గాలిలో విమానం, అపస్మారక స్థితిలో పైలట్.. ఒక ప్రయాణికుడు ఏం చేశారంటే..

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మోర్గాన్ (ఎడమ)తో హ్యారిసన్
ఫొటో క్యాప్షన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మోర్గాన్ (ఎడమ)తో హ్యారిసన్

విమానం నడపటంలో ఎలాంటి అనుభవం లేని ఒక ప్రయాణికుడు, ఫ్లోరిడాలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. పైలట్ అనారోగ్యానికి గురికావడంతో ప్రయాణికుడు ఈ పని చేయాల్సి వచ్చింది.

విమానంలో ప్రమాదకర పరిస్థితి తలెత్తిందని అందులో ప్రయాణిస్తోన్న డారెన్ హ్యారిసన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ (ఏటీసీ)లోని సిబ్బందితో మాట్లాడటం విమానంలోని వాయిస్ రికార్డర్‌లో నమోదైంది.

అయితే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తగిన సమయంలో స్పందించి సహాయం చేయడంతో ఆ వ్యక్తి పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ల్యాండ్ చేయగలిగారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది.

బహమాస్ నుంచి ఫ్లోరిడాకు వెళ్తోన్న సమయంలో తనకు నలతగా అనిపిస్తోందని పైలట్, విమానంలోని ఇద్దరు ప్రయాణీకులకు చెప్పారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) తెలిపింది. ఆ తర్వాత ఆయన పరిస్థితి మరింత దిగజారింది.

పైలట్ అనారోగ్యానికి కారణాలు ఇంకా తెలియలేదు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే విమానంలో హ్యారిసన్, ఏటీసీ సిబ్బంది మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా సాగింది.

హ్యారిసన్: ''ఇక్కడ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. పైలట్ అపస్మారక స్థితిలో ఉన్నారు. విమానాన్ని ఎలా నడపాలో నాకు అసలు తెలియదు.''

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్: ''ఏటీసీ: 333 లీమా డెల్టా, రోజర్, అక్కడి పరిస్థితి ఏంటి?''

హ్యారిసన్: ''నాకు ఏం తెలియట్లేదు. కానీ, నాకు ఫ్లోరిడా తీరం కనిపిస్తోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు.''

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్: ''వింగ్స్ లెవల్‌ను అలాగే కొనసాగించండి. ఉత్తరం లేదా దక్షిణం దిశగా తీరం వైపు వచ్చేందుకు ప్రయత్నించండి. మేం మిమ్మల్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం.''

ఫ్లోరిడాలో విమానం

ఫొటో సోర్స్, CBS

పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా రాబర్ట్ మోర్గాన్ పనిచేస్తున్నారు. ఆయన బ్రేక్‌లో ఉన్న సమయంలో ఒక సహోద్యోగి వచ్చి విమానంలో తలెత్తిన పరిస్థితి గురించి ఆయనకు వివరించారు.

రాబర్ట్ మోర్గాన్, కొత్త పైలట్లకు శిక్షణ కూడా ఇస్తుంటారు.

సుదీర్ఘ కాలంగా విమాన శిక్షకుడిగా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో 20 ఏళ్లకు పైగా పని అనుభవం ఉన్న రాబర్ట్ మోర్గాన్‌కు ఈ తరహా విమానాన్ని నడిపిన అనుభవం లేదు. సింగిల్ ఇంజిన్ సెస్నా 208 విమానాన్ని ఆయన ఎప్పుడూ నడపలేదు. అయితే, ఆ విమానంలోని కాక్‌పిట్‌కు సంబంధించిన మ్యాప్ సహాయంతో ఆయన హ్యారిసన్‌కు మార్గనిర్దేశం చేయగలిగారు.

''మిగతా అన్ని విమానాల్లాగే ఇది కూడా ప్రయాణిస్తుందని నాకు తెలుసు. అందుకే అతన్ని ప్రశాంతంగా ఉంచాలనుకున్నా. రన్‌వే వైపు ఆయన వచ్చేలా చేశాను. తర్వాత పవర్‌ను ఎలా తగ్గించాలో ఆయనకు సూచించాను. తద్వారా ఆయన ల్యాండింగ్‌ చేయగలిగారు'' అని డబ్ల్యూపీబీఎఫ్ టీవీతో మోర్గాన్ చెప్పారు.

ఇది సినిమాల్లో చూపించే విధంగా జరిగిందని ఆయన అన్నారు. విమానం ల్యాండ్ అయ్యాక హ్యారిసన్‌ను కలుసుకున్న మోర్గాన్ ఆత్మీయంగా కౌగిలించుకున్నారు.

వీడియో క్యాప్షన్, బీచ్‌లో పర్యటకుల సమీపంలో కూలిన హెలికాప్టర్

ల్యాండింగ్ చేసే సమయం రాగానే '' కంట్రోల్స్‌ను ముందుకు నెట్టి, చాలా నెమ్మదిగా కిందకు దిగండి'' అంటూ హ్యారిసన్‌కు విమానం ల్యాండింగ్‌ ఎలా చేయాలో మోర్గాన్ నేర్పించడం ఆడియోలో రికార్డ్ అయింది.

విమానం ల్యాండ్ అయ్యాక వీరోచిత ప్రయాణికుడు అంటూ హ్యారిసన్‌ను మోర్గాన్ పొగిడారు.

తొలుత ఫ్లోరిడాలోని బొకా రాటన్‌లో విమానాన్ని ల్యాండ్ చేయాలని అనుకున్నారు. కానీ మోర్గాన్ సూచనలతో పామ్ బీచ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ పొడవైన రన్ వే ఉండటంతో పాటు కావాల్సినంత రేడియో కవరేజ్ అందుబాటులో ఉంది.

స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4: 30 గంటలకు మోర్గాన్ ఆధ్వర్యంలో హ్యారిసన్ విజయవంతంగా విమానాన్ని ల్యాండ్ చేశారు.

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఘటనపై విచారణ చేస్తోంది.

వీడియో క్యాప్షన్, విమానం చక్రాల్లో దాక్కుని వెళ్లినా బతికాడు, ఎలాగంటే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)