యుక్రెయిన్‌పై రష్యా రసాయనిక దాడులు చేస్తోందా? BBC FactCheck

ఫొటో సోర్స్, TELEGRAM
- రచయిత, అలిస్టర్ కోల్‌మన్,కేలిన్ డెవ్లీన్
- హోదా, బీబీసీ మానిటరింగ్
ప్రత్యర్ధులు దాడులు చేయకపోయినా చేశారని వాదించే పాత వ్యూహాన్ని రష్యా అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా యుక్రెయిన్ సైన్యాలు వారి దేశంలోని ఎరువులను నిల్వ చేసే ప్రాంతాలపై దాడులు చేస్తున్నాయని రష్యా ఆరోపించింది.
''తమపై రష్యన్లు రసాయన దాడులు చేస్తున్నాయని ఆరోపించడమే ఈ దాడుల ఉద్దేశం'' అని రష్యన్ రక్షణ శాఖ పేర్కొంది.
ఇది రష్యా వైమానిక దాడి అనుకునేలా చేయడానికి, ఈ దాడిలో మరణించిన వారంటూ కొన్ని శవాలను అక్కడికి చేర్చే ప్రయత్నం చేసిందని, ఇలాంటి ప్రయత్నాల్లో ఇది రెండోదని రష్యా ఆరోపించింది.
అయితే, ఈ ఆరోపణలలో ఏది నిజమో ఆధారాలు లేవు. తమను రెచ్చగొడుతున్నారంటూ ప్రత్యర్ధులపై తప్పుడు ఆరోపణలు చేసే చరిత్ర రష్యాకు ఉంది.
మాస్కో ఏం చెప్పింది?
మే 11న రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బ్రీఫింగ్‌లో ''యుక్రేనియన్ బలగాలు ఎరువులు ఉన్న ఒక ట్యాంకర్‌ను పేల్చేశాయి. బహుశా ఇందులో అమ్మోనియ నైట్రేట్ ఉండొచ్చు. దీనివల్ల అక్కడ పెద్ద ఎత్తున పొగ మేఘాలు కనిపించాయి'' అని పేర్కొంది.
మాస్కో అభిప్రాయం ప్రకారం, ఖార్కియెవ్ ప్రాంతంలో సంభవించిన పేలుడు లక్ష్యం, ''పశ్చిమ దేశాల నుండి అదనపు సైనిక సహాయాన్ని సంపాదించేందుకు రష్యా రసాయన ఆయుధాలను ఉపయోగిస్తోందని కీయెవ్ అధికారుల ద్వారా ఆరోపించడం'' అని ఈ ప్రకటన పేర్కొంది.
అయితే, ఈ పేలుడుకు యుక్రేనియన్ బలగాలే కారణమన్న వాదనకు మద్దతుగా ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, WIM ZWIJNENBURG
అసలేం జరిగింది?
నారింజ రంగు పొగలు ఆకాశంలోకి ఎగసిపడుతున్నట్లు చూపించే వీడియోలోని ప్రదేశాన్ని ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి పరిశీలించినప్పుడు ఇది ఖార్కియెవ్ నగరానికి సమీపంలో ఉన్న డోల్గెన్‌కోయ్ అనే ఏరియాలోని వ్యవసాయ క్షేత్రంఅని తేలింది.
రష్యన్ డ్రోన్ ఒక వస్తువును ఢీకొట్టిన తర్వాత, పొగ మేఘాలు ఏర్పడినట్లు టెలిగ్రామ్‌లో వచ్చిన నివేదికల ఆధారంగా యుక్రెయిన్ మీడియా వెల్లడించింది.
పేలుడు తరువాత యుక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయ అధిపతికి సలహాదారు అయిన ఒలెక్సీ అరెస్టోవిచ్, ఇది రష్యా రసాయన ఆయుధ దాడి అని తాను నమ్మడం లేదని చెప్పారు.
ఈ ఘటన తర్వాత రష్యా రసాయన ఆయుధాలను ఉపయోగించిందని యుక్రెయిన్ అధికారులు ఆరోపించినట్లు బీబీసీకి ఎలాంటి ఆధారాలు దొరక లేదు.
వ్యవసాయ క్షేత్రంలో ధ్వంసమైన భవనాలు పేలుడు కారణంగానే దెబ్బతిన్నట్లు కనిపిస్తునాయి. ఇక్కడ అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉన్న భవనాలకు నిప్పంటుకుంది. దీంతో ఇక్కడి నుంచి నారింజ రంగు పొగమేఘాలు ఏర్పడ్డాయని డచ్ హ్యుమానిటేరియన్ సంస్థ పాక్స్ లో ఆయుధాలపై పరిశోధన చేస్తున్న విమ్ జ్విజ్నెన్‌బర్గ్ చెప్పారు.
ఫిబ్రవరిలో రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి యుక్రెయిన్‌లో ఇలాంటి 40 వ్యవసాయ క్షేత్రాలు ధ్వంసమయ్యాయని జ్విజ్నెన్‌బర్గ్ చెప్పారు.
ఇటీవలి వారాల్లో, డోల్గెన్‌కోయ్ ప్రాంతం పెద్ద ఎత్తున రష్యా బలగాల దాడులకు గురైంది. శాటిలైట్ చిత్రాలలో షెల్లింగ్ కారణంగా ధ్వంసమైనట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, AFP
రష్యా ‘ఫాల్స్ ఫ్లాగ్’ ఆరోపణలు
మహిళలు, పిల్లల మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా యుక్రెయిన్ ప్రభుత్వం తమ దేశంలోని డాక్టర్లకు సూచించిందని దాదాపు 8 లక్షలమంది సబ్‌స్క్రైబర్లు ఉన్న రష్యన్ అనుకూల సోషల్-మీడియా ఛానెల్ ఆపరేషన్ జెడ్ ఆరోపించింది.
ఇలా చెప్పడానికి కారణం, వారు ఆ మృతదేహాలను ఆసుపత్రి నుంచి రష్యా దాడి చేయబోయే ఒక కమ్యూనిటీ సెంటర్ తరలిస్తారని, తద్వారా వీరంతా రష్యా దాడిలో మరణించారని చెప్పడానికేనని వెల్లడించింది.
మే 12న టెలిగ్రామ్ పోస్ట్‌లో "రష్యా మిలటరీ పౌరులను చంపిందని ఆరోపిస్తూ ద్నీపర్ ప్రాంతంలోని ప్రజలను రెచ్చగొట్టేందుకు యుక్రెయిన్ ప్రత్యేక ప్రయత్నాలు మొదలు పెట్టింది'' అని పేర్కొంది.
అయితే, రష్యా అనుకూల మీడియా చేసిన ఇలాంటి ఆరోపణలు నమ్మడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
బ్రిటన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు సుమీ అనే ప్రాంతంలోని నేలమాళిగల్లోకి ప్రజల మృతదేహాలను చేరుస్తున్నారని, వీరందరినీ రష్యన్ ఊచకోత బాధితులుగా పశ్చిమ దేశాలకు చూపించే ప్రయత్నం చేస్తోందని ఏప్రిల్ ప్రారంభంలో రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపించింది.
ఈ వాదనకు కూడా ఎటువంటి ఆధారాలు లేవు.

