జగ్గీ వాసుదేవ్: ‘ధ్వంసమైన ఆలయాలన్నీ పునర్నిర్మించలేం, అలా చేయాలంటే దేశమంతా తవ్వుకుంటూ రావాలి’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
గతంలో ధ్వంసమైన దేవాలయాలన్నింటినీ పునర్నిర్మించడం సాధ్యమయ్యే పనికాదని ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ వ్యాఖ్యానించారు.
జగ్గీ వాసుదేవ్ బీబీసీతో మాట్లాడారు. ‘‘భారత దేశంలో దాదాపు ప్రతి రోడ్డులోనూ దేవాలయాలు కనిపిస్తుంటాయి. దాడుల్లో ఇవి దెబ్బతిన్నాయా? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. అవును వాటిని ధ్వంసం చేశారనే సమాధానం చెబుతాను. ఇప్పుడు అన్నింటినీ మళ్లీ పునర్నిర్మించాలా? ఇది అసలు సాధ్యంకాదు. ఎందుకంటే దీని కోసం దేశం మొత్తం తవ్వుకుంటూ రావాలి. ఇది సాధ్యమయ్యే పనికాదు’’అని సద్గురు అన్నారు.
‘‘వివాదాలు ముసురుకొన్న కొన్ని ప్రముఖ ప్రాంతాల విషయంలో ప్రజలు కూర్చొని మాట్లాడుకొని, సమస్యను పరిష్కరించుకోవాలి’’అని ఆయన సూచించారు.
‘‘ఆ ఆలయాలు దెబ్బతినప్పటి పరిస్థితులను కొన్ని కుటుంబాలు తమ కళ్లతో చూశాయి. ఇప్పటికీ నాటి పరిస్థితుల గురించి వారి వారసులు కథలుగా చెప్పుకుంటారు. ఇప్పుడు దిల్లీలోని ఔరంగజేబు పేరుతో రోడ్డును చూసినప్పుడు వారి మనసు గాయపడుతుంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఇజ్రాయెల్‌లో అడాల్ఫ్ హిట్లర్ పేరుతో ఒక రోడ్డును చూసినట్లే ఉంటుంది. ఇప్పుడు చరిత్రను తిరిగరాద్దామా? హిట్లర్‌ను మరచిపోదామా’’అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘హిట్లర్‌ను మనం మరచిపోలేం. ఎందుకంటే ఆయన మన బుర్రలో ఉన్నాడు. అలానే ఔరంగజేబు ఏం చేశారో మన చరిత్ర పుస్తకాల్లో చూడొచ్చు. దిల్లీలో ఔరంగజేబుకు నివాళులు అర్పించాల్సిన పనిలేదు. ఎందుకంటే దీని వల్ల చాలా మంది ప్రజల మనసు గాయపడుతుంది. ముందు ఇలాంటి సమస్యలను పరిష్కరించాలి. మిగతా విషయాలకు వస్తే.. ధ్వంసమైన దేవాలయాలు వేల సంఖ్యలో ఉంటాయి. అన్నింటినీ మనం పునర్నిర్మించగలమా? అసలు ఇలా పునర్నిర్మించడం అవసరమా? లేదు. అవసరం లేదు. గతంలో కొన్ని చెడు ఘటనలు జరిగాయి. వాటిని మరచిపోయి జీవితంలో ముందుకు వెళ్లాలి’’అని జగ్గీ వాసుదేవ్ అన్నారు.
ఈ వ్యాఖ్యలకు ప్రజలు ఎలా స్పందిస్తారని మీరు అనుకుంటున్నారని ప్రశ్నించినప్పుడు.. ‘‘ఎప్పటిలానే కొంత మంది తిడతారు’’అని ఆయన వివరించారు.
రెండు వైపులా నుంచీ ఇలానే స్పందిస్తారా?
ఈ ప్రశ్నకు జగ్గీ వాసుదేవ్ స్పందిస్తూ.. ‘‘చాలా మంది హిందువులు నన్ను తిడుతున్నారు. నేను పూర్తి హిందువును కాదని వారు చెబుతున్నారు. అయితే, నేను భారత్ భవిష్యత్ గురించి మాట్లాడుతున్నానని వారు అర్థం చేసుకోవాలి’’అని జగ్గీ వాసుదేవ్ అన్నారు.
