ఆరెంజ్ జ్యూస్ తాగితే అసిడోసిస్ తగ్గుతుందా... ఈ పాపులర్ పండ్ల రసం కథేమిటో తెలుసా?

ఫొటో సోర్స్, Proformabooks/Getty images
- రచయిత, వెరోనిక్ గ్రీన్‌వుడ్
- హోదా, బీబీసీ న్యూస్
పొద్దున్నే అల్పాహారంతో పాటు ఆరెంజ్ జ్యూస్ తాగడం ఎవరికి ఇష్టం ఉండదు! అల్పాహారంలో పండ్ల రసం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని కూడా భావిస్తాం. పశ్చిమ దేశాల్లో అయితే బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ మీద ఆరెంజ్ జ్యూస్ కచ్చితంగా ఉంటుంది.
దాదాపు ఒక శతాబ్దం కిందట నారింజ పండ్ల అధిక ఉత్పత్తి మనకు తెలిసిన, మనకు ఇష్టమైన ఈ అలవాటుకు దారితీసింది. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు కాఫీ, టీలే కాకుండా ఆరెంజ్ జ్యూస్ కూడా స్థానం దక్కించుకుంది. పైగా, ఆరోగ్యానికి మంచిది, విటమిన్ సి పుష్కరలంగా ఉంటుంది అనే నమ్మకాన్ని కూడా కలిగించింది.
ఒకప్పుడు నారింజ లేదా బత్తాయి పండ్లు తెచ్చి రసం పిండుకునేవారు. కానీ, ఇప్పుడు మార్కెట్‌లో చాలా రకాలు వచ్చేశాయి. డబ్బాల్లో, సీసాల్లో ఆరెంజ్ జ్యూస్ విరివిగా దొరుకుతోంది.
ఇదంతా 20వ శతాబ్దపు వ్యాపారవేత్తల సృష్టి అని చెప్పుకోవచ్చు. అధిక స్థాయిలో ఉత్పత్తి అయిన బత్తాయిలను పారేయలేక, వాటి రసం పిండి అమ్మడం మొదలుపెట్టారు.
1900ల ప్రారంభంలో ఫ్లోరిడా, కాలిఫోర్నియా బత్తాయి పండ్లు అమెరికాలోని దుకాణదారులను విపరీతంగా ఆకర్షించాయి. ఈ పండ్లను విరివిగా అమ్మేవారు. తాజా పండ్లు తినడం లేదా రసం పిండుకుని తాగడం అందరికీ అలవాటైంది.
కాలిఫోర్నియాలో నావెల్ ఆరెంజ్, వాలెన్సియా ఆరెంజ్ అని రెండు రకాలు దొరికేవి. వాలెన్సియా పండ్ల నుంచి రసం బాగా వచ్చేది.
ఫ్లోరిడాలో నాలుగు రకాలు పండేవి. ఇవన్నీ కూడా మంచి రసాల పండ్లే. వీటిని విరివిగా పండించడంతో వ్యాపారులకు పెద్ద సమస్య వచ్చి పడింది. టన్నుల కొద్దీ బత్తాయిలను పారేయలేక అవస్థపడ్డారు.

ఫొటో సోర్స్, Proformabooks/Getty images
జ్యూస్‌గా అమ్మాలనే ఆలోచనకు పునాది
1909లో వ్యాపారులంతా కలిసి ఒక నిర్ణయానికొచ్చారు. బత్తాయి పండ్ల పంటను తగ్గించడం కన్నా, వాటి రసం పిండి మార్కెట్లో అమ్మడం ఉత్తమమని భావించారు.
మొదట్లో జ్యూస్‌ను చిన్న చిన్న క్యానుల్లో అమ్మేవారు. దీని రుచి తాజా పండ్ల రసానికి చాలా దగ్గరగా ఉండడంతో కొనుగోలుదారులు ఎగబడ్డారు.
1910, 1920ల మధ్యలోనే విటమిన్ల ఆవిష్కరణ కూడా జరిగింది. దాంతో, వ్యాపారవేత్తలు ఆరెంజ్ జ్యూస్‌ను భారీగా ప్రచారం చేశారు. బత్తాయి పండ్లలో విటమిన్-సి లభ్యమవుతుందన్నది కొనుగోలుదారులను ఆకర్షించింది.
