Money through Browsing: ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్యాథరీన్ కైట్
- హోదా, బిజినెస్ రిపోర్టర్
మనం ఆన్‌లైన్‌లో సమాచారం కోసం, వస్తువుల కోసం ఇంటర్‌నెట్ బ్రౌజ్ చేస్తూ ఉంటాం. అయితే, ఇలా బ్రౌజింగ్ చేయడం కొంత మందికి విలువైన ఆదాయ వనరుగా పని చేస్తోంది.
నెటిజన్ల నుండి సేకరించిన డేటా ట్రాకింగ్ ద్వారా గూగుల్, ఫేస్‌బుక్ లాంటి సంస్థలు ప్రతీ ఏటా ప్రకటనల ద్వారా కొన్ని కోట్ల డాలర్ల ఆదాయాన్ని పొందుతున్నారు. యూజర్లను లక్ష్యంగా చేసుకుని ప్రకటనలను విడుదల చేసేందుకు సంస్థలు ఈ సమాచారాన్ని ఉపయోగించుకుంటాయి.
ఉదాహరణకు మీరు జీన్స్ కొనుక్కునేందుకు ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైలర్ల గురించి బ్రౌజ్ చేసిన కొన్ని క్షణాల్లోనే మీ ఫీడ్‌లో అందుకు సంబంధించిన ప్రకటనలు రావడం మొదలుపెడతాయి.
ఇలాంటి అనుభవాన్ని మనలో చాలా మందిమి చూసే ఉంటాం.
ఈ విధంగా ఆన్‌లైన్‌లో మనల్ని ట్రాక్ చేస్తున్న స్థాయిని చూస్తుంటే భయం వేస్తుంది.
ఒక యూరోపియన్ ఇంటర్నెట్ వాడకం డేటా రోజుకు సగటున 376 సార్లు షేర్ అవుతున్నట్లు ఒక తాజా అధ్యయనం పేర్కొంది. అమెరికాలో అయితే ఈ డేటా 747 సార్లు షేర్ అవుతోంది.
కానీ, మీ డేటా షేరింగ్ ఎంత మొత్తంలో జరుగుతుందనే విషయంపై మీ నియంత్రణ ఉండటంతో పాటు ఆదాయం కూడా సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
కెనడాకు చెందిన టెక్నాలజీ సంస్థ సర్ఫ్ ఇంటర్నెట్ వినియోగదారులకు ఆదాయం కల్పించే హామీలను ఇస్తోంది. గత ఏడాది ప్రారంభమైన ఈ సంస్థ ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేసినందుకు వినియోగదారులకు రివార్డులను అందిస్తోంది.

ఫొటో సోర్స్, Surf
అయితే, ఇదింకా బీటా లేదా లిమిటెడ్ రిలీజ్ దశలోనే ఉంది. ఇది గూగుల్ లైక్స్‌ను అధిగమించి మీ డేటాను నేరుగా రిటైల్ బ్రాండ్స్‌కు అమ్ముతుంది. అందుకు బదులుగా సర్ఫ్ మీకు కొన్ని పాయింట్లను ఇస్తుంది. ఈ పాయింట్లను వినియోగదారులు సేవ్ చేసుకుని సదరు బ్రాండ్ షాపింగ్ చేసేటప్పుడు గిఫ్ట్ కార్డులు కొనుక్కోవడం, లేదా డిస్కౌంట్ లు పొందవచ్చు.
ఇప్పటి వరకు ఈ రివార్డుల స్కీం లో ఫుట్ లాకర్, ది బాడీ షాప్, క్రాక్స్, డైసన్ వంటి సంస్థలు చేరాయి.
అయితే, ఈ సమాచారం అంతా గోప్యంగానే ఉంటుందని సర్ఫ్ చెబుతోంది. వినియోగదారుల ఫోన్ నంబర్లు, ఈ మెయిల్, చిరునామా లాంటివి షేర్ చేయడం ఉండదని చెబుతోంది. ఈ రివార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు అంగీకరించినప్పుడు మీ పేరు కూడా ఇవ్వవలసిన అవసరం లేదని అంటోంది. కానీ, ఈ పోర్టల్ మీ వయసు, లింగం, చిరునామా అడుగుతుంది. అయితే, ఇవి తప్పనిసరి కాదు.
సర్ఫ్ షేర్ చేసే డేటాను బ్రాండులు తమ ప్రకటనల కోసం ఉపయోగించుకుంటాయి.
