బాంగ్‌బాంగ్ మార్కోస్: తండ్రి అవినీతి రాజకీయ సామ్రాజ్యాన్ని కొడుకు పునఃప్రతిష్టిస్తారా

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, హోవార్డ్ జాన్సన్, విర్మా సిమోనెట్
- హోదా, బీబీసీ న్యూస్ మనీలా
తండ్రి నిర్దాక్షిణ్యమైన నియంత. తల్లి విలాసాలకు మారు పేరు. ఆమె దగ్గర 3 వేలకు పైగా బూట్ల జతలు ఉండేవి.
వారిద్దరి కుమారుడు ఇప్పుడు దేశాధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. 64 ఏళ్ల ఈ వారసుడి పేరు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్. అంతా ఆయన్ను బాంగ్‌బాంగ్ అంటారు.
మే 9న జరగబోయే ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికలలో బాంగ్‌బాంగ్ ఇప్పుడు ముందంజలో ఎలా నిలుస్తున్నారన్నదే ప్రశ్న.
దీనికి సమాధానం.. వంశపారంపర్య రాజకీయాలు, తరతరాలుగా వస్తున్న విధేయతలు, సోషల్ మీడియా మాయాజాలాలలో దొరుకుతుంది.

శ్వేత అశ్వంపై స్వర్ణ కిరీటంతో మేఘాలలో విహారం
మార్కోస్‌లు తమ కంచుకోట అయిన ఇలొకాస్ నార్టేలో నివసిస్తారు. అక్కడ వారు స్పానిష్ శైలిలో నిర్మించిన 'ది మలాకనేంగ్ ఆఫ్ ది నార్త్' భవనంలో ఉంటారు.
నిజానికి 'మలాకనేంగ్ ప్యాలస్' అనేది ఫిలిప్పీన్స్ అధ్యక్షుల అధికారిక నివాసం. రాజధాని మనీలాకు ఇది వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
అయితే, 1960లలో ఫెర్డినాండ్ మార్కోస్ ఫిలిప్పీన్స్‌కి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ దేశ టూరిజం అథారిటీ ఆయన కుటుంబానికి ఈ భవనాన్ని బహుమతిగా ఇచ్చింది.
ఇప్పుడా భవనాన్ని సందర్శించేందుకు సాధారణ ప్రజలను అనుమతిస్తున్నారు.
ఫెర్డినాండ్ అభిమానులు అక్కడ ఫెర్డినాండ్, ఆయన భార్య ఇమెల్డా మార్కోస్‌ల చిత్రపటాల దగ్గర సెల్ఫీలు దిగుతుంటారు.
ఒకప్పుడు వారు నివసించిన గదులలో అభిమానులు తిరుగుతుంటారు.
బాంగ్‌బాంగ్ చిన్నతనంలో నివసించిన గదిలో ఆయన పెయింటింగ్ ఒకటి ఉంటుంది.
తెల్లని మదపు గుర్రంపై బంగారం కిరీటం ధరించిన బాంగ్‌బాంగ్ మేఘాల్లోంచి స్వారీ చేస్తున్నట్లుగా ఆ పెయింటింగ్‌లో ఉంటుంది.
అందులో ఆయన ఒక చేతిలో ఫిలిప్పీన్స్ జెండా, మరో చేతిలో బైబిల్ కనిపిస్తాయి.
పెయింటింగ్‌పై ఒక మూలన ఉండే 'పవిత్ర' కీర్తన ఈ చిత్రపటాన్ని వివరిస్తుంది.
'పవిత్ర నగరం' జెరూసలేంపై దేవదూత విహరిస్తున్నారన్న అర్థాన్ని ఈ పెయింటింగ్‌కు కల్పిస్తోంది ఆ కీర్తన.
1986 నాటి ప్రజా తిరుగుబాటు కారణంగా పదవి కోల్పోయిన మార్కోస్ కుటుంబం ప్రపంచ రాజకీయాలలో అవినీతికి పర్యాయపదంగా మారిపోయింది.
