Virtual World - Digital Avatar: అచ్చం మీలాగే ఉండే, మీలాగే ఆలోచించే డిజిటల్ ట్విన్‌ రూపొందిస్తే.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?

డిజిటల్ ట్విన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేన్ వేక్‌ఫీల్డ్
    • హోదా, బీబీసీ న్యూస్

అచ్చం మీలాగే ఉండే ఒక వ్యక్తిని రోడ్డుపై చూశామని మనలో చాలా మంది స్నేహితులు చెబుతుంటారు.

అయితే, ఎప్పుడైనా అచ్చం మీలా కనిపించే డిజిటల్ ట్విన్‌ను సృష్టిస్తే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? డిజిటల్ ప్రపంచంలో మీలా ఉండే ఒక వ్యక్తి తిరుగుతుంటే ఎలా ఉంటుంది?

మన ప్రపంచంలో ఉండే ప్రతిదాన్నీ డిజిటల్ ప్రపంచంలో సృష్టించే యుగంలోకి మనం అడుగుపెట్టాం. నగరాలు, కార్లు, మన ఇళ్లతోపాటు మనల్ని కూడా డిజిటల్ ప్రపంచంలో సృష్టిస్తున్నారు.

మెటావర్స్‌ లాంటి డిజిటల్ ప్రపంచాల్లో మనల్ని పోలిన డిజిటల్ వ్యక్తుల్ని సృష్టించడంపై చర్చలతో కొత్త టెక్ ట్రెండ్ నడుస్తోంది.

వాస్తవ ప్రపంచంలో ఉండే వ్యక్తులకు ప్రత్యేక సేవలు అందించేందుకు లేదా పరికరాలను మెరుగు పరిచేందుకు ఈ డిజిటల్ ట్విన్‌లు ఉపయోగపడతాయి.

మొదట్లో ఈ ట్విన్‌లు 3డీ కంప్యూటర్ మోడల్స్‌కు మాత్రమే పరిమితమై ఉండేవి. అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు ఇంటర్నెట్‌ ఆఫ్ థింగ్స్ తోడు కావడంతో నిరంతరం కొత్త అంశాలు నేర్చుకుంటూ మెరుగయ్యే డిజిటల్ ట్విన్‌లకు మార్గం సుగమమైంది.

రాబ్ ఎండెర్లీ

ఫొటో సోర్స్, Intel Free Press

ఫొటో క్యాప్షన్, రాబ్ ఎండెర్లీ

మరో పదేళ్లలో..

ఈ దశాబ్దం చివరినాటికి మనుషుల డిజిటల్ ట్విన్‌ల తొలి వెర్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని టెక్నాలజీ విశ్లేషకుడు రాబ్ ఎండెర్లీ చెప్పారు.

''దీని కోసం చాలా మేధస్సు పెట్టాల్సి ఉంటుంది. నైతిక అంశాలనూ పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటి డిజిటల్ ట్విన్‌లతో ఉద్యోగాలిచ్చే సంస్థలకు చాలా ఉపయోగం ఉంటుంది''అని ఆయన అన్నారు.

''మీ కంపెనీ మీలాంటి డిజిటల్ ట్విన్ తయారుచేస్తే ఏమవుతుంది? దానికి జీతం ఇవ్వాల్సిన పనిలేదు. అప్పుడు మీతో ఆ ఉద్యోగం చేయించాల్సిన అవసరం ఉంటుందా?''అని ఆయన ప్రశ్నించారు.

ఈ డిజిటల్ ట్విన్స్ ఎవరి ఆధీనంలో ఉంటాయనే ప్రశ్న మెటావర్స్ వరల్డ్‌లో కీలకంగా మారనుందని ఆయన చెప్పారు.

వ్యక్తులను పోలిన డిజిటల్ వ్యక్తులను సృష్టించే సాంకేతికతపై ఇప్పటికే పనులు మొదలయ్యాయి. అయితే, ఇవి ఇప్పుడు మరీ ప్రాథమిక దశలో లేవు మరోవైపు పూర్తిగానూ సిద్ధమయ్యాయని కూడా చెప్పలేం.

ఫేస్‌బుక్‌(మెటా)కు చెందిన వర్చువల్ రియాలిటీ ప్లాట్‌ఫామ్ హొరైజాన్ వరల్డ్స్‌లో మన ముఖాన్ని పోలిన వ్యక్తులను మనం సృష్టించుకోవచ్చు. అయితే, దీనికి మన కాళ్లు సృష్టించడం కుదరదు. ఎందుకంటే ఇంకా ఇది ప్రాథమిక దశలో ఉంది.

