నూరేళ్ళు జీవించేందుకు ఫార్ములా ఉందా?

ఆ రోజు జనవరి 2, శుక్రవారం. జపాన్‌లోని ఒక గ్రామంలో ఒక అమ్మాయి పుట్టింది. ఆమెకు కేన్ అని పేరు పెట్టారు.

ఇది 1903 సంవత్సరం నాటి సంగతి. కేన్ తనాకా 119 సంవత్సరాల వయసులో ఏప్రిల్ 22న మరణించారు. ఆమె ప్రపంచంలోనే అత్యంత అత్యధిక కాలం జీవించిన వ్యక్తి.

ఆమె ఆఖరు రోజుల్లో ఒక నర్సింగ్ హోమ్‌లో ఉన్నారు. ఆమె పొద్దున్న ఆరు గంటలకే నిద్ర లేచేవారు. లెక్కలు సాధన చేసేవారు. బోర్డు గేమ్స్ ఆడేవారు. చాక్లెట్ తినేవారు. కాఫీ, సోడా కూడా తాగేవారు.

ఒకప్పుడు మన పూర్వీకులు 100 ఏళ్ళ వరకు జీవించి ఉండేవారని చెబుతారు. కానీ, ప్రస్తుతం అలాంటి ఆలోచన చేయడమే అసాధ్యంగా అనిపిస్తోంది. కానీ, పరిస్థితి మారుతోంది.

ప్రపంచమంతా నూరేళ్లు బ్రతకాలంటే ఏమి చేయాలి అనే విషయం పై కొన్ని అధ్యయనాలు జరుగుతున్నాయి.

ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు బీబీసీ నలుగురు నిపుణులతో మాట్లాడింది.

కేన్ తనాకా

ఫొటో సోర్స్, Reuters

సెకండ్ ఇన్నింగ్స్

"నూరేళ్లు బ్రతకడం అసాధారణమేమీ కాదు" అని జపాన్ సైన్స్ కౌన్సిల్ వైస్- ప్రెసిడెంట్ డాక్టర్ హిరోకో అకియామా అన్నారు. ఆయన వయసు పెరగడం పై అధ్యయనం చేశారు.

జపాన్‌లో జనాభా వేగంగా వయసు మీరుతున్నారని ఆమె చెప్పారు. జపాన్‌లో మహిళల సగటు వయసు 88 ఏళ్ళు కాగా, పురుషుల సగటు వయసు 82 ఏళ్ళు ఉంది. జపాన్ జనాభాలో 29 శాతం మంది 60 ఏళ్ళు దాటిన వారే ఉన్నారు.

సగటు వయసు విషయంలో హాంగ్ కాంగ్, సింగపూర్, స్విట్జర్లాండ్, ఇటలీ, స్పెయిన్ మాత్రమే జపాన్‌కు దగ్గరగా ఉంటాయి. గత ఏడాది జపాన్‌లో 86,510 మంది పౌరులు 100 సంవత్సరాలు దాటిన వారున్నారని జపాన్ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.

"జపాన్‌లో ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా ఉండటానికి చాలా కారణాలున్నాయి. అందులో యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానం ఒకటి. మేం దీనిని 1960లలో మొదలుపెట్టాం. ఇక్కడ ప్రజలు సులభంగా వైద్యాన్ని పొందగలరు" అని డాక్టర్ హిరోకో చెప్పారు. "జపాన్‌లో ప్రజలు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. వారి జీవన శైలి కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది" అని చెప్పారు.

జపాన్‌లో ప్రజలు చాలా కష్టపడే తత్త్వం కలవారు. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. తినే తిండి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కొవ్వు పదార్ధాలు తక్కువగా తింటారు. చేపలు, కూరగాయలు ఎక్కువగా తింటారు. గ్రీన్ టీ తాగుతారు.

ఇక్కడ జననాల రేటు తగ్గుతోంది. ఉద్యోగం చేసే వయసులో ఉండే జనాభా సంఖ్య క్రమంగా తగ్గుతోంది. వృద్ధుల జనాభా పెరుగుతున్న కొలదీ వారి అవసరాలు కూడా వేరుగా ఉంటాయని అర్ధమయింది.

ప్రభుత్వం ముఖ్యంగా ఆరోగ్యం, పెన్షన్ల పై దృష్టి పెడుతోంది. గృహనిర్మాణాలు, రవాణా పై కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. కానీ, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

వృద్ధులు

ఫొటో సోర్స్, Getty Images

వృద్ధులు ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా బతికేందుకు అవసరమైన మార్గాలు కనుక్కునేందుకు డాక్టర్ హిరోకో ఆయన బృందంతో కలిసి కొన్ని ప్రయోగాలు చేశారు.

