South Africa Guptas: అవినీతి ఆరోపణలతో దేశం వదిలి పారిపోయిన గుప్తా సోదరుల అరెస్ట్.. వెనక్కి తీసుకొచ్చి బోనులో నిలబెడతామన్న ప్రధాని

ఫొటో సోర్స్, South African government
సంపన్న గుప్తా కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అరెస్టయినట్లు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రకటించింది.
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాతో సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయనను అన్యాయంగా ప్రభావితం చేసి లాభాలు పొందారని అతుల్ గుప్తా, రాజేష్ గుప్తాలపై దక్షిణాఫ్రికాలో ఆరోపణలున్నాయి.
వారిని అప్పగించే అంశంపై యూఏఈతో చర్చలు జరుపుతున్నట్లు దక్షిణాఫ్రికా అధికారులు తెలిపారు.
అవినీతిలో వీరి భాగస్వామ్యం మీద 2018లో ఒక జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తు ప్రారంభించటంతో గుప్తా సోదరులు దక్షిణాఫ్రికా నుంచి పారిపోయారు.
లాభదాయకమైన ప్రభుత్వ కాంట్రాక్టులు గెలుచుకోవటానికి, ప్రభుత్వంలో శక్తివంతమైన పదవుల్లో నియామకాలను ప్రభావితం చేయటానికి ఆర్థిక ముడుపులు చెల్లించారనే ఆరోపణలూ వీరి మీద ఉన్నాయి.
భారతదేశంలో పుట్టి దక్షిణాఫ్రికాలో స్థిరపడిన ఈ సోదరుల మీద వచ్చిన అత్యంత తీవ్ర అవినీతి ఆరోపణల్లో చాలా వరకూ జాకబ్ జుమాతో వీరి సంబంధాలపై దృష్టి కేంద్రీకరించాయి. 2009 నుంచి అధికారంలో ఉన్న జుమా తొమ్మిదేళ్ల తర్వాత 2018లో అధ్యక్ష పదవి నుంచి బలవంతంగా దిగిపోవాల్సి వచ్చింది.
జుమాతో తమకు గల సన్నిహిత సంబంధాలను గుప్తా కుటుంబం దక్షిణాఫ్రికా ప్రభుత్వంలో అన్నిస్థాయిల్లోనూ రాజకీయ బలం చలాయిస్తూ వాణిజ్య కాంట్రాక్టులు గెలుచుకోవటం, ఉన్నతస్థాయి ప్రభుత్వ నియామకాలను ప్రభావితం చేయటం, ప్రభుత్వ నిధులను స్వాహా చేయటం చేసేదనేవి ఆరోపణలు.
జాకబ్ జుమా, గుప్తా సోదరులు ఈ ఆరోపణలను తిరస్కరిస్తున్నారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదంటున్నారు.

