Casteism in Catholic Church: కాథలిక్కుల్లో కులం సంగతేంటి? ఒక దళితుడు కార్డినల్ కావడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది?

పూల ఆంథోని

ఫొటో సోర్స్, facebook/stjosephscathedral

ఫొటో క్యాప్షన్, కార్డినల్‌గా ఎంపికైన పూల ఆంథోని
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటీవల కాథలిక్ చర్చికి కార్డినల్‌గా దళిత కులాలకు చెందిన పూల ఆంథోని ఎంపికయ్యారు. ఎస్సీ కులంలో పుట్టి కార్డినల్ అయిన మొదటి క్రైస్తవుడు ఈయనే.

భారతదేశంలో క్రైస్తవుల్లో, అందులోనూ కాథలిక్ క్రైస్తవుల్లో దళితుల సంఖ్య ఎక్కువ. వందల ఏళ్ల క్రితమే వారు కన్వర్ట్ అయ్యారు. కానీ కార్డినల్ స్థాయికి దళితులు ఎందుకు ఎదగలేకపోయారు?

ఇన్నాళ్లకు దళితులకు కార్డినల్ పదవి ఇవ్వడం వెనక వాటికన్ సిటీ వ్యూహం ఏంటి?

కాథలిక్-ప్రొటెస్టెంట్ తేడా ఏంటి?

క్రైస్తవుల్లో అనేక శాఖలున్నాయి. అందులో ప్రధానమైనవి కాథలిక్, ప్రొటెస్టెంట్. మరీ లోతుగా వెళ్లకుండా, పైపైన తేడాలు చూస్తే… వాటికన్ సిటీలో ఉండే పోప్‌ను ప్రపంచంలో క్రైస్తవుల పెద్దగా గుర్తించి ఆయన అడుగుజాడల్లో నడిచేవారు కాథలిక్కులు.

చర్చిలో ప్రీస్ట్ నుంచి పోప్ వరకూ వారికి పెద్ద వ్యవస్థ ఉంటుంది. ఇది వందల ఏళ్ల నుంచి పక్కాగా పాటిస్తూ వస్తోన్న చర్చి వ్యవస్థ.

అయితే దీనికి భిన్నంగా పోప్‌తో సంబంధం లేకుండా సొంత విధానాల్లో చర్చిలు నడిపే వారిని ప్రొటెస్టెంట్లు అంటారు. ఈ చర్చిల్లో పాస్టర్ల నియామకాలు, కొత్త చర్చీల స్థాపన.. ఇవన్నీ ఎవరికి వారు సొంతంగా నిర్ణయం తీసుకుంటారు.

ఎవరైనా ఒక ప్రొటెస్టెంట్ చర్చి పెట్టుకోవచ్చు. ఎవరైనా పాస్టర్ కావచ్చు. కానీ కాథలిక్ అలా కాదు. ఒక చర్చి కట్టడం నుంచి, ఫాదర్ నియామకం వరకూ అన్నీ ఒక హైయరార్కీ కింద జరుగుతాయి.

క్రైస్తవులు

ఫొటో సోర్స్, Getty Images

వీటిలో అతి ముఖ్యమైన తేడా కాథలిక్ చర్చిల్లో బ్రదర్స్, ఫాదర్స్, నన్స్ - వీళ్లు బ్రహ్మచర్యం పాటిస్తారు. వీరి ఎంపిక చాలా కఠినంగా ఉంటుంది. స్కూలు దశలో మొదలుపెట్టి 12 ఏళ్ల శిక్షణ తరువాతే ఎవరైనా కాథలిక్ చర్చిలో ఫాదర్ లేదా ప్రీస్ట్ కాగలరు.

కానీ ప్రొటెస్టెంట్ చర్చిల్లో ఏ శిక్షణా లేని వారు కూడా పాస్టర్ కావచ్చు. బ్రహ్మచర్యం అక్కర్లేదు. ప్రొటెస్టెంట్లు పాస్టర్ అని పిలుస్తారు. కాథలిక్కులు బ్రదర్ లేదా ఫాదర్ అని పిలుస్తారు.

