవారు. ఇంగ్లిష్ నేర్చుకుంటే ఉద్యోగాలొస్తాయని మొదట గుర్తించినవాళ్లు బ్రాహ్మణులు. అప్పటికి ఇంగ్లిష్ చెప్పే స్కూల్స్ ఇంకా మొదలుకాలేదు. ఇంటిదగ్గిరే ఎబీసీడీలు నేర్చుకునేవారు, లేదా ఒక ట్యూటర్‌ను పెట్టుకుని గబాగబా ఇంగ్లిష్ నేర్చుకుని, చూసి రాత (కాపీరైటింగ్) చేయగలిగితే ఉద్యోగం గ్యారంటి ఉన్న రోజులవి.
ఇలా నెలకు ఒకటి రెండు రుపాయలకు బ్రాహ్మణ పిల్లలు కాపిరైటర్‌గా చేరేవారు. ఆ తర్వాత తన బంధువుల పిల్లలకు ఏబీసీడీలు నేర్పించి ఏదో ఒక కచేరిలో ఉద్యోగానికి కుదిర్చేవారు. ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ లేదు కాబట్టి కచేరీల నిండా ఒకే కుటుంబానికి చెందినవారే ఉండేవారు. ఇలా మచిలీపట్నం హుజూర్ కచేరిలో అకౌంట్స్ విభాగంలో పని చేసే మేనమామ ఒడిలో కూర్చుని ఏబీసీడీలు నేర్చుకుని కాపిరైటర్‌గా గుంటూరు జిల్లా వినుకొండ తాలుకాఫీస్‌లో కొలువుకు కుదిరిన వారే వెన్నెలకంటి సుబ్బారావు.
అక్కడి నుంచి అంచెలంచెలులా ఎదుగుతూ మద్రాసు సదర్ అదాలత్‌లో చీఫ ఎంటర్‌ప్రెటర్ హోదాకు వెన్నెలకంటి సుబ్బారావు చేరారు. ఉద్యోగంలో చేరేటప్పటికి ఆయన వయసు పదేళ్లే. ఇంగ్లిష్ భాష చూసి రాయడం నేర్చుకునేందుకు ఆయన కనిపించిన ప్రతి ఇంగ్లిష్ పేపర్ ముక్కను కాపి చేస్తూ వచ్చారు. ఇందులో స్పీడ్ నేర్చుకున్నాక ఒక రుపాయ నెలజీతానికి కొలువుకు కుదిరారు.

ఫొటో సోర్స్, Getty Images
1929లో రిటైరయ్యాక ఆయన మద్రాసు టెక్స్ట్ బుక్ సొసైటీ సభ్యుడయ్యారు. నాటి మద్రాసు సెలెబ్రిటీలలో ఒకరయ్యారు. ఆ రోజుల్లో ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఎలా ఉండిందో సుబ్బారావు తన ఆత్మకథలో కూడా రాశారు. నలుగురితో మర్యాదగా మాట్లాడేందుకు, పెద్దవాళ్లతో కలివిడిగా ఉండేందుకు నాలుగు ఇంగ్లిష్ ముక్కలు మాట్లాడటం చాలా అవసరం. ఇంగ్లిష్ మాట్లాడితే హోదా కూడా వచ్చేదని ప్రజలు గుర్తించినట్లు ఫ్రైకెన్‌బర్గ్ రాశారు.
ఈ నేపథ్యంలో 1846, అక్టోబర్ 7న మద్రాసు పచ్చయప్పాస్ హాల్‌లో ఒక బహిరంగ సభ జరిగింది. ఇందులో తమిళ, తెలుగు ప్రముఖులంతా ఉన్నారు. “మంచి ఇంగ్లిష్ స్కూళ్లు ప్రారంభించాలి. కచేరి నియామకాలలో మత పక్షపాతం లేకుండా ఉండాలి” అనే విషయం చర్చించేందుకు జరిగిన సభ అది. ఈ సభ అప్పటి మద్రాసు ప్రభుత్వానికి ఒక మెమొరాండం సమర్పించింది.
“ ప్రెసిడెన్సీ ప్రాంతంలో ఇంగ్లిష్ విద్యను ప్రవేశపెట్టి, ఆ భాషలో సంపాదించిన ప్రావీణ్యం ఆధారంగా మాత్రమే ప్రభుత్వ కార్యాలయాల్లో నియామకాలు జరగాలి” అని తీర్మానించినట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. అప్పుడు కేవలం వ్యక్తిగత సంబంధాల ద్వారానే ఉద్యోగాలొచ్చేవి. దీనితో బళ్లారీ, అనంతపూర్, నెల్లూరు, కడప, కర్నూలు, గుంటూరు జిల్లా కచేరీలలో సకుటుంబ సపరివారమంతా ఉండేది.