మార్కోస్ తమ పాలనాకాలంలో భారీగా సంపద పోగేసుకున్నారని, మానవ హక్కులను ఉల్లంఘించారని స్వతంత్ర సంస్థల నివేదికలు, కోర్టు పత్రాలు తిరుగులేని ఆధారాలు చూపిస్తున్నాయి.
1986లో విప్లవకారులు అధ్యక్ష భవనంపై దాడి చేసినప్పుడు అక్కడ మార్కోస్ కుటుంబ అద్భుత తైలవర్ణ చిత్రాలను చూశారు.
బంగారు పూతతో ఉన్న పరికరాలు అమర్చిన స్నానాల తొట్టె, 15 మింక్ కోట్‌లు, ఫ్యాషనబుల్‌గా ఉన్న 508 కొచ్యూర్ గౌన్‌లు, మార్కోస్ భార్యకు చెందిన 3 వేలకుపైగా డిజైనర్ షూస్ అధ్యక్ష భవనంలో గుర్తించారు.
35 ఏళ్ల తరువాత ఇప్పుడు బాంగ్‌బాంగ్ ఆ దేశ అధ్యక్ష రేసులో ముందంజలో ఉన్నారు. ఆయన ప్రచారానికి ప్రజల నుంచి మద్దతు పెరుగుతున్న తరుణంలో ఆయన మద్దతుదారులు 1986 నాటి ఈ లెక్కలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఆయన ప్రత్యర్థులు మాత్రం.. చరిత్రను తుడిచేయడానికి, తప్పుడు సమాచారాన్ని ప్రచారంలోకి తేవడానికి మార్కోస్ కుటుంబం సోషల్ మీడియాను వాడుకుంటోందని ఆరోపిస్తున్నరు. కానీ, ఈ ఆరోపణలను మార్కోస్ కుటుంబం ఖండిస్తోంది.
మార్కోస్ కుటుంబ ఘనతను ప్రచారం చేసే, వారసత్వాన్ని సమర్థించే పోస్ట్‌లు, అనామక ఖాతాలతో ఫేస్‌బుక్ కొన్నాళ్లుగా నిండిపోతోంది.
గతాన్ని తారుమారు చేయడమనేది చాలాకాలంగా ఉంది. ప్రజలు ఈ తప్పుడు సమాచారాన్ని నమ్మి తామూ అదే వల్లెవేస్తున్నారు.
ఇలాంటి ప్రచారాలన్నిటిలోనూ కనిపించే అంశం ఒకటి ఉంది.. అది మార్కోస్‌ల నిరంకుశ పాలనను స్వర్ణయుగంగా చూపడం.
మార్కోస్‌ల పాలనాకాలంలో ఫిలిప్పీన్స్ ఆర్థికంగా పతనావస్థకు చేరడం, విదేశీ బ్యాంకులకు భారీగా రుణపడడం వంటి నిజాలను దాచి ఇలాంటి స్వర్ణయుగ భావనను ప్రచారంలోకి తెస్తున్నారు.

విధేయత, వారసత్వ ఘనత
రాజధాని మనీలకు చెందిన 71 ఏళ్ల జీసస్ బాటిస్టా బాంగ్‌బాంగ్‌కు మద్దతుదారు.
'స్మోకీ మౌంటెయిన్'గా పిలిచే భారీ చెత్త కుప్ప దగ్గర ఆయన వ్యర్థాలలో మండే స్వభావం ఉన్న పదార్థాలను వేరుచేసే పని చేస్తారు.
ఆయనకు 1983లో ట్రాఫిక్ నియంత్రణ విభాగంలో ఫుల్ టైమ్ ఉద్యోగం, పెన్షన్ ఇచ్చారు.
ఆ సమయంలో ఫెర్డినాండ్ మార్కోస్ భార్క ఇమెల్డాను మనీలా నగరానికి గవర్నరుగా నియమించారు. అదొక అప్రజాస్వామిక నియామకం.