కొబ్బరికాయలు కొట్టడం, గుండు చేయించుకోవడం, కొవ్వొత్తులు వెలిగించడం, బొట్టు పెట్టుకోవడాన్ని కాథలిక్కులు అంగీకరిస్తారు. ప్రొటెస్టెంట్లు ఒప్పుకోరు.

ప్రొటెస్టెంటుల్లో ఉండే సంపాదనలో దశమ భాగం దానం ఇవ్వడం, కాథలిక్కుల్లో పెద్దగా కనిపించదు. కాథలిక్ చర్చిలకు ఆదాయాలు వచ్చే ఆస్తులు, ఫాదర్లకు జీతాలూ ఉంటాయి.

కార్డినల్స్ అంటే ఎవరు?

  • కాథలిక్ చర్చిల్లో పూజారి (ప్రీస్ట్) అర్హత ఉన్న వాళ్లు, చర్చి విధుల్లో ఉండే వాళ్లను డీకాన్స్ అంటారు. ఒక చర్చిలో చాలా మంది డీకాన్స్ ఉంటారు.
  • వారిపై చర్చికి ఒక ప్రీస్ట్ ఉంటారు.
  • కొన్ని చర్చిలకు కలిపి ప్రీస్టులందరిపై బిషప్ ఉంటారు. సాధారణంగా రెండు మూడు జిల్లాలకు కలిపి ఒక బిషప్ ఉంటారు.
  • సాధారణంగా రాష్ట్రానికి ఒక ఆర్చి బిషప్ ఉంటారు.
  • ఆ ఆర్చి బిషప్ కంటే పైవ్యక్తి, ప్రపంచ నంబర్ వన్ అయిన పోప్‌కి తరువాత వ్యక్తి కార్డినల్. పోప్ తరువాత అంత గౌరవం పొందేవారు కార్డినల్స్. కార్డినల్ స్థాయి వ్యక్తులే పోప్‌ను కూడా ఎన్నుకుంటారు.

అంటే కాథలిక్ క్రైస్తవ సమాజంలో వీరు నంబర్ 2. అందుకే వాళ్లను ప్రిన్స్ అని పిలుస్తారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 229 మంది కార్డినల్స్ ఉంటే అందులో భారతదేశం నుంచి నలుగురు ఉన్నారు. తాజాగా ఇద్దరిని నియమించారు.

క్రైస్తవులు

ఫొటో సోర్స్, EPA

కాథలిక్ చర్చిల్లో కుల వ్యవస్థ..

ఒకవైపు భారత క్రైస్తవుల్లో సగానికిపైగా దళితులు ఉన్న నేపథ్యంలో, ఆ కులాల నుంచి ఒకరు కార్డినల్ అవడం మాత్రం ఇదే మొదటిసారి.

అందుకే ఇప్పుడు కాథలిక్ చర్చిల్లో కుల వ్యవస్థ గురించిన చర్చ జరుగుతోంది.

తెలుగునాట కాథలిక్కుల్లో రెడ్డి, కమ్మ కులాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈ పరిస్థితుల్లో ఎస్సీ వర్గానికి చెందిన కార్డినల్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రొటెస్టెంట్లకు ఇలా హైయరార్కీ వ్యవస్థ ఉండదు కాబట్టి, ఆ శాఖలో తేడా ఉన్నా అది స్పష్టంగా కనిపించదు.

2011 జనాభా లెక్కల ప్రకారం భారత క్రైస్తవుల్లో 60 శాతం ప్రొటెస్టెంట్లు, 33 శాతం కాథలిక్కులు, మిగతా ఇతర క్రైస్తవ శాఖలూ ఉంటాయి.

వీరిలో పోర్చుగీసు, బ్రిటిష్ వాళ్ల రాకముందే క్రైస్తవానికి మారిన భారతీయులు కూడా ఉన్నారు.

కులం ఆధారంగా ప్రీస్టుల నియామకానికి లాబీయింగ్..

భారతదేశంలో కాథలిక్ క్రైస్తవం యూరోపియన్ వలసల కంటే ముందే ప్రారంభం అయింది. కేరళ, తమిళనాడులో వీటికి పెద్ద చరిత్ర ఉంది. దీంతో మొదట్లో చాలా కులాలకు చెందిన వారు క్రైస్తవంపై ఆసక్తి చూపి మతం మారారు.

