ఆవుల సుబ్బారావు: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో డిఫెన్స్ అకాడమీ యజమానిని ప్రశ్నిస్తున్న పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సికింద్రాబాద్ స్టేషన్‌పై దాడి, విధ్వంసం వెనుక ఉన్నదెవరనే విషయంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ దాదాపు 30 మంది అభ్యర్థులను ప్రశ్నించారు. దాదాపు 10 మంది వరకూ ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసులు వర్గాలు చెబుతున్నాయి.
హింసకు పాల్పడినవారిని ఎవరైనా పురిగొల్పారా? రెచ్చగొట్టారా అనే కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది.
ఈ క్రమంలో పోలీసులు కీలక ఆధారాలు సంపాదించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడికి ముందు కొందరు అనేక వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు.
‘హకీంపేట ఆర్మీ సోల్జర్స్’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపు, అందులోని వివరాలు బయటకు వచ్చాయి.
అందులోని చాట్‌లో ఎక్కువగా ప్రస్తావించిన సాయి డిఫెన్స్ అకాడమీ యజమాని ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.
అల్లర్లలో అతని పాత్ర ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. నరసరావుపేట, హైదరాబాద్ సహా పలుచోట్ల ఆయనకు డిఫెన్స్ అకాడమీలు ఉన్నాయి.మరోవైపు నిన్న సికింద్రాబాద్ తరువాత ఈరోజు గుంటూరు, విశాఖపట్నాలలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని విద్యార్థులు భావించినట్టు పోలీసులు వర్గాలు చెబుతున్నాయి.
ఈ మేరకు వాట్సప్ గ్రూపుల్లో సమాచారం కనిపించింది. దీంతో శుక్రవారమే అప్రమత్తమైన పోలీసులు ఆంధ్ర పోలీసులకు, అక్కడి రైల్వే వారికి సమాచారం అందించడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సికింద్రాబాద్ తరహాలో విశాఖలో నష్టం జరగకుండా ఏర్పాట్లు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ ఏర్పడ్డాక అతి పెద్ద ఆందోళన
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఆందోళన అగ్నిపథ్ వేడిని తెలుగు రాష్ట్రాలకు తెలియజెప్పింది. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగనంత పెద్ద ఎత్తున ఆందోళన తెలంగాణలో జరిగింది.
ఆందోళనకు కారణం సంగతి ఎలా ఉన్నా, అంత పెద్ద ఆందోళన అకస్మాత్తుగా ఎలా జరిగింది అన్న ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే రాజకీయ వేడినీ రగుల్చుతోంది.
తెలంగాణ రాష్ట్రం కోసం చాలా ఆందోళనలు జరిగాయి. కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత ఆ స్థాయిలో ఏ నిరసనా జరగలేదు.
మధ్యలో అనేక ప్రదర్శనలు, సంఘటనలూ జరిగినా వాటి తీవ్రత తక్కువ. కానీ శుక్రవారం తరువాత జరిగినది మాత్రం తెలంగాణలోని అతి పెద్ద నిరసనల్లో ఇది ఒకటి.
పోలీసుల కాల్పుల్లో ఆందోళనకారుడు చనిపోవడం కూడా ఈ మధ్య కాలంలో తెలంగాణలో జరగలేదు.
అందుకే ఇప్పుడిది రాజకీయ వివాదంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా కలిశారు?
ఇప్పుడు కేసు విచారణ చేస్తోన్న పోలీసుల ముందున్న పెద్ద ప్రశ్న ఇది.
ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఆర్మీ ఉద్యోగ ఆశావహులంతా కొన్ని వాట్సప్ గ్రూపులుగా ఏర్పడ్డారు.
వారికి ఉద్యోగాల సమాచారం చేరవేసే ఈ గ్రూపుల్లోనే ఆందోళనల గురించి చర్చ జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు పోలీసులు.
దానికి సంబంధించి పలు వీడియోలను, స్క్రీన్ షాట్లను పోలీసులు సేకరించారు.
కొందరు ఉద్యోగార్థులూ ‘బీబీసీ తెలుగు’తో ఈ విషయం చెప్పారు. ఈ ఆందోళన గురించి తమ వాట్సప్ స్టేటస్‌లుగానూ పెట్టుకున్నట్టు వారు బీబీసీతో చెప్పారు.
దేశంలో ఇతర చోట్ల జరుగుతోన్న ఆందోళనలు కూడా వారికి ఒక ఆలోచనను ఇచ్చాయి. దీంతో పక్కా ప్రణాళికతో నిరసనకు వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
గురువారం రాత్రే రైల్వే స్టేషన్‌కు వచ్చారు
ప్రాథమిక సమాచారం ప్రకారం ఆందోళనకారుల్లో ఎక్కువమంది తెలంగాణ నుంచే వచ్చారు.
