Oil: రష్యా చమురు భారత్ మీదుగా దొంగచాటుగా యూరప్ వెళ్తోందా

చమురు

ఫొటో సోర్స్, Reuters

యుక్రెయిన్‌పై దాడి తర్వాత, రష్యాపై పశ్చిమ దేశాలు కఠినమైన ఆంక్షలు విధించాయి. దీంతో ఆర్థిక వ్యవస్థను కాపాడుకునే దిశగా రష్యా చర్యలు మొదలుపెట్టింది.

తమ చమురు, గ్యాస్ పరిశ్రమల ఉత్పత్తులను కొనుగోలుచేసే సంస్థలు, దేశాల కోసం రష్యా అన్వేషిస్తోంది.

తాజాగా చైనాకు భారీగా చమురు, గ్యాస్ సరఫరా చేస్తున్న సౌదీ అరేబియా స్థానాన్ని రష్యా భర్తీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

చమురు, గ్యాస్ దిగుమతులపై చైనాకు రష్యా భారీ డిస్కౌంట్లు ఇస్తోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి డిస్కౌంట్లతోనే కొత్త కొనుగోలుదారులకు రష్యా చేరువ అవుతోంది.

భారత్, చైనా

ఫొటో సోర్స్, Getty Images

చైనాతోపాటు భారత్‌కు కూడా చమురు, గ్యాస్‌ను రష్యా భారీగా విక్రయిస్తోంది.

యుక్రెయిన్‌పై దాడికి ముందు భారత్‌ దిగుమతి చేసుకునే చమురుల్లో రష్యా వాటా ఒక శాతం కంటే తక్కువే ఉండేది. ఇప్పుడది దాదాపు 18 శాతానికి పెరిగింది.

ఇలా కొత్త సంస్థలు, దేశాలకు చమురు, సహజ వాయువులను విక్రయిస్తూ..యుక్రెయిన్‌లో దాడికి అవసరమైన ఆదాయాన్ని రష్యా సంపాదిస్తోంది.

చమురు

ఫొటో సోర్స్, Reuters

చాలా చవకగా..

చైనా అధికారిక గణాంకాల ప్రకారం.. మే నెలలో రష్యా నుంచి చైనా దిగుమతి చేసేకున్న ముడి చమురు రికార్డు స్థాయిలో 84.2 లక్షల టన్నులకు పెరిగింది. దీనిలో ''తూర్పు సైబీరియా పసిఫిక్ మహాసముద్రం పైప్‌లైన్'' నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు కూడా ఉంది.

గత ఏడాది మే నెలతో పోల్చినప్పుడు రష్యా నుంచి చైనాకు ఎగుమతయ్యే చమురులో 55 శాతం పెరుగుదల కనిపించింది.

గత కొన్ని నెలలుగా చైనా ప్రభుత్వ చమురు సంస్థలు సైనోపెక్, జిన్‌హువా.. ముందెన్నడూ లేని స్థాయిలో భారీగా చమురును దిగుమతి చేస్తున్నాయి.

ఈ సంస్థలకు రష్యా భారీగా డిస్కౌంట్లు ఇస్తోంది. యుక్రెయిన్‌పై దాడి అనంతరం పశ్చిమ దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు చైనాకు పెద్దయెత్తున చమురును ఎగుమతి చేస్తున్న రెండో దేశంగా సౌదీ అరేబియా మారింది. మే నెలలో మొత్తంగా 78.2 లక్షల టన్నుల చమురును చైనాకు సౌదీ అరేబియా ఎగుమతి చేసింది.

కేవలం రష్యా నుంచి మాత్రమే కాదు, పశ్చిమ దేశాల ఆంక్షలు అమలులోనున్న ఇరాన్ నుంచి కూడా చైనా భారీగా చమురును కొనుగోలు చేస్తోంది. మే నెలలో మొత్తంగా 2.60 లక్షల టన్నుల చమురును ఇరాన్‌ నుంచి చైనా కొనుగోలు చేసింది.

రష్యా

ఫొటో సోర్స్, Reuters

ఆంక్షలు తప్పించుకునేలా..

పశ్చిమ దేశాల ఆంక్షల నడుమ రష్యా పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు తగ్గుతూ వస్తున్నాయని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఈఆర్ఏ) తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది.

అయితే, తమ ఎగుమతులను పెంచుకునేందుకు రష్యా కొన్ని పక్కదారులను ఎంచుకుంటోందని ఈ నివేదికలో హెచ్చరికలు చేశారు.