తెలుగునాట బ్రాహ్మణులు, కమ్మ, రెడ్లు, తమిళనాట వన్నియర్లు, కేరళలో నాయర్లు.. ఇలా చాలా అగ్రకులాలు క్రైస్తవంలోకి మారాయి.

కానీ మతం మారినా వారు కులాన్ని వదల్లేదు. దీంతో చర్చిల్లో కులం అలాగే ఉంది. కాథలిక్ ప్రీస్టులు కూడా ఆయా అగ్ర కులాల నుంచి ఎక్కువ మంది ఉండేవారు. క్రమంగా ఏ ప్రాంతంలోని చర్చిలో ఏ కులం వారు ఎక్కువ మంది ఉంటే ఆ కులం ప్రీస్టును నియమించాలనే డిమాండ్, అలాంటి నియామకం కోసం లాబీయింగు జరిగేది.

భక్తులు తక్కువ కులం, ప్రీస్టు అగ్ర కులం అయితే సమస్య లేదు. కానీ ప్రీస్టు తక్కువ కులం, భక్తులు అగ్రకులం అయితే కూడా కొన్నిచోట్ల ఆ సమస్య ఉండేది. కేవలం ప్రీస్టే కాకుండా, ఆ పైస్థాయి పదవుల కోసం కులాల లాబీ పనిచేసేది.

క్రైస్తవులు

ఫొటో సోర్స్, AFP

''2002-03 ప్రాంతంలో మారంపూడి జోజి విజయవాడ బిషప్ నుంచి హైదరాబాద్ ఆర్చ్ బిషప్‌గా వెళ్లారు. ఆయన కంటే ముందు విజయవాడ బిషప్‌గా తుమ్మ జోసెఫ్ రెడ్డి అనే రెడ్డి వ్యక్తి ఉండేవారు. జోజి తర్వాత ఆయన స్థానంలో అక్కడకు తానం మర్రెడ్డి అనే రెడ్డి బిషప్ వస్తారు అనుకున్నారు. కానీ కడప నుంచి మల్లవరపు ప్రకాశ్ అనే కమ్మ వ్యక్తి విజయవాడ బిషప్‌గా వచ్చారు. దీంతో విజయవాడ కాథలిక్ క్రైస్తవుల్లో అదో పెద్ద చర్చ అయింది. నల్గొండ, గుంటూరు, ఖమ్మం ప్రాంత చర్చిలో రెడ్ల డామినేషన్ ఉంటుంది. దీంతో రెడ్డి, కమ్మల మధ్య ఈ పదవుల కోసం ఆధిపత్య పోరు ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎస్సీల నుంచి ప్రీస్టుల సంఖ్య పెరిగింది కానీ, ఇప్పటికీ ఎస్సీ ప్రీస్టులు బిషప్‌లు, ఆర్చి బిషప్‌లు అవడం అరుదే. మారంపూడి జోజి బిషప్ అయినప్పుడు కూడా అగ్ర కులాలు పెద్ద సహకరించలేదు. కానీ అతనికి వాటికన్ లెవెల్లో ఉన్న పలుకుబడితో నెట్టుకొచ్చారు అని చెబుతారు" అని బీబీసీతో విజయవాడకు చెందిన, పేరు బహిర్గతం చేసేందుకు ఇష్టపడని ఒక కాథలిక్ క్రిస్టియన్ వివరించారు.

ఒక రాష్ట్రంలోని మొత్తం కాథలిక్ క్రైస్తువులకు హెడ్ అయిన ఆర్చి బిషప్ పదవి పొందిన తొలి దళితుడు మారంపూడి జోజి. ఆయన కూడా 2000వ సంవత్సరంలో ఆ హోదా పొందారు.

మొదటి దళిత బిషప్ మూలగడ జాన్ 1977లో ఆ హోదా పొందారు.

‘ప్రభువును నమ్మినా, కులాన్ని వదలడం లేదు’

పదవుల విషయంలోనే కాదు, పద్ధతుల్లోనూ చర్చిలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది.