''డిజిటల్ ట్విన్‌లను సృష్టించడంపై చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే మనకు ఇలాంటివి సైన్స్ ఫిక్షన్ నవలలోనే కనిపించేవి. అయితే, అవి ఇప్పుడు నిజం అవుతున్నాయి''అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని సీనియర్ రీసెర్చర్, ప్రొఫెసర్ శాండ్రా వాచెర్ చెప్పారు.

అయితే, ఈ టెక్నాలజీ చాలా సంక్లిష్టమైన అంశాలతో ముడిపడి ఉందని ఆమె అన్నారు. ''అందుకే దీన్ని అర్థం చేసుకోవడానికి, పూర్తిగా మన లాంటి ట్విన్‌లను సృష్టించడానికి మరికొంత సమయం పట్టొచ్చు''అని ఆమె వివరించారు.

''ముఖ్యంగా మన స్నేహితులు, కుటుంబం, సామాజిక పరిస్థితులు, చుట్టూ ఉండే వాతావరణం తదితర అంశాలపై మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ప్రవర్తిస్తామో ముందుగానే అంచనా వేయడం ఏఐకు సాధ్యంకాదు. కాబట్టి ఇలాంటి సంక్లిష్టతలను మనం అర్థం చేసుకోవాలి. మన జీవితం మొదటి నుంచి చివరి వరకూ సమగ్రంగా ఉండేలా ఒక మోడల్‌ను సృష్టించడం అంత తేలిక కాదు''అని ఆమె అన్నారు.

శాండ్రా వాచెర్

ఫొటో సోర్స్, Sandra Wachter

ఫొటో క్యాప్షన్, శాండ్రా వాచెర్

డిజిటల్ నగరాలు

ప్రోడక్ట్స్ డిజైన్, డిస్ట్రిబ్యూషన్, అర్బన్ ప్లానింగ్‌లలో డిజిటల్ ట్విన్లు చక్కగా ఉపయోగపడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

ఫార్ములా వన్ రేసింగ్‌లో మెక్‌లారెన్, రెడ్ బుల్ టీమ్‌లు ఇప్పటికే డిజిటల్ ట్విన్‌లను ప్రవేశపెట్టాయి.

మరోవైపు డెలివరీ ఏజెంట్ డీహెచ్‌ఎల్ కూడా తమ వేర్‌హౌస్‌లు, సప్లై చెయిన్‌ల డిజిటల్ వెర్షన్‌లను రూపొందిస్తోంది.

మన నగరాలను పోలిన డిజిటల్ నగరాలు కూడా తయారవుతున్నాయి. షాంఘై, సింగపూర్‌లకు ఇప్పటికే డిజిటల్ ట్విన్‌లు ఉన్నాయి. ముఖ్యంగా డిజైన్, బిల్డింగ్స్ ఆపరేషన్స్, ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ తదితర అంశాల్లో మెరుగైన వ్యూహాలకు వీటిని ఉపయోగిస్తున్నారు.

షాంఘై

ఫొటో సోర్స్, Getty Images

సింగపూర్‌లో అయితే, రద్దీగా ఉండే వీధుల్లోకి మరింత మంది వెళ్లకుండా లేదా కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ డిజిటల్ ట్విన్ సేవలను ఉపయోగిస్తున్నారు. మరోవైపు భూగర్భ మార్గాల్లో మౌలిక సదుపాయాల కల్పనకూ ఇది ఉపయోగపడుతుంది. పశ్చిమాసియాలోని కొన్ని నగరాలనూ ఇలా డిజిటల్ రూపంలో సృష్టించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి.

తాము కొత్తగా అభివృద్ధి చేసిన డిజిటల్ ట్విన్ టెక్నాలజీపై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ డసో సిస్టమ్స్ తెలిపింది.

ప్రస్తుతం తమ టెక్నాలజీతో మెరుగైన ఫలితాలను ఇచ్చే షాంపూలు తయారుచేసేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు. దీని వల్ల షాంపూ వృథా కావడం తగ్గుతోందని సంస్థ చెబుతోంది.

