Sambhaji Nagar, Dharashiv: ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ల పేర్లు ఎందుకు మార్చారు? హైదరాబాద్ నిజాంకు ఈ పేర్లతో సంబంధం ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
మహారాష్ట్రలో వారాలపాటు వార్తల్లో నిలిచిన రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చింది. శివసేన రెబల్ నాయకుడు ఏక్‌నాథ్ శిందే.. బీజేపీ సాయంతో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు కూడా తీసుకున్నారు.
అయితే, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కొన్ని గంటల ముందు రెండు నగరాలు, ఒక విమానాశ్రయానికి పేర్లు మార్చారు.
ఔరంగాబాద్‌ను శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గా పేర్లు మారుస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. మరోవైపు నవీ ముంబయి ఎయిర్‌పోర్ట్ పేరును డీబీ పాటిల్ ఎయిర్‌పోర్టుగా పేరు మార్చారు.
ఎప్పటినుంచో ఈ నగరాల పేర్లు మార్చాలని మహారాష్ట్రలో కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. వీటిలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన కూడా ఉంది.
అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలన్న గవర్నర్ ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో.. వెంటనే ఈ నగరాల పేర్లు మారుస్తున్నట్లు రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది.
ఆ క్యాబినెట్ సమావేశం అనంతరం మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి అధిపతిగా వ్యవహరిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే.. రాజీనామా చేస్తున్నట్లు ఫేస్‌బుక్ లైవ్ ద్వారా వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఔరంగాబాద్ పేరు ఎందుకు మార్చారు?
ఔరంగాబాద్ నగరంతోపాటు ఔరంగాబాద్ జిల్లా పేరు మార్పు వివాదం ఎప్పటికప్పుడే వార్తల్లో నిలుస్తూ ఉండేది. ఇటీవల ''లవ్ ఔరంగాబాద్'', ''సూపర్ శంభాజీనగర్'' పేర్లతో సైన్‌బోర్డులు ఔరంగాబాద్ నగరంలో దర్శనమిచ్చాయి.
ఈ విషయంపై దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి.
ఔరంగాబాద్‌లో ఈ సైన్‌బోర్డులు పెట్టినప్పుడు.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్పందించింది. ''ఎప్పటినుంచో ఈ నగరం పేరు మార్చాలని శివసేన డిమాండ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉన్నది శివసేననే.. ఆ డిమాండ్‌ను ఇప్పటికైనా వారు పూర్తిచేయాలి''అని బీజేపీ వ్యాఖ్యానించింది.
అయితే, ఔరంగాబాద్ పేరు మార్చాలనే నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగిన కాంగ్రెస్ స్పష్టంచేసింది.

ఫొటో సోర్స్, ANI
ఈ విషయంలో మొదట్నుంచీ శివసేనను కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ వస్తోంది. అయితే, తాజాగా పేర్లు మార్చిన తర్వాత ఈ విషయంపై కాంగ్రెస్ స్పందించలేదు.
అయితే, సెక్యులర్ అడుగుజాడల్లో తమ ప్రభుత్వం పనిచేస్తుందని రెండు రోజుల క్రితం వరకు అధికారంలోనున్న ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును మొదట్నుంచీ శివసేన వ్యతిరేకిస్తూనే ఉంది.
ఈ పేరు మార్పుకు ముందుకు కూడా ఔరంగాబాద్‌ను శంభాజీ నగర్‌గానే తన ప్రసంగాల్లో ఉద్ధవ్ ఠాక్రే సంబోధించేవారు.
దీనిపై అప్పట్లో కాంగ్రెస్ స్పందిస్తూ.. పేర్లు మార్పుకు తమ ప్రభుత్వం అంత ప్రాధాన్యం ఇవ్వదని చెప్పింది. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ఇలాంటి విధానాలకు తాము వ్యతిరేకమని పేర్కొంది.
అదే సమయంలో శంభాజీ మహారాజ్ అంటే తమకు ఎలాంటి విద్వేషమూలేదని కూడా స్పష్టీకరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఔరంగాబాద్ చరిత్ర ఏమిటి?
ఔరంగాబాద్‌లో హిందువుల జనాభా ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ముస్లిం జనాభా కూడా తక్కువేమీ ఉండదు. అందుకే ఈ నగరం పేరును మార్చాలనే అంశంపై పెద్దయెత్తున వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతూ ఉండేది.
''యాదవుల పాలనా కాలం నుంచి ఔరంగాబాద్ ప్రస్తావన కనిపిస్తుంది. అయితే, శాతవాహన కాలం నుంచి ఇక్కడ కార్యకలాపాలు కొనసాగేవని ఆధారాలు చెబుతున్నాయి''అని ఔరంగాబాద్ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ దుల్హారీ ఖురేషి చెప్పారు.
కన్హేరి, శాతవాహన గుహల్లో ఔరంగాబాద్ పేరును రాజ్‌తదాగ్‌గా పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. ఆ గుహలు ఔరంగాబాద్ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. ఉజ్జయిని-మహిష్మతి-భోకారదన్-రాజ్‌తదాగ్-ప్రతిష్ఠాన్-టేర్ వాణిజ్య మార్గం మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది.

ఫొటో సోర్స్, TWITTER/@IMTIAZ_JALEEL
''ఈ నగరానికి ఫతేనగర్‌గా మాలిక్ అంబర్ పేరు పెట్టారు. అయితే, 1636లో దక్కన్ ప్రాంతానికి సుబేదార్‌గా ఔరంగజేబును మొఘల్ చక్రవర్తి షాజహాన్ నియమించారు. అప్పడు దీనికి ఖుజిస్తా బునియాద్‌గా పేరు మార్చారు''అని చరిత్రకారుడు పుష్కర్ సాహ్ని చెప్పారు.
