Prayagraj: బుల్డోజర్లతో కూల్చేసిన ఈ ఇంటిలో ఉండే జావెద్ మొహమ్మద్ ఎవరు?

ప్రయాగ్‌రాజ్ హింస

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, అనంత్ ఝణాణే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో శుక్రవారం పార్థనల అనంతరం హింస చెలరేగింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు 98 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఎఫ్ఐఆర్‌‌లో 70 మందిపై అభియోగాలు మోపారు. 29 తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అయితే, ఈ కేసులో ‘ప్రధాన నిందితుడి’గా చెబుతున్న జావెద్ మొహమ్మద్ ఇంటిని ఆదివారం పోలీసుల సమక్షంలో ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీడీఏ) అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు.

దీనికి ఒక రోజు ముందు, ఆ ఇంటిపై ఒక నోటీసు అతికించారు. ఇంటిని కూల్చేయబోతున్నట్లు దీనిలో పేర్కొన్నారు. అది అక్రమ నిర్మాణం అంటూ మే 10న నోటీసులు ఇచ్చామని, మే 24న దానిపై విచారణ జరిగిందని నోటీసులో వివరించారు.

‘‘మే 24న జావెద్ గానీ, ఆయన న్యాయవాది కానీ ఎలాంటి పత్రాలు సమర్పించలేదు. దీంతో జూన్ 9 నాటికి ఆ ఇంటిని కూల్చేయాలని మే 25న ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పటికీ ఆయన ఇంటిని కూల్చకపోవడంతో జూన్ 12 ఉదయం 11లోగా ఇంటిని ఖాళీ చేయాలని నోటీసులు అంటించాం. ఆ తర్వాత కూల్చేశాం’’ అని పీడీఏ అధికారులు చెబుతున్నారు.

ప్రయాగ్‌రాజ్ హింస

ఫొటో సోర్స్, KK ROY

ఫొటో క్యాప్షన్, జావెద్ మహమ్మద్ (ఎడమ), ఎస్ఎస్‌పీ ప్రయాగ్‌రాజ్ అజయ్ కుమార్ (మధ్యనున్న వ్యక్తి )

ఇంటి నుంచి ఆయుధాలు..

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన హింసకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకుంటున్నామని ప్రయాగ్‌రాజ్ ఎస్ఎస్‌పీ అజయ్ కుమార్ చెప్పారు. ‘‘ఆధారాలు సేకరిస్తున్నాం. అన్ని వాస్తవమని ధ్రువీకరించుకున్నాకే చర్యలు తీసుకుంటాం. అమాయకులపై ఎలాంటి చర్యలూ తీసుకోం’’ అని ఆయన అన్నారు.

‘‘ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న జావెద్ మొహమ్మద్ అలియాజ్ జావెద్ పంప్‌ తన ఇంటిని అక్రమంగా నిర్మించారని జిల్లా పరిపాలనా విభాగం, పీడీఏ చర్యలు తీసుకుంది. ప్రస్తుత కేసు విచారణను పరిశీలిస్తే, శుక్రవారం జరిగిన హింసకు ప్రధాన సూత్రధారి ఆయనేనని తెలుస్తోంది. ఆయన ఇంటిలో సోదాలు చేశాం. ఒక 12 బోర్ రైఫిల్, ఒక 315 బోర్ రైఫిల్, కొన్ని తూటాలు లభించాయి’’ అని అజయ్ కుమార్ చెప్పారు.

ఆయుధాలతోపాటు అభ్యంతరకర పోస్టర్లు, కొన్ని పత్రాలు లభించినట్లు అజయ్ కుమార్ తెలిపారు.

‘‘ఆ పత్రాల్లో కోర్టును అభ్యంతరకర పదాలతో జావెద్ దూషించారు’’ అని అజయ్ వివరించారు. ఈ ఆధారాలన్నీ కోర్టులో సాక్ష్యాలుగా సమర్పిస్తామన్నారు.

‘‘కొన్ని పుస్తకాలు, జెండాలు, పోస్టర్లు, బ్యానర్లు కూడా ఆ ఇంట్లో దొరికాయి. వీటిని ఎవరు రాశారు? ఎందుకు రాశారు? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది’’ అని పోలీసులు చెప్పారు.

హింసలో పిల్లలను అడ్డుపెట్టుకున్న, రాళ్లు విసిరిన వారిని విడిచిపెట్టబోమని పోలీసులు చెబుతున్నారు.

ప్రయాగ్‌రాజ్ హింస

ఫొటో సోర్స్, ANI

ఆ ఇల్లు ఎవరి పేరున ఉంది?

