ఆయిల్ రేట్లను అమెరికా ఎందుకు నియంత్రించలేకపోతోంది? ఇది బైడెన్ వైఫల్యమేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నటాలీ షెర్మన్
- హోదా, బీబీసీ ప్రతినిధి, న్యూ యార్క్
మార్కెట్‌లో ఒకవైపు ఇంధన ధరలు పెరుగుతుండగా, మరో వైపు లాభాలను ఆర్జించేందుకు టెక్సస్‌కు చెందిన ఆయిల్ వ్యాపారి జ్యాసన్ హ్యారిక్ మరింత ఇంధనాన్ని సమకూర్చుకోవాలని చూస్తున్నారు.
దీని కోసం ఆయన ఎంత గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఈ ఏడాది ఆయన సంస్థ చేసే ఇంధన ఉత్పత్తి తగ్గుతుందనే అనుమానం కూడా ఉంది. వరుసగా మూడేళ్ళ నుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
ఇంధన ధరలు పెరిగిన తర్వాత ఆదాయం తగ్గడంతో పాంటెరా ఎనర్జీ గత కొన్నేళ్లుగా కొత్త ఉత్పత్తుల పై పెట్టుబడులు పెట్టలేదు. కోవిడ్ మహమ్మారి ప్రారంభ సమయంలో ఈ ఉత్పత్తి బాగా తగ్గిపోయింది.
అమెరికాతో పాటు ఇతర ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల్లో ఉన్న చాలా సంస్థల మాదిరిగానే హ్యారిక్ కూడా ప్రాజెక్టుల నిర్వహణకు తగిన సరఫరాలు, సిబ్బంది కోసం వెతకడంలో జాప్యాన్ని ఎదుర్కోవలసి వస్తోంది.
"ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత ఎక్కువ ఉత్పత్తి చేయడమే మా బాధ్యత, ఆ పనిని మేము చేస్తూనే ఉన్నాం" అని ఆయన అన్నారు.
"మేం చాలా వెనుకబడి ఉన్నాం. మార్కెట్ లో మిగిలిన వారిని అందుకోవడానికి చాలా కష్టంగా ఉంది" అని అన్నారు.
ప్రపంచంలోనే అత్యధికంగా ఇంధనం, గ్యాస్ ను ఉత్పత్తి చేస్తున్న అమెరికా నుంచి కనిపిస్తున్న సంకేతాల్లో ఇదొకటి. కుటుంబాల పై ప్రభావం చూపిస్తున్న ఈ ఇంధన ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు.
2021 ప్రారంభం నుంచి ఇంధనం, గ్యాస్ ధరలు రెండింతలు కంటే ఎక్కువగా పెరిగాయి.
యుక్రెయిన్ లో మొదలైన యుద్ధంతో రష్యా పై విధించిన ఆంక్షలు ఈ ధరలను మరింత పెరిగేలా చేశాయి.
అమెరికాలో ఈ ఏడాది ఇంధన ఉత్పత్తి రోజుకు సుమారు 10 లక్షల బ్యారెళ్ళు చొప్పున పెరగవచ్చని అంచనా.
కానీ, ఇది 10% కంటే తక్కువ. పెరుగుతున్న డిమాండును తట్టుకునేందుకు ఈ ఉత్పత్తి సరిపోదు. 2014లో ఇదే మాదిరిగా ధరలు పెరిగినప్పుడు ఆయిల్ ఉత్పత్తి 20% పెరిగి ఆయిల్ విప్లవం అత్యంత తీవ్ర స్థాయికి చేరింది.

ఫొటో సోర్స్, Google
ఉత్పత్తిని పెంచేందుకు ఆయిల్ సంస్థలు స్పందించకపోవడానికి పెరుగుతున్న ధరలు, ముడి సరుకులు, పరికరాలు, సిబ్బంది కొరత ఆటంకాలుగా నిలుస్తున్నాయి. మరో వైపు వాతావరణ మార్పులను అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో ఎంత మొత్తంలో ఇంధనం, గ్యాస్ అవసరం ఉంటుందోననే దీర్ఘకాలిక ప్రశ్నలు కూడా పెట్టుబడిదారుల నుంచి వస్తున్నాయి.
తమ సంస్థకు చాలా కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి కానీ అందుకు తగిన స్టీలు పైపులు మాత్రం లభించటం లేదని లోన్ స్టార్ ప్రొడక్షన్స్ అనే ఆయిల్ వెలికితీత సంస్థలో ఇంజనీర్ మైక్ వెండ్ చెప్పారు. దీంతో, ఉత్పత్తిలో జాప్యం, ధరల్లో పెరుగుదల ఏర్పడుతోందని అన్నారు.