సుమారు 1500 మంది ఒకేసారి వచ్చారని రైల్వే ఎస్పీ అనూరాధ మీడియాతో అన్నారు. వారంతా వాట్సప్‌లో మాట్లాడుకున్న తరువాత శుక్రవారం ఉదయం సికిందరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేలా నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్‌కి దూరంగా ఉన్న గ్రామాల నుంచి వచ్చినవారు గురువారం రాత్రే స్టేషన్ చేరుకున్నట్టు చెబుతున్నారు. ఇక అందరూ అనుకున్నట్టు స్టేషన్ దగ్గరకు చేరుకున్న తరువాత గొడవ మొదలైంది.
నిజానికి మొదట్లో ఈ ఆందోళన కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం చేస్తోంది అనుకున్నారు. కానీ ఈ గొడవలకూ తమకూ సంబంధం లేదని ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ వివరణ ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
టీఆర్ఎస్ హస్తం ఉందా?
ఈ ఘటనల వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందన్నట్టు అనుమానం వ్యక్తం చేసింది బీజేపీ.
‘మోదీని ఎదుర్కునే దమ్ములేక కేంద్రానికి అప్రతిష్ట తేవడం కోసం ఇదంతా కుట్రతో చేశారు. స్టేషన్ దగ్గర జరిగిన పరిణామాలు అనుమానాలను పెంచుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్రం ప్రభుత్వ సమగ్ర విచారణ చేయాలి లేదా మేం సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తాం అన్నారు’’ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.
అయితే టీఆర్ఎస్ పార్టీ ఈ ఆరోపణలపై స్పందించకపోయినా, కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టింది. అగ్ని పథ్ విధివిధానాలు మార్చాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
అల్లర్లు వెనుక ఎవరైనా ఉన్నారా? లేదా? అనేది ఇంకా విచరాణ కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా మొదలైంది?
శుక్రవారం ఉదయం స్టేషన్ బయట ఆందోళన చేశారు విద్యార్థులు. ఒక బస్సు అద్దం కూడా పగిలింది. ఆ తరువాత అక్కడి నుంచి ఒక్కసారిగా స్టేషన్లోకి చొచ్చుకువచ్చారు.
సాధారణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉదయం వేళ బిజీగా ఉంటుంది. దూరప్రాంత రైళ్లన్నీ అప్పుడే ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి.
దానికితోడు స్కూళ్లు తెరిచే సమయం కావడంతో పిల్లలతో ఊళ్లకు వెళ్లి వెనక్కు వచ్చే వారితో స్టేషన్ రద్దీగా ఉంది.
ఆ సమయంలో ఇంతమంది ఆందోళనకారులు ఒకేసారి రావడంతో చాలా మంది ప్రయాణికులు భయపడ్డారు. అయితే ప్రయాణికులెవరికీ హాని జరగలేదు. ఆందోళనకారులు చేస్తోన్న విధ్వంసం చూసి ప్రయాణికులు చాలామంది చెల్లాచెదురయ్యారు.
ఆందోళనకారుల సంఖ్య భారీగా ఉండడం, వాళ్ల దాడుల వేగం, తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎదుర్కోవడానికి మొదట్లో పోలీసుల బలం చాలలేదు. పరిస్థితి అదుపులోకి రావడం కోసం పోలీసులు లాఠీచార్జీ చేశారు.
దీంతో వారు మరింత ఆగ్రహంతో చెలరేగారు. దీంతో మళ్లీ ఆందోళనకారులను అదుపు చేయడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు.
చివరగా 15 రౌండ్లు కాల్పులు జరిపారు రైల్వే పోలీసులు. కాల్పులు జరిగిన తరువాత ఆందోళనకారులు స్టేషన్ నుంచి ట్రాక్ దగ్గరకు వచ్చారు. కాల్పుల్లో 13 మందికి గాయాలు కాగా ఒకరు మరణించారు.

ఫొటో సోర్స్, Getty Images
స్టేషన్లో నిరసన చేసిన వారు రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. షాపులు పగలగొట్టారు. సిమెంట్ దిమ్మెలు కూల్చారు. అద్దాలు పగలగొట్టారు. రైలు పెట్టెలకు నిప్పు పెట్టారు. పార్సిళ్లను, పార్సిళ్లు మోసే వాహనాలను ట్రాకులపై అడ్డంగా పెట్టి నిప్పు పెట్టారు. పట్టాల మధ్యలో ఇనుప ఊచలను లాగేశారు.
చేతిలో ఉన్న రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడులు చేశారు. రైళ్లలో ఒక చోటి నుంచి మరో చోటికి పంపిస్తున్న బైకులను కాల్చారు. పెద్ద ఎత్తున సరకు నష్టం జరిగింది.
దీనివల్ల రైల్వే ఆస్తులే కాకుండా, రైళ్లలో తమ సామగ్రి పంపుతున్న సామాన్యులకూ నష్టం జరిగింది. చివరగా సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో స్టేషన్ నుంచి వారిని బయటకు పంపగలిగారు పోలీసులు.
స్టేషన్ బయట పడిగాపులుకాసిన ప్రయాణికులు
రాత్రి వరకూ రైళ్లు ఆపేశారు. ట్రాక్, ఇతర సాంకేతిక అంశాలూ చూసుకున్న తరువాత రాత్రికి రైళ్లను మళ్లీ ప్రారంభించారు.
