సీఎం వైఎస్ జగన్: 'అవినీతికి పాల్పడితే వెంటనే పీకిపారేస్తా'- ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, I&pr andhrapradesh
ప్రభుత్వంపై అవినీతి ముద్ర పడేందుకు ఎంతమాత్రం వీల్లేదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులకు స్పష్టం చేశారని ఆంధ్రజ్యోతి దినపత్రిక పేర్కొంది.
ఏ మంత్రిపై అవినీతి అరోపణలు వచ్చినా.. తక్షణమే వారిని మంత్రివర్గం నుంచి తొలగిస్తానని జగన్ తేల్చిచెప్పారు. రెండున్నరేళ్లపాటు మంత్రులుగా కొనసాగుతామని భావించి ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదన్నారు.
సోమవారం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రిగా తన ప్రాధాన్యాలను, విధానాలను జగన్ స్పష్టం చేశారు.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... ''చంద్రబాబు పాలనలో ప్రతిశాఖలో అవినీతి రాజ్యమేలింది. ప్రజలు మార్పు కోరుకుని వైసీపీకి అఖండ విజయాన్ని అందించారు. ప్రజల విశ్వాసం కొనసాగాలంటే ప్రభుత్వానికి అవినీతి మరక అంటేందుకు వీల్లేదు. ప్రధానంగా మంత్రుల నడవడికను ప్రజలందరూ గమనిస్తున్నారని గుర్తించాలి. మంత్రులు అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే వెంటనే పీకిపారేస్తా'' అని సీఎం జగన్ అన్నారని ఆంధ్రజ్యోతి రాసింది.
పాదయాత్ర సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు తాను ఇచ్చిన హామీ నెరవేరేలా నిర్ణీత కాలవ్యవధిలోగా నివేదికను సిద్ధం చేయాలని జగన్ ఆదేశించారు. 'నవ రత్నాల' హామీలను నెరవేర్చడమే తన లక్ష్యమని చెప్పారు. తొలి కేబినెట్‌లోనే 70 శాతం మేర హామీలు నెరవేర్చడంపై దృష్టి సారించామన్నారు.
జులై 1 నుంచి అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 27 శాతం మధ్యంతర భృతిని కేబినెట్ ఆమోదించింది. అంగన్‌వాడీలు, ఆయాలు, హోంగార్డులు, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను పెంచింది.
ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకానుంది. బిడ్డలను బడికి పంపే తల్లులకు ఏడాదికోసారి రూ.15వేలు అందించే 'అమ్మ ఒడి'ని జనవరి 26నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. రైతు యూనిట్‌గా ఏడాదికి రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందించే ప్రతిపాదనను ఆమోదించింది.
2014 నుంచి చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ రూ.2వేల కోట్లు తక్షణమే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అగ్రిగోల్డు బాధితులకు చెల్లించేందుకు రూ.1150 కోట్లను న్యాయస్థానంలో జమ చేయాలని నిర్ణయించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటర్‌లో రాణిస్తున్నా... ఎంసెట్‌లో డీలా పడుతున్నారు
ఇంటర్మీడియట్‌లో ఉత్తమ మార్కులు సాధిస్తున్న విద్యార్థుల్లో అత్యధికులు ఎంసెట్‌లో బోల్తా పడుతున్నారంటూ ఈనాడు పత్రిక ఒక కథనం ప్రచురించింది.
ఇంటర్‌లో పాఠ్యపుస్తకాలు చదివినా మంచి మార్కులు సాధించవచ్చని, అదే ఎంసెట్‌లో మాత్రం సబ్జెక్టుపై లోతైన అవగాహన ఉంటేనే రాణిస్తారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఇంటర్మీడియట్‌లో 75% మార్కులు సాధిస్తున్నవారు 60 శాతానికిపైగా ఉండగా, ఎంసెట్‌లో మాత్రం 50% మార్కులు తెచ్చుకునే వారు 10-12 శాతమే ఉంటున్నారు.
ఇంటర్ రెండో సంవత్సరం తాజా ఫలితాల్లో మొత్తం 2.47 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో 1,49,574 (60.40%) మంది 75%, ఆపైన మార్కులు (ఏ గ్రేడ్) సాధించారు. ఏ గ్రేడ్ సాధించిన మొత్తం విద్యార్థుల్లో 85,654 మంది ఎంపీసీ, 38,898 మంది బైపీసీ గ్రూపు వారే ఉన్నారు. ఎంసెట్ ఇంజినీరింగ్‌లో మాత్రం కేవలం 10-12% మందే 50% మార్కులు సాధిస్తున్నారు. 160 మార్కులకు ఎంసెట్ నిర్వహిస్తుండగా అందులో 80 మార్కులు కూడా సాధించలేని వారే 85-90% ఉంటున్నారని ఈనాడు రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త 119 గురుకులాలు రెడీ
వెనుకబడిన తరగతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 119 గురుకుల పాఠశాలలు ప్రారంభానికి సిద్ధమయ్యాయని సాక్షి రాసింది.