ఇలాంటి నేపథ్యం లోనుంచే వెన్నెలకంటి సుబ్బారావు తొమ్మిదో యేట ఇంగ్లిష్ నేర్చుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. ఇంగ్లీష్‌కు ఇంత డిమాండ్ ఉన్నందునే మద్రాస్ మౌంట్ రోడ్డులో ఇప్పటి కాన్వెంట్ స్కూళ్లలాగా సందుసందున ఇంగ్లీష్ బోధించే దుకాణాలు ఉండేవి. ఇలా మౌంట్ రోడ్ లో ‘బెస్ట్ ఇంగ్లీష్ విద్య నేర్పబడును’ అని బోర్డు తగిలించుకున్న దుకాణాలు దాదాపు 500 దాకా ఉండేవని ఫ్రైకెన్ బెర్గ్ రాశారు. ఫ్రైకెన్ బెర్గ్ గుంటూరు జిల్లాలో ‘భారతీయ ఇంగ్లిష్ తరం ఎలా మొదలయింది’ అనే దాని మీద లోతైన పరిశీలన జరిపారు.
పచ్చయప్ప హాల్‌లో జరిగిన పబ్లిక్ మీటింగ్ సార్వత్రిక ఆంగ్ల విద్య కోసం జరిగిన ఒక తిరుగుబాటు లాంటిది. అంతేకాదు, కేవలం కొన్ని కుటుంబాల వాళ్లకే కాకుండా, ఆంగ్లం నేర్చుకున్న వారందరికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఎంపిక విధానం అమలుచేయాలని మెరిట్ ప్రాతిపదిక కోరుతూ బ్రాహ్మణేతరులు చేసిన తొలి డిమాండ్ అది. నాటి సార్వత్రిక ఆంగ్ల విద్య అనే డిమాండ్ 175 సంవత్సాల అనంతరం ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో నిజమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
భిన్న వాదనలు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగు మీడియం రద్దు చేయాలనుకోవడంతో తెలుగు మేధావుల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘‘ఇది మాతృ భాషకు ద్రోహం చేయడం అవుతుంది. ప్రాంతీయ భాషల ప్రోత్సహించాలన్న గాంధీజీ, తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు ఆశయాలకు తూట్లూ పొడవడమే’’ అని తెలుగు అధికార భాష ఉద్యమకారుడు, న్యాయవాది కేసీ కల్కూర(కర్నూలు ) అన్నారు.
ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం వేరు, తెలుగు మీడియం పూర్తిగా రద్దు చేయడం వేరు అనేది ఆయన వాదన. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టండి, దీనికి తెలుగు మీడియం రద్దుచేయడం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. తెలుగును అధికార భాషగా పూర్తిగా అమలుచేయాలని గత 3 దశాబ్దాలుగా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసిన వ్యక్తి కల్కూర.
అయితే, పౌర హక్కుల వాది, రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ ఎ చంద్రశేఖర్ (అనంతపురం) ఈ వాదనతో ఏకీభవించలేదు. “తెలుగు మీద తొలిదెబ్బ 25 సంవత్సరాల కిందటే పడింది. నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ సంస్థలు తెలుగు మీడియం ఎత్తేశాయి. తెలుగును కనీసం ఒక సబ్జెక్టుగా కూడా బోధించ లేదు. తెలుగు సబ్జెక్టును తీసేసి సంస్కృతం ప్రవేశపెట్టారు. అపుడు ఒక్క మాట మాట్లాడని పండితులు, ఇపుడు ప్రభుత్వం కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం అనగానే ఆవేశపడుతున్నారు”అని ఆయన వ్యాఖ్యానించారు.
“రాష్ట్రంలోని విద్యార్థులలో 55 శాతం మంది ఎప్పుడో కార్పొరేట్ కాలేజీల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. ఇక మిగిలింది కేవలం 45 శాతం గ్రామీణ విద్యార్థులే. వీళ్లంతా ఖరీదైన కాన్వెంట్ స్కూల్లకు పంపలేని కుటుంబాల పిల్లలే. ఇపుడు ప్రభుత్వం స్కూళ్లలో వసతులు పెంచి వీళ్ల కోసం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతూ ఉంది. దీనితో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య పెరిగింది. మేం జరిపిన ఒక సర్వేలో కూడా ఇది రుజువయింది”అని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు.
‘‘ఇక్కడే 1986 నాటికి, 2002 నాటికి ఉన్న తేడా కనిపిస్తుంది. ఆ రోజుల్లో మద్రాస్ ప్రెసిడెన్సీలోని కొంతమంది బ్రాహ్మణేతర అగ్రకులాల నుంచి మాత్రమే ఇంగ్లిష్ విద్య కావాలనే డిమాండ్ వచ్చింది. ఇపుడు సమాజంలోని అట్టడుగు వర్గాలన్నీ ఇంగ్లిష్ విద్యను కోరుకుంటున్నాయి’’అని ఆయన అన్నారు.