ఫొటో సోర్స్, Getty Images
గతంలోనూ అదే వైఖరి
కొన్ని సందర్భాల్లో రష్యా లేదా దాని అనుకూల వర్గాలు చేసే వాదనలు, భవిష్యత్తులో ఎప్పుడూ జరగని ఘటనలను కూడా సూచిస్తాయి.
సిరియా యుద్ధం సమయంలో మాస్కో పదేపదే వైట్‌హెల్మెట్ సివిల్ డిఫెన్స్ గ్రూప్, యూకే, అమెరికా, ఫ్రాన్స్, బెల్జియంలు రసాయన దాడులకు సిద్ధమవుతున్నాయని ఆరోపించేది. మరోవైపు ఆ దేశాలు కూడా రష్యా, సిరియాలపై ఇవే ఆరోపణలు చేసేవి.
చివరకు విచారణలో ఈ దాడులు చేసింది సిరియా ప్రభుత్వమేనని తేలింది.
యుక్రెయిన్ పై దాడికి ముందు కూడా రష్య వేర్పాటువాదులు చేసిన అనేక తప్పుడు ఆరోపణలపై కూడా బీబీసీ రిపోర్ట్ చేసింది. ఒక కాలిపోయిన, బులెట్ దెబ్బలు తిన్న కారు యుక్రెయిన్ తన తమ పౌరులపై దాడులు చేస్తోందనడానికి నిదర్శనమంటూ రష్యా అనుకూల వర్గాలు అప్పట్లో ఆరోపించాయి.
అయితే, ఈ కారులో ఉన్న మృతదేహాలను నిశితంగా పరిశీలించినప్పుడు అంతకు కొద్దిరోజుల ముందు పోస్ట్ మార్టం నిర్వహించిన మృతదేహాలను ఈ ఘటనలో ఉపయోగించారని, రష్యన్ వేర్పాటువాదులు ఆరోపిస్తున్న ఈ దాడి జరిగే నాటికే అందులో కనిపించిన దేహాలు మరణించినట్లు తేలింది.

ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీ 75 ఏళ్లకు రిటైర్ అవ్వరా? మూడోసారి కూడా ప్రధాని కావాలనుకుంటున్నారా?
- ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా.. సొంతిల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి
- హోంలోన్ వడ్డీ రేటు పెరిగినప్పుడు టెన్యూర్ పెంచుకుంటే మంచిదా లేక EMI ఎక్కువ కడితే బెటరా..
- తాజ్‌మహల్ ఒకప్పుడు తేజో మహాలయమా... ఆ 22 గదులలో ఏముంది?
- టంగ్-టై అంటే ఏంటి? పిల్లల్లో పెరుగుతున్న ఈ కొత్త సమస్యను గుర్తించడం ఎలా?
- సంపూర్ణ చంద్రగ్రహణం: ఎందుకు, ఎలా ఏర్పడుతుంది.. ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