"వృద్ధులు ఎక్కువగా ఉన్న సమాజపు అవసరాలకు అనుగుణంగా సమాజాన్ని పునర్నిర్మించాలని చూస్తున్నాం. వందేళ్ల వరకు ఆరోగ్యంగా, చైతన్యవంతంగా ఒకరితో ఒకరు కనెక్ట్ అయి సురక్షితంగా ఉండే విధంగా జీవించాలని చూస్తున్నాం. మేము కేవలం వృద్ధుల కోసమే కాకుండా అన్ని వయసుల వారి కోసం పని చేస్తున్నాం" అని డాక్టర్ హిరోకో చెప్పారు.

జపాన్‌లో పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రజలు కొత్త ఉద్యోగాలు చేస్తారు. వారు పదవీ విరమణ తర్వాత రెండవ కెరీర్‌ను కానీ, జీవితాన్ని రెండవ సారి కానీ మొదలుపెడతారు. దీని వల్ల వారి జీవితం క్రమబద్ధంగా ఉండి ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది.

డాక్టర్ హిరోకో అకియామాకు కూడా 78 సంవత్సరాలు. ఆయన రెండవ కెరీర్‌ను ఆస్వాదిస్తున్నారు.

"ఆమె చాలా రోజులు యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేశారు. నాకు 70 ఏళ్ళు ఉండగా వ్యవసాయం మొదలుపెట్టాను. నాతో పాటు మరో నలుగురు చేరారు. నాకు రైతు కావాలనే కల చిన్నప్పటి నుంచే ఉండేది" అని అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Science Photo Library

వృద్ధాప్యం అంటే ఏంటి?

"వృద్ధాప్యం అనేది వ్యక్తిగతమైన విషయం. వయసు పెరగడం అన్నది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు.

అని బర్మింగ్‌హాం‌లోని ఆస్టన్ రీసెర్చ్ సెంటర్‌లో సీనియర్ లెక్చరర్ కేథీ స్లాక్ చెప్పారు.

వయసు పెరిగే ప్రక్రియను తగ్గించవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెదికేందుకు కేథీ బృందం పరిశోధన చేస్తోంది.

వృద్ధాప్యం ఛాయలు బయటకు కనిపిస్తాయి. శరీరం పై ముడతలు పడటం, తల నెరవడంతో పాటు శరీరంలో అంతర్గతంగా కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి.

వృద్ధాప్యపు ఛాయలు శరీరంలో అన్ని కణాల పైనా చూపిస్తుంది. దీని ప్రభావం మెదడు నుంచి సంతానోత్పత్తి సామర్ధ్యం వరకు పడుతుంది. వీటిని వృద్ధాప్యపు సంకేతాలుగా భావిస్తారు.

"కణాల్లో ప్రోటీన్ నాణ్యత లోపం, మైటోకాండ్రియా అచేతనంగా అవ్వడం లాంటివి జరుగుతాయి".

"వృద్ధాప్యం మొదలవ్వగానే, మధుమేహం లాంటి సమస్యలు బయటపడతాయి. కణాలు పని చేసేందుకు పోషకాల సరఫరాను నియంత్రణ చేయడం కూడా అవసరమే.ఆరోగ్య సమస్యలు మొదలైనప్పుడు స్టెమ్ కణాలు నాశనమవుతూ ఉంటాయి. ఇవి కణాలను రిపేర్ చేస్తూ ఉంటాయి. ఆలోచనా శక్తిలో మార్పులు వస్తాయి" అని కేథీ వివరించారు.

వందేళ్లు జీవించడం ఎలా అనే విషయం గురించి కేథీ మాట్లాడారు.

"వయసు పెరుగుతున్న కొలదీ మెదడు పరిమాణం కూడా తగ్గుతుంది. దీంతో, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. పనులు చేసే సామర్ధ్యం తగ్గుతుంది. ప్రవర్తనలో మార్పులు వస్తాయి. వాళ్ళు ఒత్తిడికి లేదా ఆందోళనకు గురవుతారు. కానీ, ఇవన్నీ అందరిలోనూ ఒకేలా ఉండవు" అని అన్నారు.

"సమాజంలో చాలా మంది వృద్ధులున్నారు. కానీ, వారి ఆరోగ్యం బాగుండదు. ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి. దీని కోసం ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలి. ఎప్పుడూ చురుకుగా ఉండాలి. వయసు పెరుగుతున్న కొలదీ పనులు కూడా ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. మద్యం ఎంత సేవిస్తున్నామో చూసుకోవాలి. పొగ తాగడం మానాలి" అని సూచించారు.

