Maps-GPS Location: మ్యాపుల్లో ఉత్తరం దిక్కునే పైభాగంలో చూపుతారెందుకు? నార్త్ అంటే ఆధిపత్యమా? పేదవాళ్లంతా సౌత్‌లోనే ఉంటారా?

ఫొటో సోర్స్, NASA
- రచయిత, కరోలినా విలియమ్స్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
మీరు అంతరిక్షం నుంచి భూమిని చూస్తున్నట్లు ఊహించుకోండి. అక్కడి నుంచి భూమి పైభాగంలో ఏం కనబడుతుంది? అని అడిగితే... మీ సమాధానం, ఉత్తర ధ్రువం అయితే గనక ఈ సమాధానం చెప్పిన వ్యక్తి మీరొక్కరే కాదు. అలా అని మీరు చెప్పిన సమాధానం సరైనది కూడా కాదు.
నిజం ఏంటంటే... ప్రతీ ఒక్కరూ ప్రపంచంలో ఉత్తరమే పై భాగాన ఉంటుందనే ఊహలో ఉంటారు. కానీ, ఉత్తరం అనేది పైభాగంలోనే ఉంటుందని చెప్పడానికి సరైన శాస్త్రీయ కారణాలు లేవు.
చరిత్ర, ఖగోళ భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్తాలను అనుసరించి ఈ విధమైన ఊహ రూపొందింది.
ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకోవడం అనేది చాలా సహజమైన నైపుణ్యం. అందుకే మనం, మన పరిసరాలకు సంబంధించిన మ్యాప్‌లను రూపొందించుకున్నాం. ప్రపంచం గురించి మనకున్న అవగాహనను ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నించాం.
మ్యాప్‌లను గీయడంలో మనకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 14 వేల సంవత్సరాల క్రితం గుహల్లోని గోడలపై గీసిన మ్యాప్‌లు కూడా బయటపడ్డాయి. పూర్వ కాలం నుంచి రాతి పలకలు, పురాతన పత్రాలు, కాగితాలు ఇప్పుడు కంప్యూటర్ స్క్రీన్లపై మ్యాపులను తయారు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Wikipedia
మ్యాపుల సుదీర్ఘ చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే... గత కొన్ని వందల సంవత్సరాలుగా మాత్రమే మ్యాపుకు పైభాగంగా ఉత్తరం దిక్కును పరిగణిస్తున్నారని తెలుస్తోంది.
లండన్‌లోని క్వీన్‌మేరీ యూనివర్సిటీ మ్యాప్ చరిత్రకారుడు జెర్రీ ట్రోటన్ ప్రకారం... నిజానికి, మానవ చరిత్రలో ఉత్తరం ఎప్పుడూ అగ్రస్థానంలో కనిపించలేదు.
''చీకటి ప్రారంభమయ్యే ఉత్తరం దిక్కును చాలా అరుదుగా మ్యాపు పైభాగంలో ఉంచారు. పడమరను కూడా పైభాగంలో ఉంచే అవకాశం లేదు. ఎందుకంటే పశ్చిమానే సూర్యుడు అదృశ్యమవుతాడు'' అని జెర్రీ చెప్పారు.
'ఎ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఇన్ ట్వెల్వ్ మ్యాప్స్' అనే పుస్తకాన్ని జెర్రీ రాశారు.
కానీ, తొలినాళ్ల నాటి చైనీస్ మ్యాప్‌లు ఈ ధోరణిని చూపిస్తున్నాయి. బ్రోటన్ చెప్పినదాని ప్రకారం... అప్పటికే వారు దిక్సూచిని వాడుతుండటం వల్ల ఉత్తరాన్ని ఎగువ భాగంలో ఉంచారని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే తొలినాళ్లలో చైనీస్ దిక్సూచీలు దక్షిణాన్ని సూచించేవి.
చైనా దేశపు చక్రవర్తిని అనుసరించి మ్యాపులను రూపొందించి ఉంటారని బ్రోటన్ అభిప్రాయపడ్డారు. ''చైనా చక్రవర్తి దేశానికి ఉత్తరాన నివసించేవారు. ఆయన ఎప్పుడూ దక్షిణానికి అభిముఖంగా కూర్చునేవారు. ఎందుకంటే దక్షిణం నుంచే గాలి వీచేది. గాలి వీచేందుకు నార్త్ అనువైన దిశ కాదు. కానీ, మీరు చక్రవర్తికి లోబడి ఉండాల్సిందే కాబట్టి ఆయనను చూడటానికి మీరు నార్త్ వైపు చూడాల్సిందే'' అని బ్రోటన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Wikipedia
దీని ప్రకారం, ప్రతీ సంస్కృతికి భిన్నమైన భావజాలం, అధిపతులు ఉన్నందున తొలినాళ్ల నాటి మ్యాపుల్లో సమరూపత చాలా తక్కువగా ఉంటుంది.
పురాతన ఈజిప్టు కాలంలో తూర్పును అగ్రభాగంలో ఉంచేవారు. అది సూర్యుడు ఉదయించే దిశ కాబట్టి దాన్ని పైభాగాన ఉంచారు.
ఇస్లామిక్ ప్రపంచానికి చెందిన తొలినాళ్ల నాటి మ్యాపులు దక్షిణ దిశను అగ్రభాగంలో ఉంచేవి. ఎందుకంటే చాలా ముస్లిం సంస్కృతులు మక్కాకు ఉత్తరంగా ఉన్నాయి. కాబట్టి దాన్ని చూడటం కోసం మ్యాపుల్లో దక్షిణాన్ని అగ్రభాగాన ఉంచేవారని భావించారు.
అదే కాలానికి (మప్పా మండి) చెందిన క్రైస్తవ మ్యాపులు.. ఈడెన్ గార్డన్, జెరూసలెంను దృష్టిలో పెట్టుకొని తూర్పును పైభాగంలో ఉంచాయి.

