ఆపరేషన్ లోటస్: శివసేనలో ముసలం వెనుక బీజేపీ ఉందనడానికి 5 అనుమానాలు ఇవేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆశిష్ దీక్షిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌కు ఏదైనా బహిరంగంగా మాట్లాడతారనే పేరు ఉంది.
మహారాష్ట్రలోని అధికార కూటమి 'మహావికాస్ అఘాడీ'లో అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని ఆయన ప్రతీవారం అంచనా వేస్తూనే ఉన్నారు.
ఇప్పుడు అక్కడి ప్రభుత్వం దాదాపుగా కూలిపోయే స్థితికి చేరింది. కానీ, పాటిల్ దీని గురించి ఇప్పుడు ఏమీ మాట్లాడటం లేదు.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం గురించి విలేఖరులు ఆయనను ప్రశ్నించగా... '' ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటు చేయడం శివసేన పార్టీ అంతర్గత వ్యవహారం'' అని పాటిల్ బదులిచ్చారు.
కానీ, ఇది నిజంగానే శివసేన అంతర్గత వ్యవహారమా? లేక ఈ తిరుగుబాటు వెనుక బీజేపీ హస్తం ఉందా?
ఒకవేళ ఇది బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నడిపిన 'ఆపరేషన్ లోటస్' అయితే దీని గురించి బీజేపీ ఇంకా ఎందుకు బయట పడట్లేదు? ఇలాంటి ప్రశ్నలు తలెత్తక తప్పదు.

ఫొటో సోర్స్, Getty Images
గత రెండున్నర ఏళ్లుగా శివసేనలో చీలికలు ముదురుతున్నాయి. పార్టీలోని పలువురు అగ్రనేతలు కోపంగా ఉన్నారు. ఉద్ధవ్‌ఠాక్రేను సంప్రదించడం పార్టీలోని ఎమ్మెల్యేలకు కూడా కష్టమేనని చెబుతుంటారు.
తమ ప్రాంతంలో చిన్నా చితక పనులు కూడా జరగకపోవడంతో శివసేన పార్టీకి చెందిన కొందరు అధికారులు ఆగ్రహంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి సెక్యులర్ ప్రభుత్వంలో ఉండటం, కాషాయమద్దతుదారులైన శివసేన సైనికుల్లో అసంతృప్తికి, అసహనానికి కారణమై ఉండొచ్చు.
అంతర్గత విభేదాల కారణంగా మహారాష్ట్ర వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని దాదాపు గత ఏడాదిన్నర కాలంగా దేవేంద్ర ఫడ్నవీస్ అంటున్నారు.
కానీ, ఇప్పుడు ప్రభుత్వం కూలిపోతున్నవేళ... ఇది శివసేన పార్టీ అంతర్గత వ్యవహారమని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
కానీ, ఈ వ్యవహారాన్నంత నిశితంగా పరిశీలిస్తే, ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటు జెండా ఎగురవేయడంలో బీజేపీ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ తిరుగుబాటును 'ఆపరేషన్ లోటస్' అని చెప్పేందుకు అయిదు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. వాటి గురించి చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
1. ఎయిర్‌పోర్ట్‌లో మోహిత్ కాంబోజ్
ముంబై బీజేపీలో మెహిత్ కాంబోజ్ అందరికీ సుపరిచితుడు. సూరత్ విమానాశ్రయంలో శివసేన ఎమ్మెల్యేలను విమానంలోకి ఎక్కిస్తూ మోహిత్ కాంబోజ్ కనిపించారు. ఒకవేళ ఇది శివసేన అంతర్గత వ్యవహారమైతే... శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సహాయం చేయడానికి కాంబోజ్ అక్కడికి ఎందుకు వెళ్లినట్లు? ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే... ఎమ్మెల్యేల కోసం విమానాన్ని, ఫైవ్‌స్టార్ హోటల్‌ను ఎవరు బుక్ చేశారు?
మోహిత్ కాంబోజ్ స్వస్థలం ఉత్తర్ ప్రదేశ్. ఆయన ధనవంతుడైన నగల వ్యాపారి. 2004లో బీజేపీ ఆయనకు ముంబైలోని డిండోషి స్థానం నుంచి టిక్కెట్ ఇచ్చింది. ఆ సమయంలో ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తనకు రూ.250 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు. చాలామంది సీనియర్ నేతలను కాదని మోహిత్‌కు టిక్కెట్ ఎలా ఇచ్చారని అప్పట్లో జోరుగా చర్చ జరిగింది.
ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీలో ఆయన స్థాయి ఏమాత్రం తగ్గలేదు. ముంబై పోలీస్ ఆర్థిక నేరాల విభాగం ఆయనపై కేసు కూడా నమోదు చసింది. కానీ, తాను ఎలాంటి ఆర్థిక కుంభకోణానికి పాల్పడలేదని కాంబోజ్ చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
2. ఏక్‌నాథ్ శిందేతో సంజయ్ కుటె
బీజేపీ యువ నాయకుడు డాక్టర్ సంజయ్ కుటే. దేవేంద్ర ఫడ్నవీస్‌కు విశ్వాసపాత్రునిగా ఆయన ఇటీవల గుర్తింపు పొందారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు సూరత్‌కు వెళ్లినప్పుడు అందరికంటే ముందుగా సంజయ్ కుటె అక్కడికి చేరుకున్నారు.
ఉద్ధవ్ ఠాక్రే ప్రతినిధి మిలింద్ నార్వేకర్, సూరత్ హోటల్‌కు చేరుకోవడానికంటే ముందే ఏక్‌నాథ్ శిందేను సంజయ్ కుటె కలిశారు. ఆయన ఎమ్మెల్యేలను కలవడమే కాకుండా వారితో అక్కడే ఉన్నారు.
తిరుగుబాటు ఎమ్మెల్యేలు, గువాహటి చేరుకున్నప్పుడు కూడా సంజయ్ అక్కడే ఉన్నారు. అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్ వెనుక సీట్లో కూర్చొనే సంజయ్ కుటె, రాజకీయ వర్గాల్లో చాలా ఫేమస్. ఇటీవలి రాజ్యసభ, శాసన మండలి ఎన్నికల సమయంలో పోలింగ్ ఏజెంట్‌గా డాక్టర్ సంజయ్ కుటె పనిచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
3. బీజేపీ పాలక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు
శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ నాయకుడిపై మాత్రమే కోపంగా ఉంటే, మహారాష్ట్రలో ఎక్కడైనా కూర్చొని ఫోన్ ఆఫ్ చేసి తమ అసంతృప్తిని వ్యక్తం చేయవచ్చు.
మహారాష్ట్రలో తలదాచుకోవడానికి వేల సంఖ్యలో హోటళ్లు ఉన్నాయి. ఇంతకు ముందు అజిత్ పవార్ లేదా మరే ఇతర నాయకుడికైనా కోపం వచ్చినప్పుడు రాష్ట్రం పరిధిలోనే వేరే ప్రాంతానికి వెళ్లి తమ ఫోన్లు స్విచాఫ్ చేసేవారు.
కానీ, ఏకనాథ్ శిందే ఇలా చేయలేదు. ఆయన లోనావాలా లేదా ముల్షీకి వెళ్ళలేదు. మహారాష్ట్ర సరిహద్దు దాటి గుజరాత్ వెళ్లారు. గుజరాత్ కేవలం బీజేపీ పాలిత రాష్ట్రం మాత్రమే కాదు… అది మోదీ- అమిత్‌షాల కోట. దీన్ని బట్టి వారు గుజరాత్ పోలీసుల రక్షణలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఆ తర్వాత ఎమ్మెల్యేలంతా మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంకు వెళ్లారు. అక్కడ కూడా వారికి స్థానిక పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. ఇది శివసేనలో పెల్లుబికిన అంతర్గత అసంతృప్తి అయితే… ఈ మరాఠీ ఎమ్మెల్యేలంతా వేల మైళ్ల దూరంలో ఉన్న గువాహటికి ఎందుకు వెళ్తారు? బీజేపీ సహాయం లేకుండా ఇదంతా సాధ్యం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
4. ఏక్‌నాథ్ శిందే డిమాండ్
ఉద్ధవ్ ఠాక్రేకు ఏక్‌నాథ్ శిందే చేసిన డిమాండ్ తన అసంతృప్తికి సంబంధించినది కాదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఉద్ధవ్ ఠాక్రేపై శిందేకు నిజంగా కోపం ఉంటే... బీజేపీతో పొత్తు గురించి మాట్లాడకుండా, ఆయనపై తనకున్న ఫిర్యాదుల గురించి మాట్లాడేవారు.