క్యాన్సర్ లాంటి రోగాలపై చాలా మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కానీ, కేథీ లాంటి వారు వీటిని వయసు సంబంధిత రోగాలుగా చూస్తున్నారు. ఇలా చూడటం వల్ల కొత్త చికిత్సా విధానాలను కనిపెట్టేందుకు వీలవుతుంది.

వృద్ధులు

ఫొటో సోర్స్, Getty Images

"కొన్ని ప్రయత్నాలతో వయసు పెరిగే ప్రక్రియను మందగించేలా చేయవచ్చు" అని న్యూయార్క్‌లో ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ మెడిసిన్ కాలేజీలో ఏజింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ నీర్ బర్జిలాయి అన్నారు.

ప్రపంచంలో 100 ఏళ్ళు దాటిన జనాభా ఎంత మంది ఉన్నారో అంచనా వేయడం కష్టం. 2021లో వందేళ్లు, వందేళ్లు దాటిన వృద్ధులు 5లక్షల 73వేల మందిఉన్నారు.

చాలా మంది వందేళ్లకు పైగా బ్రతుకుతున్నారని నీర్ బర్జిలాయి అన్నారు. ఆయన వందేళ్లు పైగా బ్రతికిన వారి 750 కుటుంబాలతో మాట్లాడి అధ్యయనం చేస్తున్నారు.

వృద్ధాప్యానికి సంబంధించిన మూడు అంశాల పై ఆయన బృందం పని చేస్తోంది.

ఇందులో, మొదటిది వయసు పెరిగే ప్రక్రియను మందగించేలా చేయడం. ఈ ప్రక్రియకు ఫిక్షనల్ పాత్ర 'డోరియన్ గ్రే' పేరు పెట్టారు. ఈ పాత్ర వయసు వల్ల ప్రభావితం కాదు.

రెండవ దశను 'ఫౌంటెన్ ఆఫ్ యూత్' అని అంటారు. ఇందులో మనుషులను యవ్వనంగా కనిపించేలా చేస్తారు. కానీ, ఈ ప్రక్రియ చాలా కష్టం.

మూడవ దశను 'పీటర్ పెన్' అంటారు. ఈ ఫిక్షనల్ పాత్ర అసలు వయసు మీరదు. ఇందులో ఇరవైలు, ముప్పైలలో ఉన్న వ్యక్తులను ఎంపిక చేసుకుని ఏడాదికొకసారి చికిత్స చేయాల్సి ఉంటుంది. దీని వల్ల వృద్ధాప్యపు ప్రభావం ఆపడం గాని, లేదా వయసు పెరగడాన్ని మందగించేలా చేయడం గాని జరుగుతుంది.

గుండె జబ్బులను సూచించే కొలెస్టరాల్ లాంటి బయో మార్కర్లు శరీరం లోపల జరుగుతున్న జబ్బులను సూచిస్తాయి. కానీ, వృద్ధాప్యాన్ని గుర్తించేందుకు ఈ సంకేతాలను తెలుసుకోవడం సులభం కాదు.

"మనకు చాలా రకాల బయోమార్కర్లు అవసరం. ఇవి నిజమైన వయసుకు, శారీరకంగా ఏర్పడుతున్న వయసుకు మధ్య చోటు చేసుకుంటున్న వ్యత్యాసాన్ని చెప్పగలగాలి. కొంత మంది వారి వయసు కంటే చిన్నగా కనిపిస్తారు. వయసు తగ్గించేందుకు వాడే మందుల వల్ల బయోమార్కర్లలో ఏర్పడుతున్న మార్పులను కూడా తెలియచేయగలగాలి" అని నీర్ అన్నారు.

వయసు తగ్గించేందుకు తయారు చేసిన కొన్ని ఔషధాలకు నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం కూడా లభించింది.

సాధారణంగా టైపు 2 మధుమేహ నియంత్రణలో వాడే మెట్‌ఫార్మిన్‌కు ఉన్న ప్రయోజనాల గురించి డాక్టర్ నీర్ అధ్యయనం చేస్తున్నారు.

ఈ మేరకు విజయం సాధిస్తాననే నమ్మకంతో ఆయన ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు ఇలాంటి ఔషధాల పై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు చెప్పారు.

వృద్ధులు

ఫొటో సోర్స్, Thinkstock

"ఇతరులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ప్రేమానుబంధాలతో ఉండేవారికి ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది" అని హార్వర్డ్ మెడికల్ స్కూల్ రాబర్ట్ వాల్ డింగర్ అన్నారు.