''ఇప్పటికీ కొన్ని కాథలిక్ చర్చిల్లో మొదటి వరుస అగ్ర కులాలకు రిజర్వు అయి ఉంటుంది. కొన్ని కాథలిక్ చర్చిల్లో ప్రసాదం కూడా ముందుగా అగ్రకులాల వారికే ఇస్తారు. ప్రీస్టు ఏ కులం వారైనా, భక్తుల్లో అగ్ర కులాల వారికే ముందు ప్రాధాన్యత. ఇది ఇప్పటికీ మీరు కొన్ని పల్లెల్లోని కాథలిక్ చర్చిల్లో చూడవచ్చు'' అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు విజయవాడ నగరానికి చెందిన ఒక కాథలిక్. అయితే ఈ విషయాన్ని బీబీసీ ధ్రువీకరించలేదు.

తమిళనాడు కాథలిక్ చర్చిల్లో కుల వ్యవస్థ బహిరంగంగానే కనిపిస్తుంది. ప్రముఖ క్షేత్రం వేలాంకణిలో చర్చి దగ్గర శ్మశానంలో కేవలం కొన్ని కులాల వారి శవాలనే పూడ్చనిస్తారు.

తిరుచ్చిలో కాథలిక్ చర్చిలో దళితుల సమాధులకు, వన్నియర్ల సమాధులకు మధ్య గోడ ఉంటుంది. ఆఖరికి అక్కడ శవ వాహనం కూడా దళితులను వాడనివ్వరని పదేళ్ల క్రితం బీబీసీ కథనం చేసింది.

''ఇప్పటికీ చర్చిల్లో కుల వ్యవస్థ పోకపోవడం దురదృష్టకరం. నగరాల్లో కనిపించకపోయినా గ్రామాల్లో కనిపిస్తుంది. ఈ మధ్య ఇది కొత్త రూపం తీసుకుంది. చర్చిల్లో కలసి కూర్చోవడం, భోజనం చేయడం వరకూ ఏ ఇబ్బందీ ఉండడం లేదు. కానీ పెళ్లి సంబంధాల దగ్గర మాత్రం స్పష్టంగా తేలిపోతుంది. మొదటి ప్రశ్నే మీ కులం ఏంటి? అని వస్తుంది. అందరినీ ఆదరించి సమానంగా చూసే ప్రభువును నమ్మినా, కులాన్ని వదలడం లేదు. ఇది కేవలం కాథలిక్ చర్చ మాత్రమే కాదు, ప్రొటెస్టెంట్, ఇతర అన్ని శాఖల క్రైస్తవంలోనూ కులం భావన కొనసాగుతోంది'' అని బీబీసీతో చెప్పారు హైదరాబాద్ వైఎంసీఎ అధ్యక్షులు జేకర్ డానియేల్.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవులకు శ్మశానాల కొరత... పాత సమాధుల్లోనే మళ్లీ ఖననాలు

తమ కులం ఫాదరే కావాలంటూ ఆందోళన

కొంతకాలంగా కాథలిక్కు చర్చిలకు ఫాదర్లుగా అక్కడి భక్తుల్లో డామినేట్ కులాల వారినే పంపుతున్నారు.

ఆంధ్రలో మాల, మాదిగలు ఎక్కువ మంది కాథలిక్కులు కాగా వారి తరువాత స్థానంలో, రెడ్డి, కమ్మ, పద్మశాలీలు ఎక్కువ. కానీ ప్రీస్టుల్లో మాత్రం అదే నిష్పత్తిలో లేరు.

ఇండియా మేటర్స్ వెబ్ సైట్ కథనం ప్రకారం, భారతదేశంలో కాథలిక్ క్రైస్తవుల్లో దళితులు 65 శాతం వరకూ ఉంటే, కాథలిక్ ప్రీస్టుల్లో దళితుల శాతం 5 కంటే మించలేదు.

అయితే సంఖ్య తక్కువే అయినప్పటికీ ప్రీస్టులుగా దళితులకు 1960ల నాటికే అవకాశం వచ్చింది.

19వ శతాబ్దం నుంచి కోస్తా దళితులు క్రైస్తవ ప్రభావం చేత ఇంగ్లిష్ కాన్వెంట్ చదువులు చదవడమే ఆ మాత్రమైనా ప్రీస్టులు దొరకడానికి అవకాశం ఇచ్చింది. అలా 60లలోనే ప్రీస్టులు అయిన ఆంధ్రా దళితుల బంధువులు కొందరు ఇప్పుడు వాటికన్‌లో కూడా ఉన్నారు.

