‘విజయవాడ నగరమంత విస్తీర్ణంలో ఉండే మొక్క.. భూమి మీద ఇదే అతి పెద్దది’

ఆస్ట్రేలియాలోని షార్క్ బేలో గల సముద్రపు జాతి గడ్డి

ఫొటో సోర్స్, Rachel Austin

ఫొటో క్యాప్షన్, సముద్ర తీరంలో నీటి అడుగున విస్తరించి ఉన్న రిబ్బన్ వీడ్ మొక్క
    • రచయిత, టిఫానీ టర్న్‌బుల్
    • హోదా, బీబీసీ న్యూస్, సిడ్నీ

విజయవాడ నగరమంత విస్తీర్ణంలో ఉండే మొక్కను ఎప్పుడైనా చూశారా? వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా అలాంటి మొక్క ఉంది.

భూమి మీద ఇప్పటివరకు మనకు తెలిసిన అతి పెద్ద మొక్క ఇదే.

ఆస్ట్రేలియాలోని సముద్ర తీరంలో ఈ మొక్కను గుర్తించారు. సముద్రపు గడ్డి జాతికి చెందిన ఈ మొక్క 180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.

సముద్రం అడుగున విస్తరించి ఉన్న ఈ మొక్క చూడటానికి గడ్డి మైదానంలా కనిపిస్తుంది.

ఒకే విత్తనం నుంచి పుట్టుకొచ్చిన ఈ మొక్క, సుమారు 4,500 ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఆస్ట్రేలియాలోని షార్క్ బేలో 180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మొక్క

ఫొటో సోర్స్, Angela Rossen

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియాలోని షార్క్ బేలో 180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మొక్క

ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి సుమారు 800 కిలోమీటర్ల దూరంలో ఉండే షార్క్ బేలో అనుకోకుండా ఈ మొక్కను గుర్తించారు.

రిబ్బన్ వీడ్ అని కూడా పిలిచే ఈ మొక్క ఆస్ట్రేలియా అంతటా కనిపిస్తుంది.

షార్క్ బేలో కనిపించిన సముద్రపు గడ్డి మైదానంలోని కాడలను సేకరించి వాటి జన్యువులను విశ్లేషించారు వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఒక్కో శాంపిల్ నుంచి సుమారు 18వేల జెనెటిక్ మార్కర్స్‌ అంటే జన్యువుల్లో కెమికల్ బాండిగ్స్‌ను క్రియేట్ చేశారు.

షార్క్ బేలో భారీగా విస్తరించిన గడ్డి మైదానంలో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయన్నది తెలుసుకోవడమే శాస్త్రవేత్తల లక్ష్యం. కానీ వారి పరిశోధనలో వచ్చిన ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయి.

ఎందుకంటే ఆ గడ్డి మైదనమంతా కేవలం ఒక్క మొక్కతోనే నిండి పోయి ఉందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన జేన్ ఎడ్జ్‌లోయ్ అన్నారు. 'షార్క్ బేలో 180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆ మొక్క విస్తరించి ఉంది. ఇప్పటి వరకు మనకు భూమి మీద తెలిసిన మొక్కల్లో ఇదే అతి పెద్దది.'

అనేక రకాల వాతావరణ పరిస్థితులు ఉండే ఆస్ట్రేలియా తీరాల్లో రిబ్బన్ వీడ్ పెరుగుతోంది

ఫొటో సోర్స్, Facebook/TourismWestrenAustralia

ఫొటో క్యాప్షన్, అనేక రకాల వాతావరణ పరిస్థితులు ఉండే ఆస్ట్రేలియా తీరాల్లో రిబ్బన్ వీడ్ పెరుగుతోంది

ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఈ మొక్క మనుగడ సాగించగలదు. అనేక రకాల వాతావరణ పరిస్థితులు ఉండే ఆస్ట్రేలియా తీరాల్లో ఈ మొక్క పెరుగుతోంది. ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గులు, సముద్ర జలాల్లోని లవణీయత, అధిక కాంతి వంటి వాటిని చాలా సముద్రపు జాతి మొక్కలు తట్టుకోలేవు. కానీ రిబ్బన్ వీడ్ మాత్రం అటువంటి కఠిన పరిస్థితులను చాలా చక్కగా తట్టుకుని నిలబడుతోందని పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ ఎలిజబెత్ అన్నారు.

ప్రతి ఏడాది 35 సెంటీ మీటర్ల చొప్పున ఈ మొక్క విస్తరిస్తూ పోతోంది. అందువల్లే ఇంత భారీ పరిమాణంలో విస్తరించేందుకు దానికి 4,500 సంవత్సరాలు పట్టి ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

ఈ పరిశోధన వివరాలు 'ది రాయల్ సొసైటీ' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)