అగ్నిపథ్ నిరసనకారుల 7 ప్రశ్నలకు సైన్యాధికారుల సమాధానాలివీ...

అగ్నిపథ్

ఫొటో సోర్స్, ANI

సైన్యంలో నియామకాలపై జూన్ 14 అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటినుంచీ దీనిపై భిన్న వర్గాల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది.

నాలుగేళ్లపాటు సైన్యంలో సేవలు అందించేందుకు అవకాశం కల్పించే ఈ పథకంపై యువత ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో వీరు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు.

బిహార్‌, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణల్లో మొత్తంగా 14 రైళ్లకు యువత నిప్పు పెట్టారు. చాలా ప్రాంతాల్లోని రైల్వే సదుపాయాలపై దాడులు కూడా జరిగాయి. దాదాపు 300 రైళ్లను కూడా శనివారం రద్దు చేశారు.

ఈ నిరసనలకు సంబంధించి ప్రజల్లో చాలా ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి. మరోవైపు నాయకులు సైతం దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు.

త్రివిధ దళాల అధికారులు

ఫొటో సోర్స్, ANI

నిరసనల నడుమ వరుసగా రెండు రోజులపాటు సైన్యం, నావికా దళం, వాయు సేన అధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీఅయ్యారు.

మరోవైపు ముగ్గురు సైన్యాధిపతులు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురీ కూడా అగ్నిపథ్ పథకానికి సంబంధించి ప్రశ్నలపై మాట్లాడారు.

అనిల్ పురీతోపాటు వైమానిక దళ అధిపతి ఎయిర్ మార్షల్ సూరజ్ కుమార్ ఝా, నావికా దళ సీనియర్ అధికారి వైస్ అడ్మిరల్ డీకే త్రిపాఠి, సీనియర్ సైన్యాధికారి లెఫ్టినెంట్ జనరల్ సీబీ పొన్నప్ప కూడా ఈ విలేకరుల సమావేశానికి హాజరయ్యారు.

ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సీనియర్ సైన్యాధికారుల ఏడు ప్రశ్నలు-సమాధానాలు మీ కోసం..

అగ్నిపథ్

ఫొటో సోర్స్, Getty Images

1. దీని అవసరం ఇప్పుడు ఏమిటి?

లైన్

‘‘ఈ సంస్కరణలు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్నాయి. 1989లోనే దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. అయితే, దీనిలో చాలా అంశాలున్నాయి. మొదట కమాండింగ్ ఆఫీసర్ల వయో పరిమితిని తగ్గించాలని భావించాం. ఒక్కొక్కటిగా సంస్కరణలు తీసుకొచ్చాం. ఆ తర్వాత అర్జున్ సింగ్ కమిటీ, కార్గిల్ రివ్యూ కమిటీలను ప్రభుత్వం వేసింది. ఆ సూచనలపై త్రివిధ దళాధిపతి (సీడీఎస్) పదవిని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత సైన్యంలో సగటు సైనికుడి వయసు 32ఏళ్ల నుంచి 26ఏళ్లకు ఎలా తగ్గించాలనే అంశంపై దృష్టిపెట్టాం.’’

‘‘2030నాటికి మన దేశంలో 50 శాతం మంది వయసు 25ఏళ్లకు లోపే ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని త్రివిధ దళాధిపతులతో జనరల్ రావత్, మరికొంతమంది సీనియర్ సైన్యాధికారులు చర్చలు జరిపారు.’’

‘‘మరోవైపు విదేశాల్లోని సైన్యాలు అనుసరిస్తున్న విధానాలపైనా అధ్యయనం చేపట్టాం. ముఖ్యంగా యువకుల్లో ఉత్సాహాన్ని, అనుభవాన్ని కలగలిసేలా ఈ పథకాన్ని తీసుకొచ్చాం.’’

అగ్నిపథ్

ఫొటో సోర్స్, Getty Images

2. రిజర్వేషన్ల ప్రకటనతో ప్రభుత్వ వైఖరి మెతకబడినట్లు భావించొచ్చా?

లైన్

‘‘నిరసనల వల్ల రిజర్వేషన్లు ప్రకటించినట్లు అనుకోవద్దు. అలా అసలు కాదు. దీని కోసం ముందే నిర్ణయం తీసుకున్నారు.’’

‘‘ఎందుకంటే సైన్యంలో పనిచేసిన వారిలో 75 శాతం మంది నాలుగేళ్ల తర్వాత వెనక్కి వెళ్లిపోతారు. వారు మన దేశానికి వెన్నెముక లాంటి వారు.’’