అదే సమయంలో, పోషకాహార నిపుణుడు ఎల్మర్ మెక్‌కలమ్ ఓ కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఆమ్లాలు అధికంగా ఉత్పత్తి చేసే బ్రెడ్, పాల వంటి ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వలన అసిడోసిస్ అనే అవస్థ కలుగుతుందని, దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని కనిపెట్టారు.
ఈ కొత్త భయాన్ని ఆసరాగా చేసుకుని సిట్రస్ ఇండస్ట్రీ విజృంభించింది.
అయితే, ఆకుకూరలు, సిట్రస్ ఫ్రూట్స్ తినడం ద్వారా అసిడోసిస్‌ను నియంత్రించలేమని కూడా మెక్‌కలమ్ వివరించారు. కానీ, మార్కెట్‌పై అది ఏ మాత్రం ప్రభావం చూపలేదు.
సంకిస్ట్ సంస్థ బత్తాయి పండ్ల రసం తాగడం వల్ల లాభాలు, విటమిన్-సి ఉపయోగాల గురించి విపరీతంగా ప్రచారం చేసిందని అడీ బ్రౌన్ అట్లాంటిక్ మ్యాగజీన్‌కు రాసిన ఓ కథనంలో ఉదహరించారు.
"నివారణ చాలా సులభం.. ఏ రూపంలోనైనే బత్తాయి పండ్లను తీసుకోండి. బత్తాయిలు ఎన్ని తిన్నా విసుగు పుట్టదని సంకిస్ట్ కొనుగోలుదారులను నమ్మించింది" అని బ్రౌన్ రాశారు.
అయితే, డాక్టర్లు బత్తాయిలు తింటే అసిడోసిస్ తగ్గదని నొక్కిచెప్పడంతో మళ్లీ విటమిన్ల వైపు దృష్టి మళ్లించారు. కానీ, ఆరెంజ్ జ్యూస్ అమ్మకాలపై ఆసక్తి మాత్రం తగ్గలేదు. అప్పటికి జ్యూస్‌ను ఇంకా క్యాన్లలోనే అమ్ముతున్నారు.
కొత్త ప్రయోగాలు
కానీ, ప్రభుత్వం... ముఖ్యంగా ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ సిట్రస్ కొత్త ప్రయోగాలలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది.
రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా సైనికులు మోసుకెళ్లడానికి సులువుగా ఉండే సిట్రస్ ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ కొత్త ప్రయోగాలకు దారితీసింది. పాల లాగ ఆరెంజ్ జ్యూస్‌ను కూడా గడ్డ రూపంలో (కండెన్స్) తీసుకురావాలనే ప్రయోగాలు విఫలమయ్యాయి.
"అధిక ఉష్ణోగ్రతలు దాన్ని విషంగా మార్చాయి. ఆ మిశ్రమం గోధుమరంగులోకి మారిపోయి, రుచి కోల్పోయింది" అని చరిత్రకారుడు హామిల్టన్ పేర్కొన్నారు.
దీనిపై మరిన్ని ప్రయోగాలు జరిగాయి. కానీ, ఏవీ సంతృప్తికరమైన ఫలితాలు ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, Proformabooks/Getty images
అయితే, బత్తాయి రసాన్ని గడ్డకట్టించి, తరువాత శీతలపానీయంలా తయారుచేసే పద్ధతి కొంతవరకు ఫలించింది.
ఆరెంజ్ జ్యూస్‌ను శీతలపానీయం లాగ భద్రపరచి కావలసినప్పుడు వినియోగించుకునే వెసులుబాటు ఫ్లోరిడాలో బత్తాయి పండ్ల ఉత్పత్తిని మరింత పెంచింది.
1940ల నాటికి బత్తాయి మొక్కలు మరిన్ని నాటడం ప్రారంభించారు. ఇక వాటికి డిమాండ్ పెంచడమే మిగిలింది.
