Jaggi Vasudev: భూ పరిరక్షణ ఉద్యమం, వివాదాస్పద అంశాలపై జగ్గీ వాసుదేవ్‌తో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ..

ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ 'సేవ్ సాయిల్' అనే పేరుతో 27 దేశాల్లో 30,000 కిలోమీటర్ల యాత్ర చేస్తున్నారు.
ఈ యాత్రలో భాగంగా జగ్గీ వాసుదేవ్ దిల్లీ వచ్చినప్పుడు బీబీసీ తమిళ్ ప్రతినిధి కె.శుభగుణం ఇంటర్వ్యూ చేశారు.
మట్టి నాణ్యతను కాపాడాలంటూ చేపట్టిన 'సేవ్ సాయిల్' ఉద్యమంతోపాటు ఇతర వివాదాస్పద అంశాల గురించి జగ్గీ వాసుదేవ్ మాట్లాడారు. కానీ ఒక ప్రశ్న అడిగినప్పుడు.. అసహనాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ.. బీబీసీ కెమెరాలను ఆఫ్ చేయండంటూ తన అనుచరులను ఆయన ఆదేశించారు.
దీంతో ఈ ఇంటర్వ్యూ అసంపూర్ణంగానే ఆగిపోయింది.
ఇంటర్వ్యూలోని మూఖ్యాంశాలు
బీబీసీ రిపోర్టర్: 'సేవ్ సాయిల్' పేరుతో మీరు 27 దేశాలు తిరిగారు. మరి అక్కడ ప్రజలు ఎలా స్పందించారు? ఆయా దేశాల ప్రజాప్రతినిధులతో మాట్లాడారా? నేలను రక్షించేందుకు వారి దగ్గర ఏమైనా ప్రణాళికలున్నాయా?
జగ్గీ వాసుదేవ్: అన్ని దేశాల్లోని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రజాప్రతినిధులతోనూ చాలా సార్లు మాట్లాడాం. ఆయా దేశాల వ్యవసాయ, పర్యావరణశాఖలతో చర్చలు జరిపాం. అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం.
మేం రూపొందించిన 'సేవ్ సాయిల్' విధానం ప్రకారం మట్టి నాణ్యతను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటి వరకు 74 దేశాలు ప్రకటించాయి.
ఇది ఒక్కరోజులో అయ్యే పని కాదు. అవగాహన కల్పించడంలో ఇప్పుడొక అడుగు ముందుకేశాం. చేతల్లో చేయాల్సింది ఇంకా చాలా ఉంది.

బీబీసీ రిపోర్టర్: ప్రజలందరికీ తిండి దొరకాలంటే మట్టి నాణ్యతను కాపాడాలని మీరు చెబుతున్నారు. మరి జీవవైవిధ్యం దెబ్బతిని వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి కదా? ఈ సమస్యను పరిష్కరించేందుకు మీ వద్ద ఏవైనా ఆలోచనలున్నాయా?
జగ్గీ వాసుదేవ్: ఇది తిండి గురించి మాత్రమే కాదు. మట్టి అనేది తిండి కోసమే కాదు జీవులకు కూడా ప్రాణాధారమే. మనుషులే కాదు భూమి నుంచి పుట్టుకొచ్చిన జీవులన్నింటికీ మట్టి కావాలి. ప్రాణులకు జీవనాధారమైన అటువంటి మట్టి మనుగడ సాగించలేకపోతే ఇక జీవులకు బతికే మార్గమే ఉండదు.
మీరు గుప్పెడు మట్టి తీసుకుని చూడండి... అందులో వేల కోట్ల జీవులుంటాయి. కానీ ఏడాదికి 27వేల జాతుల చొప్పున అవి అంతరించిపోతున్నాయి. ఇది ఇలాగే జరుగుతూ పోతే భూమీ మీద జీవం ఉండలేదు. ఎందుకంటే మన ఒంట్లో కూడా ఉండేది 60శాతం సూక్ష్మజీవులే.
మట్టిలో ఉండే జీవులు అంతరించిపోతే మన ఒంట్లో జీవం ఉండలేదు. ఇది నేను చెబుతున్నది కాదు శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. కానీ మనం వారి మాటలను పట్టించుకోవడం లేదు. అందుకే మట్టిని కాపాడాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని (సేవ్ సాయిల్) చేపట్టాం. దీని కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలనేదే మా లక్ష్యం.
ఇది వ్యవసాయానికి సంబంధించింది మాత్రమే కాదు. మట్టి అనేది ఎంతో ముఖ్యమైనది. మన పూర్వీకులు దాన్ని సజీవంగా మనకు అప్పగించారు. అందువల్లే మనం బాగా జీవించగలుగుతున్నాం. రేపటి తరాలు కూడా బాగా బతకాలంటే మట్టిని వారికి కూడా సజీవంగా ఇవ్వాలి. అది మన బాధ్యత.