పూల ఆంథోనీ ప్రస్థానం..

ప్రస్తుతం కార్డినల్ అయిన పూల ఆంథోని కూడా అలా కాథలిక్ చర్చి నుంచి లాభం పొందిన రెండవ తరం క్రైస్తవుడే.

నంద్యాల దగ్గర్లోని చందుకూరులో క్రైస్తవ తల్లితండ్రులకు పుట్టిన ఆయన ప్రతిభను గుర్తించిన విదేశీ కాథలిక్ ప్రీస్టులు, చర్చి డబ్బుతో చదివించారు.

''సమ్మర్‌లో పెట్టే ధార్మిక శిక్షణలో నా ప్రతిభను చూసి నన్ను చదివించాలనుకున్నారు నెదర్లాండ్స్‌కి చెందిన ప్రీస్టులు. వారు ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే, వాళ్లు విదేశాలకు వెళ్లేప్పుడు నా 9వ తరగతి నుంచీ బీకాం వరకూ చదువుకూ, ఇతర ఖర్చులకూ సహాయానికి ఏర్పాట్లు చేసి మరీ వెళ్లారు'' అని బీబీసీకి చెప్పారు ఆంథోని.

ఆంథోని తండ్రి బూన్ అనే విదేశీ ప్రీస్ట్‌కు సహాయకారిగా ఉండేవారు. అప్పట్లో తెలుగు ప్రీస్టుల సంఖ్య తక్కువ కావడంతో విదేశీయులతో పాటూ కేరళ వారే రాయలసీమ ప్రాంతంలో చర్చి ప్రీస్టులుగా ఉండేవారు. ఆంథోని 7వ తరగతితో చదువు మానేసి ఏదో పనిలో చేరాల్సి వస్తుందనుకున్న సమయంలో చర్చి ఆయన్ను కర్నూలు సెయింట్ మేరీస్ అపోస్టోలిక్ స్కూల్లో చేర్చింది.

అక్కడే ఆయన 9, 10 చదివారు. ఎస్టీబీసీ కాలేజీలో బీకాం చదివారు. ఆ కుటుంబంలోని ఆరుగురు సంతానంలో ఆయనొక్కరే పెద్ద చదువులకు వెళ్లారు. ఆయన తోబట్టువులు అవకాశం ఉన్నా ఉన్నత చదువులకు వెళ్లలేకపోయారు.

''మిషనరీ సంస్థలు నన్ను ఒక కొడుకుగా భావించి చదివించడం, బాధ్యత తీసుకోవడం నచ్చింది. అందుకే నేను కూడా మత గురువుగా మారి ఇతరులకు సాయపడాలని ఆలోచన వచ్చింది'' అని బీబీసీతో చెప్పారు ఆంథోని.

పూల ఆంథోని

ఫొటో సోర్స్, facebook/stjosephscathedral

ఫొటో క్యాప్షన్, కార్డినల్‌గా ఎంపికైన పూల ఆంథోని

‘కుల వ్యవస్థ దురదృష్టకరం.. కానీ, ఏమీ చేయలేం’

కడప, నూజివీడు, కర్నూలు, బెంగళూరుల్లో పనిచేసి, ప్రస్తుతం హైదరాబాద్ ఆర్చి బిషప్‌గా ఉన్నారు ఆంథోని.

కాథలిక్కుల్లో దళితులు అప్పుడప్పుడే ప్రీస్టులుగా మారుతున్న సమయంలో ఎదిగిన వ్యక్తి ఆంథోని. కానీ ఇటువంటి వారి సంఖ్య కాథలిక్ చర్చిలో చాలా తక్కువ. అందుకే ఫాదర్ల నియామకంలో సమస్యలు వచ్చేవి.

ఈ విషయం తమిళనాడులో కాస్త బహిరంగంగానే కనిపిస్తుంది. పుదుచ్చేరి - కడలూరు ఆర్చి బిషప్‌గా దళితుడు కాని వ్యక్తిని నియమించినప్పుడు అక్కడ బహిరంగ ఆందోళనలు జరిగాయి. దళిత ప్రీస్ట్ కావాలని దళిత్ క్రిష్టియన్ లిబరేషన్ మూమెంట్ ఆందోళన చేసింది. అలా చర్చి పాస్టర్ కులం విషయంలో బహిరంగ నిరసన జరగడం కూడా ప్రత్యేకమే.