తాజా పండ్ల రసం కన్నా ఈ జ్యూస్ వ్యత్యాసంగా ఉందన్న సంగతిని వినియోగదారులు పెద్దగా పట్టించుకోలేదు. బత్తాయిలు విరివిగా పండే ప్రాంతంలో కూడా తాజా పండ్ల రసం దొరకని పరిస్థితికి క్యాన్ ఆరెంజ్ జ్యూస్ ప్రాచుర్యం పొందింది.
రచయిత జాన్ మెక్‌ఫీ 50 ఏళ్ల క్రితం ఫ్లోరిడా వెళ్లినప్పుడు, అక్కడ తాజా పండ్ల రసం విరివిగా దొరకట్లేదని గమనించారు. తాజా పండ్ల రసం ఒక్కోసారి కొంచం పుల్లగా, మరీ నీళ్లలా ఉండవచ్చు. కానీ, ప్యాకేజీలో వచ్చే జ్యూస్ రుచి ఎప్పుడూ మారదు. జ్యూస్ ప్యాకెట్ల డిమాండ్ పెరగడానికి ఇదీ ఓ కారణం కావచ్చని జాన్ మెక్‌ఫీ తన పుస్తకం ఆరెంజెస్‌లో తన అనుభవాలను వివరించారు.
ప్యాకెట్లలో వచ్చే జ్యూసులకు కొత్త ఫ్లేవర్లు జతచేయడం మొదలుపెట్టిన తరువాత వాడి వాడకం మరింత పెరిగిపోయింది. ఆయిల్స్, కొన్ని రకాల ఎసెన్సులు వాడడం వల్ల పాత జ్యూస్ కూడా తాజాగా అనిపిస్తుంది.
అయితే, ఈ అంశంలో వివాదాలు కూడా లేకపోలేదు. వివిధ రకాల పదార్థాలు కలపడం వల్ల ప్యాకెట్లలో వచ్చే జ్యూస్ "సహజమైందా" అంటూ కేసు వేసిన సందర్భాలు ఉన్నాయి.
అప్పటికే, ఆరెంజ్ జ్యూస్ బ్రేక్‌ఫాస్ట్ టేబుల్‌పై ముఖ్యమైన పదార్థంగా మారిపోయింది. కాబట్టి ఈ కేసులు ఎలాంటి ప్రభావం చూపలేదు.
అలాగే, 20వ శతాబ్దంలో జీవనశైలిలో వచ్చిన మార్పులు, రెడీమేడ్ పదార్థాలకు పెరిగిన డిమాండ్ వల్ల కూడా ప్యాకేజ్డ్ జ్యూస్‌ల వినియోగం పెంచింది.
కొన్ని దశాబ్దాల కాలంలో డబ్బాలలో వచ్చే ఆరెంజ్ జ్యూస్ ఇంటింటా తిష్ట వేసుకు కూర్చుంది.
"అమెరికాలో 5 శాతం మాత్రమే తాజా బత్తాయి పండ్లను వినియోగిస్తారని 21 శాతం ఆరెంజ్ జ్యూసే తాగుతారు" అని 2003లో వచ్చిన ఒక రిపోర్ట్ (USDA) వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఉడుత ఎక్కితే హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడతాయా? ఐదుగురు సజీవ దహనం వెనుక అసలు కారణాలేంటి?
- ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ల పేర్లు ఎందుకు మార్చారు? హైదరాబాద్ నిజాంకు ఈ పేర్లతో సంబంధం ఏమిటి?
- డేటా సేకరణలో భారత్ చరిత్ర ఏంటి... ఇప్పుడు గణాంకాల వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉందా?
- క్రిప్టో కరెన్సీ పేరుతో రూ. 31,000 కోట్లు మోసం చేసిన అమెరికాస్ మోస్ట్ వాంటెడ్ మహిళ
- ఉన్నత చదువులకు ప్రపంచంలోని టాప్-10 'స్టూడెంట్స్ ఫ్రెండ్లీ' నగరాలివే...
- పులి, ఎలుగుబంట్లు, ఏనుగులు... ఊళ్ళ మీద ఎందుకు పడతాయి... అవి ఎదురైతే ఏం చేయాలి?
- పక్కా కమర్షియల్ సినిమా రివ్యూ: హంగులు ఎక్కువ... విషయం తక్కువ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














