Agriculture-Solar Energy: పొలాల్లో సోలార్ ప్యానెళ్లు.. ప్రభుత్వానికి కూడా కరెంటు అమ్ముతున్న రైతులు
బీబీసీ ప్రతినిధి తేజస్ వైద్య అందిస్తున్న ప్రత్యేక కథనం..
గుజరాత్ ఖేడా జిల్లా ధుండి గ్రామం రైతులు తమ పొలాల్లో పంటలతో పాటు విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నారు.
తమ పొలంలో సోలార్ పానెళ్లను ఏర్పాటు చేశారు ప్రవీణ్ పర్మార్. ఈ పానెళ్లు సౌర శక్తిని, విద్యుచ్ఛక్తిగా మార్చుతాయి. ఉత్పత్తి అయిన విద్యుత్తులో 50శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, ఇతర రైతులకు ఈయన అమ్ముతున్నారు. మిగతాది తన పొలానికి వినియోగిస్తున్నారు.
''ప్రభుత్వానికి విద్యుత్తును అమ్మడం ద్వారా మేం సుమారు 50 వేల నుంచి 60 వేలు సంపాదిస్తున్నాం. నీటి వనరులు లేని రైతులకు మేం నీటిని కూడా అమ్ముతున్నాం. దీని ద్వారా మరో 50, 60 వేలు సంపాదిస్తున్నాం. మొత్తంగా ఈ పానెళ్ల ద్వారా ఏడాదికి లక్షన్నర రూపాయల దాకా సంపాదిస్తున్నాం'' అని రైతు ప్రవీణ్ పర్మార్ బీబీసీతో చెప్పారు.
పొలంలో పానెళ్లు ఏర్పాటు చేస్తే పంట దెబ్బతింటుందని ప్రవీణ్ భార్య మొదట్లో భయపడ్డారు. కానీ ఆమె ఇప్పుడు సంతోషంగా ఉన్నారు.
''ఈ పానెళ్లతో చేను సారం తగ్గిపోతుందని, వీటి కింద పంటలు సరిగా పండవేమో అనుకున్నాను. కానీ అలా ఏం జరగలేదు'' అని దక్షా పర్మార్ తెలిపారు.
ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్‌స్టిట్యూట్ రీసెర్చ్ ఫెలో తుషార్ షా బీబీసీతో మాట్లాడుతూ.. ''సౌర విద్యుత్తుతో పంపులు కూడా నడుస్తాయని ఏడేళ్ల క్రితం వరకు రైతులకు తెలియదు. మేం చాలా గ్రామాలు తిరిగాం. ఇక్కడ చాలా తక్కువ విద్యుత్ కనెక్షన్లు ఉండడంతో ధుండి రైతులు కూడా మాతో పనిచేసేందుకు అంగీకరించారు'' అన్నారు.
రైతులు స్వయంగా సోలార్ ఎనర్జీ కోపరేటివ్ సోసైటీనీ ఏర్పాటు చేసుకున్నారు.
''ప్రభుత్వానికి విద్యుత్తును అమ్మడం ద్వారా మా కోపరేటివ్ సోసైటీ గత ఐదేళ్లలో 15 లక్షల రూపాయలు సంపాదించింది'' అని సొసైటీకి చెందిన ప్రవీణ్ పర్మార్ తెలిపారు.
''ప్రతీ రైతుకు సొంత మీటర్ ఉంది. అమ్మిన విద్యుత్ వివరాలు ప్రతీ రోజూ పొందుతారు. మీటర్ రీడింగ్ ఆధారంగా సొసైటీకి చెల్లింపులు జరుగుతాయి'' అని సొసైటీకే చెందిన రాహుల్ రాథోడ్ వివరించారు.
ధుండిలోని ఈ గ్రామం మిగతా వారికి ఆదర్శంగా నిలిచింది. కానీ ఈ రంగంలో మరింత కృషి జరగాల్సి ఉంది.
సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉన్న పొలాలు దేశంలో చాలానే ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ప్రపంచం ఆశపైనే ఆధారపడి నడుస్తుందనే మాటను గుర్తుంచుకోవాలి.
ఇవి కూడా చదవండి:
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్లెట్కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- ఆర్మీ రిక్రూట్మెంట్: వయసు పెరిగిపోతోంది.. ఆర్మీలో చేరాలనే కల నిజమయ్యేది ఎప్పుడు?
- అవినీతి ఆరోపణలతో దేశం వదిలి పారిపోయిన గుప్తా సోదరుల అరెస్ట్.. వెనక్కి తీసుకొచ్చి బోనులో నిలబెడతామన్న ప్రధాని
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