కాథలిక్కుల్లో కుల ప్రభావం ఉందన్న విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారు పూల ఆంథోని. ''పెద్ద నగరాల్లో లేదు కానీ, చిన్న పట్టణాలు, గ్రామాల్లో కుల వ్యవస్థ ఉంది. దాన్ని మనం తప్పించుకోలేం. అది దురదృష్టకరమైనది. మనం దాంతో కలసి బతకాల్సిందే. తప్పించుకోలేం. ఏమీ చేయలేం'' అని బీబీసీతో అన్నారు ఆంథోనీ.

''విదేశాల నుంచి వచ్చిన మిషనరీలు మొదట్లో కులాన్ని పట్టించుకోలేదు. కానీ అగ్ర కులాల వారు ముందుగా చదువుకున్నారు కాబట్టి, సహజంగా వారే ముందు ఉన్నారు. చర్చిలో పెద్ద స్థాయి వెంటవెంటనే రాదు. దానికి ఏళ్లు పడుతుంది. ఈలోపు సహజంగా అగ్రకులాల వారు పెద్ద పదవుల్లో కనిపిస్తారు. కానీ ఇప్పుడు కాథలిక్ చర్చి అన్ని కులాలనూ ప్రోత్సహిస్తోంది. అవకాశాలూ, బాధ్యతలూ ఇస్తోంది. అలాగే విద్య, ఇతరత్రా సాధికారిత మీద పనిచేస్తున్నాం''అని అన్నారు ఆంథోని.

చాలా కులాల వాళ్లు ప్రీస్టులుగా తమ వాళ్లనే కోరుకుంటున్నారన్నారు ఆంథోనీ. ''అన్ని కులాల వారూ తమ హక్కుల కోసం అడుగుతున్నారు. వాళ్ల కులాల వారినే చర్చి లీడర్లుగా పంపాలని కోరుతున్నారు. మేం మా స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. అక్కడక్కడా అసంతృప్తులు ఉన్నాయి. లేవని చెప్పలేం. మొత్తంగా చర్చి తరపున సమానత్వం కోసం, అందర్నీ సంతృప్తి పరచడం కోసం చూస్తున్నాం. ఆసక్తిని బట్టి అవకాశాలు ఇస్తాం. ఇద్దరు ముగ్గురు పిల్లలున్నప్పుడు అందరికీ న్యాయం చేయలేం కదా'' అన్నారాయన.

వీడియో క్యాప్షన్, మెదక్ చర్చి: ఈ అద్భుత కట్టడం విశిష్టతలేంటో తెలుసా...

కార్డినల్‌గా పూల ఆంథోనీ నియామకం ఒక వ్యూహమా?

పోప్ ఫ్రాన్సిస్ వచ్చిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా అణగారిన వర్గాలుగా పిలవబడుతోన్న వారికి క్రైస్తవంలో పెద్ద పదవులు ఇవ్వడం పెరిగింది.

2020వ సంవత్సరంలో తొలిసారిగా అమెరికాకు చెందిన నల్లజాతి వ్యక్తి, (ఆఫ్రికన్ అమెరికన్) కార్డినల్ అయ్యారు. విల్టన్ గ్రెగరీ అనే వాషింగ్టన్ ఆర్చిబిషప్‌ను కార్డినల్‌గా చేశారు పోప్ ఫ్రాన్సిస్.

భారతదేశంలో కూడా ఎప్పటి నుంచో దళిత కార్డినల్ డిమాండ్ వినిపిస్తూ వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దళితుల కంటే చాలా ముందే ఆదివాసీల నుంచి ఒక కార్డినల్ వచ్చారు.

2003లో జార్ఖండ్ రాంచీకి చెందిన ఆర్చి బిషప్ టెలిస్పోర్ బి టొప్పాను కార్డినల్‌గా నియమించారు అప్పటి పోప్ జాన్ పాల్. ఆదివాసీ నుంచి దళితులకు కార్డినల్ హోదా దక్కడానికి రెండు దశాబ్దాలు పట్టింది.