బీజేపీతో తెగదెంపులు చేసుకున్న ఉద్ధవ్ ఠాక్రే, మహావికాస్ అఘాడీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. గత రెండున్నరేళ్లలో ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ పరస్పరం చాలా విమర్శలు చేసుకున్నారు. ఇదంతా జరిగిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే మరోసారి బీజేపీతో కలిసి నడవలేరన్న సంగతి ఏక్‌నాథ్ శిందేకు తెలుసు.
అయినా, ఆయన ఇలాంటి డిమాండ్ ఎందుకు చేస్తున్నారు? ఒకవేళ ఉద్ధవ్ ఠాక్రే, ఈ డిమాండ్‌కు అంగీకరిస్తే బీజేపీ, దేవేంద్ర ఫడ్నవీస్‌లకు ప్రయోజనం చేకూరేది. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి పోయేది. అప్పుడు ఫడ్నవీస్ సీఎం అయ్యే అవకాశం ఉండేది.
శివసేన నుంచి వెళ్లిపోకూడదు అని శిందే అనుకొని ఉంటే…మరో పార్టీ నాయకుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసి ఉండేవాడు కాదు.

ఫొటో సోర్స్, EKNATHSHINDE
5. ఏక్‌నాథ్ శిందే భాష
ఈ సంక్షోభ సమయంలో ఏక్‌నాథ్ శిందే మాట్లాడిన మాటలను నిశితంగా పరిశీలిస్తే, ఆయన బీజేపీ భాషలో మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ''అధికారం కోసం 'బాలాసాహెబ్ హిందుత్వ'ను వదలిపెట్టడం సరైనది కాదు'' అని శిందే అన్నారు. ఇదే మాటను దేవేంద్ర ఫడ్నవీస్, చంద్రకాంత్ పాటిల్‌తో పాటు బీజేపీకి చెందిన అనేక మంది ప్రతినిధులు గతంలో చాలాసార్లు వ్యాఖ్యానించారు.
బీజేపీ, శివసేనతో బంధాన్ని తెంచుకున్నప్పటికీ, బాలాసాహెబ్‌ను వారసుడిగా పేర్కొంది. అయితే కాంగ్రెస్, ఎన్సీపీలతో శివసేన ముడిపడినప్పటి నుంచి... అధికారం కోసం ఉద్ధవ్ ఠాక్రే, బాలసాహెబ్ పాటుపడిన హిందుత్వతో రాజీ పడ్డారని ఫడ్నవీస్ పదేపదే ఆరోపించారు.
ఇప్పుడు ఏక్‌నాథ్ శిందే కూడా ఇదే చెబుతున్నారు. ఆయన ఉద్ధవ్ ఠాక్రే పేరును నేరుగా ప్రస్తావించట్లేదు. కానీ, అధికారంలోకి రావడానికి 'బాలా సాహెబ్ హిందుత్వ'ను ఉద్ధవ్ ఠాక్రే వదిలిపెట్టారని పరోక్షంగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రస్తుతం శిందే వర్గానికి బీజేపీ ఎంత దూరం పాటిస్తున్నప్పటికీ, అంతర్గత సమస్యల వల్లే శివసేనలో రాజకీయ సంక్షోభం తలెత్తిందని చెబుతున్నప్పటికీ... శివసేన ప్రస్తుత పరిస్థితికి బీజేపీ కారణమనేది స్పష్టంగా తెలుస్తోంది.
శిందే వర్గంలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు చేరినట్లు తెలుస్తోంది. శిందేకు ఉప ముఖ్యమంత్రి పదవిని బీజేపీ ఆఫర్ చేసినట్లు సమాచారం. త్వరలోనే శిందే, ఫడ్నవీస్ బహిరంగంగా ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇవి కూడా చదవండి:
- ఎలాంటి మదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోవడం ఎలా, కొలమానాలు ఏంటి?
- రష్యా చమురు భారత్ మీదుగా దొంగచాటుగా యూరప్ వెళ్తోందా
- ‘ఇళ్లలో నిద్రిస్తున్నవారు నిద్రిస్తున్నట్లే ప్రాణాలొదిలారు’
- మీ ముఖం మీదే సెక్స్ చేసే ఈ సూక్ష్మజీవుల గురించి మీకు తెలుసా
- అగ్నిపథ్: అగ్నివీరుల భవిష్యత్‌పై 10 ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