ముఖ్యంగా భారత్ లాంటి దేశాల ద్వారా ఐరోపా మార్కెట్‌లకు చేరాలనే వ్యూహాన్ని రష్యా అనుసరిస్తోందని సీఈఆర్ఏ హెచ్చరించింది. మొదట పెట్రోలియంను శుద్ధి చేయడానికి భారత్‌కు పంపిస్తారని, అక్కడి నుంచి మళ్లీ ఐరోపాలోని మార్కెట్లకు చేరుకునేందుకు ప్రయత్నిస్తారని పేర్కొంది.

''పెట్రోల్‌ను రిఫైనింగ్ చేయడానికి భారత్‌కు రష్యా ఎలా ఎగుమతి చేస్తోంది? అక్కడి నుంచి యురప్‌కు ఈ చమురు ఎలా వెళ్తోంది? లాంటి అంశాలపై ఈ నివేదికలో కొన్ని కీలకమైన అంశాలను వెల్లడించారు''అని బీబీసీ బిజినెస్ రిపోర్టర్ థియో లెగెట్ అన్నారు.

''ఇలాంటి మార్గాలను పూర్తిగా మూసివేసేలా పశ్చిమ దేశాలు చర్యలు తీసుకోవాలి''అని ఆయన వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, డోన్బాస్ యుద్ధరంగం నుంచి బీబీసీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

ఐరోపాకు ఎలా?

ప్రస్తుతం రష్యా చమురు, గ్యాస్ ఎగుమతులకు ఐరోపా దేశాలే అతిపెద్ద కొనుగోలుదారులుగా ఉన్నాయి.

యుక్రెయిన్‌పై దాడిచేసిన నాటి నుంచి తొలి వంద రోజుల్లో మొత్తంగా చమురు, గ్యాస్ అమ్మకాల ద్వారా యూరప్ నుంచి రష్యా 97 బిలియన్ డాలర్లు (రూ.7.59 లక్షల కోట్లు) అర్జించినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.

రష్యా నుంచి వచ్చే పెట్రోలియం ఉత్పత్తులు, చమురుపై పూర్తిగా నిషేధం విధించడంపై ఇప్పటివరకు ఐరోపా దేశాల మధ్య పూర్తి స్థాయి ఒప్పందం ఏమీ కుదరలేదు. ఈ ఏడాది చివరినాటికి సగానికిపైగా తగ్గించుకోవాలని యూరప్ భావిస్తోంది.

మరోవైపు గ్యాస్ దిగుమతులను కూడా ఏడాదిలోపే మూడింట రెండొంతులు తగ్గించుకోవాలని యూరోపియన్ యూనియన్ ప్రణాళికలు రచిస్తోంది.

అయితే, రష్యా నుంచి చమురు, గ్యాస్, బొగ్గు దిగుమతులపై అమెరికా పూర్తి నిషేధం విధించింది. బ్రిటన్ కూడా 2022 చివరి నుంచి ఇలాంటి నిషేధాన్నే అమలు చేయాలని భావిస్తోంది.

వీడియో క్యాప్షన్, ఖార్కీవ్‌లో రష్యా సేనలు నిషేధిత ఆయుధాలను విచక్షణారహితంగా ప్రయోగిస్తున్నాయన్న అమ్నెస్టీ

ఇది సాధ్యమేనా?

''చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో.. డిస్కౌంట్ల గురించి మనం మాట్లాడుకుంటున్న దేశాలే వరుసలో ముందు నిలబడుతున్నాయి''అని బీబీసీ గ్లోబల్ బిజినెస్ కరస్పాండెంట్ దర్శిని డేవిడ్ వ్యాఖ్యానించారు.

ప్రస్తుత పరిస్థితిని చైనా, భారత్ తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆమె అన్నారు.

అయితే, ఇలాంటి అడ్డదారుల్లో రష్యా ముందుకు వెళ్లడం సాధ్యంకాదని, త్వరలోనే యూరోపియన్ యూనియన్ ఆంక్షలు ప్రభావం చూపిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

''చమురు నుంచి రష్యా ఆదాయం తగ్గడం ఇప్పటికే మొదలైంది. ఇది రానున్న రోజుల్లో మరింత తగ్గుతుంది. ఎందుకంటే చాలా యూరోపియన్ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తున్నాయి''అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)