బీబీసీ రిపోర్టర్: పర్యావరణ పరిరక్షణ కోసం ఈషా ఫౌండేషన్ పని చేస్తోందని చెబుతున్నారు. కానీ పర్యావరణ అనుమతులు లేకుండానే దాన్ని నిర్మించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి కదా?
జగ్గీ వాసుదేవ్: ఎన్ని సార్లు ఈ ప్రశ్న అడుగుతారు?
బీబీసీ రిపోర్టర్: పర్యావరణ అనుమతులు లేకుండా...
జగ్గీ వాసుదేవ్: ఎవరు చెప్పారు మీకు? మీరు వార్తలు చూశారా? (అసహనంతో.. ష్.. అంటూ) ప్రభుత్వం ఏం చెబుతోందో వింటున్నారా? కోర్టు ఏం చెప్పిందో తెలుసా? లేక మీ చుట్టుపక్కల అరకొర జ్ఞానంతో మాట్లాడే వారు చెప్పేవి మాత్రమే వింటున్నారా?
(రిపోర్టర్ ఏదో మాట్లాడుతుండగా అడ్డుకుంటూ..) లేదు లేదు.. ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మేం దేన్నీ ఆక్రమించుకోలేదు. ప్రభుత్వం ఏం చెబుతోందంటే.. మేం ఏమీ ఆక్రమించుకోలేదు.. అంతా పర్ఫెక్ట్‌గా ఉందని చెబుతోంది. అదంతా ఇన్నాళ్లూ మాట్లాడుకున్నారు.
బీబీసీ రిపోర్టర్:నేను అలా అనలేదు. ఆక్రమించారు అని నేను అనడం లేదు. పర్యావరణానికి ఎంతో విలువనిచ్చే ఒక సంస్థ, ముందుగా పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే ఎందుకు బిల్డింగులు నిర్మించింది?
జగ్గీ వాసుదేవ్:(మధ్యలో కల్పించుకుంటూ..) దేశంలో చట్టం ఉంది కదా.
బీబీసీ రిపోర్టర్:ఉంది.
జగ్గీ వాసుదేవ్:ప్రభుత్వం ఉందా?
బీబీసీ రిపోర్టర్:ఉంది.
జగ్గీ వాసుదేవ్:(చేతులు జోడించి నమస్కరిస్తూ..) వాటి పని వాటిని చేయనివ్వండి. మీరు ఎందుకు ఆ పని చేస్తున్నారు? ఇక చాలు. (విసుగ్గా..) వదిలేయండి.
బీబీసీ రిపోర్టర్:పర్యావరణ అనుమతులు..
జగ్గీ వాసుదేవ్:(తీవ్ర అసహనంతో..) ష్..
బీబీసీ రిపోర్టర్: 'పర్యావరణ అనుమతులు తీసుకోకుండా మేం నిబంధనలు ఉల్లంఘించాం...' అంటూ ఒక లేఖలో ఈషా ఫౌండేషన్ ఒప్పుకుంది కదా? ముందు తీసుకోవాల్సిన పర్యావరణ అనుమతులు తర్వాత ఎందుకు తీసుకున్నారు? ముందే తీసుకుని ఉండాల్సింది కదా.

జగ్గీ వాసుదేవ్:దేశంలో.. (రిపోర్టర్ ఏదో చెబుతుండగా ఆగ్రహంతో.. ష్.. అంటూ కళ్లు మూసుకుని, నోటికి వేలును అడ్డుపెట్టి) దేశంలో చట్టం ఉంది, ప్రభుత్వం ఉంది. వాళ్లపని వాళ్లు చేయనివ్వండి. (ఆగ్రహంగా) మీరు వదిలేయండి.
(రిపోర్టర్ ఏదో మాట్లాడుతుండగా అడ్డుకుంటూ.. చేయి చూపిస్తూ..) ఇనఫ్ (ఇకచాలు).
బీబీసీ రిపోర్టర్:ఇషా ఫౌండేషన్..
జగ్గీ వాసుదేవ్:అరే.. యువర్ నాన్సెన్.. ఇనఫ్. (కెమెరాను ఆపేందుకు ప్రయత్నించారు)
బీబీసీ రిపోర్టర్:పర్యావరణ అనుమతులు ఉల్లంఘించామని చెబుతూ, అనుమతులు కోరారు.
జగ్గీ వాసుదేవ్:(తన అనుచరులతో..) ఈ కెమెరాలు ఆపేయండి.
(రిపోర్టర్ పర్యావరణ అనుమతుల గురించి మాట్లాడుతుండగా అడ్డుకుంటూ..) హే మ్యాన్.. నేను చెప్పేది విను. ఈ దేశంలో ఉన్న ప్రతి చట్టాన్ని మేం పాటించాం. ఒకవేళ ఏదైనా లోపం (మావైపు నుంచి) ఉన్నా దానిని సరిచేసుకున్నాం. చాలాకాలం క్రితం.. 20 ఏళ్లకు ముందు ఏదో చిన్న లోపం ఉంది. దాన్ని మేం సరిచేసుకున్నాం.
(రిపోర్టర్ స్పందిస్తుండగా అడ్డుకుంటూ.. తీవ్ర ఆగ్రహంతో కూడిన స్వరంతో..) ష్.. చెప్పేది వినవయ్యా ముందు..
ఈ సమయంలో జగ్గీ వాసుదేవన్ అనుచరులు బీబీసీ కెమెరాల షూటింగ్‌ను బలవంతంగా నిలుపుదల చేయించారు.
ఇవి కూడా చదవండి:
- కాథలిక్కుల్లో కులం సంగతేంటి? ఒక దళితుడు కార్డినల్ కావడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది?
- రాష్ట్రపతి ఎన్నికలు: బీజేపీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటారా?
- అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే మార్గం ఇది
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- మంకీపాక్స్ ఎలా సోకుతుంది, లక్షణాలేమిటి? స్వలింగ సంపర్కులకు ఎక్కువగా సోకుతుందా
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్‌లెట్‌కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- అల్లా, మొహమ్మద్ ప్రవక్తల ఫొటోలు ఎందుకు కనిపించవు? వీరి బొమ్మలను ఖురాన్ నిషేధించిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