విరిగిపోయిన ఒక వెదురు కుర్చీలో వెనక్కు చేరబడి కూర్చుంటూ బాటిస్టా... ''నేను ఇమెల్డాకు రుణపడి ఉన్నాను. ప్రజాధనం నుంచి జీతం ఇచ్చే ఉద్యోగం నాకు ఇచ్చారామె' అన్నారు.
ఇమెల్దా మార్కోస్‌పై తరువాత కాలంలో వచ్చిన ఆరోపణల మేరకు ఆమె 1000 కోట్ల డాలర్ల మేర సొమ్ము దోచుకున్నట్లు తేలినప్పటికీ తాను మాత్రం ఆమె కుమారుడికి ఓటు వేస్తానని బాటిస్టా చెబుతున్నారు.
''మార్కోస్ కుటుంబం అవినీతికి పాల్పడినట్లు చూడలేదు నేను' అని చెప్పిన బాటిస్టా... ''ఇదంతా కేవలం జనం అనుకునేది. శత్రువులు వారి పేర్లు ప్రచారంలోకి తెచ్చారంతే' అన్నారాయన.
1986లో ప్రజలు మార్కోస్ ప్యాలస్‌పై దండెత్తినప్పటి ప్రత్యక్ష సాక్ష్యులలో అమెరికా జర్నలిస్ట్ జిమ్ లారీ కూడా ఒకరు.
''ఇమెల్డా వార్డ్ రోబ్ రూమ్‌లోకి వెళ్లినప్పుడు వందల సంఖ్యలో డిజైనర్ గౌన్‌లు, డ్రెస్‌లు కనిపించాయి. వాటిపై న్యూయార్క్‌లోని బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మేన్, పారిస్, రోమ్‌లోని ఇతర దుకాణాల లేబుళ్లు ఉన్నాయి. బహుశా అవన్నీ ఆమె ఎన్నడూ ధరించకపోయి ఉండొచ్చు. ఫిలిప్పీన్స్ లాంటి ఒక పేద దేశంలో అలాంటి విలాసం చూడడం ఏమాత్రం బాగా అనిపించలేదు' అన్నారు జిమ్ లారీ.
అక్కడ చూసినవి గోరంత మాత్రమే.

ఫొటో సోర్స్, Getty Images
మార్కోస్ కుటుంబం అక్రమంగా ఆర్జించిన డబ్బును స్విస్ బ్యాంకు ఖాతాలకు ఎలా మళ్లించిందో, న్యూయార్క్ నగరంలో లెక్కలేనన్ని ఆస్తులు ఎలా కూడగట్టిందో అక్కడున్న పత్రాలు వెల్లడించాయి.
ఆ తరువాత అనేక కోర్టు కేసులు వారిని చుట్టుముట్టాయి. వాటిలో కొన్ని ఆ కుటుంబాన్ని విచారించేందుకు కారణమయ్యాయి, మరికొన్ని కేసులు విఫలమయ్యాయి.
అలాంటి విఫల కేసులలో 1990 నాటి మోసం కేసు ఒకటి. న్యూయార్క్‌లో జరిగిన మోసానికి సంబంధించిన కేసు ఇది. ఇమెల్డా మార్కోస్‌కు చెందిన స్టార్ పవర్ ఈ కేసులో విజయం సాధించడంతో ఆ కుటుంబం ఫిలిప్పీన్స్‌కు తిరిగి రాగలిగింది.
అప్పట్లో తిరిగి ఫిలిప్పీన్స్ వచ్చినప్పుడు తాను ఎంత సంశయానికి గురయ్యాననేది బింగ్‌బాంగ్ 'ది కింగ్ మేకర్' అనే డాక్యుమెంటరీలో వివరించారు.
'ఎప్పుడూ ఫస్ట్ క్లాస్‌లోనే ప్రయాణించిన నేను కోచ్‌లో రాలేకపోయాను' అంటూ ఆయన ఇంటర్వ్యూ చేసిన వ్యక్తితో చెప్పారు.
నాయకత్వమే గమ్యంగా..
బాంగ్‌బాంగ్‌ని నాయకుడిని చేసేందుకు చిన్ననాటి నుంచే అన్ని రకాలుగా తయారుచేశారు.