‘‘వీరికి ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించాలి? అనే అంశంపై ముందే నిర్ణయం తీసుకున్నాం. అందుకే చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అగ్నివీరుల వయోపరిమితి కూడా పెంచారు.’’

అగ్నిపథ్

ఫొటో సోర్స్, ANI

3. చిన్నవయసులో అగ్నివీరులైన జవాన్లు త్వరగా రిటైర్ అయిపోతారా?

లైన్

‘‘నేడు ఎక్కడ చూసినా యుద్ధాలే జరుగుతున్నాయి. వాటిలో భారీగా చనిపోతున్న సైనికులను చూస్తే మన కంటి నుంచి నీళ్లు అలా కారుతుంటాయి.

యుద్ధాల్లో పాల్గొనడం అనేది చాలా కష్టమైన పని. అందుకే కనిష్ఠ వయసు 17గా, గరిష్ఠ వయసు 21గా నిర్ణయించాం.

ప్రస్తుతం కనిష్ఠ వయసులో మార్పులు చేయలేదు. కానీ, గరిష్ఠ వయసులో సడలింపు ఇచ్చాం. ఎందుకంటే గత రెండేళ్లలో కోవిడ్-19 వల్ల నియామకాలు జరగలేదు. అయితే, మొత్తంగా తీసుకున్న వారిలో 75 శాతం మంది వెనక్కి వెళ్తారు. వీరికి రిజర్వేషన్లు వర్తిస్తాయి.’’

4. ఏటా 46,000 మందినే తీసుకుంటారా?

లైన్

‘‘వచ్చే నాలుగైదేళ్లలో 50,000 నుంచి 60,000 మంది సైన్యంలోకి తీసుకుంటాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది. దీన్ని 90,000 నుంచి 1.25 లక్షలకు కూడా పెంచే అవకాశముంది.

కేవలం 46,000 మందిని మాత్రమే తీసుకుంటాం అనుకోకండి. ఎందుకంటే కాస్త తక్కువ సంఖ్యతో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలని అనుకుంటున్నాం. మొదట్లో వచ్చే సమస్యలేమిటో ఆరంభ దశలోనే మేం తెలుసుకోవాలని అనుకుంటున్నాం.’’

వీడియో క్యాప్షన్, సికింద్రాబాద్ స్టేషన్‌లో ‘అగ్నిపథ్’ విధ్వంసం.. రైళ్లకు నిప్పు పెట్టిన నిరసనకారులు

5. ఇప్పటికే నియామక ప్రక్రియల్లో ఉన్నవారి పరిస్థితి ఏమిటి?

లైన్

‘‘ఇప్పటికే నియామక పరీక్షల్లో పాల్గొన్నవారి విషయంలో గరిష్ఠ వయో పరిమితిని 21 నుంచి 23ఏళ్లకు పెంచాం.

ఫలితంగా వారికి మరో రెండేళ్లు అదనంగా దక్కుతాయి. మరోవైపు అగ్నివీర్‌గా చేరేందుకు మీకు ఇష్టమేనా? అని దరఖాస్తు సమయంలోనే వారిని అడుగుతారు. దీని కోసం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇకపై అన్ని నియామకాలు అగ్నివీర్ యోజన కిందే జరుగుతాయి. గరిష్ఠ వయో పరిమితి పెంచడంతో.. అర్హులైన అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి వీలుపడుతుంది. రెండేళ్లు అనేది చాలా ఎక్కువ సమయం.

వీడియో క్యాప్షన్, అగ్నిపథ్ స్కీమ్‌పై ఈ నిరసనలకు కారణమేంటి? దేశ వ్యాప్తంగా ఎందుకింత అగ్ని రాజేసింది?

6. సైన్యంలో నియామక ప్రక్రియలు ఏమిటి?

లైన్

‘‘సైన్యంలో అగ్నివీరుల నియామకాలు మాత్రమే ఈ పథకం కింద జరుగుతాయి. మిగతా నియామక ప్రక్రియలు కొనసాగుతాయి’’

7. అగ్నివీర్ పథకాన్ని వెనక్కి తీసుకునే అవకాశముందా?

లైన్

‘‘అగ్నివీర్ పథకాన్ని వెనక్కి తీసుకునే ఆలోచన లేదు. ఎందుకు దీన్ని వెనక్కి తీసుకోవాలి. దేశానికి మరింత శక్తినిచ్చే పథకం ఇది. ఒక ఉదాహరణ చెబుతాం వినండి. కొన్ని విపత్కర వాతావరణ పరిస్థితుల్లో చాలా మంది సైనికులు చనిపోతున్న సంగతి మనకు తెలుసు. అందుకే యువకులు మనకు చాలా ముఖ్యం. దీనిలో వెనక్కి తగ్గే ప్రశక్తే లేదు.’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)