అంగారక గ్రహంపై పరిశోధన ప్రారంభించిన నాసా రోవర్ 'పెర్సెవీరన్స్'

ఫొటో సోర్స్, NASA/JPL-CALTECH
- రచయిత, జోనాథన్ అమోస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అంగారక గ్రహం పైకి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపిన రోవర్ పెర్సెవీరన్స్ తన చక్రాలను సడలించి తొలిసారిగా కదిలింది.
ఎక్కువ దూరం కాదుగానీ.. 6.5 మీటర్లు అంటే 21 అడుగుల దూరం కదిలింది.
అయితే, ఈ కదలిక ఎంతో ముఖ్యమైనదని నాసా డిప్యుటీ ప్రాజెక్టు సైంటిస్ట్ కేటీ స్టాక్ మోర్గాన్ తెలిపారు.
"రోవర్ ఇంకా ఇంజినీరింగ్‌కు సంబంధించిన అంశాలను ఖరారు చేసుకుంటున్నపటికీ, అది కదిలిన క్షణాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంటాయి. మనల్ని మనం అంగారక గ్రహంపై అన్వేషకులమని పిలుచుకోవచ్చు" అని ఆమె బీబీసీ న్యూస్‌తో చెప్పారు.
టన్ను (1000 కిలోలు) బరువున్న ఈ రోబో మార్స్‌పై దిగి రెండు వారాలైంది.
దిగిన తరువాత, దీని సంక్లిష్ట వ్యవస్థను పూర్తిగా పరిశీలించి, పనితీరును నిర్థరించుకుని, కదలికలను ప్రారంభించేందుకు నాసా ఇంజినీర్లకు రెండు వారాలు పట్టింది.
పెర్సెవీరన్స్ కదలికల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా గురువారం నాడు అది కదిలింది. రోబో కొద్ది దూరం ముందుకు వెళ్లి, వెనక్కి వచ్చింది.
"రోవర్ చక్రాల గుర్తులు మార్స్‌పై స్పష్టంగా చూడవచ్చు. చక్రాల గుర్తులు చూసి మునుపెన్నడూ ఇంత సంతోషపడిన జ్ఞాపకం లేదు" అని పెర్సెవీరన్స్ మొబిలిటీ ఇంజినీర్ అనైస్ జరిఫియాన్ అన్నారు.
"ఈ ప్రాజెక్టులో ఇదొక మైలురాయి. ఈ రోబోను భూమి మీద నడిపాం. కానీ, మార్స్ మీద నడపడం ఒక అద్భుతం. ఇదే మా అంతిమ లక్ష్యం. ఈ క్షణాల కోసం ఎంతోమంది సంవత్సరాల తరబడి శ్రమించారు" అని జరిఫియాన్ చెప్పారు.
మార్స్‌పై జీవం ఆనవాళ్ల గురించి పరిశోధించేందుకు జెజెరో అనే సరస్సు ప్రాంతం దగ్గర ఈ రోవర్‌ను దించారు.
ఇక్కడ ఉన్న రాళ్లలో పురాతన జీవసంబంధ అంశాలను అన్వేషించే దిశలో ఈ రోవర్, రాబోయే మార్టిన్ సంవత్సరం (భూమి లెక్కల్లో సుమారు రెండు సంవత్సరాలు)లో ఒక 15 కిలోమీటర్ల దూరం తిరుగుతుందని ఆశిస్తున్నారు.
ఇక్కడ ఒకచోట డెల్టా ప్రాంతం ఉన్నట్టు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించింది. జెజెరో దగ్గర కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద బిలంలో సరస్సు ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ డెల్టాకు చేరుకునేందుకు ఉన్న రెండు మార్గాల్లో ఒకదానిని శాస్త్రవేత్తల బృందం పరిశీలిస్తోంది.
"ఈ మట్టి దిబ్బ రోవర్‌కు ఒక మైలున్నర దూరంలో ఉంది. ఈ రాళ్లలోని పొరలను పరిశీలించడం ద్వారా గత జీవుల ఆనవాళ్లను పసిగట్టొచ్చు. ఇవన్నీ పురాతన సరస్సు జెజేరో నీటి ప్రవాహం వల్ల కొట్టుకొచ్చిన రాళ్లై ఉండొచ్చు. ఈ రాళ్ల మూలాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు" అని డాక్టర్ స్టాక్ మోర్గాన్ తెలిపారు.

ఫొటో సోర్స్, NASA/JPL-CALTECH
పెర్సెవీరన్స్ తక్షణ లక్ష్యం హెలికాప్టర్ ప్రయోగం. ఈ రోవర్ భూమి నుంచి ఒక చిన్న చాపర్‌ను తనతో పాటూ తీసుకెళ్లింది.
రాబోయే కొన్ని వారాల్లో ఈ వాహనం ప్రస్తుతం ఉన్న చోటు నుంచి ముందుకు కదిలి, రెండు కిలోల బరువున్న పరికరం 'ఇంజెన్యుయిటీ'ని తగిన చోటులో ఉంచేందుకు ప్రయత్నిస్తుంది.
"హెలికాప్టర్ ఎగరగలిగే ప్రదేశాలను ఇంకా పరిశీలిస్తున్నాం. ఆ ప్రాంతాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించేందుకు నావిగేషన్ కెమేరా చిత్రాలను, స్టీరియో చిత్రాలను సేకరిస్తున్నాం" అని రోవర్ డిప్యుటీ మిషన్ మేనేజర్ రాబర్ట్ హాగ్ తెలిపారు.
ఇప్పటివరకూ మార్స్‌పై నాసా పంపిన అత్యంత వేగవంతమైన రోవర్ ఇదే. దీని చక్రాలు ఎంత వేగంగా కదులుతాయన్నది కాకుండా, ఇది ఎంత స్వీయ నియంత్రణతో ముందుకు కదులుతుందనేదే కీలకం.
ఈ రోవర్ కదులుతూ కూడా చిత్రాలను తీయగలదు. ఇంతకుముందు పంపించిన రోవర్స్ ఒకచోట ఆగి మాత్రమే చిత్రాలను తీయగలిగేవి. ఇది మాత్రం ఎగురుతూ కూడా ముందున్న మార్గం చిత్రాలు తీసి శాస్త్రవేత్తలకు పంపించగలదు.
జెజెరో బిలం వద్ద పెర్సెవీరన్స్ దిగిన ప్రదేశానికి అమెరికాకు చెందిన ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత ఆక్టవియా ఈ బట్లర్ పేరును పెట్టినట్టునట్టు నాసా శుక్రవారం ప్రకటించింది.
2012లో నాసా ముందు పంపించిన 'క్యూరియాసిటీ' రోవర్ దిగిన ప్రదేశానికి కూడా సైఫై రచయిత రే బ్రాడ్బరీ పేరు పెట్టారు.
ఇవి కూడా చదవండి:
- విమానం ఇంజిన్‌లో మంటలు: శకలాలు వీధుల్లో, పార్కుల్లో పడిపోయాయి
- మేడ మీదే విమానం తయారీ
- రూ.500 ఇంధనంతో 160 కి.మీ. ప్రయాణించే విమానం
- ఫుట్‌బాల్ మైదానం కంటే పెద్ద విమానం
- ‘నేవీ నుంచి బయటపడటానికి విమానాన్ని దొంగిలించా’
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