1986 విప్లవ సమయంలో అధ్యక్ష భవనాన్ని వీడి వెళ్లే సమయం నాటి ఒక ఫుటేజ్‌లో ఆయన తన తండ్రి పక్కన కనిపిస్తారు. అప్పటికి 28 ఏళ్ల వయసున్న బాంగ్‌బాంగ్ అలాంటి పరిస్థితుల్లోనూ ఆయన తన తండ్రి పక్కన ఎంతో శ్రద్ధగా నిల్చుని ఉన్నట్లు కనిపిస్తుంది.
అయితే, 1972లో ఫెర్డినాండ్ మార్కోస్ తన డైరీలో మాత్రం తన కుమారుడి భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నట్లుగా రాసుకున్నారు.
''నా ఆందోళనంతా బాంగ్‌బాంగ్ గురించే. ఆయన బాగా సోమరిపోతు, పైగా నిర్లక్ష్యంగా ఉంటాడు' అని ఫెర్డినాండ్ మార్కోస్ తన డైరీలో రాసుకున్నారు.
1975లో బాంగ్‌బాంగ్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనమిక్స్(పీపీఈ)లో డిగ్రీ చదివారు.
రాజకీయ నాయకులుగా కెరీర్ ప్రారంభించడానికి ఈ కోర్సును ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు.
అయితే, ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తిచేయడంలో విఫలమయ్యారు. కానీ, గ్రాడ్యుయేషన్ పూర్తిచేయలేకపోయారన్న మాటను మాత్రం బాంగ్‌బాంగ్ అంగీకరించరు.
బాంగ్‌బాంగ్ రెండు సార్లు పరీక్షల్లో ఫెయిల్ అయిన తరువాత సోషల్ సైన్సైస్‌లో ప్రత్యేక డిప్లమో ఆయనకు ప్రదానం చేసేలా ఫిలిప్పీన్స్ దౌత్యవేత్తలు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో మంతనాలు జరిపారని ఫిలిప్పీన్స్ వార్తావెబ్‌సైట్ 'వెరాఫైల్స్' రాసింది.
అయితే, తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాల్లో రాకుండా ఈ వివాదం ఏమీ ఆయన్ను ఆపలేకపోయింది. ప్రజా విప్లవం వెల్లువెత్తడంతో ఆయన రాజకీయ ప్రయాణం ఆగిపోయింది.
అయితే, ఫిలిప్పీన్స్‌కు తిరిగి వచ్చిన తరువాత ఆయన క్రమంగా బలపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
మే 9న జరగబోయే అధ్యక్ష ఎన్నికలలో బాంగ్‌బాంగ్ పోటీ చేస్తుండగా ఆయనతో కలిసి నడుస్తూ ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు 43 ఏళ్ల సారా డ్యూటెర్డ్. ఆమె ప్రస్తుత అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్ట్ కుమార్తె.
ఫిలిప్పీన్స్ రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్ట్ రెండోసారి అధికారం చేపట్టే అవకాశం లేదు.
2016లో అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్రిగో మాదక ద్రవ్యాలపై యుద్ధం ప్రకటించారు. డ్రగ్స్ వాడేవారు, డీలర్లు, అక్రమంగా తరలించే వేలాది మందికి ఎలాంటి న్యాయ విచారణ లేకుండా మరణ శిక్షలు విధించారన్న ఆరోపణలున్నాయి.
ఫిలిప్పీన్స్‌ను ఏకం చేసేందుకు, మళ్లీ ప్రగతి పథంలో నడిపించేందుకు బాంగ్‌బాంగ్‌తో కలిసి పనిచేస్తానని రోడ్రిగో డ్యూటెర్ట్ కుమార్తె సారా చెబుతున్నారు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ మిలటరీలో చేరాలనేది తప్పనిసరి చేస్తానని సారా చెబుతుండగా... మార్పు రాదు అనుకున్న నేరగాళ్లకు మరణశిక్ష విధించడానికి తాను అనుకూలమేనని బాంగ్‌బాంగ్ చెబుతున్నారు.