"మేం ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఇంధనాన్ని వెలికి తీయాలని చూస్తున్నాం. కానీ డిమాండ్, సరఫరా ఇబ్బందులు తలెత్తడంతో మార్కెట్ ను కుదిస్తోంది" అని అన్నారు.
వాతావరణ మార్పులు
"ఉత్తర అమెరికాలో ఆయిల్ సంస్థలకు ఎదురవుతున్న సవాళ్ళను ఊహించలేకపోతున్నాం" అని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ లో ఆయిల్ & గ్యాస్ విశ్లేషకుడు ట్రే కొవాన్ చెప్పారు.
వెన్డ్ లాంటి చాలా సంస్థలు ఉత్పత్తిని పెంచేందుకు చూస్తుండగా, పెద్ద సంస్థలు తమ పెట్టుబడుల ప్రణాళికల దగ్గర ఆగిపోయారు.
వాతావరణ మార్పుల వల్ల వాల్ స్ట్రీట్ నుంచి వస్తున్న ఒత్తిడి ఇంధన పరిశ్రమ తమ విధానాలను కూడా మార్చుకునేలా చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ విధమైన మార్గం ఒక కొత్త మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది.
"ప్రపంచం శిలాజ ఇంధనాల నుంచి దూరంగా మరలుతుండగా ఇంధన డిమాండు పట్ల నెలకొన్న అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టకుండా ముందు సంపాదించిన లాభాలను పంచుకోవాలని సంస్థల పై ఒత్తిడి తెస్తున్నారు" అని ఎస్ & పి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ రౌల్ లీ బ్లాంక్ అన్నారు. .
"ఇంధనానికి డిమాండ్ తగ్గి వెసెల్స్ పనికిరాకుండా పోతాయనే ఆందోళన మార్కెట్ లో ఉంది. స్టాక్ ధరలకు దీర్ఘకాలిక విలువ లేకపోతే చాలా పెద్ద మొత్తంలో డివిడెండ్లు చెల్లించాల్సి రావచ్చు" అని అన్నారు.
"ఇంధన ధరలు ఎక్కువగా ఉండటంతో, సంస్థలు పెట్టుబడులను కొంత వరకు పెంచే అవకాశముంది" అని ఆయన అన్నారు.
"ఇంధనం పూర్తిగా అక్కర్లేదనే రోజులైతే రావు. కానీ, మనమింకా శిలాజ ఇంధనాల ప్రపంచంలోనే బ్రతుకుతున్నామని యుక్రెయిన్ యుద్ధం మరో సారి తెలియచేసింది. ఇంధన వాడకం నుంచి పక్కకు వైదొలగడాన్ని పూర్తిగా తోసిపడేయలేం. కానీ, దీని పై జరుగుతున్న చర్చ మాత్రం తక్షణ అవసరాలను తిరిగి తూకం వేసింది" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వాతావరణ మార్పుల నిబద్ధత పై ఊగిసలాట
జో బైడెన్ తన ఎన్నికల ప్రచారంలో వాతావరణ మార్పులను అరికట్టడాన్ని ఒక ముఖ్యమైన అంశంగా ఎంచుకోవడంతో ఈ చర్చ అమెరికా రాజకీయ రంగంలో భయాలను రేకెత్తించింది. కాలుష్య వాయువులను అరికట్టేందుకు పర్యావరణ నియమాల గురించి ప్రచారం చేయకుండా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వైపు మరిలేందుకు తొందర చేయవచ్చు.
బైడెన్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం పెట్టుబడులు పెట్టాలంటూ పిలుపునివ్వడంతో ఆయన గతంలో చేసిన భారీ ప్రతిపాదనలకు ఆటంకం ఏర్పడింది.
ఇంధన ధరలు పెరగడానికి బైడెన్ అవలంబించిన పర్యావరణ ఎజెండా కారణమని రిపబ్లికన్లు నిందిస్తుండగా, అమెరికాలోని సహజ వాయువు ఎగుమతులను పెంచేందుకు ఆయన ఒప్పందాల పై సంతకాలు చేశారు. జాతీయ నిల్వల నుంచి ఇంధనాన్ని విడుదల చేసి, ప్రభుత్వ భూముల్లో ఆయిల్ తవ్వకాలకు కొన్ని వందల అనుమతులు జారీ చేశారు.