‘‘ఇక్కడ మనం ప్రాక్టికల్‌గా చూడాలి. ప్రాక్టికల్‌గా ఆలోచించకపోతే ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. అప్పుడు బలప్రయోగంతో క్రూరంగా ముందుకు వెళ్లేవారు పైచేయి సాధిస్తారు. ఏ సమాజంలోనైనా అదే జరుగుతుంది’’అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మట్టిని కాపాడేందుకు..
పడిపోతున్న మట్టి నాణ్యతపై ప్రపంచానికి అవగాహన కల్పించేందుకు సద్గురు 100 రోజుల మోటర్‌బైక్ ర్యాలీ చేపడుతున్నారు. మార్చిలో లండన్‌లో ఈ యాత్రను మొదలుపెట్టారు. దీనికి ‘‘సేవ్ సాయిల్’’గా నామకరణం చేశారు.
ఈ యాత్రలో భాగంగా యూరప్, పశ్చిమాసియాలలో చాలా దేశాల మీదుగా ప్రయాణించిన జగ్గీ వాసుదేవ్ భారత్ చేరుకున్నారు.
‘‘మట్టిలో జీవం ఉంటుంది. మానవుల మనుగడకు ఈ మట్టి ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. మట్టిలోని ఖనిజాలు తగ్గిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ ఖనిజలవణాలు తగ్గిపోతే పంట దిగుబడి తగ్గుతుంది. ఫలితంగా పెరుగుతున్న జనాభాకు అసవరమైన ఆహారం పండించడంలో సమస్యలు వస్తాయి’’అని సేవ్ సాయిల్ క్యాంపెయిన్ ప్రచారకర్తలు చెబుతున్నారు.
మానవ చర్యల వల్ల మట్టి నాణ్యత దెబ్బ తింటోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా మట్టి నాణ్యత పడిపోతే ఆహార గొలుసు దెబ్బతినే ముప్పుంది.
సారవంతమైన నేలల శాతం భారీగా తగ్గిపోతోందని ‘‘సేవ్ సాయిల్’’ ప్రచారకర్తలు వివరిస్తున్నారు. మట్టిలో 3 నుంచి 6 శాతం వరకు సేంద్రియ పదార్థాలు ఉండాలని, కానీ, ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు ఇలా లేవని వారు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మసీదు ఒకప్పుడు దేవాలయం వివాదంపై..
ప్రతీ మసీదులోనూ శివ లింగాన్ని ఎందుకు చూడాలి? అని ఇటీవల ఆరెస్సెస్ అధిపతి మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. దీనిపై జగ్గీ వాసుదేవ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతిచోటా శివ లింగాన్ని వెతక్కూడదు. ఎందుకంటే భారత్‌లో ప్రతి వీధిలో, ప్రతి ఇంటిలో మనకు శివ లింగం కనిపిస్తుంది’’అని ఆయన అన్నారు.
‘‘అలా వెతుక్కుంటూ వెళ్తే మనకు చాలా కనిపిస్తాయి. అన్నింటినీ మనం పునర్నిర్మించలేం. ఎందుకంటే వెయ్యేళ్లనాటి చరిత్రను మళ్లీ మనం పునర్నిర్మించాల్సి ఉంటుంది. అది సాధ్యంకాదు కూడా’’అని ఆయన చెప్పారు.
మత స్వేచ్ఛపై అమెరికా విదేశాంగ శాఖ విడుదలచేసిన నివేదికలో భారత్‌ను విమర్శించడాన్ని జగ్గీ వాసుదేవ్ తప్పుపట్టారు.
‘‘నాకు తెలిసి అమెరికా ప్రభుత్వం ముందువెనుక ఆలోచించకుండా విమర్శలు చేసింది. భారత్‌లాంటి దేశాల్లో పరిస్థితులు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఇక్కడ భిన్నమతాల వారు వంద ఏళ్ల నుంచి కలిసి జీవిస్తున్నారు. ఇక్కడి సమస్యలు, సంక్లిష్టతలను అర్థంచేసుకోవడం అంత తేలిక కాదు’’అని ఆయన అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలోనూ ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం శోచనీయమని ఆ నివేదిక నేపథ్యంలో భారత్ విమర్శించింది.