ఆ ఇంటిపై అతికించిన నోటీసుల్లో ఇంటి యజమానిగా జావెద్ మొహమ్మద్ పేరుని పేర్కొన్నారు.

అయితే, పీడీఏ కూల్చేసిన ఆ ఇల్లు ఆయన పేరున లేదని అలహాబాద్ హైకోర్టులో జావెద్ తరఫున ఆయన న్యాయవాది ఒక పిటిషన్ దాఖలు చేశారు. ‘‘ఆ ఇల్లు నా భార్య పర్వీన్ ఫాతిమా పేరున ఉంది. పెళ్లికి ముందే ఆమె పుట్టింటివారు ఆమెకు దీన్ని బహుమతిగా ఇచ్చారు’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

‘‘ఆ ఇంటిపై జావెద్‌కు ఎలాంటి హక్కూ లేదు. ఆయన పేరు మీద చర్యలు తీసుకోవడం అక్రమం’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

‘‘జూన్ 11న ఆ ఇంటిపై ఒక నోటీసు అతికించారు. దానిపై ఇదివరకు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కానీ, జావెద్‌కు కానీ, ఆయన భార్యకు కానీ ఎలాంటి నోటీసులూ రాలేదు’’ అని జావెద్ తరఫు న్యాయవాది కేకే రాయ్ చెప్పారు.

‘‘ముస్లిం పర్సనల్ లా ప్రకారం.. పుట్టింటివారు తనకు బహుమతిగా ఇచ్చిన ఇంటిపై పూర్తి హక్కులు ఆమెకే ఉంటాయి. ఆస్తుల విషయంలో హిందూ లా కంటే ముస్లిం లా భిన్నమైనది. ఇక్కడ ఫాతిమాకు ఆ ఇంటిపై పూర్తి హక్కులున్నాయి. కానీ, జావెద్ పేరుతో నోటీసులు ఇచ్చారు’’ అని పిటిషన్‌లో కేకే రాయ్ వివరించారు.

ఈ విషయంలో తాము పోరాడతామని, అవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళ్తామని కేకే రాయ్ తెలిపారు.

ఈ కేసుపై మాట్లాడేందుకు పీడీఏ, ప్రయాగ్‌రాజ్ డీఎంలను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, వార్త రాసే సమయానికి వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

લાઇન

ఇప్పటివరకు ఏం జరిగింది?

લાઇન

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, ఆ పార్టీ మీడియా విభాగం ఇన్‌ఛార్జి నవీన్ కుమార్ జిందాల్‌ వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత.. ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనలు జరిగాయి. చాలాచోట్ల హింస కూడా చోటుచేసుకుంది.

కాన్పుర్, సహారన్‌పుర్, ప్రయాగ్‌రాజ్‌లలో హింస చెలరేగింది. దీనికి సంబంధించి మొత్తంగా 306 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ఓ టీవీ ఛానెల్ చర్చలో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

ఆ వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది. ఖతర్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. మరికొన్ని దేశాలు భారత రాయబారుల ఎదుట నిరసన కూడా తెలియజేశాయి.

నిరసనల నడుమ నూపుర్ శర్మపై బీజేపీ చర్యలు తీసుకుంది. మరోవైపు ఈ వివాదానికి సంబంధించి సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టిన నవీన్ కుమార్ జిందాల్‌పైనా చర్యలు తీసుకున్నారు.

લાઇન
జేఎన్‌యూలో నిరసన

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, జావెద్ ఇంటిని కూలదోయడంపై జేఎన్‌యూలో నిరసన

జావెద్ మొహమ్మద్ ఎవరు?

విద్యార్థి దశ నుంచీ జావెద్ క్రియాశీలంగా రాజకీయాల్లో పాల్గొనేవారని ఆయనకు సన్నిహితుడు, న్యాయవాది కేకే రాయ్ చెప్పారు. ‘‘అప్పటి నుంచే జావెద్ నాకు తెలుసు. ముస్లింల వ్యవహారాలను చూసుకునే అన్ని కమిటీల్లోనూ ఆయన సభ్యుడిగా ఉండేవారు’’ అని రాయ్ వివరించారు.

జావెద్ మచ్చలేని వారని రాయ్ అన్నారు. ‘‘జిల్లా పరిపాలనా విభాగంతోనూ ఆయనకు మంచి సంబంధాలే ఉండేవి. 20 ఏళ్లుగా ఆయన ప్రజలకు సేవ చేస్తున్నారు. చిన్న నేరంలోనూ ఆయన నిందితుడిగా లేరు. నేరస్థులతోనూ ఆయనకు సంబంధాలు లేవు. కరోనావైరస్ విజృంభించినప్పుడు, వరదల సమయంలో ఆయన చాలా సేవ చేశారు’’ అని రాయ్ చెప్పారు.