ఫార్ములా 1

ఫొటో సోర్స్, Getty Images

కొత్తకొత్త రంగాల్లో

మోటార్‌బైక్స్, ఫ్లైయింగ్ కార్స్ ఇలా చాలా రంగాల్లో డిజిటల్ ట్విన్ టెక్నాలజీని ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే, ఆరోగ్య రంగంలో ఈ పరిజ్ఞానం మరింత ఎక్కువగా ఉపయోగపడే అవకాశముంది.

మనిషి గుండెను పోలిన ఒక ప్రోటోటైప్‌ను తయారుచేశామని డసో వెల్లడించింది. గుండె శస్త్రచికిత్సల్లో వైద్యులకు ఇది చాలా ఉపయోగపడే అవకాశముంది.

డిజిటల్ ఎర్త్

ఫొటో సోర్స్, Nvidia

ఈ ప్రాజెక్టుకు డాక్టర్ స్టీవ్ లెనిన్ నిధులు సమకూర్చారు. ఆయన తనలాంటి డిజిటల్ ట్విన్‌ను కూడా తయారుచేయాలని భావిస్తున్నారు. ఆయన కుమార్తెకు పుట్టుకతోనే ఒక గుండె సమస్య ఉంది. ప్రస్తుతం 20ల వయసులోనున్న ఆమె గుండె ఏ సమయంలోనైనా ఆగిపోయే ముప్పుంది. దీంతో శస్త్రచికిత్స నిర్వహించడం అనివార్యంగా మారింది. ఈ శస్త్రచికిత్సలో ఉపయోగపడేలా గుండె ప్రోటోటైప్‌ను ఆయన అభివృద్ధి చేయించారు.

బోస్టన్ పిల్లల ఆసుపత్రి ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తోంది. మరోవైపు లండన్‌లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్‌ కూడా కొన్ని వైద్య పరికరాలను దీనిపై పరీక్షిస్తోంది.

వీడియో క్యాప్షన్, ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోమైన్‌.. ఇక్కడ ప్రతీ క్షణం డబ్బులు పండిస్తారు

జంతువులపై పరీక్షల అవసరం ఉండదు..

''డిజిటల్ హార్ట్‌ను తయారుచేయడం వల్ల కొత్త ఔషధాలు, వైద్య పరికరాలను జంతువులపై ప్రయోగించాల్సిన అవసరం తప్పుతుంది. సైంటిఫిక్ రీసెర్చ్‌లో జంతువులపై ఇలా పరీక్షలు చేయడంపై మొదట్నుంచీ చాలా వివాదాలు ఉన్నాయి''అని డసో సిస్టమ్స్‌లోని గ్లోబల్ అఫైర్స్ డైరెక్టర్ సెవెరీన్ ట్రౌలిట్ అన్నారు.

కళ్లు, మెదడు లాంటి మరిన్ని డిజిటల్ అవయవాలను సృష్టించడంపై సంస్థ దృష్టిపెట్టింది.

''ఏదో ఒక సమయంలో మనల్ని పోలిన పూర్తి డిజిటల్ ట్విన్ తయారు అయిపోతుంది. అప్పుడు వ్యాధులు రాకముందే మనం వాటిని పసిగట్టొచ్చు. చికిత్సలు కూడా మనకు తగినట్లుగా అభివృద్ధి చేయొచ్చు''అని ఆమె అన్నారు.

అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థ ''వీడియా'' కూడా ఓమ్నీవెర్స్ అనే టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇది డిజిటల్ ప్రపంచాలను, డిజిటల్ ట్విన్‌లను సృష్టించడానికి ఉపయోగపడుతుంది.

దీని సాయంతో భూమిలాంటి డిజిటల్ ప్రపంచాన్ని అభివృద్ధి చేయాలని సంస్థ భావిస్తోంది.

ఈ ఏడాది మార్చిలో యూరోపియన్ కమిషన్‌తో కలిసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.. భూమి లాంటి డిజిటల్ ట్విన్ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

2024 చివరినాటికి ఉపగ్రహాల డేటా సాయంతో ఈ డిజిటల్ భూమి శాస్త్రవేత్తల చేతికి వచ్చే అవకాశముంది. దీని సాయంతో వరదలు, కరవు, హీట్‌వేవ్స్, సునామీలను మెరుగ్గా ఎదుర్కొనే వ్యూహాలు తయారుచేయొచ్చు.

వీడియో క్యాప్షన్, మిగిలిపోయే ఆహారాన్ని 24 గంటల్లో ఎరువుగా మార్చే మెషీన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)