Diet and Health: ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా?

ప్రోటీన్ సప్లిమెంట్లు

ఫొటో సోర్స్, Getty Images

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు, బరువును నియంత్రించేందుకు చాలా మంది ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకుంటారు.

ముఖ్యంగా జిమ్‌కు వెళ్లేవారు, స్పోర్ట్స్ ఆడేవారి డైట్‌లో ఈ ప్రోటీన్ పౌడర్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే, ఈ పౌడర్‌ ఒక్కదాన్నే తీసుకోవచ్చా? దీన్ని ఎక్కువగా తీసుకుంటే ఏం అవుతుంది? లాంటి ప్రశ్నలపై డైటీషియన్ రమ్య రామచంద్రన్ బీబీసీతో మాట్లాడారు.

ప్రోటీన్ సప్లిమెంట్లు

ఫొటో సోర్స్, Getty Images

శరీరానికి ప్రోటీన్ ఎందుకు అవసరం?

మన శరీర నిర్మాణంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. శరీర ఎదుగుదల, కణజాల మనుగడకు ఇది చాలా అవసరం. ఎర్రరక్త కణాల్లో ఒక రకమైన ప్రోటీన్ ఉంటుంది. శరీరం మొత్తానికి ఇదే ఆక్సిజన్ సరఫరా చేస్తుంది.

మనం తీసుకునే సగం ప్రోటీన్ ఎంజైమ్‌ల ఉత్పత్తికి అవసరం. ఆహారం జీర్ణం కావడంలో ఈ ఎంజైమ్‌లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మరోవైపు శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి కూడా ప్రోటీన్ అవసరం.

హార్మోన్లు సాఫీగా పనిచేయడం, ఆకలిని నియంత్రించడం, బరువును నియంత్రించడం, గాయాలను త్వరగా మాన్పించడం తదితర విధులలో ప్రోటీన్లు అవసరం ఉంటుంది. మరోవైపు స్పోర్ట్స్‌లో గాయాలైనప్పుడు, దెబ్బతిన్న కణజాలాన్ని సాధారణ స్థితికి తీసుకురావడంలో ప్రోటీన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ప్రోటీన్ సప్లిమెంట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఎక్కడి నుంచి వస్తాయి?

శాకాహారులు.. కొమ్ము సెనలు, బఠానీలు, సోయా బీన్స్, బాదం, గోధుమలు, నువ్వులు, గుమ్మిడి గింజలు, అవిసె గింజలు ఆహారంలో భాగంగా తీసుకుంటే ప్రోటీన్ అందుతుంది. డెయిరీ ఉత్పత్తుల నుంచి కూడా ప్రోటీన్ వస్తుంది.

మంసాహారులైతే గుడ్లు, చేపలు, మాంసం తీసుకోవచ్చు. వీటిలో ప్రోటీన్ స్థాయిలు చాలా ఎక్కువ ఉంటాయి.

ప్రోటీన్ సప్లిమెంట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఎంత ప్రోటీన్ అవసరం?

ప్రోటీన్ అందరికీ అవసరం. దీనిలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే, ఒక్కొక్కరికి ఒక్కోలా ప్రోటీన్ అవసరం అవుతుంది.

వయసు, శరీర బరువు ఆధారంగా ఎవరికి ఎంత ప్రోటీన్ అవసరమో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక నివేదిక విడుదల చిసంది.

ఉదాహరణకు 65 కేజీల బరువుండే వ్యక్తి రోజుకు 54 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. 55 కేజీల బరువుండే వ్యక్తి 46 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి.

గర్భంతో ఉండే మహిళలు నాలుగో నెల తర్వాత 46 గ్రాములకు అదనంగా మరో తొమ్మిది గ్రాముల ప్రోటీన్‌ను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. చివరి మూడు నెలలు 22 గ్రాముల ప్రోటీన్‌ను అదనంగా తీసుకోవాలి.

ఆరు నెలల వరకు వయసున్న చిన్నారులకు రోజుకు 8 నుంచి 8.5 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఆరు నుంచి 12 నెలల చిన్నారులకు పది గ్రాముల ప్రోటీన్ ఇవ్వాలి.

ప్రోటీన్ సప్లిమెంట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఎవరికి ఎక్కువ ప్రోటీన్ అవసరం?

శ్రమతో కూడుకున్న వ్యాయామం చేసేవారికి ప్రోటీన్ ఎక్కువగా అవసరం అవుతుంది. డెయిరీ ఉత్పత్తులు తీసుకోని శాకాహారులు కూడా ప్రోటీన్ అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది.

క్యాన్సర్ రోగులు, పోషకాహార లోప బాధితులు, కాలిన గాయాలైన వారు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి.

హైపోథైరాయిడిజంతో బాధపడేవారు కూడా శరీర బరువు తగిన విధంగా ఉండేలా చూసుకునేందుకు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ హలీం ఎందుకు ఇంత ఫేమస్

ఎవరు ఎక్కువ తీసుకోకూడదు?

కిడ్నీ వ్యాధులు ఉండేవారు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోకూడదు. ప్రోటీన్ వారి అనారోగ్య సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. ఎదుకంటే కిడ్నీలు ప్రోటీన్‌ను శరీరం నుంచి బయటకు పంపించలేవు.

మరోవైపు మెటబాలిక్ రుగ్మతలుండే పిల్లలు కూడా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు.

వీడియో క్యాప్షన్, హైటెక్ టొమాటోలు.. ఎలా పండిస్తున్నారో చూడండి

ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకోవచ్చా?

ప్రోటీన్ సప్లిమెంట్లను ఎక్కువ మొత్తంలో రోజూ తీసుకుంటే కాలేయం దెబ్బతినే ముప్పుంటుంది. అందుకే ఆహారంలో భాగంగా ప్రోటీన్‌ను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

కొంత మందిలో కిడ్నీల్లో రాళ్లు పేరుకోవడం, కాల్షియం నిల్వలు పెరగడం, రక్తం సమతౌల్యం దెబ్బతినడం లాంటి అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టే ముప్పు ఉంటుంది.

వైద్యులను సంప్రదించకుండా ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకుంటే ఈ దుష్ప్రభావాలు చుట్టుముట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)