"గతంలో వాతావరణ మార్పుల పట్ల చేసిన ప్రమాణాల విషయంలో బైడెన్ పాలక వర్గం పక్కకు తొలుగుతున్నట్లుగా కనిపిస్తోంది" అని గ్లోబల్ ఎనర్జీ మానిటర్ లో విశ్లేషకుడు రాబర్ట్ రోజన్స్కీ అన్నారు.
ఇలా చేసిన ప్రమాణాల నుంచి పక్కకు వైదొలగడం అమెరికాకు కొత్తేమీ కాదు.
బైడెన్ , బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తో సహా సహా పశ్చిమ దేశాల నాయకులు సౌదీ అరేబియా తో పాటు ఇతర దేశాల్లో ఉత్పత్తిదారులను సహాయం కోసం అభ్యర్ధించారు. ఈ దేశాలకు కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టకుండా ఉత్పత్తిని పెంచే సామర్ధ్యం ఉందని రోజన్స్కీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా, సౌదీ అరేబియా, రష్యా తర్వాత అధికంగా ఆయిల్ ఉత్పత్తి చేసే కెనడా ప్రభుత్వం కూడా చాలా కాలం నుంచి ఉత్పత్తి లేకుండా నిలిచిపోయిన ఆయిల్, గ్యాస్ ప్రాజెక్టులు, యూరప్ కు సహజ వాయువును ఎగుమతి చేసేందుకు టెర్మినల్స్ ఏర్పాటు గురించి చర్చలను పునరుద్ధరించింది.
"ఇది పూర్తిగా ఆలోచనా విధానంలో 180 డిగ్రీల మార్పు" అని పియరీడే ఎనర్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆల్ఫ్రెడ్ సోరెన్ సన్ అన్నారు.
గత ఏడాది పెట్టుబడిదారులు లేకపోవడంతో ఈ సంస్థ నోవాస్కోషియాలోని లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ టెర్మినల్ ప్రణాళికలను నిలిపేసింది.
కానీ, తిరిగి ప్రభుత్వం సహకారం అందిస్తుందనే సంకేతాలు అందడంతో ఈ ప్రాజెక్టును పునరుద్ధరించాలనే ఆలోచన చేస్తోంది.
ఆయిల్, గ్యాస్ కోసం కొత్త టెర్మినల్స్, పైపు లైన్ల నిర్మాణానికి ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత వల్ల మార్కెట్ లో ఎదురవుతున్న అనుమానాలను మారుతున్న రాజకీయ పవనాలు దాటగలవో లేదోననేది ప్రశ్నగానే మిగిలి ఉంది. ఈ వ్యతిరేకత వల్ల ప్రాజెక్టులు చట్ట సంబంధమైన సవాళ్ళను ఎదుర్కొంటూ కొన్నేళ్ల పాటు స్తబ్ధతకు గురి కావచ్చు.
"ఇంధనం, గ్యాస్ సరఫరా చేసి యూరప్ ను రక్షించాలని రాజకీయ నాయకులు, ఇంధన పరిశ్రమ చూస్తోంది" అని ఎకో జస్టిస్ లో న్యాయవాది గన్ వాల్డెన్ క్లాసెన్ అన్నారు.
"ప్రస్తుత కాలానికి పనికిరావని తెలిసినా కూడా మనం 20 వ శతాబ్దపు పరిష్కారాల పై ఆధారపడుతున్నాం" అని అన్నారు.
"ఉదాహరణకు పియరీడే నేచురల్ గ్యాస్ టెర్మినల్ 2027 వరకు సహజ వాయువును ఎగుమతి చేసేందుకు సిద్ధం కాదు. ఇది ప్రస్తుతం ఉన్న సంక్షోభానికి పరిష్కారం చూపించలేదు" అని అన్నారు.
"యూరప్, కెనడా, అమెరికాలో ఇంధన భద్రత సాధించాలంటే సుదీర్ఘ కాలం ఉండే ఇంధన వనరులను అభివృద్ధి చేసుకోగలగాలి" అని ఆయన అన్నారు. అలా చేయడం సాధ్యమే. అది తప్పనిసరిగా చేయాలి" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- Fake Currency notes: నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడం ఎలా.. ఈ పది విషయాలు గుర్తుపెట్టుకోండి
- మీ సెల్ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకోవడం ఎలా... హ్యాక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- సైబర్ మాయగాళ్లు వేసే ఎరలు ఎలా ఉంటాయి? వాటికి చిక్కుకోకుండా ఉండడం ఎలా : డిజిహబ్
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












