నరేంద్ర మోదీ: ‘అవినీతికి పాల్పడ్డానా? ఆస్తులు సంపాదించానా?.. ధైర్యం ఉంటే నిరూపించండి’ - ప్రెస్‌ రివ్యూ

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

తాను అక్రమంగా సొమ్ము సంపాదించినట్టు నిరూపించాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రతిపక్షాలకు బహిరంగ సవాలు విసిరారు. చివరి దశ పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న వేళ ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్లియా, బిహార్‌లోని సాసారాం, బక్సర్‌, చండీగఢ్‌లలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారని ఈనాడు తెలిపింది.

''మహాకల్తీ నేతలకు నేను బహిరంగ సవాలు విసురుతున్నా. నన్ను దూషించే బదులు ధైర్యం ఉంటే నా బహిరంగ సవాలును స్వీకరించండి. నేనేమైనా బినామీ పేర్లతో ఆస్తులు సంపాదించానా? బంగళాలు, షాపింగ్‌ కాంప్లెక్సులు కట్టుకున్నానా? విదేశీ బ్యాంకుల్లో సొమ్ము దాచుకున్నానా? విదేశాల్లో ఆస్తులు కూడబెట్టానా? లక్షలు, కోట్లు విలువ చేసే వాహనాలు కొనుగోలు చేశానా? ధైర్యం ఉంటే నిరూపించండి..ధనవంతుణ్ని కావాలని నేనెప్పుడూ కలగనలేదు. పేదల ధనాన్ని దోచుకొని పాపం చేయలేదు. పేదల సంక్షేమం, మాతృభూమి రక్షణ, గౌరవానికే ప్రాధాన్యం ఇచ్చాను'' అని చెప్పారు.

తనపై చేస్తున్న విమర్శలకు ప్రజలే ఓట్ల ద్వారా సమాధానం ఇస్తారని తెలిపారు. దీర్ఘకాలంపాటు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రధానిగా ఉన్నానని, తన జీవితం తెరిచిన పుస్తకంలాటిందని చెప్పారు.

పాకిస్థాన్‌ అహంకారాన్ని అణచివేశామని, ఉగ్రవాదులు ఇప్పుడు రహస్య స్థావరాల్లో దాక్కొని మోదీ గద్దె దిగాలంటూ ప్రార్థనలు చేస్తున్నారని అన్నారు. స్థానిక గూండాలనే అదుపు చేయలేని మహాకూటమి నేతలు ఉగ్రవాదులను ఎలా అణచివేస్తారని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ నాయకుడు శ్యాం పిట్రోడా చేసిన హువా తో హువా (జరిగిందేదో జరిగిపోయింది) అనే వ్యాఖ్యను మోదీ మళ్లీ ప్రస్తావించారు. దేశ ప్రజలు కాంగ్రెస్‌ను ఉద్దేశించి 'ఇక చాలు.. ఇప్పటికే చాలా జరిగింది' (అబ్‌ బస్‌.. బహుత్‌ హువా) అని అంటున్నారని విమర్శించారు.

వారసత్వ రాజకీయాలు, అవినీతి, అహంకార ధోరణితో దేశ ప్రజలు విసిగిపోయారని, ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పనున్నారని అన్నారు. ఓటు వేసే ముందు కాంగ్రెస్‌ నాయకుల అక్రమ సంపాదనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కార్యకర్తలు అప్పుడే కొట్టుకుంటున్నారని, అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. లాలూ ప్రసాద్‌ పార్టీ ఆర్జేడీ ఎన్నికల గుర్తు లాంతరుపై వ్యాఖ్యానిస్తూ వారు రాష్ట్రాన్ని తిరిగి విద్యుత్తు లేని లాంతరుల కాలానికి తీసుకెళ్తారని వ్యాఖ్యానించారని ఈనాడు పేర్కొంది.

స్టాలిన్

ఫొటో సోర్స్, Stalin/fb

''తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నన్ను కలుసుకున్నది కాంగ్రెస్సేతర, బీజేపీయేతర తృతీయ కూటమి ఏర్పాటుపై చర్చలు జరిపేందుకు కాదు. ఇప్పటికిప్పుడు అలాంటి కూటమి ఏర్పాటుకు అవకాశమే లేదు'' అని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ చెప్పాని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సోమవారం ఆయనతో భేటీ అయిన సంగతి తెలిసిందే. తూత్తుకుడి జిల్లా ఒట్టపిడారం అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారానికి బయలుదేరే ముందు.. చెన్నై విమానాశ్రయం వద్ద విలేకరులతో మాట్లాడిన స్టాలిన్‌ ఈ అంశం గురించి మాట్లాడారు.