2009లో మనీలాలోని అమెరికా ఎంబీసీ నుంచి 'వికీలీక్స్' లీక్ చేసిన సమాచారంలో సారా డ్యూటెర్ట్ ప్రస్తావన ఉంది. 'టఫ్‌గా ఉండే మనిషి.. తండ్రిలాగే ఆమెతో మాట్లాడడం కష్టం'' అని అందులో ఆమె గురించి వివరించారు.
2011లో ఆమె మేయర్‌గా ఉన్న సమయంలో ఓ మురికివాడలో ఇళ్ల కూల్చివేత వద్దంటూ ఆమె ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించినందుకు ఓ కోర్టు షరీఫ్ ముఖంపై ఆమె పిడిగుద్దులు కురిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియా ప్రభావం
బాంగ్‌బాంగ్ మార్కోస్ తన రాజకీయ పునరాగమనాన్ని ఇంత బలంగా ఎలా మార్చుకోగలిగారన్నది అర్థం చేసుకోవాలంటే ఆ కుటుంబానికి కంచుకోటలాంటి ఇలొకాస్ నార్టే ప్రావిన్స్ చూస్తే చాలు.
1972 నుంచి కర్కశమైన మార్షల్ లా అమలులో ఉన్నందున ఫిలిప్పీన్స్‌లోని అనేక ప్రాంతాలు ఇబ్బందులు పడినప్పటికీ ఇలొకాస్ నార్టే ప్రాంతానికి మాత్రం ఏ లోటు లేకుండా నిధులు అందాయి. ఈ ఒక్క కారణంతోనే అక్కడి ప్రజలు ఎంతోమంది ఈ కుటుంబానికి విధేయులుగా ఉన్నారు.
'ఒక భయంకరమైన తుపాను దేశంలో వినాశనం సృష్టిస్తున్నట్లు ఊహించుకోండి, అలాంటి సమయంలోనూ ఇలొకాస్ నార్టేకు ఏమీ కాలేదు' అని అప్పటి పరిస్థితులను వివరించారు ఓ జర్నలిస్ట్.
మార్కోస్ కుటుంబం అవినీతి, హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందనే వాదనను ఇలొకాస్ నార్టే ప్రాంత ప్రజలు తిరస్కరిస్తున్నారు.
సోషల్ మీడియా మేనిపులేషన్‌తో ఇలాంటి సెంటిమెంట్ మరింత పాదుకునేలా చేస్తున్నారు.
''సోషల్ మీడియాలో మార్కోస్ కుటుంబ మద్దతుదారులు అవినీతి విషయాన్ని దారి మళ్లిస్తూ వారు సాధించిన విజయాలను ప్రధానంగా చెబుతుంటారు. ఇప్పుడు కనిపిస్తున్న మౌలిక వసతుల అభివృద్ధి అంతా మార్కోస్ కుటుంబ పాలన ఫలితమే అంటారు. దీనిపై వారితో వాదించడం అనవసరం'' అని ట్రైనీ లాయర్ సాసా రావాల్ చెప్పారు.
తాను ఒక చిన్న మైనారిటీ వర్గానికి చెందినవారిగా చెప్పుకొనే సాసా బాంగ్‌బాంగ్ మార్కోస్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేయబోనని అంటున్నారు.
'ఓర్నాయనో... సోషల్ మీడియాలో చాలామంది నన్ను తిడుతుంటారు. కొందరు వేధిస్తుంటారు కూడా'' అని సాసా చెప్పారు.
'ఇలొకానోలో ఉంటూ వేరేవాళ్లకు ఎలా ఓటు వేస్తావని నన్ను అడుగుతుంటారు. నేను ఫిలిప్పినో కాబట్టి ఎవరికైనా ఓటు వేస్తాను అనేది నా సమాధానం'' అన్నారు సారా.