రాష్ట్రం ఏర్పాటుకు ముందు 19 పాఠశాలలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. 2017-18 విద్యా సంవత్సరంలో కొత్తగా 119 గురుకుల పాఠశాలలు ప్రారంభించగా.. 2019-20 విద్యా సంవత్సరంలో మరో 119 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
ఈ క్రమంలో చర్యలు చేపట్టిన మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) కసరత్తు పూర్తి చేసింది. 119 గురుకుల పాఠశాలలకు అద్దె భవనాలను సిద్ధం చేసి అందులో మౌలిక వసతులను కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. పుస్తకాలు, విద్యార్థుల మెటీరియల్‌ను ఇప్పటికే పాఠశాలల్లో అందుబాటులో ఉంచింది.
దాదాపు అన్ని పాఠశాలల్లో సిబ్బంది సర్దుబాటు సైతం పూర్తయింది. వాస్తవానికి ఈ నెల 12 నుంచి బడులు ప్రారంభమవుతాయి. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల కొత్త గురుకులాలు మాత్రం 17వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక గురుకులం చొప్పున 119 గురుకుల పాఠశాలలు వారంరోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. కొత్త గురుకులాల్లో 5, 6, 7 తరగతులను ప్రారంభిస్తారు. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతి అప్‌గ్రేడ్ అవుతుంది.
కేజీ టూ పీజీ విద్యా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న గురుకుల పాఠశాలలను ఇకపై జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తారు. పదో తరగతి వరకు అప్‌గ్రేడ్ అయిన వాటిల్లో ఇంటర్మీడియట్‌ను సైతం ప్రారంభిస్తారు. ఈ ఏడాది కొత్తగా 119 గురుకులాల ప్రారంభంతో అదనంగా 28,560 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
కొత్త వాటితో కలిపితే రాష్ట్రంలో మొత్తం 257 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో 94,800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మరో రెండేళ్లలో ఈ సంఖ్య లక్ష దాటనుంది.

ఫొటో సోర్స్, fb/TalasaniTRS
బోనాలకు 15 కోట్లు
జూలై 4 నుంచి హైదరాబాద్‌లో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని నమస్తే తెలంగాణ పేర్కొంది.
4న గోల్కొండ బోనాలు, 21న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 28న పాతబస్తీలో బోనాలు నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందన్నారు.
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే బోనాల పండుగ ఏర్పాట్లపై హోంమంత్రి మహమూద్‌అలీ, దేవాదాయశాఖ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ఆయాశాఖల అధికారులతో తలసాని సోమవారం సచివాలయంలో సమీక్షించారు.
జీహెచ్‌ఎంసీ ద్వారా రూ.22 కోట్లతో వివిధ పనులకోసం ప్రతిపాదనలు సిద్ధంచేయాలని, రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్యం, దేవాలయాల వద్ద లైటింగ్ ఏర్పాట్లుచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
భక్తుల సౌకర్యార్థం జలమండలి మూడు లక్షలకుపైగా వాటర్ ప్యాకెట్లను సిద్ధంచేయాలని సూచించారు. భక్తులకు ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా దేవాలయాల వద్ద బారికేడింగ్ సిద్ధంచేయాలన్నారు.
విద్యుత్ అంతరాయం లేకుండా అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటుచేయాలని సూచించారు. దేవాదాయ కమిటీల దృష్టికి ఏమైనా సమస్యలు వచ్చినట్టయితే.. తన దృష్టికి తీసుకురావాలన్నారు. దేవాలయాల వద్ద సాంస్కృతికశాఖ సహకారంతో సాంస్కృతిక, భక్తి, అధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నామని వివరించారు.
ఇవి కూడా చదవండి:
- రంగుల జెర్సీలు ఎలా వచ్చాయి... వాటి నంబర్ల వెనుక కథేంటి... శ్రీలంక జెర్సీ ఎందుకంత ప్రత్యేకం
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- క్రికెట్ వరల్డ్ కప్ 2019: పోటీ ఈ మూడు జట్ల మధ్యే ఉంటుందా?
- ఫ్యాక్ట్ చెక్: బీరు దొరకట్లేదని కేసీఆర్‌కు బ్యాలెట్ బాక్సు ద్వారా లేఖ నిజమేనా?
- ఒంగోలు గిత్తల కథ: ఇక్కడ అరుదై పోయాయి.. బ్రెజిల్లో వెలిగిపోతున్నాయి
- షోరూంలో వస్తువులు కొని, క్యారీ బ్యాగ్ కోసం డబ్బులిస్తున్నారా, ఇకపై ఇవ్వొద్దు
- ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది
- ప్రతాప్ చంద్ర సారంగి: సాధారణంగా కనిపించే ఈయన గతం వివాదాస్పదమే
- ఆంధ్రప్రదేశ్ కొత్త మహిళా మంత్రులు వీరే
- మహిళలకు భావప్రాప్తి కలిగిందో లేదో పట్టించుకోనవసరం లేదా - అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