ఫొటో సోర్స్, Wikipedia
మరి అందరూ కలిసి ఉత్తరాన్ని మ్యాపులో పైభాగాన పెట్టాలని ఎప్పుడు నిర్ణయించారు?
భూమి వక్రతను పరిగణలోకి తీసుకొని తొలిసారిగా 1569లో మెర్కాటర్ ప్రపంచ పటాన్ని రూపొందించారు. ఉత్తరాన్ని మ్యాప్ పైభాగంలో ఉంచాలనే భావన ఇక్కడి నుంచే మొదలైందని నమ్ముతారు. సెయిలర్లను పరిగణలో ఉంచుకొని ఆయన ఈ పటాన్ని రూపొందించారు.
అయితే, ఈ పటానికి కూడా ఉత్తరానితో పెద్దగా సంబంధం లేదని బ్రోటన్ అన్నారు. ''మెర్కాటర్, ధ్రువాలను అనంతంగా అంచనా వేశారు. ఆయన తన వివరణలో... ధ్రువాల వరకు సెయిలింగ్ చేసే ఆసక్తి లేదు కాబట్టి పర్వాలేదు అని చెప్పారు. ఉత్తరం, అగ్రభాగాన ఉంది. కానీ దాన్ని ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే మేం అక్కడికి వెళ్లడం లేదు'' అని మెర్కాటర్ అన్నట్లు బ్రోటన్ వివరించారు.

ఫొటో సోర్స్, Wikipedia
బహుశా, ఆ సమయంలో యూరోపియన్లు, ఉత్తరార్థ గోళంలో అన్వేషణ చేస్తున్నందున దాన్ని అగ్రభాగానికి ఎంపిక చేసుకోని ఉండొచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు.
కారణాలు ఏవైనప్పటికీ, మ్యాపుల్లో అగ్రభాగాన ఉత్తరం ఉండాలనే భావన స్థిరపడిపోయినట్లు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, NASA
పైన కనిపిస్తోన్న ఈ చిత్రాన్ని 1973లో నాసాకు చెందిన ఒక వ్యోమగామి తీశారు. ఈ ఫొటోను తీసినప్పుడు ఆయన రోదసిలో తిరుగుతున్నారు. నిజానికి, దక్షిణం పైభాగాన కనిపించేలా ఈ ఫొటోను తీశారు. కానీ, ప్రజలు గందరగోళానికి గురవ్వకుండా ఉంచడం కోసం నాసా ఈ ఫొటోను ఫ్లిప్ చేయాలని నిర్ణయించింది.
మీరు అంతరిక్షం నుంచి భూమిని చూస్తున్నప్పుడు అది ఒక నిర్దిష్ట దిశలో కనబడుతుందని అనుకోవడం చాలా పొరపాటు. చిన్నప్పుడు పాఠశాలలో మనందరం చదువుకున్నట్లుగానే, సౌర వ్యవస్థలో భూమి ఇతర గ్రహాలతో కలిసి ఒకే అక్షంలో ఉంటుంది. కాబట్టి మనం అంతరిక్షంలో ఎక్కడ నిల్చొని చూస్తున్నామనే ప్రదేశాన్ని బట్టి భూమి ఎలా కనిపిస్తుందనేది ఆధారపడి ఉంటుంది.