ఉదాహరణకు లాస్ ఏంజెల్స్‌లో 18-24 సంవత్సరాల పురుషులు ఎక్కువగా బ్రౌజ్ చేస్తున్న వెబ్ సైట్ల గురించి ఈ డేటా ద్వారా తెలుసుకుంటుంది. ఈ డేటాకు అనుగుణంగా వారి ప్రకటనలను టార్గెట్ చేసే వీలుంటుంది.
అయితే, ఇలా రివార్డ్ పాయింట్ల ద్వారా వినియోగదారులు ఎంత మొత్తం సంపాదించగలరనేది సర్ఫ్ వెల్లడించలేదు. వినియోగదారులందరూ కలిపి సుమారు 97,000 డాలర్లు (రూ. 75.27 లక్షలు)పైగా సంపాదించవచ్చని మాత్రం చెప్పింది.
అలాగే, సర్ఫ్ ఏ విధమైన డేటాను షేర్ చేయవచ్చనే విషయాన్ని కూడా వినియోగదారులు నియంత్రించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు వాళ్ళు విజిట్ చేసిన కొన్ని వెబ్ సైట్లను బ్లాక్ చేయవచ్చు.
ఈ విధమైన సౌలభ్యం ద్వారా ఆన్ లైన్ డేటా వినియోగం పై నియంత్రణ లభించేలా చేసిందని యార్క్ యూనివర్సిటీ విద్యార్థిని అమీనా అల్-నూర్ అన్నారు.

ఫొటో సోర్స్, Aminah Al-Noor
"మీరు సర్ఫ్‌కు ఇవ్వాలని అనుకుంటున్న సమాచారాన్ని ఎంపిక చేసుకోవచ్చు" అని అమీనా చెప్పారు. "నేనెప్పుడైనా బ్రౌజ్ చేసిన డేటా విషయం మర్చిపోయి ఒక వారం రోజుల పాటు వదిలేస్తే నా పాయింట్లు పెరుగుతూ కనిపిస్తాయి" అని చెప్పారు.
"మా సమాచారాన్ని అన్ని టెక్ సంస్థలు సేకరిస్తాయి. కానీ, టెక్నాలజీని సరైన విధంగా ఉపయోగించుకుంటూ మా అనుభవాలను మెరుగ్గా చేసుకోవడమే ముఖ్యం" అని ఆమె అన్నారు.
ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నందుకు సంస్థ ఫ్రీక్వెన్ట్ ఫ్లయర్ రివార్డ్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు సర్ఫ్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్విష్ గోస్వామో చెప్పారు.
"మేం మొదట్నుంచీ ఎటువంటి సమాచారం షేర్ చేయవచ్చు, చేయకూడదనే విషయాల పట్ల యూజర్లతో చాలా స్పష్టంగా ఉన్నాం. యూజర్లు తమ డేటాను నియంత్రించుకునే వీలును కూడా మేము కల్పిస్తున్నాం" అని చెప్పారు.
"మీరు వినియోగదారులతో నిజాయితీగా వ్యవహరించి వారి వివరాలు వెల్లడి చేయకుండా వారి డేటాను బ్రాండులతో షేర్ చేస్తున్నట్లు తెలియచేస్తే మరింత మంది దీనికి సుముఖత తెలుపుతారు" అని అన్నారు.
డేటాను నియంత్రించే విషయంలో 'సర్ఫ్' వినియోగదారులకు ఎక్కువ నియంత్రణ ఇవ్వడంతో దీనిని 'బాధ్యతాయుతమైన టెక్నాలజీ' అని కొంత మంది అభివర్ణించారు.
వినియోగదారులు గూగుల్ న్యూస్, ఆపిల్ న్యూస్ ట్రాకర్, ప్రకటనల ఆధారంగా వచ్చే అల్గారిథమ్‌ల పై ఆధారపడకుండా తమకు కావల్సిన న్యూస్ ఫీడ్‌ను ఎంచుకునే వీలును మరో టెక్ సంస్థ వేవెర్లీ కల్పిస్తోంది.
వేవెర్లీ సైటులో మీకిష్టమైన అంశాలను పూరించవచ్చు. ఆ పోర్టల్‌లో ఉన్న ఏఐ సాఫ్ట్ వేర్ మీకిష్టమైన వ్యాసాలను ఎంపిక చేసి ఫీడ్‌లోకి పంపిస్తుంది.

ఫొటో సోర్స్, Philippe Beaudoin
మాంట్రియాల్‌లో ఉన్న సంస్థను ఫిలిప్ బ్యూడోయిన్ స్థాపించారు. ఆయన గతంలో గూగుల్‌లో ఇంజనీర్‌గా పని చేసేవారు.