2014వ సంవత్సరంలోనే దళితులను కార్డినల్ చేయాలంటూ జీవధార అనే క్రైస్తవ థియోలాజికల్ మాగజైన్లో సూచించారు ఫాదర్ విల్ ఫ్రెడ్ ఫిలిక్స్. కింద కులాల వారినీ, అగ్ర కులాలు, మధ్య స్థాయి బీసీ కులాల వారు ఎదగనివ్వడం లేదనే అభిప్రాయం కూడా కాథలిక్కుల్లో విస్తృతంగా ఉంది.

దీంతో తాజాగా పోప్ తీసుకున్న నిర్ణయం భారతదేశంలో దళితుల తరపును మాట్లాడే క్రైస్తవులకు నైతిక బలాన్ని ఇస్తుందని కాథలిక్కులు భావిస్తున్నారు.

''దళిత్ కార్డినల్‌ను ఎంపిక చేయడం ద్వారా పోప్ ఫ్రాన్సిస్ అంటరాని వర్గాల ప్రత్యేక చాంపియన్‌గా నిలవగలరు. భారత క్రైస్తవుల్లో మెజార్టీగా ఉన్న దళితులను పదవిలోకి తీసుకోవడం ద్వారా ఒక పాజిటివ్ గుర్తింపు ఇచ్చినట్టు అయింది. దళితుల, దళిత క్రైస్తవుల హక్కుల కోసం పోరాడటానికి ఇది చర్చికి నైతిక బలం ఇచ్చింది. 400 ఏళ్ల క్రితం ప్రారంభం అయిన కుల నిర్మూలన ప్రయత్నంలో విఫలమైన మిషనరీలకు ఈ నియామకం గొప్ప బలాన్ని ఇస్తుంది'' అని యూనియన్ ఆఫ్ కాథలిక్ ఏషియన్ న్యూస్ వెబ్ సైట్ రాసింది.

కాథలిక్ చర్చిలో అగ్ర కులాలు ఎప్పుడు చేరాయి?

17వ శతాబ్దంలో తెలుగు నేలపై ప్రస్తుత అనంతపురం ప్రాంతంలో మొదటిసారి కాథలిక్ చర్చి ప్రవేశించింది. అప్పట్లో మొట్టమొదటగా ఒక పద్మశాలీ మహిళ క్రైస్తవం స్వీకరించినట్టు రికార్డుల్లో ఉంది. ఆ తరువాత, అదే ప్రాంతానికి స్థానిక పాలెగారు అయిన హనుమంత రెడ్డి క్రైస్తవం స్వీకరించడంతో అతని పరిధిలోని గ్రామాల్లో విస్తృతంగా చర్చిలు నిర్మించారు. ఎందరో క్రైస్తవం తీసుకున్నారు. అప్పటి మొదలు కాథలిక్ చర్చిలో రాయలసీమ, కోస్తా, తెలంగాణలకు చెందిన రెడ్లు, పద్మశాలీలు, కమ్మలు - ఈ మూడు కులాల వారూ కొనసాగుతూనే ఉన్నారు.

అప్పట్లో ఈ క్రైస్తవం స్వీకరించిన వారిపై ఇతర రాజులు దండెత్తినప్పుడు, వారు తెలుగు నేలలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం ద్వారా ఆయా ప్రాంతాలకు క్రైస్తవం వ్యాపించినట్టు చెబుతారు. మొదట్లో రెడ్లు, తరువాత కమ్మలు కాథలిక్ చర్చికి పెద్ద ఎత్తున భూములు ఇచ్చి చర్చీలు నిర్మించడంలో సాయం చేశారు. స్థానికులను ఆకర్షించే క్రమంలో కొన్ని స్థానిక పద్ధతులతో పాటూ, కుల వ్యవస్థ జోలికి వెళ్లకుండా కొనసాగించింది కాథలిక్ చర్చి.