ఫొటో సోర్స్, South African government
గుప్తా సోదరులు దేశం విడిచి పారిపోయాక.. దక్షిణాఫ్రికా 2021లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో నిందితుల అప్పగింత ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందం ద్వారా గుప్తా సోదరులను దక్షిణాఫ్రికాకు తీసుకువచ్చి బోనులో నిలబెట్టటానికి వీలవుతుందని ఆశిస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు సిరిల్ రమఫోసా ప్రభుత్వం పేర్కొంది. అయితే యూఏఈలో అరెస్టయిన గుప్తా సోదరులను దక్షిణాఫ్రికాకు అప్పగిస్తారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.
గుప్తా సోదరులు జాకబ్ జుమాకు ఎంతగా సన్నిహితులయ్యారంటే.. రెండు కుటుంబాలను కలిపి చెప్పటానికి 'జుప్తాలు' అనే పదం కూడా పుట్టింది.
జుమా భార్యల్లో ఒకరు, జుమా సంతానంలో ఒక కొడుకు, ఒక కూతురు కూడా గుప్తాల కంపెనీల్లో కీలక పదవుల్లో పనిచేశారు.
గుప్తాలకు చెందిన చాలా కంపెనీలు ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ కార్పొరేషన్ల నుంచి లాభదాయకమైన కాంట్రాక్టులు సంపాదించుకుని లబ్ధి పొందాయి. గుప్తా సోదరుల వ్యాపార ప్రయోజనాలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆ కుటుంబం తమకు నేరుగా నిర్దేశించేదని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు.
ఆ నిర్దేశాలను పాటిస్తే డబ్బులు, ప్రమోషన్లు కానుకలుగా వచ్చేవని, పాటించకపోతే ఉద్యోగాల నుంచి తొలగించేవారని ఆరోపణలున్నాయి.
గుప్తా సోదరులు గుప్పెట్లో పెట్టుకున్నట్లుగా ఆరోపణలున్న ప్రభుత్వ సంస్థల జాబితా చాలా పెద్దదే ఉంది. ఆర్థిక శాఖ, సహజ వనరులు, ప్రభుత్వ సంస్థల మంత్రిత్వశాఖలతో పాటు.. పన్ను వసూళ్ల విభాగం, సమాచార విభాగం, ప్రభుత్వ ప్రసార సంస్థ ఎస్ఏబీసీ, జాతీయ విమానయాన సంస్థ సౌత్ ఆఫ్రికన్ ఎయిర్‌వేస్, ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వే సరకు రవాణా సంస్థ, ఇంధన దిగ్గజం ఎస్కోమ్.. ఆ జాబితాలో కొన్ని.
దేశ అత్యున్నత న్యాయమూర్తి నాలుగేళ్ల పాటు దర్యాప్తు చేసి ప్రచురించిన నివేదిక.. ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిల్లోనూ, జుమాకు చెందిన అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలోనూ సంపన్న గుప్తా సోదరులు లోతుగా పాతుకుపోయారని నిర్ధారించింది.
ఈ సోదరులు రైల్వే, నౌకాశ్రయాలు, పైప్‌లైన్ మౌలిక సదుపాయాలను ప్రొక్యూర్ చేసుకోవటం ద్వారా అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడ్డారని కూడా ఈ ఏడాది ప్రచురించిన నేవేదికలు ఆరోపించాయి.
''గుప్తా సోదరులు ఏది అడిగినా సరే జాకబ్ జుమా చేసేస్తారు'' అని దర్యాప్తు అధికారులు తాజా నివేదికల్లో పేర్కొన్నారు.
ఇదే దర్యాప్తు అధికారుల ఎదుట వాంగ్మూలం ఇవ్వటానికి నిరాకరించినందుకు గాను జాకబ్ జుమాకు గత ఏడాది 15 నెలల జైలు శిక్ష విధించారు. జైలులో రెండు నెలలు గడిపిన తర్వాత ఆయనను పెరోల్ మీద విడుదల చేశారు.

ఫొటో సోర్స్, Gallo Images
ఎవరీ గుప్తా సోదరులు?
అజయ్ గుప్తా, అతుల్ గుప్తా, రాజేష్ గుప్తాలు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ నుంచి 1993లో దక్షిణాఫ్రికాకు నివాసం వెళ్లారు. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షాపూరిత వ్యవస్థ కూలిపోయి అప్పటికి ఎంతో కాలం కాలేదు.
అతుల్ తమ కుటుంబ వ్యాపారం సహారా కంప్యూటర్స్ స్థాపించటానికి దక్షిణాఫ్రికా వచ్చినపుడు.. అక్కడ ప్రభుత్వ నియంత్రణ తీవ్రంగా లేకపోవటం చూసి ఆశ్చర్యపోయారని చెప్తుంటారు.
ఆ కంపెనీలో దక్షిణాఫ్రికాలో 10,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకునే స్థాయికి ఎదిగిన గుప్తా సోదరులు మైనింగ్, విమాన యానం, ఇంధన రంగం, సాంకేతిక రంగం, మీడియా రంగాల్లోనూ ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించుకున్నారు.
జాకబ్ జుమా అధ్యక్షుడు కాకముందు ఒకసారి సహారా వార్షిక ఉత్సవాలకు అతిథిగా వచ్చినపుడు ఆయనను తాను కలిశానని అతుల్ గుప్తా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్ఆర్ఆర్ సినిమాను ‘గే’ చిత్రం అంటున్నారెందుకు
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను నిర్మూలించవచ్చా?
- సూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి?
- సమ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్: భారత చరిత్రను మలుపు తిప్పిన ఈ వీరుడి కథ నిజమా, కల్పనా?
- Fake Currency notes: నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడం ఎలా.. ఈ పది విషయాలు గుర్తుపెట్టుకోండి
- ముస్లింలలో కుల వ్యవస్థ ఎలా ఉంది... ఈ మతంలో ఒక కులం వారు మరో కులం వారిని పెళ్ళి చేసుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