ప్రభుత్వ వాదన
సమాజంలో రెండు రకాల అసమానతలను రూపుమాపే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేస్తున్నదని, ఈ ప్రయోగం వెనక ఒక ఉన్న సామాజిక సంస్కరణ ఆశయం ఉందని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు బీబీసీ తెలుగుతో చెప్పారు.
ఈ అసమానతల గురించి ఆయన ఇలా వివరించారు. “ చాలా మంది తల్లిదండ్రులు కొడుకులను కష్టపడి ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకి పంపిస్తున్నారు. పిల్లలకు ఇంగ్లిష్ నేర్పించాలని కోరిక ఉన్నా ఆర్థిక వనరుల్లేని కుటుంబాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు పరిమితమవుతున్నారు. ప్రయివేటు ఇంగ్లిష్ విద్యార్థులు, ప్రభుత్వం తెలుగు విద్యార్థులనే రెండు వర్గాలు తయారవుతున్నాయి. సమాజంలో సమానత్వం తీసుకురావలసిన చదువు ఇలా అసమానత తీసుకువస్తూ ఉంది. మరొక అసమానత ఎంటంటే బాలికలకు అన్యాయం జరగడం. పేద వర్గాలు ఇద్దరు పిల్లలను ప్రయివేటు స్కూళ్లకు పంపడం కష్టం కాబట్టి, కొడుకులను ప్రయివేటు స్కూళ్లకు పంపి, కూతుళ్లను ప్రభుత్వ పాఠశాలలకు పింపస్తున్నారు. ఇది మరొక సామాజిక రుగ్మత సృష్టిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ స్కూళ్లుగా మార్చడం వెనక ఈ రెండు రకాల అసమానతలను రూపుమాపాలనే లక్ష్యం ఉంది” అని ఆయన చెప్పారు.
ఉపాధ్యాయ సంఘాల అసంతృప్తి
మొత్తం ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చడం పట్ల టీచర్ల సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ సంఘాలు క్యాంపెయిన్ కూడా చేస్తున్నాయి.
ఇంత కీలకమయిన నిర్ణయం తీసుకునేటపుడు టీచర్ల ప్రతినిధులను సంప్రదించలేదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు హృదయరాజు వ్యాఖ్యానించారు.
“ఇంగ్లిష్ బోధించే అనుభవం ఉన్న టీచర్లు లేరు. ప్రయివేటు స్కూళ్లలో కూడా ఇంగ్లిష్ మీడియం సబ్జెక్టులను తెలుగులో చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో తెలుగు టీచర్లను ఉన్నట్లుండి ఇంగ్లీష్‌లో పాఠాలు చెప్పండి అనడం, ఇంగ్లిష్ మీడియంను బలవంతంగా విద్యార్థుల మీద రుద్దడం సబబుకాదు. ఇది అనర్థాలకు దారి తీస్తుంది. ఇది విద్యార్థులు మీద, టీచర్లు మీద ఒత్తిడి తీసుకువస్తుంది” అని హృదయరాజు చెప్పారు. తమ పిల్లలకు ఏ మీడియం కావాలో ఎంచుకునే స్వేచ్ఛ తల్లితండ్రులకు ఇవ్వకపోవడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ వాదనను ప్రభుత్వవర్గాలు తోసిపుచ్చాయి. అనుభవం లేని విషయాన్ని పభుత్వం గుర్తించిందని చెబుతూ ఈ సమస్య పరిష్కారానికి ప్రాథమిక పాఠశాలల్లో ఒకే పాఠాన్ని ఇంగ్లిష్ తెలుగు భాషల్లో ముద్రించిన పాఠ్య పుస్తకాలను అందిస్తున్న విషయాన్ని ఈ వర్గాలు గుర్తు చేశాయి.
ఇలాంటప్పుడు ఇంగ్లిష్ మీడియం మీద తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారనే విషయం మీద ప్రభుత్వం ఒక సర్వే జరిపించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సర్వే ప్రకారం 96.17 శాతం తల్లితండ్రులు, విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం కావాలన్నారు. కేవలం 3.06 శాతం మంది మాత్రమే తెలుగు మీడియం కావాలన్నారు.
“విద్యార్థులను 21వ శతాబ్దాపు అవసరాలకు, సవాళ్లుగా దీటుగా తయారుచేయాలనే ఒక దీర్ఘ కాలిక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతోంది. ఈ లక్ష్యంలో మార్పు ఉండదు”అని అధికారులు చెబుతున్నారు.
మొత్తానికి రాష్ట్రమంతా ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లిష్ మీడియంకు సిద్దమవుతున్నాయి. దానికి తల్లితండ్రుల మద్దతూ కనిపిస్తూ ఉంది. తమ పిల్లలకు తెలుగు మీడియం కావాలని కోరిన తల్లితండ్రులెవరూ లేరని బీబీసీ తెలుగుతో మాట్లాడిన కొన్ని పాఠశాలల హెడ్ మాస్టర్లు చెప్పారు.
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