‘‘ఈద్, బక్రీద్, చాంద్ రాత్, శుక్రవారం ప్రార్థనలు లాంటి సమయాల్లో ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం అయినప్పుడు జిల్లా పరిపాలనా విభాగానికి జావెద్ సాయం అందించేవారు. ఒక్కసారిగా అందరి దృష్టిలో ఆయన నిందితుడు ఎలా అయిపోయాడు?’’ అని రాయ్ ప్రశ్నించారు.

వీడియో క్యాప్షన్, దిల్లీని పాలించిన ఔరంగజేబు సమాధిని మహారాష్ట్రలో ఎందుకు నిర్మించారు?

దిల్లీలోని వేల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియాతో జావెద్‌కు మంచి సంబంధాలున్నాయని రాయ్ చెప్పారు. ఈ పార్టీనీ ఎస్‌క్యూఆర్ ఇల్యాస్ స్థాపించారు.

‘‘వేల్ఫేర్ పార్టీకి ముందు ఆయన జనతా దళ్‌లో ఉండేవారు. 2022 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇల్యాస్‌తో కలిసి అఖిలేశ్ యాదవ్ ఒక విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. అప్పుడు జావెద్ కూడా వెల్ఫేర్ పార్టీ నుంచి పోటీ చేయాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఆయన బరిలోకి దిగలేదు’’ అని రాయ్ చెప్పారు.

‘‘వృత్తిరీత్యా జావెద్ ఒక షాపు నడుపుతున్నారు. ఇదివరకు ఆయన పంపుసెట్ల బిజినెస్ చేసేవారు’’ అని కేకే రాయ్ వివరించారు.

బం‌ద్‌కు ఆయన పిలుపునిచ్చారా?

జూన్ 10న బంద్‌కు జావెద్ పిలుపునిచ్చారా? ఈ ప్రశ్నపై రాయ్ స్పందిస్తూ.. ‘‘లేదు. బంద్‌ను ఆయన వ్యతిరేకించారు. వాట్సాప్‌లో ఆయన పేరిట వస్తున్న వార్తలన్నీ ఫేక్’’ అని అన్నారు.

అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు జావెద్ అని ప్రయాగ్‌రాజ్ జిల్లా పరిపాలనా విభాగం చెబుతోంది.

వీడియో క్యాప్షన్, కాశీ-జ్ఞాన్‌వాపి వివాదమేంటి? దాని వెనుక ఉన్న చారిత్రక మూలాలేంటి?

అఫ్రీన్ ఫాతిమా ఎవరు?

‘‘జావెద్ కుమార్తె అఫ్రీన్.. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విమెన్స్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. చదువులో ఆమె టాపర్. జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ కౌన్సిలెర్‌గానూ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె రీసెర్చర్’’ అని కేకే రాయ్ చెప్పారు.

అఫ్రీన్‌పైనా చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్నపై ప్రయాగ్‌రాజ్ ఎస్ఎస్‌పీ అజయ్ కుమార్ స్పందిస్తూ.. ‘‘హింసకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఆధారాలు లభించిన వెంటనే చర్యలు తీసుకుంటాం. అమాయకులపై ఎలాంటి చర్యలూ ఉండవు’’ అని ఆయన వివరించారు.

తన కుమార్తె జేఎన్‌యూలో చదువుకుంటోందని, తనకు సూచనలు సలహాలు ఇస్తుంటుందని జావెద్ విచారణలో చెప్పినట్లు ఎస్ఎస్‌పీ అజయ్ కుమార్ వెల్లడించారు.

ప్రస్తుతం జావెద్‌కు సూచనలు, సలహాలు ఎవరిచ్చారనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు. ‘‘జావెద్ ఫోన్ నుంచి కొన్ని నంబర్లు తీసుకున్నాం. ఆయన ఫోన్‌లో కొన్ని వాట్సాప్ మెసేజ్‌లు డిలీట్ అయ్యాయి. వాటిని తిరిగి పొందేందుకు మొబైల్‌ను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం’’ అని పోలీసులు తెలిపారు.

జావెద్ కుమార్తెను కూడా విచారిస్తారా? అనే ప్రశ్నపై ఎస్ఎస్‌ప అజయ్ కుమార్ స్పందిస్తూ.. ‘‘విచారణలో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చారు. అవసరమైతే దిల్లీ వెళ్తాం. దిల్లీ పోలీసులనూ ఆశ్రయిస్తాం’’ అని చెప్పారు.

అఫ్రీన్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే, ఆమె నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)