బ్రిటన్‌కు చెందిన పొలిటికల్ కన్సల్టెన్సీ కేంబ్రిడ్జ్ అనలిటికా మాజీ ఉద్యోగి బ్రిట్నీ కైజర్ వార్తా వెబ్‌సైట్ రాప్లర్‌తో మాట్లాడుతూ.... ''సోషల్ మీడియాలో తన కుటుంబ ఇమేజ్‌ను రీబ్రాండ్ చేయడానికి కేంబ్రిడ్జ్ అనలిటికాను సంప్రదించారు'' అని చెప్పారు.
ఊరూపేరూ లేని ఖాతాలకు జవాబుదారీతనం ఉండదు. జర్నలిస్టులను, నిజం చెప్పేవారిని ఇలాంటి అనామక ఖాతాలతో లక్ష్యంగా చేసుకుంటారు.
ఉదాహరణకు.. జర్నలిస్ట్ లారీ మార్షల్ లా కాలం నాటి వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేసినప్పుడు ఊరూపేరూ లేని వేలాది ఖాతాలు ఆ వీడియోలలోని కంటెంట్‌ను ప్రశ్నించాయి.
ఫేస్‌బుక్ మాతృ సంస్థ 'మెటా'ను ఈ విషయంపై బీబీసీ సంప్రదించింది. ''ఫేస్‌బుక్ పాలసీని ఉల్లంఘిస్తూ రహస్యంగా ప్రభావితం చేసేలాంటి 150 కార్యకలాపాలను గుర్తించి వాటిని తొలగించాం'' అని మెటా నుంచి సమాధానం వచ్చింది.
ఎన్నికల ప్రక్రియలో జోక్యాన్ని ఎదుర్కొనేందుకు, తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు, రాజకీయ ప్రకటనలను పారదర్శకంగా అందించేందుకు పౌర సమాజం, ఎన్నికల అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు మెటా తెలిపింది.
మరోవైపు ఈ ఏడాది జనవరిలో ట్విటర్ బాంగ్‌బాంగ్ మద్దతుదారులకు చెందినవిగా చెబుతున్న వందలాది ఖాతాలను సస్పెండ్ చేసింది. స్పామ్, మేనిపులేషన్‌కు సంబంధించిన ట్విటర్ నిబంధనలను ఉల్లంఘించినందున ఆ ఖాతాలను ట్విటర్ సస్పెండ్ చేసింది.
అయితే, సోషల్ మీడియా సంస్థలు కూడా తప్పుడు ప్రచారాల నిరోధంలో తగినంతగా పనిచేయలేకపోతున్నాయన్న భావన ఉంది.
సామాజిక మాధ్యమాల వినియోగం ఫిలిప్పీన్స్‌లో చాలా ఎక్కువ. ప్రపంచ సగటు కంటే ఫిలిప్పీన్స్‌లో సగటు వినియోగం చాలా ఎక్కువగా ఉంది. ఇది కూడా సమస్యను తీవ్రం చేస్తోంది.
జర్మన్ డేటాబేస్ సంస్థ స్టాస్టిస్టా 2020లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం ఫిలిప్పీన్స్‌లో 16 నుంచి 64 ఏళ్ల వయసు గల వారు రోజుకు సగటున 4 గంటలు సోషల్ నెట్‌వర్క్‌లలో ఉంటున్నారు. అదే బ్రిటన్‌లో అయితే ఈ సగటు రోజుకు 2 గంటలుగా ఉంది.
మరోవైపు స్వతంత్ర వార్తాసంస్థలను మార్కోస్ కుటుంబానికి వ్యతిరేకంగా వార్తలు రాసేవిగా పరిగణిస్తారు. వారికి ఆ కుటుంబం, మద్దతుదారుల ఇంటర్వ్యూలు దొరకవు. బీబీసీ కూడా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించినా మార్కోస్ కుటుంబం వైపు నుంచి సానుకూల స్పందన రాలేదు.
బాంగ్‌బాంగ్ తన ప్రచారంలో సోషల్ మీడియాను విస్తారంగా వాడుకోవడమే కాకుండా ప్రజలకు నేరుగా కమ్యూనికేట్ చేయడానికి భారీ ర్యాలీలు నిర్వహిస్తుంటారు.
