Mars: అంగారకుడిపై కనిపిస్తున్న ఈ ‘తలుపు’ వెనుక రహస్యమేంటి, నాసా ఏం చెబుతోంది

ఫొటో సోర్స్, NASA/JPL
అంగారకుడిపై ఒక తలుపులా దీర్ఘచతురస్రాకారంలో కనిపిస్తున్న ఒక ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.
అది తలుపేనని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకువేసి పొరుగునున్న గ్రహానికి వెళ్లేందుకు అక్కడివారు ఏర్పాటుచేసుకున్న మార్గమా? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఫోటోను అంగారకుడిపై కాలుమోపిన క్యూరియాసిటీ రోవర్ తీసింది. 2012 నుంచి అంగారకుడిపై సమాచారాన్ని ఈ రోవర్ అందిస్తోంది.
ఇంతకీ ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఏమిటి? నాసా ఏం చెబుతోంది.

ఫొటో సోర్స్, NASA/JPL/Neville Thompson
అలా వెలుగులోకి..
అంగారకుడి ఉపరితలంపై క్యూరియాసిటీ రోవర్ తీసిన కొన్ని చిత్రాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మే 7న విడుదల చేసింది.
మార్స్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రొగ్రామ్ వెబ్‌సైట్‌లో ‘‘ఎస్‌వోఐ 3466’’ సిరీస్ పేరుతో నాసా విడుదలచేసిన చిత్రాల్లో తాజా చిత్రం కూడా ఒకటి.
ఈ ఫోటోను పబ్లిష్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయింది.
ఫోటోలో కనిపిస్తున్నది ‘‘తలుపు’’ అయి ఉంటుందని కొందరు చెబుతుంటే, మరో గ్రహానికి ద్వారం అని ఇంకొందరు కామెంట్ చేశారు.
అయితే, ఈ సిరీస్‌లోని అన్ని ఫోటోలనూ చూస్తే మన దృష్టికోణం మారుతుందని, మన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
‘‘ఒక రాయిపై ఏర్పడిన చీలికను చాలా చాలా పెద్దదిగా జూమ్ చేసి చూస్తే ఇలా కనిపిస్తోంది’’అని బీబీసీ ముండోతో నాసా చెప్పింది.
3466 సిరీస్‌లోని మిగతా ఇమేజ్‌లు చూస్తే ఆ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుందని నాసా వివరించింది. ఇవి అంగారకుడి మీద ‘‘జెజిరో బిలం’’పై పరిశోధన చేపట్టే సమయంలో క్యూరియాసిటీ రోవర్ తీసిన చిత్రాలని పేర్కొంది.
దీని పరిమాణం ఎంత?
ఆ రాయి మధ్యలో కనిపిస్తున్న చీలిక 30 సెం.మీ. వెడల్పు, 45 సెం.మీ.ల పొడవు మాత్రమే ఉంటుందని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు చెప్పారు.
‘‘ఆ ప్రాంతంలో అలాంటి చీలికలు చాలానే ఉన్నాయి’’అని వారు వివరించారు.
ప్రశ్నలు రేకెత్తించేదే
ఈ ఫోటోలో మర్మమేమీలేదని, అయితే, దీనిలోని అంశాలు కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయని అంగారకుడి విశేషాల మీద ఏళ్ల నుంచి పరిశోధన చేపడుతున్న బ్రిటన్ శాస్త్రవేత్త నీల్ హోడ్జ్‌సన్ చెప్పారు.
‘‘అక్కడ నేల కోతకు గురవుతోందని ఈ ఫోటో ద్వారా అర్థమవుతోంది’’అని లైవ్‌సైన్స్‌తో ఆయన చెప్పారు. ‘‘అక్కడ రాళ్లపై ఇసుక పొరలుపొరలుగా ఉన్నట్లు కనిపిస్తోంది’’అని ఆయన అన్నారు.
‘‘రాళ్లు క్రమక్షయానికి గురికావడంతో నాలుగు బిలియన్ ఏళ్ల క్రితం అవి ఏర్పడి ఉండొచ్చు. నది ప్రవాహం లేదా గాలి వల్ల అలా ఇసుక పొరలుపొరలుగా మారి ఉండొచ్చు’’అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇచ్చేప్పుడు జాగ్రత్త.. ఉత్తర కొరియా వాళ్లు జాబ్‌లు కొట్టేస్తున్నారు’ - ఐటీ సంస్థలకు అమెరికా హెచ్చరిక
- చేతనా రాజ్: ప్లాస్టిక్ సర్జరీ తర్వాత మరణించిన కన్నడ నటి, అసలేం జరిగింది?
- రాజ్యసభకు వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. చిరంజీవి ఆచార్య నిర్మాతకు, ఇద్దరు తెలంగాణ వారికి ఎంపీ పదవులు ఎందుకు ఇచ్చారంటే..
- వంటింట్లో మనకు తెలియకుండానే మనం చేసే 9 తప్పులు.. ఇవి చాలా ప్రమాదకరం అంటున్న నిపుణులు
- ఆన్లైన్ గేమ్సా... జూద క్రీడలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











