సెక్స్: ఎక్కువ కాలం శృంగారానికి దూరంగా ఉంటే ఏమవుతుంది, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది

ఫొటో సోర్స్, Getty Images
వివిధ కారణాల వల్ల శృంగారానికి దూరంగా ఉండాల్సి రావొచ్చు. దాంపత్య జీవితంలో కలహాల వల్ల కావచ్చు, విడాకులు తీసుకోవడం, బిజీ షెడ్యూల్ వల్ల అయ్యుండొచ్చు.. లేదంటే కొంతకాలం పాటు సెక్స్‌కు దూరంగా ఉండాలని అనుకొని ఉండొచ్చు. కారణమేదైనా కావచ్చు, కానీ శృంగార జీవితానికి సుదీర్ఘ విరామం ఇవ్వడం వల్ల శరీరంపై ప్రభావం పడుతుందంటూ ఏఎన్‌ఐ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది.
తరచుగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఆనందం పొందడంతో పాటు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
ఎక్కువ కాలం పాటు శృంగారంలో పాల్గొనకపోవడం వల్ల మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూద్దాం..

ఫొటో సోర్స్, Getty Images
గుండె ఆరోగ్యంపై ప్రభావం
ఎక్కువ కాలం సెక్స్ చేయకపోవడం మీ గుండెకు మంచిది కాదు. నిజమే. సెక్సుకు ఎక్కువ రోజులు విరామం ఇవ్వడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల బారిన పడే ముప్పు పెరుగుతుంది. శరీరంలోని అదనపు కేలరీలను ఖర్చు చేయడానికి అద్భుతమైన మార్గం సెక్స్.
అంతేకాదు.. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిల మధ్య సమతుల్యతను పెంపొందించడంలోనూ శృంగారం సహాయపడుతుందని.. తద్వారా గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుందని ఏఎన్‌ఐ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది
సంభోగ సమయంలో ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ వంటి హ్యాపీ హార్మోన్లు శరీరంలో విడుదలవుతాయి.
సెక్స్‌కు దూరంగా ఉన్నప్పుడు మీ శరీరం ఈ హార్మోన్లను తక్కువగా విడుదల చేస్తుంది.
దాంతో ఒత్తిడిని ఎదుర్కోవడం మీకు కష్టతరం అవుతుంది. ఆందోళన పెరుగుతుంది.
జ్ఞాపకశక్తి సమస్యలు
శృంగారానికి దూరంగా ఉండటం వల్ల మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుంది.
సెక్స్ చేయకపోవడం వల్ల జ్ఞాపకశక్తి సమస్యలు పెరిగే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాల ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి.
ఆసక్తికర విషయం ఏంటంటే.. రెగ్యులర్ సెక్స్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని.. ముఖ్యంగా 50 నుంచి 89 ఏళ్ల మధ్య వయస్సు వారికి అది బాగా ఉపయోగపడుతుందని ఆ పరిశీలనల్లో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
లైంగికవాంఛ తగ్గుతుంది
సుదీర్ఘ విరామం సెక్స్ పట్ల ఆసక్తిని పూర్తిగా కోల్పోయేలా చేస్తుంది.
తరచూ సెక్స్‌లో పాల్గొనడం ద్వారా శృంగార సామర్థ్యం మెరుగుపడుతుంది.
మీరు ఎంత ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటే, భవిష్యత్తులో అంత ఎక్కువగా శృంగార జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటారు.
రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది
సెక్స్‌కు దూరంగా ఉండటం వల్ల జలుబు, ఫ్లూ జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి.
రెగ్యులర్ సెక్స్ వల్ల "ఇమ్యునోగ్లోబులిన్ A" అనే యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. తద్వారా వ్యాధులను తట్టుకొనే సామర్థ్యం మీ శరీరంలో పెరుగుతుంది.
యోని ఆరోగ్యం
ఎక్కువ కాలం సెక్స్‌కు దూరంగా ఉండటం వల్ల యోని భాగంలో అసౌకర్యంగా ఉంటుంది.
ఆ తర్వాత సౌకర్యవంతంగా సెక్స్ చేసేందుకు మహిళ శరీరం సిద్ధమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది.
తరచుగా శృంగారంలో పాల్గొనడం లేదా హస్తప్రయోగం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
దాంతో, యోని కణజాలాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఒంటి నొప్పులు
ఒంటి నొప్పులను తగ్గించుకునేందుకు ఒక చక్కని మార్గం సెక్స్.
సంభోగం సమయంలో ఎండార్ఫిన్లు, ఇతర హార్మోన్ల అధికంగా విడుదలవ్వడం వల్ల తల, వెన్ను, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి.
ఆర్థరైటిస్ నొప్పి, పీరియడ్స్ సమయంలో తిమ్మిర్ల లాంటి సమస్యలు తగ్గుతాయి.
అయితే, అందరూ గుర్తుంచుకోవాల్సిందేమిటంటే.. సెక్స్ వల్ల చాలా ప్రయోజనాలున్నది వాస్తవమే.. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే శృంగారం ఒక్కటే మార్గమని అనుకోవద్దు.
సెక్స్ కోరికలు ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఉంటాయి.
అలాంటప్పుడు కొంతకాలం సెక్స్‌కు దూరంగా ఉండటం కూడా కొందరికి సాధారణమే కావొచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఔరంగజేబు: 300 ఏళ్ల క్రితం మరణించిన మొఘల్ చక్రవర్తి గురించి ఇప్పుడెందుకు చర్చ జరుగుతోంది
- మంకీపాక్స్: ఈ పాత వైరస్ కొత్తగా వ్యాపిస్తోంది.. మనం భయపడాలా? అవసరం లేదా?
- డ్రైవర్ మృతి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని అరెస్ట్ చేస్తాం: కాకినాడ జిల్లా ఎస్పీ
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారా, బౌద్ధ ఆరామాలను కూల్చి గుడులు కట్టారా? చరిత్ర ఏం చెబుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