"ఈ అధ్యయనాన్ని 84 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఒకే గ్రూపు పై ఇన్నేళ్ళుగా సాగుతున్న అధ్యయనం ఇదొక్కటే అని చెప్పొచ్చు. వాళ్లంతా టీనేజర్లుగా ఉన్నప్పుడు ఈ అధ్యయనం మొదలయింది. వాళ్ళు వృద్ధులుగా అయ్యేవరకూ ఇది కొనసాగుతుంది. ఈ అధ్యయనం 1938లో మొదలయింది" అని రాబర్ట్ వివరించారు.

ఇందులో మొదట్లో 724 మంది పాల్గొనగా, చాలా మంది ఇప్పటికే మ్రించారు. కానీ, ఇందులో 90 ఏళ్ళు దాటిన వారు కొంత మంది బ్రతికే ఉన్నారు. పోషకాహారం, జీవన శైలి దీర్ఘ కాలం జీవించేలా చేశాయని ఈ అధ్యయనం వల్ల తెలిసాయని ఆయన చెప్పారు.

ఇతరులతో సత్సంబంధాలు కలిగి ఉండటం, ప్రేమతో ఉండటం ఆరోగ్యంగా ఉండేందుకు దారి తీశాయని చెప్పారు. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన ఉండకూడదని రాబర్ట్ అంటారు.

"మిమ్మల్ని బాధపెట్టే విషయం జరిగినప్పుడు మీ శరీరం ఒత్తిడికి గురవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత మీ మనసులో మాటను పంచుకునే వ్యక్తి ఉంటే మీ అలసట తీరిపోతుంది."

ఒంటరిగా ఉండేవారికి ఎక్కువ కోపం ఉంటుందని రాబర్ట్ అన్నారు. ఇలాంటి వారు ఎప్పుడూ ఒత్తిడితో ఉంటారు. ఈ పరిశోధనలో ఇతరులతో సత్సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఒత్తిడి నుంచి బయటపడవచ్చని తేలిందని రాబర్ట్ వివరించారు.

దీర్ఘ కాలం జీవించేందుకు ఆరోగ్యకరమైన సంబంధాలు అవసరం. కానీ, కొంత మంది ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు.

"ఇది చాలా ముఖ్యమైన విషయం. మనమంతా మంచి వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండాలని అనుకుంటాం. కొంత మంది ముభావంగా ఉంటారు. అదేమీ తప్పు కాదు. ఇలాంటి వారికి ఒకరిద్దరు సన్నిహితులుంటే చాలు. అలా అని ఇదే ఫార్ములా అందరికీ వర్తించదు. పెంపుడు జంతువులు కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి" అని అన్నారు.

"70, 80 ఏళ్ళు దాటిన తర్వాత కూడా కొంత మంది తమ జీవితంలో మొదటిసారి ఇతరులతో సంబంధాలు ఏర్పర్చుకున్న వాళ్ళు ఉన్నట్లు రాబర్ట్స్ చెప్పారు. కొంత మంది తొలి సారి ప్రేమలో పడ్డారు. ప్రేమలో పడటానికి వయసు లేదని చెప్పవచ్చు" అని ఆయన అన్నారు.

వృద్ధ మహిళ

ఫొటో సోర్స్, Getty Images

అయితే, వందేళ్లు బతకడానికి కిటుకు ఏంటి?

దీనికొక ప్రత్యేకమైన సమాధానం ఏమి లేదు. కానీ, కొన్ని పనులు చేయడం ద్వారా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. మాట్లాడేందుకు స్నేహితులో, లేదా పెంపుడు జంతువో ఉండేటట్లు చూసుకోవాలి. వృద్ధులు పెరుగుతున్న దేశంలో ఉన్నట్లయితే, మీ శేష జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.

వయసును తగ్గించేందుకు లేదా వెనక్కి మరలించేందుకు ప్రత్యేకంగా ఫార్ములా లేదు. కానీ, శాస్త్రవేత్తలు మాత్రం ఈ దిశగా కృషి చేస్తున్నారు.

కానీ, ఈ ఫార్ములాను కనిపెట్టడం జరిగే వరకు ఆరోగ్యవంతంగా ఉండేందుకు రాబర్ట్ వాల్‌డింగర్ ఇచ్చిన సలహా పని చేస్తుంది.

వీడియో క్యాప్షన్, అనాధల కోసం సకల సౌకర్యాలతో దిల్లీ ప్రభుత్వ వృద్ధాశ్రమాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)