అప్పటికే పెద్ద సంఖ్యలో ప్రయాణికులు స్టేషన్ బయట ఫుట్ పాత్ మీదే గంటల తరబడి ఎదురు చూశారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకూ ట్రాక్‌పై అభ్యర్థులు ఉన్నారు. కాకపోతే సాయంత్రం గడిచే కొద్దీ వారి సంఖ్య పలచబడింది.
రెండుమూడు సార్లు పోలీసులు ఆందోళనకారులతో చర్చించినా ఉపయోగం లేకపోయింది.
చాలా రైలు ఇంజిన్లు దెబ్బతిన్నాయి. రైల్వే ఇంకా ఆస్తినష్టం అంచనా వేయలేదు. రైల్వే సిబ్బందికి గాయాలు కాలేదు కానీ ఇద్దరు పోలీసులకు మాత్రం గాయాలైనట్టు రైల్వే ఉన్నతాధికారులు చెప్పారు.
మొత్తం వ్యవహారంలో అనేక సెక్షన్లు కింద కేసులు పెట్టారు. నిందితులను ఇంకా గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇదంతా ఎందుకు చేశారు?
కేవలం అగ్నిపథ్ రద్దు మాత్రమే కాదు. వారికి తక్షణం ఆర్మీ నియామక పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు.
‘2019 నుంచి ఆర్మీ ఉద్యోగాలు ఇదిగో అదుగో అంటూ వాయిదా పడ్డాయి. ఇప్పటికి 8 సార్లు వాయిదా వేశారు. మేం అడిగినా ప్రతిసారీ ఏదో వంక పెట్టుకుని పక్కనపెడతున్నారు. మాకు ఫిజికల్, మెడికల్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇక మేం పరీక్ష రాస్తే చాలు. ఇటువంటి సమయంలో పరీక్ష ఆపేసి మా జీవితాలతో ఆడుకున్నారు. మేం ఇంతకాలం ఈ పరీక్ష కోసమే ప్రయత్నం. ఇప్పుడు రాత్రికి రాత్రి ఈ పరీక్ష రద్దు చేశారు. మా మూడేళ్ల కష్టం ఎటూ కాకుండా పోయింది. అగ్ని పథ్ వంటి పథకాలకు కూడా మేం ఎలిజిబుల్ కాదు. మేం ఎంతో కష్టపడి, ప్రాక్టీస్ చేశాం. ఇప్పడు అదంతా వృథాయే కదా?’’ అని బీబీసీతో అన్నారు గద్వాల జిల్లా నుంచి వచ్చిన ఓ యువకుడు.
ఇక్కడ అగ్ని పథ్ స్కీమ్ మంచి చెడ్డల సమస్య కంటే, ఆ స్కీమును తక్షణం అమలు చేయడం వల్ల, ఎప్పటి నుంచీ ప్రిపరేషన్ లో ఉన్నవారు వెనుకబడతారు. సరిగ్గా ఇక్కడి ఆందోళనకారులది అదే సమస్య. తమకు వయసు ఉన్నప్పుడు ఉద్యోగానికి అప్లై చేసి, మెడికల్, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు పాసయి, ఇక రాత పరీక్షే తరువాయి అన్న దశలో, 8 సార్లు ఆ రాత పరీక్ష వాయిదా వేశారు. ఇప్పుడు మొత్తం రద్దు చేసి, కొత్త పథకం వస్తోంది. వీళ్లు మూడేళ్ళుగా అదే పోస్టు కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఇప్పటికే వీళ్ల వయసు ఆ పథకం ఎలిజిబిలిటీ దాటేసింది. కాబట్టి, తమకు రాత పరీక్ష నిర్వహించి పాత పద్ధతిలో నియాకమాలు జరపాలనేది వారి డిమాండ్.
స్టేషన్లో ఆస్తుల ధ్వంసం చేయడాన్ని చాలా మంది సమర్థించుకుంటున్నారు. ఈ హింస తరువాతే తమ సమస్యపై చర్చ జరుగుతోందని వారు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 'అగ్నిపథ్' పథకంతో ప్రయోజనం ఎవరికి? ఇండియన్ ఆర్మీకి మేలు ఎంత? అగ్నివీర్లకు మేలు ఎంత?
- సాద్ అన్సారీ ఎవరు? నూపుర్ శర్మ వ్యాఖ్యల వివాదంలో ఈ ముస్లిం యువకుడిని ఎందుకు అరెస్టు చేశారు?
- బిట్ కాయిన్ ఎందుకు ఇంత వేగంగా కుప్పకూలుతోంది?
- అచ్చం మీలాగే ఉండే, మీలాగే ఆలోచించే డిజిటల్ ట్విన్ రూపొందిస్తే.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?
- 68 అడుగుల లోతులో 5 రోజులు నరకయాతన.. పదేళ్ల మూగ బాలుడిని ఎలా రక్షించారంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










