లైవ్ స్ట్రీమింగ్: వర్చువల్ కోర్టులతో ఏమేం మార్పులొచ్చాయంటే

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ
    • రచయిత, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ న్యూస్

వర్చువల్ కోర్టులు మొదలుకావడంతో భారత్‌లో ఒకట్రెండు నవ్వు తెప్పించే ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక లాయర్ షార్టు వేసుకుని విచారణకు హాజరైతే.. మరొక లాయర్ ఏకంగా హుక్కా పీలుస్తూ దర్శనమిచ్చారు.

అయితే, మొత్తంగా చూసుకుంటే సామాన్యులతో మొదలుపెట్టి లాయర్లు, జర్నలిస్టుల వరకు అన్ని వర్గాలకూ ఈ వర్చువల్ కోర్టులు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి.

‘‘ఏదో ఒక రోజు పత్రికల్లో మొదటి పేజీ వార్తలు కోర్టు నుంచే వస్తాయని ముందే అంచనావేసి న్యాయ వార్తలకు ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్ పెట్టాం’’అని బార్ అండ్ బెంచ్ కోఫౌండర్ శిశిర రుద్రప్ప చెప్పారు.

గత దశాబ్దంలో లైవ్ లా, బార్ అండ్ బెంచ్‌ లాంటి లీగల్ వెబ్‌సైట్లను చాలా ప్రారంభించారు. మరోవైపు స్మార్ట్‌ఫోన్ల విప్లవంతో సోషల్ మీడియా వినియోగం కూడా పెరిగింది. దీంతో కోర్టు గదుల నుంచి వార్తలు రాసే విధానం కూడా మారింది.

ఒకప్పుడు కోర్టు తీర్పు, న్యాయమూర్తి చెప్పే అంశాలు, కోర్టులో వాదనలకు మాత్రమే రిపోర్టింగ్ పరిమితమై ఉండేది.

‘‘కానీ, నేడు పరిస్థితి చాలా మారింది. కోర్టుల్లో ఏం జరుగుతుందో ప్రజలు మెరుగ్గా తెలుసుకోగలుగుతున్నారు’’ అని లైవ్ లా మేనేజింగ్ ఎడిటర్ మను సెబాస్టియన్ చెప్పారు.

ఇప్పటికప్పుడు పరిస్థితులను వివరిస్తూ ఇచ్చే లైవ్‌ అపేడేట్‌లు కోర్టు పరిణామాలకు వర్చువల్ ఎక్స్‌టెన్షన్‌గా జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గత ఏడాది అభివర్ణించింది.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

2018లోనే..

2018లో ఇండియన్ కోర్టుల లైవ్ స్ట్రీమింగ్‌కు సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత కోవిడ్-19 వ్యాప్తి మొదలైంది. దీంతో దేశ న్యాయవ్యవస్థ.. వర్చువల్ కోర్టులను మొదలుపెట్టడం అనివార్యమైంది.

2020లో వర్చువల్ కోర్టులు మొదలైనప్పుడే కేరళ హైకోర్టులో పీవీ ఉత్తర తన ప్రాక్టీసును మొదలుపెట్టారు.

వర్చువల్ ప్రొసీడింగ్స్‌తో తనలో ఆందోళన తగ్గిందని, కోర్టు కార్యక్రమాలను కూడా తాను మెరుగ్గా అర్థం చేసుకోగలిగాని ఆమె బీబీసీతో చెప్పారు.

ముఖ్యంగా మహిళా, యువ లాయర్లకు ఈ వర్చువల్ విధానం ఉపయోగపడింది. ఎందుకంటే వీరికి ఇచ్చే జీతాలు సాధారణంగా తక్కువగా ఉంటాయి. కోర్టుకు నేరుగా వెళ్లాల్సిన పని తగ్గడంతో వీరికి సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

‘‘సాధారణ పౌరులకు కూడా ఈ వర్చువల్ విధానంతో మేలే జరుగుతోంది. ఎందుకంటే రవాణా ఖర్చులు ఆదా అవుతాయి. ఎక్కువ మంది లాయర్లతో మాట్లాడాల్సిన పని కూడా తప్పుతుంది’’అని ఆమె చెప్పారు.

‘‘కోర్టు ఆదేశాలను తమకు అర్థమయ్యే పరిభాషలో చెప్పడానికి ఒక లాయర్ మనకు అవసరం. అయితే, తమ కేసును వర్చువల్‌గా లాయర్లు వాదించడం చూడటంతో క్లైంట్లకు కాస్త సంతృప్తిగా అనిపిస్తుంది. కేసును దగ్గర నుంచి చూస్తున్న భావన కూడా కలుగుతుంది’’అని ఆమె అన్నారు.

‘‘మరోవైపు తక్కువ ఖర్చుతో న్యాయ వ్యవస్థ ప్రజలకు చేరువయ్యేందుకు ఇది తోడ్పడుతుంది. ముఖ్యంగా వైకల్యం ఉన్నవారు నేరుగా ఈ విధానం సాయంతో కోర్టు వ్యవహారాల్లో పాలుపంచుకోవడం తేలిక అవుతుంది’’అని ఆమె అన్నారు.

