ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి అవినీతి కేసులో జైలు శిక్ష

ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు, 66 ఏళ్ల నికోలస్ సర్కోజీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు, 66 ఏళ్ల నికోలస్ సర్కోజీ

ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు, 66 ఏళ్ల నికోలస్ సర్కోజీ అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో పారిస్ కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

అయితే, అందులో ఏడాది మాత్రమే ఆయన జైలు శిక్ష అనుభవిస్తారు. మిగతా రెండేళ్లు తదుపరి నేరం జరిగితే తప్ప శిక్షను అమలు చేయకూడదని కోర్టు తెలిపింది. దీన్ని సస్పెండెడ్ సెంటెన్స్ అంటారు. అంటే ఒక నిర్దిష్ట వ్యవధిలో నేరస్థుడు మరొక నేరం చేస్తే తప్ప శిక్షను అమలు చేయరు.

అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తరువాత, 2014లో ఒక న్యాయామూర్తికి లంచం ఇవ్వజూపారని సర్కోజీపై కేసు నమోదైంది. వేరే కేసులో తనకు కావలసిన సమాచారాన్ని అందిస్తే ఆ జడ్జ్‌కు మంచి ప్రతిష్ఠాత్మకమైన పోస్టు ఖాయం చేస్తానని సర్కోజీ లంచం ఇవ్వజూపారు.

అయితే, తాజా తీర్పుపై మళ్లీ కోర్టులో అప్పీల్ చేసుకుంటామని సర్కోజీ తరపు న్యాయవాది తెలిపారు.

జైలు శిక్షను ఎదుర్కోబోతున్న తొలి మాజీ ఫ్రెంచ్ అధ్యక్షుడు సర్కోజీనే.

"తాను చేస్తున్న పని తప్పు అని ఆయనకు తెలుసు. ఆయన, ఆయన తరఫు లాయర్లు చేసిన పనులు ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల నమ్మకాన్ని సన్నగిల్లేలా చేశాయి" అని ఈ కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తి క్రిస్టీన్ మీ వ్యాఖ్యానించారు.

సర్కోజీ చేసిన నేరాలను 'ప్రభావితం చేయడం', 'వృత్తిపరమైన గోపత్యా ఉల్లంఘన'గా పరిగణించారు.

సర్కోజీకి

ఫొటో సోర్స్, Getty Images

యుద్ధానంతర ఫ్రాన్స్ చరిత్రలో ఇదొక మైలురాయిలాంటి తీర్పు. గతంలో ఏ ఫ్రెంచ్ అధ్యక్షుడూ జైలు శిక్షను ఎదుర్కోలేదు.

ఇంతకుముందు, ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్‌ పారిస్ మేయర్‌గా ఉన్న కాలంలో తన మిత్రుల కోసం పారిస్ సిటీ హాల్‌లో బోగస్ ఉద్యోగాలు సృష్టించినందుకు గానూ 2011లో రెండేళ్ల సస్పెండెడ్ సెంటెన్స్ ఎదుర్కొన్నారు.

సర్కోజీ అప్పీల్ విఫలమైతే, ఏడాది పాటూ జైలుకు వెళ్లకుండా ఆయన ఇంట్లోనే ఎలక్ట్రానిక్ ట్యాగ్‌తో నిర్బంధంలో ఉండవచ్చు.

సర్కోజీ సహచరి, సూపర్‌ మోడల్, సింగర్ అయిన కార్లా బ్రూనీ ఈ తీర్పుపై స్పందిస్తూ..."ఇది అర్థం లేని తీర్పు. మా పోరాటం కొనసాగుతుంది. ఎప్పటికైనా నిజాలు బయటకి వస్తాయి" అని అన్నారు.

నికోలస్ సర్కోజీ 2007 నుంచి 2012 వరకూ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన పాలనలో కఠినమైన వలస వ్యతిరేక విధానాలను అమలు చేశారు. 2008, 2009లలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని కమ్మేసినప్పుడు, ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే ప్రయత్నాలు చేశారు.

కేసు ఏమిటి?

2007లో ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో సర్కోజీ లోరియల్ వారసురాలు లిలియాన్ బెటెన్‌కోర్ట్ నుంచి అక్రమంగా సొమ్ము స్వీకరించారనే నేరం కింద ఆయనపై కేసు విచారణకు వచ్చింది.

ఆ కేసు గురించి వివరాలు తనకు అందజేస్తే గిల్బర్ట్ అజిబెర్త్ అనే జడ్జ్‌కు మొనాకోలో ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం ఇప్పిస్తానని సర్కోజీ, ఆయన లాయర్ థియరీ హెర్జోగ్ లంచం ఇచ్చేందుకు ప్రతిపాదించిన ఫోన్ రికార్డులు బయటపడడంతో 2014లో ఆయనపై మరో కేసు నమోదైంది.

ఈ కేసులో గిల్బర్ట్ అజిబెర్త్, థియరీ హెర్జోగ్‌లకు కూడా రెండేళ్లు సస్పెండెడ్ సెంటెన్స్‌తో కూడిన మూడేళ్ల జైలు శిక్ష ఖరారైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)