1657లో ఖుజిస్తా బునియాద్ పేరును ఔరంగాబాద్‌గా మార్చారు. మొఘల్ పాలనా కాలంలో లాహోర్, దిల్లీ, బుర్హాన్‌పుర్‌లలానే ఔరంగాబాద్‌కు కూడా ప్రాముఖ్యత ఉండేది.
మొదట్లో ఔరంగజేబు కొన్నాళ్లు దౌలతాబాద్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఖుజిస్తా బునియాద్ (ఔరంగాబాద్)కు వచ్చారు.
అప్పటి మొఘల్ పాలకులకు ఈ ప్రాంతం చాలా నచ్చింది. ఇక్కడ వారు పెద్దపెద్ద కాలనీలు ఏర్పాటుచేశారు. వీటి చుట్టూ భారీ ప్రహరీ గోడలు నిర్మించారు. ఆ తర్వాత ఇది దక్కన్ ప్రాంత రాజధానిలా మారింది. మాలిక్ అంబర్‌లానే ఇక్కడ 11 నీటి కాలువలను ఔరంగజేబు నిర్మించారు.
ఈ నగర సౌందర్యం గురించి చాలా మంది సందర్శకులు తమ పుస్తకాల్లో రాశారని ఖురేషి వివరించారు. ''ఇక్కడి గాలి పరిమలిస్తుందని పర్యటకులు పుస్తకాల్లో రాశారు. ఇక్కడి నీటిని అమృతంతో పోల్చారు. 1681లో ఔరంగజేబు ఇక్కడికి వచ్చారు. ఖులతాబాద్‌లో తనకు సమాధాని నిర్మించాలని ఆయన సూచించారు''అని ఖురేషి చెప్పారు.
ధారాశివ్ కథ
ఉస్మానాబాద్ పేరును కూడా మార్చాలని దశాబ్దాలుగా శివసేన డిమాండ్ చేస్తూ వచ్చింది. 1990ల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన శివసేన నాయకుడు మనోహర్ జోషి కూడా ఈ నగరం పేరును ధారాశివ్‌గా మార్చాలని సూచించారు.
ధారాశివ్ అనేది ఉస్మానాబాద్ పాత పేరు. పారిపాలనా సౌలభ్యం కోసమే ఈ జిల్లా పేరును ఉస్మానాబాద్‌గా మార్చారని స్థానిక జర్నలిస్టు కమలాకర్ కుల్‌కర్ణి చెప్పారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటికీ ఈ నగరాన్ని ధారాశివ్‌గానే పిలుస్తారని ఆయన వివరించారు.
మహారాష్ట్రలోని మరాఠ్వాడ ప్రాంతం హైదరాబాద్ నిజాం పాలనలోకి వచ్చినప్పుడు చాలా నగరాల పేర్లు మార్చారు. వాటిలో ధారాశివ్ కూడా ఒకటి.
ధారాశివ్ గురించి చాలా కథలు ప్రచారంలో ఉండేవి. ఇక్కడ ధరాశుర్‌గా పిలిచే రాక్షశుడు నివాసం ఉండేవాడని స్కంద పురాణంలో పేర్కొన్నారు. ఆ రాక్షసుడి పేరు మీదనే ఈ ప్రాంతాన్ని మొదట ధరాశుర్‌గా పిలిచేవారు. ధరాశుర్.. శివుడి భక్తుడు. శివుడి నుంచి వరం పొందిన ధరాశురుడు ప్రజలను పీడించేవాడు.
అయితే, ధరాశుర్‌ను సరస్వతీ దేవి హతమార్చింది. దీంతో ధరాశురమర్దిని అని కూడా సరస్వతిని పిలుస్తుంటారు.
''ధారాశివ్ టు ఉస్మానాబాద్'' పేరుతో సీనియర్ జర్నలిస్టు భరత్ గజేంద్రగడ్కర్ ఒక పుస్తకం రాశారు. ''కొన్ని రాగి శాసనల్లోనూ ఈ ప్రాంతం పేరు ధారాశివ్‌గా పేర్కొన్నారు. 1972లో ఉస్మానాబాద్ జిల్లా గెజెట్‌లోనూ ధారాశివ్ పేరును ప్రస్తావించారు''అని తన పుస్తకంలో ఆయన పేర్కొన్నారు.
అయితే, ఉస్మానాబాద్‌గా పేరును ఎలా మార్చారనే అంశంపై భిన్నమైన వాదనలు ఉన్నాయని భరత్ చెప్పారు. 1990ల్లో హైదరాబాద్ నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్.. ధారాశివ్‌ను ఉస్మానాబాద్‌గా పేరు మార్చారని చాలా ఆధారాలు ఉన్నాయని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- రెండుసార్లు సీఎం.. ఇప్పుడు డిప్యూటీ సీఎం.. దేవేంద్ర ఫడణవీస్ స్థాయిని బీజేపీ అధిష్ఠానం తగ్గించిందా?
- జూలై 1: ఈరోజు నుంచే.. వారానికి 4 రోజులే పని, 3 రోజులు సెలవు.. ఉద్యోగుల జీవితాల్లో, జీతాల్లో వచ్చే మార్పులు ఇవీ..
- ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
- ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వాలు జీవోలను ఎందుకు బయటకు రానివ్వడం లేదు, జగన్మోహన్ రెడ్డి సర్కారు మరింత రహస్యంగా వ్యవహరిస్తోందా?
- విశాఖ సమీపంలో గోల్కొండ నవాబుల గ్రామం 'షేర్ మహమ్మద్ పురం'... బొబ్బిలి సంస్థానానికీ ఈ ఊరికీ ఏమిటి సంబంధం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