కాథలిక్ చర్చిలో దళితులకు ప్రాధాన్యత లేదు అన్న వాదనను అగ్రకులాలకు చెందిన కాథలిక్కులు అంగీకరించడం లేదు. ''60ల వరకూ కాథలిక్ ప్రీస్టులు, బిషప్ లు అందరూ అయితే విదేశీయులు లేదంటే కేరళ వారూ ఉండేవారు. ఇక తెలుగువారు ప్రారంభం అయిందే 60ల నుంచి. 70లలోనే ఒక దళితుడు బిషప్ అయ్యారు. ఇప్పుడు ఎస్సీ, బీసీలకు సమాన అవకాశాలు ఉన్నాయి చర్చిలో'' అని బీబీసీతో చెప్పారు కృష్ణా జిల్లాకు చెందిన అగ్ర కులానికి చెందిన కాథలిక్. తమ కుటుంబం దాదాపు 250 ఏళ్ల నుంచీ క్రైస్తవాన్ని అనుసరిస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.

''తొలి తరంలో తెలుగు నేలలో కాథలిక్ చర్చిని నిలిపింది ప్రస్తుతం అగ్రకులాలుగా పిలవబడుతోన్న వాళ్లే. విదేశీయులు వెళ్లి, దళితులు చర్చిని టేకప్ చేసే మధ్యలో మాత్రమే ఎక్కువ సంఖ్యలో పదువులు వాళ్లు అనుభవించింది వాస్తవం. కానీ ఇప్పుడు దళితులు, బీసీలకు తగినంత రిప్రజెంటేషన్ వచ్చింది. ఆ మాటకొస్తే ఇప్పుడు కాథలిక్ చర్చి దళితుల డామినేషన్ లోనే ఉంది. ఇప్పుడు తెలుగునాట కాథలిక్ చర్చి దళితుల చేతే నడపబడుతోంది. ఆ క్రమంలో చర్చిని మొదటి నుంచీ అంటిపెట్టుకుని, చర్చి ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషించిన ఇతర కులాల కాథలిక్స్ ప్రాధాన్యత తగ్గిపోతోంది. ఎన్నో కష్టాలు, వేధింపులు, అవమానాలు ఎదుర్కొని చర్చిని నిలబెట్టడంలో అన్ని కులాల పాత్ర ఉంది. ఆమాటకొస్తే చర్చిలో ఇప్పటి వరకూ సరైన రిప్రజంటేషన్ రానిది ఎస్టీలకు. దళితుల లాబీ పవర్ ఫుల్ అయింది. వాటికన్ సిటీ కులం బాలెన్స్ చూసే క్రమంలో చర్చిలో మిగతా వారిని కోల్పోతోంది. వందల ఏళ్ల నుంచి ఉన్న వారిని కూడా ఏదో కొత్తగా వచ్చినట్టు ట్రీట్ చేస్తున్నారు'' అని బీబీసీతో అన్నారు ఆ వ్యక్తి.

దానికి సాక్ష్యంగా ప్రస్తుత బిషప్ ల సంఖ్యను ఆయన చూపించారు. ఆంధ్ర, తెలంగాణల్లో ప్రస్తుతం 12 బిషప్ లలో ఇద్దరు మాదిగ, ముగ్గురు మాల, ఒక రెడ్డి, ఒక కమ్మ, ఒక కేరళ వ్యక్తి, ఒక తొగట (బీసీ), ఒక యాదవ (బీసీ) ఉన్నారు.

అయితే బిషప్ లుగా విదేశీయుల తరువాత, దళితుల సంఖ్య పెరగక ముందూ - ఈ గ్యాపులో ఎక్కువ మంది అగ్ర కుల బిషప్ లు ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ బిషప్ పదవి దాదాపు 47 ఏళ్లు రెడ్లు, కమ్మల చేతిలోనే ఉంది. అదే సందర్భంలో ఏలూరు, శ్రీకాకుళం వంటి చోట్ల మొదటి బిషపే దళితులు వచ్చారు.

60ల తరువాత మొదట్లో ఎక్కువగా ఓసీ కులాల బిషప్ లు కనిపిస్తారు. ఆ తరువాత తరంలో మిగిలిన కులాలు, ముఖ్యంగా ఎస్సీల నుంచి బిషప్ ల సంఖ్య పెరుగుతూ వచ్చినట్టు బీబీసీ పరిశీలనలో కనిపించింది. అయితే అతి ముఖ్యమైన ఆర్చి బిషప్ పదవికి ఇప్పటి వరకూ ఇద్దరు దళితులు మాత్రమే వెళ్లగా, కార్డినల్ పదవికి మొదటిసారి దళితులు వెళ్లారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)