‘‘నిజానికి మన కోర్టులు చాలావరకు వికలాంగులు హాజరయ్యేందుకు వీలుగా లేదా అనుకూలంగా ఉండవు’’అని ఆమె వివరించారు. సుప్రీం కోర్టు కూడా ఒక అధ్యయనంలో ఈ విషయాన్ని అంగీకరించింది.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

హైబ్రిడ్ వ్యవస్థ

కేరళ హైకోర్టు ఈ ఏడాది ప్రారంభంలో హైబ్రిడ్ వ్యవస్థను మొదలుపెట్టింది. ఇక్కడ వర్చువల్‌ విధానంతోపాటు నేరుగానూ విచారణలు జరుగుతున్నాయి. వర్చువల్ విధానం వల్ల కుటుంబానికి తగిన సమయం కేటాయించగలుగుతున్నానని, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని కూడా చూసుకోగలుగుతున్నానని ఉత్తర చెప్పారు.

2020లో మొదట గుజరాత్ హైకోర్టు కేసుల లైవ్‌స్ట్రీమింగ్‌ను మొదలుపెట్టింది. ఈ మోడల్‌ను కర్నాటక హైకోర్టు కూడా అనుసరించింది. ఫిబ్రవరి 2022లో కర్నాటకలో స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ వివాదంపై విచారణను కూడా లైవ్ స్ట్రీమ్ చేశారు.

ఈ కేసు విచారణను వేల మంది యూట్యూబ్‌లో చూశారు. కోర్టు గదుల్లో పరిణామాలపై సోషల్ మీడియాలోనూ చర్చ జరిగింది.

వీడియో క్యాప్షన్, ఆభరణాల తయారీతో సెక్స్ వర్కర్ల కొత్త జీవితం

‘‘రెండంచుల కత్తే’’

అయితే, ఇలా కోర్టుల్లోని పరిణామాలపై చర్చలు అన్నిసార్లు ఆహ్వానించకూడదని కేంద్రం భావిస్తోంది.

స్వలింగ సంప్కరుల వివాహాల కేసు లైవ్ స్ట్రీమింగ్‌ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ ప్రమాణ పత్రం దాఖలుచేసింది. అయితే, దీనిపై దిల్లీ హైకోర్టు కేంద్రాన్ని మందలించింది.

ఈ కేసులో పిటిషనర్ అనవసరంగా హైప్‌ను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజాప్రయోజనం పేరుతో ఈ అంశాన్ని సంచలనంగా మార్చేందుకు పిటిషన్‌దారుడు ప్రయత్నిస్తున్నారని కేంద్రం ఆరోపించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే, లైవ్ స్ట్రీమింగ్ అనేది రెండంచుల కత్తి లాంటిదని, న్యాయమూర్తులు చాలా అప్రమత్తంగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ చెప్పారు. మీడియాలో చోటుచేసుకునే పరిణామాలు కేసు విచారణపై ప్రభావం చూపకూడదని ఆయన అన్నారు.

అమెరికాలో నటి అంబర్ హెర్డ్‌పై ఆమె మాజీ భర్త, నటుడు జానీ డెప్ వేసిన కేసు లైవ్ స్ట్రీమింగ్ ఈ ఆందోళనను మరింత పెంచింది. ఈ కేసులో గృహహింస కోణంపై దృష్టి సారించేందుకు బదులు మీడియాలో ఒక సర్కస్ నడిచినట్లయ్యింది.

కానీ, భారత్‌లో ప్రస్తుతమున్న చట్టాలు వ్యక్తుల గోప్యతా హక్కులకు పెద్దపీట వేస్తున్నాయని న్యాయవాదులు చెబుతున్నారు. లైంగిక దాడులు అయినా లేదా హెచ్ఐవీ కేసులు అయినా అన్నింటిలోనూ ఇక్కడ గోప్యత పాటిస్తారని వివరిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, హరిత టపాసులు త్వరలో రాబోతున్నాయి..

‘‘ఉదాహరణగా కర్నాటక హైకోర్టునే తీసుకోండి. పెళ్లికి సంబంధించిన వివాదాలు, లైంగిక నేరాలు, పిల్లలపై నేరాల విచారణను ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ చేయరు. మరోవైపు ఈ విషయాలను బయటకు చెప్పకుండా కోర్టు కూడా చర్యలు తీసుకుంటుంది. మరోవైపు తమ కేసులు లైవ్ స్ట్రీమింగ్ చేయొద్దని పిటిషన్‌దారులు కూడా అడగొచ్చు’’అని ఉత్తర చెప్పారు.

‘‘ఇలాంటి సదుపాయాలు, రక్షణ చర్యలు మన భారతీయ న్యాయ వ్యవస్థలో ముందు నుంచీ ఉన్నాయి’’అని ఉత్తర వివరించారు.

‘‘అయితే, లైవ్ స్ట్రీమింగ్ అనేది ఇప్పుడు కొన్ని కోర్టులకే పరిమితం అయ్యింది. అందుకే జర్నలిస్టులు, కోర్టులు ఇచ్చే అప్‌డేట్‌లు కొంతవరకు దీనికి ప్రత్యామ్నాయంగా చూడొచ్చు’’అని సెబాస్టియన్ చెప్పారు.

ప్రతి ఒక్కరికీ న్యాయ వ్యవస్థను చేరువచేయడం అనేది చాలా సంక్లిష్ట ప్రక్రియని సెబాస్టియన్ అన్నారు.

దీని కోసం మీడియా, విధానకర్తలు, చట్టసభ సభ్యులు, ప్రభుత్వం ఇలా అందరూ తమ వంతు కృషి చేయాలని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)