నూపుర్ శర్మ వివాదంపైనా జగ్గీ వాసుదేవ్ స్పందించారు. ‘‘భారత్‌లో ఇలాంటి వివాదాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కోపం లేదా ఆవేశంతో ఉండేవారు చాలా మాట్లాడతారు. దాని గురించి అంత చర్చ ఎందుకు?’’అని ఆయన అన్నారు.
అరబ్ దేశాల్లో తన పర్యటన గురించి మాట్లాడుతూ.. ‘‘నేను అరబ్ దేశాలకు వెళ్లినప్పుడు ఘన స్వాగతం పలుకుతుంటారు. మా కార్యక్రమాలకు మూడు రెట్లు బుకింగ్స్ వస్తున్నాయి. మాకు చోటు సరిపోవడం లేదు. దుబయిలో మా కార్యక్రమానికి పది వేల మంది వరకు వచ్చారు. మేం ఎక్కడికి వెళ్లినా స్పందన అలానే ఉంటోంది’’అని ఆయన అన్నారు.
విమర్శలు
యూరప్, పశ్చిమాసియాల్లో సాధారణ ప్రజలు కూడా తమను ఆదరించారని జగ్గీ వాసుదేవ్ చెప్పారు. వంద రోజుల యాత్ర తర్వాత కూడా మట్టి నాణ్యతకు సంబంధించిన విధానాల్లో మార్పుల కోసం కృషి చేస్తానని వివరించారు.
అయితే, మోటార్ సైకిల్‌పై వేల కిలోమీటర్ల యాత్రతో మట్టి నాణ్యత ఎలా మెరుగుపడుతుంది? ఇది కేవలం తమని తాము ప్రమోట్ చేసుకునే క్యాంపెయిన్ అని కొందరు విమర్శిస్తున్నారు.
‘‘అలా విమర్శించేవారు నాకు తెలిసింతవరకు అత్యంత నిఖార్సయిన మనుషులు. వారు జీవితంలో ఒక్క తప్పు కూడా చేసుండరు. ఎందుకంటే అసలు వారు ఏ పనీ చేసుండరు. నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ప్రజలు కూడా పాటు నాతోపాటు కృషి చేస్తున్నారు. ఇది వంద శాతం కచ్చితమైన పనని చెప్పలేను. అలా చేయడం ఎవరికీ సాధ్యంకాదు’’అని జగ్గీ వాసుదేవ్ అన్నారు.
‘‘వారి వయసు ఏదైనా కావొచ్చు.. పది రోజుల్లో పది వేల కి.మీ. ప్రయాణించి చూడమనండి’’ అని ఆయన చెప్పారు.
ఆ బైక్‌లు వేల లీటర్ల పెట్రోలు తాగి, భారీగా కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేసుంటాయనే విమర్శలపై స్పందిస్తూ.. ‘‘అయితే, 50 సీసీలో వెళ్లమంటారా? వారు ఏం చెబుతున్నారు? కార్ మీద వెళ్లమంటారా? ఎలా వెళ్లాలో చెప్పమనండి.. అలానే వెళ్తాం’’అని జగ్గీ వాసుదేవ్ వ్యాఖ్యానించారు.
‘‘సేవ్ సాయిల్’’ క్యాంపెయిన్ గురించి మాట్లాడుతూ.. ‘‘మట్టి నాణ్యత గురించి ప్రపంచానికి తెలియాలి. నేడు ఈ కార్యక్రమానికి వచ్చిన చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు. మేం అదే కోరుకుంటున్నాం’’ అని జగ్గీ వాసుదేవ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రాష్ట్రపతి ఎన్నికలు: బీజేపీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటారా?
- అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే మార్గం ఇది
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- మంకీపాక్స్ ఎలా సోకుతుంది, లక్షణాలేమిటి? స్వలింగ సంపర్కులకు ఎక్కువగా సోకుతుందా
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్‌లెట్‌కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- అల్లా, మొహమ్మద్ ప్రవక్తల ఫొటోలు ఎందుకు కనిపించవు? వీరి బొమ్మలను ఖురాన్ నిషేధించిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