యాప్ వినియోగదారులు తమ ప్రిఫరెన్సులను తరచుగా మార్చుకుంటూ, వ్యాసాల గురించి ఫీడ్ బ్యాక్ కూడా ఇవ్వవచ్చు. వినియోగదారులు తమ ఆసక్తుల గురించి చెప్పడానికి కాస్త సమయం వెచ్చించాల్సి ఉంటుందని బ్యూడోయిన్ చెప్పారు. ఇలా చేయడం వల్ల వారు ప్రకటనల బారి నుంచి తప్పించుకోవచ్చు.
ఈ యాప్‌లో ఉన్న ఏఐ టెక్నాలజీ కొన్ని వేల వ్యాసాలను చదివి, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఫీడ్‌లోకి పంపిస్తుంది.
అమెరికాకు చెందిన 'అబైన్' సంస్థ వినియోగదారులు తమ ప్రైవసీని పెంచుకునేందుకు వీలుగా 'బ్లర్', 'డిలీట్ మీ' అనే రెండు యాప్‌లను తయారు చేసింది. మొదటి యాప్‌లో మీ పాస్‌వర్డ్‌లు, చెల్లింపు వివరాలను ట్రాక్ చేసే వీలుండదు. రెండవ యాప్ పర్సనల్ ఇంజన్ల నుంచి మీ వ్యక్తిగత సమాచారాన్ని తొలగిస్తుంది.
"ఇంటర్నెట్ సర్ఫింగ్ చేసే విధానం ప్రైవసీతో కూడుకుని ఉండాలనే అభిప్రాయాన్ని సంస్థ అధిపతి రాబ్ షావెల్ వ్యక్తం చేశారు.
వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండే విధంగా టెక్ సంస్థలు తమ వ్యాపార మోడళ్లను తయారు చేయాలి" అని ఆక్స్ ఫర్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎథిక్స్ లో ఏఐ అసోసియేట్ ప్రొఫెసర్ కేరిసా వెలిజ్ అన్నారు.

ఫొటో సోర్స్, Carissa Veliz
"మన జీవితాలను శాసిస్తున్న చాలా అల్గారిథమ్‌లను ఎటువంటి పర్యవేక్షణ, మార్గదర్శకత్వం లేకుండా ప్రైవేటు సంస్థలు తయారు చేయడం ఆందోళన కలిగించే విషయం" అని అన్నారు.
గూగుల్ "ప్రైవసీ స్యాండ్ బాక్స్" విధానం ద్వారా వినియోగదారులకు వ్యక్తిగత ప్రకటనల ద్వారా పరిష్కారాలను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
తాము ప్రైవసీ స్యాండ్ బాక్స్ ద్వారా కొత్త టెక్నాలజీలు తయారు చేసేందుకు రెగ్యులేటర్లు, వెబ్ కమ్యూనిటీ లతో కలిసి పని చేస్తున్నట్లు గూగుల్ ప్రతినిధి చెప్పారు. దీని వల్ల ఆన్‌లైన్‌లో యూజర్ల ప్రైవసీని రక్షించడంతో పాటు, ఆన్ లైన్ కంటెంట్, సేవలను అందరికీ ఉచితంగా అందించేందుకు చూస్తోంది.
ఈ ఏడాది చివర్లో "మై యాడ్ సెంటర్" లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు. "దీని వల్ల యూజర్లకు ప్రైవసీ కంట్రోల్స్ ను మరింత విస్తృతం చేసి ప్రకటనలు చూపేందుకు వాడే సమాచారం పై మరింత నియంత్రణ కల్పిస్తుంది" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్‌లెట్‌కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- వాతావరణ లక్ష్యాలు: చేసిన హామీలకు దేశాలు కట్టుబడుతున్నాయా? ఎంతవరకు నెరవేర్చుతున్నాయి?
- పిల్లలు సంతోషంగా ఉండాలంటే తల్లి ఏం చేయాలి? ‘సూపర్ మామ్’గా ఉండటం కరెక్టేనా?
- పుతిన్ కాల్పుల విరమణ ప్రకటిస్తారా? యుక్రెయిన్ గెలుస్తుందా
- నైకా, మామాఎర్త్ వంటి స్టార్టప్స్ భారత్‌లో చర్మ సౌందర్య సాధనాల విప్లవానికి ఎలా నాంది పలికాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















