అమెరికా వేస్తున్న ఎత్తులకు చైనా, భారత్ పైఎత్తులు వేస్తున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
రెండు ప్రపంచ శక్తులతో సంబంధాలను సమన్వయం చేసుకోవడంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలు ఇటీవల చాలా గందరగోళాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఇప్పటి వరకు ఈ దేశాలు ఆర్థిక సహకారం కోసం చైనాపై, భద్రతా సహకారం కోసం అమెరికా పై ఆధారపడుతూ వచ్చాయి. అయితే, చైనా అమెరికాల మధ్య ఇటీవల వైరం పెరగడం ఈ దేశాలకు ఇబ్బందిగా మారింది.
ఇటీవల జో బైడెన్ క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు ఆసియాను సందర్శించారు. ఈ సందర్భంగా ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్)పై సంతకం కూడా చేశారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని ఎదుర్కోవాలనే అమెరికా ఆందోళనకు ఇది నిదర్శనంగా మారింది.
మరోవైపు, పసిఫిక్ ప్రాంతంలోని బ్రిక్, ఐలాండ్ నేషన్స్ తో చైనా సన్నిహిత సంబంధాలను పెంచుకుంటోంది. ఇక అదే సమయంలో ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్‌లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. దీంతో ఈ ప్రాంతంలో ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి మరింత క్లిష్టంగా మారినట్లు అర్థమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్‌కు వ్యతిరేకంగా చైనా ప్రచారం
ఈ ప్రాంతీయ దేశాల శ్రేయోభిలాషిగా తనను తాను చూపించుకోవడానికి చైనా నిరంతరం ప్రయత్నిస్తోంది. అలాగే తనతో వ్యాపార భాగస్వామ్యాల వల్ల ప్రయోజనాలను కూడా వివరిస్తోంది.
అదే సమయంలో అమెరికాతో ఒప్పందాలలోని లోపాలను చైనా ముందుకు తెస్తోంది.
అమెరికాతో ఇటీవల ఆసియా ప్రాంతంలోని దేశాలు చేసుకున్న ఒప్పందాన్ని ఆయా దేశాలపై ఒత్తిడి చేసి చేసుకున్న ఒప్పందంగా అభివర్ణించిన చైనా, అమెరికా ఈ దేశాలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని, ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలపై ప్రభావం చూపుతుందని అంటోంది.
చైనాను ఒంటరిని చేయడానికే బైడెన్ ఆసియాలో పర్యటిస్తున్నారని, ఒప్పందాలు చేసుకుంటున్నారని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆరోపించారు. ఆర్థిక వ్యవహరాలతో ఈ దేశాలు చైనా పక్షమో, లేదా అమెరికా పక్షమో వహించాలని అమెరికా నిరంతరం ఒత్తిడి తెస్తోందని వాంగ్ అన్నారు.
అమెరికా ప్రయత్నాలను కుట్రగా అభివర్ణించిన వాంగ్ యి, అమెరికా కుదుర్చుకున్న తాజా ఒప్పందం నాటోకు ఆసియా-పసిఫిక్ వెర్షన్ గా అభివర్ణించారు. ఇది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీస్తుందని చైనా అంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అధికారిక వార్తాపత్రిక పీపుల్స్ డైలీ మే 27న తన వార్తలలో, చైనా, అమెరికా స్నేహితులు ఒకే వర్గానికి చెందినవారని, ఆసియాన్ దేశాలు రెండు శక్తుల్లో ఎవరో ఒకరి పక్షం వహించాలని కోరుకోవడం లేదని రాసింది.
సింగపూర్ ప్రధాని లీ జియాన్ లూంగ్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలు రెండు ప్రపంచ శక్తులతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాయని ఆయన అన్నారు. ఆసియా దేశాలను చైనా పక్షం, అమెరికా పక్షం అంటూ వర్గాలుగా విభజించడం సరికాదని సూచించారు.
చైనా అధికారిక వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ తన నివేదికలో ఐపీఈఎఫ్ లో చేరే దేశాల మధ్య భిన్న వైఖరులు ఉన్నాయని పేర్కొంది. దక్షిణ కొరియా, ఇండియా, సింగపూర్ ఈ ఫ్రేమ్‌వర్క్‌లో చేరడం గురించి డైలమాలో ఉన్నాయని ఈ రిపోర్ట్ పేర్కొంది. ఎందుకంటే ఈ ఒప్పందం 'చైనాను నియంత్రించేలా' కనిపించాలని అవి కోరుకుంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ లలో కొత్త ప్రభుత్వాలు
ఐపీఈఎఫ్ చేరిన 13 దేశాలలో ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఈ దేశాలలో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అయితే, చైనాతో సంబంధాల విషయంలో కొత్త ప్రభుత్వాల దగ్గర స్పష్టమైన వ్యూహమంటూ ఏమీ లేదు.
ఆస్ట్రేలియా కొత్త ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ చైనా పట్ల "హేతుబద్ధమైన" విధానాన్ని అవలంబిస్తారని గ్లోబల్ టైమ్స్ పత్రిక తన సంపాదకీయంలో ఆశాభావం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఆ దేశ మాజీ ప్రధాని స్కాట్ మోరిసన్ చైనా వ్యతిరేక విధానాన్ని అవలంబించారు.
అయితే, మే 24న జరిగిన క్వాడ్ కాన్ఫరెన్స్‌కు హాజరైన తర్వాత, అదే వార్తాపత్రిక అల్బనీస్‌కు వ్యతిరేకంగా ఒక కథనాన్ని ప్రచురించింది. కొత్త ప్రధానమంత్రి పాత ప్రధానమంత్రి నీడ నుంచి ఇంకా బయటకు రాలేదని విమర్శించింది.
దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా యున్ సుక్-యోల్ మే 10న ప్రమాణ స్వీకారం చేయగా, చైనా ప్రభుత్వ మీడియా కూడా ఆయనపై చాలా ఆశలు పెట్టుకుంది.
థాడ్ (THAAD) అనే అమెరికా క్షిపణి నిరోధక వ్యవస్థ నుంచి బైటకు రావాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ నిర్ణయం తీసుకోవడంపై గ్లోబల్ టైమ్స్ ఆయనను ప్రశంసించింది. యున్ చైనాతో సత్సంబంధాలు కొనసాగిస్తారని ఆ పత్రిక విశ్వాసం వ్యక్తం చేసింది.
అయితే, చైనాకు తాను దూరమన్న సంకేతాలను పంపుతూ దక్షిణ కొరియా మళ్లీ అమెరికాతో ఐపీఈఎఫ్ ఒప్పందంలో చేరింది. చైనా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని అమెరికాతో కలిసి దక్షిణ కొరియా ఒక ప్రకటన విడుదల చేసింది.
దక్షిణ కొరియాలో చైనా రాయబారి, జింగ్ హెమింగ్, మే 20న ఈ నిర్ణయాన్ని విమర్శించారు. చైనాను పారిశ్రామికంగా సప్లై చైన్ నుంచి దూరం చేయడం మార్కెట్ ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు.

ఫొటో సోర్స్, NEWS1
మే 9న, ఫిలిప్పీన్స్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ గెలుపొందారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇది మంచి సంకేతంగా దీనిని చైనా అభివర్ణించింది.
చైనా ప్రభుత్వ మద్దతుగా జాతీయవాద వెబ్‌సైట్ గ్వాంచా మార్కోస్ ప్రకటనను ప్రముఖంగా ప్రదర్శించింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకుంటాయని ఈ పత్రిక ఆశాభావం వ్యక్తం చేసింది.
అయితే, మే 26న మార్కోస్ దక్షిణ చైనా సముద్రంపై 2016 అంతర్జాతీయ నిర్ణయాన్ని అమలు చేస్తానని వాగ్దానం చేశారు. దీంతోపాటు తమ సముద్ర సరిహద్దు హక్కులలో ఒక మిల్లీమీటర్ పైన కూడా ఇతర దేశాల జోక్యాన్ని తాను అనుమతించబోనని ఆయన హెచ్చరించారు.
ఈ ప్రకటనపై చైనా నుండి బలమైన స్పందన లేదు. అయితే చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తామని చైనా పునరుద్ఘాటించింది.
మార్కోస్ వ్యాఖ్యలను "చైనాపై ఇప్పటి వరకు చేసిన అత్యంత కఠినమైన వ్యాఖ్యలు"గా గ్వాంచా అభివర్ణించింది. ఫిలిప్పీన్స్ చైనాతో యుద్ధానికి దిగబోదన్న మార్కోస్ ప్రకటనను కూడా ఆ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది.

ఫొటో సోర్స్, Getty Images
చైనా బ్రిక్, పసిఫిక్ దీవుల వ్యూహం
బైడెన్ దక్షిణ కొరియా, జపాన్ పర్యటనలో ఉన్నప్పుడు, చైనా బ్రిక్( BRIC) దేశాలతో సమావేశమై, ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో ఈ కూటమిని విస్తరించాలని కోరింది.
అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ ఇప్పటికే ఈ గ్రూపులో చేరడానికి ఆసక్తి చూపారు. ఇండోనేషియా కూడా ఇదే ఆలోచనలో ఉంది.
అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి బ్రిక్ దేశాలు వాణిజ్య ఒప్పందాలను పెంచుకోవాలని, జాతీయ కరెన్సీని వేగవంతం చేయాలని చైనాలోని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
మే 26 నుండి జూన్ 4 వరకు, వాంగ్ యి పసిఫిక్ ద్వీప దేశాలను సందర్శించారు. అమెరికా, ఆస్ట్రేలియాల వాదనలకు వ్యతిరేకంగా తమ దేశం చేస్తున్న ప్రచారాన్ని చైనా మీడియా ప్రముఖంగా ప్రచురించింది.
"తన 'ఇండో-పసిఫిక్ స్ట్రాటజీ'లో భాగంగా చైనా విస్తరణను అడ్డుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే, ఇప్పుడు ఈ ప్రాంతంలో చైనా వ్యూహాలు చైనాకు ఉన్నాయి'' అని గ్లోబల్ టైమ్స్ పత్రికతో కొందరు విశ్లేషకులు రాశారు.
చైనాను లక్ష్యంగా చేసుకోవడం పై భయపడవద్దని సమావేశానికి హాజరైన మిత్రదేశాలకు వాంగ్ విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి మూడు రోజుల ముందు ఫిజీ ఐపీఈఎఫ్‌లో చేరనున్నట్లు ప్రకటించింది. అమెరికాతో ఈ ఒప్పందంలో చేరిన పసిఫిక్ ప్రాంతంలో ఇది మొదటి దేశం.
దక్షిణ కొరియా నుంచి ఫిజీ వరకు ఈ ప్రాంతంలో చైనా, అమెరికాల మధ్య ఆధిపత్య పోరు మరింత ముదురుతుందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
- Fake Currency notes: నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడం ఎలా.. ఈ పది విషయాలు గుర్తుపెట్టుకోండి
- మీ సెల్‌ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకోవడం ఎలా... హ్యాక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- సైబర్ మాయగాళ్లు వేసే ఎరలు ఎలా ఉంటాయి? వాటికి చిక్కుకోకుండా ఉండడం ఎలా : డిజిహబ్
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