ఎర్రని చొక్కాలు వేసుకునే ఆయన మద్దతుదారులు పెద్దసంఖ్యలో ఆయన చుట్టూ ఉంటారు.. దాంతో ఆయనకు ప్రశ్నలు సంధించడం జర్నలిస్టులకు సాధ్యం కాదు.
బాంగ్‌బాంగ్ ర్యాలీలకు హాజరైనవారికి రిస్ట్ బ్యాండ్‌లు, టీషర్ట్‌లు, త్రీ ఇన్ వన్ కాఫీ ప్యాకెట్లు ఇస్తుంటారు. వాటిపై నవ్వులు చిందించే బాంగ్‌బాంగ్ ఫోటోలు ఉండడంతో పాటు 'ఎదుగుతున్న మీ మిత్రుడు' అనే క్యాప్షన్ కూడా ఉంటుంది.

మార్కోస్ అనుకూల నేతలు నిర్వహించే ర్యాలీలలో వారు ప్రసంగించడానికి ముందు నృత్యాలు, పాప్ సంగీతం, కామెడీ కార్యక్రమాలతో హాజరైనవారిని ఆకర్షిస్తుంటారు.
నేతలు తమ ప్రసంగాలలో మార్కోస్ విధాన ప్రతిపాదనలను పైపైన చెబుతారు కానీ వివరంగా చెప్పరు.
'బీబీఎం(బాంగ్‌బాంగ్ మార్కోస్) - సారా' ర్యాలీకి బీబీసీ ఏప్రిల్‌లో హాజరైంది. టయోటా ఎస్‌యూవీల వాహన శ్రేణితో బాంగ్‌బాంగ్ ఆ ర్యాలీకి చేరుకున్నారు. 'సీరియస్ ఇంటర్వ్యూలకు అంగీకరించకపోవడం వల్ల మీరు ఒక మంచి అధ్యక్షుడిగా ఉండగలరా' అని బీబీసీ ఆయన్ను ప్రశ్నించింది. దానికి ఆయన నవ్వి ఊరుకున్నారే కానీ సమాధానమివ్వలేదు.
ఆ తరువాత ఆయన మద్దతుదారులు సోషల్ మీడియాలో మాపై విరుచుకుపడ్డారు. ఆయనను దురుసుగా ప్రశ్నించామని, సామ్రాజ్యవాదంతో వ్యవహరించామని ఆరోపించారు.
కొందరు ఆ కుటుంబం అవినీతికి పాల్పడినట్లు అంగీకరిస్తున్నా వారికి మరో అవకాశం ఇవ్వడంలో తప్పు లేదని చెబుతున్నారు.
ఆయన విమర్శకులు మాత్రం.. ఆయనకు నిజం పట్ల నిజాయతీ లేదని ఆయన ర్యాలీలు చెబుతాయని, అన్నిటికీ తలూపే మనుషులే ఆయన వెంట ఉంటారని అంటారు.
ఎన్నికలలో ఆయన విజయం సాధిస్తే 1986లో ఆయన తండ్రి ఫెర్డినాండ్ మార్కోస్ ఆపేసిన చోటి నుంచి అంతా మళ్లీ మొదలుపెడతారని విమర్శకులు భయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఎవరెస్ట్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ శిఖరంపై యుక్రెయిన్ యుద్ధ ప్రభావం
- మనకు తగినంత విటమిన్-డి అందాలంటే ఏ సమయంలో, ఎంతసేపు ఎండలో ఉండాలి
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
- 7 లక్షల జనాభా ఉన్న చిన్న దేశంతో చైనా ఒప్పందం: భయపడుతోన్న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా...
- మెన్స్ట్రువల్ కప్: నెలసరి సమయంలో దీనిని ఎలా వాడాలి? ఇక శానిటరీ ప్యాడ్ల అవసరం ఉండదా? 5 ప్రశ్నలు, సమాధానాలు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