ఫొటో సోర్స్, NASA
మిగిలిన పాలపుంతతో పోల్చి చూస్తే, మన సౌరవ్యవస్థ 63 డిగ్రీలు తక్కువగా ఉంటుంది.
అంతరిక్షం అంతటా నక్షత్రాలు, గ్రహాలు తమ పొరుగు గ్రహాలతో ఒకే విధంగా అమరి ఉన్నాయని వ్యోమగాములు కనుగొన్నారు. అయితే, అనంతమైన విశ్వంతో పోలిస్తే ఇందులో నిజం పాళ్లు తక్కువేనని లండన్ ఇంపీరియల్ కాలేజీలోని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డేనియల్ మోర్ట్‌లాక్ అన్నారు. ''అంతరిక్షంలో నిజంగా పైభాగం, కింది భాగం అనేవి లేవు అని చెప్పగలం'' అని ఆయన వ్యాఖ్యానించారు.
కాబట్టి భూమికి ఏది పైభాగం? అనే ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. అదేంటంటే... భూమికి ప్రత్యేకంగా ఒక పైభాగం అంటూ లేదు. ప్రపంచంలో ఉత్తరం అగ్రభాగంలో ఉన్నట్లు భావించడానికి చారిత్రక ఆధిపత్య కారణాలు తప్ప ఇతర కారణాలు లేవు.
మనకు అలవాటు అయిన కోణం నుంచి గ్రహాన్ని చూడటం ఆపేసి భిన్నమైన కోణంలో చూడాల్సిన సమయం వచ్చిందా? ప్రపంచంలో విలువైన వాటి గురించి మనం ఆలోచించే విధానాన్ని ఈ నార్త్ అప్ కల్చర్ కలుషితం చేస్తుందని మనస్తత్వశాస్త్ర ఆధారాలు సూచిస్తున్నాయి.

ఫొటో సోర్స్, NASA
చాలా మంది ప్రజలు ఉత్తరాన్ని ఎక్కువ విలువైనదిగా దక్షిణాన్ని తక్కువ విలువైనదిగా భావిస్తారు.
ఒక నగరానికి చెందిన మ్యాపును ప్రజలకు చూపించి ఎక్కడ నివసించాలి అనుకుంటున్నారని అడిగితే... వారు ఎక్కువగా ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.
వివిధ సామాజిక హోదాలకు చెందిన వ్యక్తులు ఎక్కడ నివసిస్తారని అడగగా... ఉత్తర ప్రాంతంలో ధనవంతులు, దక్షిణ ప్రాంతంలో పేదవాళ్లు ఉంటారని చూపించారు.
అలాగే మ్యాప్‌లో లేదా గ్లోబ్‌లో తమ కంటే కింది ప్రాంతంలో ఉన్న దేశాల్లో లేదా ప్రాంతాల్లో ఏమి జరుగుతుందో తెలుసుకోకపోవడానికి పైభాగాలకు చెందిన ప్రజలు ఆసక్తి చూపకపోవడం పెద్ద ఆశ్చర్యం కలిగించే అంశమేమీ కాదని దీన్ని బట్టి అర్థం అవుతోంది.
ఇవి కూడా చదవండి:
- సద్గురు జగ్గీ వాసుదేవ్: ‘ధ్వంసమైన ఆలయాలన్నీ పునర్నిర్మించలేం, అలా చేయాలంటే దేశమంతా తవ్వుకుంటూ రావాలి’
- పిల్లల ఉన్నత విద్య ఖర్చుల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
- లద్దాఖ్‌లో చైనా ఏం చేస్తోంది? కళ్లు తెరిపించేలా చైనా పనులు ఉన్నాయని అమెరికా ఎందుకు అంటోంది?
- హిందీ మీడియంలో సివిల్స్ రాసే వాళ్లు సక్సెస్ కాలేక పోతున్నారా
- ఆమ్ ఆద్మీ పార్టీ: గుజరాత్లో కాంగ్రెస్‌ను అరవింద్ కేజ్రీవాల్ పార్టీ రీప్లేస్ చేయగలదా? బీజేపీ కోటను కూలగొట్టగలదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