''తెలంగాణ సీఎం తమిళనాడులోని ఆలయాల సందర్శన కోసం వచ్చారు. ఈ సందర్భంగా చెన్నైలో నన్ను మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. తృతీయ కూటమి ప్రస్తావన మా మధ్య రాలేదు. అయినా, కాంగ్రెస్‌, బీజేపీ లేకుండా మూడో కూటమి సాధ్యపడుతుందని నేను భావించడం లేదు'' అని అన్నారు. అయితే, మే 23న ఫలితాల తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.

మరోవైపు.. తూత్తుకుడిలో స్టాలిన్‌ బసచేస్తున్న గెస్ట్‌హౌజ్‌లో , ఆయన ప్రచారానికి ఉపయోగించే వ్యాన్‌లో మంగళవారం ఉదయం ఎన్నికల సంఘం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు తనిఖీలు జరిపారు.

ఓటర్లకు పంచేందుకు గెస్ట్‌హౌజ్‌లో డబ్బులు దాచారని రహస్య సమాచారం రావడంతో ఈ తనిఖీలు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో స్టాలిన్‌ ఒట్టపిడారంలో కాలినడకన ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

‘నాథూరామ్‌ గాడ్సే ఉగ్రవాదే’

జాతిపిత మహాత్మాగాంధీని హతమార్చిన నాథూరామ్‌ గాడ్సే ఉగ్రవాదే అని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారని సాక్షి తెలిపింది.

స్వాతంత్య్రం వచ్చాక దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది హిందువేనని.. అతనే నాథూరామ్‌ గాడ్సే అంటూ మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలను అసద్‌ సమర్థించారు.

మంగళవారం దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతిపిత గాంధీని చంపిన గాడ్సేను మహాత్ముడంటారా? రాక్షసుడంటారా? అని ప్రశ్నించారు.

గాంధీని చంపినట్లు రుజువై.. శిక్ష కూడా పడిన వ్యక్తిని ఏమని పిలవాలని అన్నారు. హంతకుడిని గొప్పవాడిగా ఎలా అభివర్ణిస్తారన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నైరాశ్యంలో ఉన్నారని, ఆయనకు దేశమంతటా ఎదురుగాలి వీస్తోందని పేర్కొన్నారు. మోదీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు.

టీఆర్‌ఎస్‌ ఆధినేత కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలు అభినందనీయమన్నారు. కేసీఆర్‌కు రాజకీయ విజన్, ఒక వ్యూహం ఉందన్నారు. తెలంగాణలో బీజేపీని అసెంబ్లీలో ఒక్క సీటుకు పరిమితం చేయగలిగామని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ ఒక్క సీటు కూడా గల్లంతు కావడం ఖాయమన్నారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని జోస్యం చెప్పారని సాక్షి పేర్కొంది.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, chandrababu naidu/fb

టీడీపీ మహానాడు వాయిదా

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఏటా మే 27 నుంచి మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించే పార్టీ మహానాడుని ఈసారి వాయిదా వేయాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. దీనికి బదులుగా ఎన్టీఆర్‌ జయంతిని గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని సంకల్పించారని ఈనాడు తెలిపింది.

మంగళవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం మొదలవడానికి ముందుగా మంత్రులతో మధ్యాహ్న విందు సమావేశం నిర్వహించారు. అంతకు ముందు ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ అధికార ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.

మహానాడు నిర్వహణ, కేంద్రంలో రాజకీయ పరిణామాలు సహా పలు అంశాలపై వారితో చర్చించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉండటం, ఏర్పాట్లకు తగిన సమయం లేకపోవటంతో మహానాడుని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, ఒకవేళ ఎన్డీయేనే మళ్లీ అధికారంలోకి వచ్చినా మోదీ మాత్రం ప్రధాని కాలేరన్న అభిప్రాయం మంత్రులతో నిర్వహించిన సమావేశంలో వ్యక్తమైంది.

మహానాడు నిర్వహణపై చంద్రబాబు పార్టీ నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. మహానాడు నిర్వహించాలంటే కనీసం నెల రోజుల ముందు నుంచీ ఏర్పాట్లు ప్రారంభించాలి. ఎన్నికల నేపథ్యంలో ఇంత వరకు ఆ దిశగా సన్నాహాలు లేవు.

ఈ నెల 23న ఫలితాలు వెలువడ్డ తర్వాత చంద్రబాబు దిల్లీలో ఉండాల్సిన పరిస్థితి ఉన్నందున మహానాడుని వాయిదా వేయాలన్న ప్రతిపాదనకే ఎక్కువ మంది మొగ్గు చూపారు.

ఈ నెల 28న ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా అన్ని వార్డులు, గ్రామాలు, పట్టణాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికలు తదితర కారణాల వల్ల 1985, 1991, 1996ల్లోనూ మహానాడు నిర్వహించలేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారని ఈనాడు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)