Agnipath: బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణాల్లో నిరసనలు- రైళ్లపై దాడులు, యువకుడి ఆత్మహత్య

రైళ్లపై దాడులు

ఫొటో సోర్స్, SEETU TIWARY/BBC

భారత సైన్యంలో స్పల్పకాలిక నియామకాల కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై బిహార్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణాలతో పాటు ఉత్తరాఖండ్‌లో నిరసనలు చెలరేగుతున్నాయి.

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల క్రితమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్నయువకులకు స్వల్పకాలం పాటు సైన్యంలో పనిచేసే అవకాశం దక్కుతుంది.

ఈ పథకం ప్రకారం యువకులకు నాలుగేళ్లపాటు సైన్యంలో ఉద్యోగం కల్పిస్తారు. రిక్రూట్ అయిన యువతలో 25 శాతం మంది మాత్రమే సైన్యంలో కొనసాగుతారు. మిగిలిన వారు ఉద్యోగాన్ని వదిలేయాల్సి ఉంటుంది.

ఈ పథకాన్ని ప్రకటించిన తర్వాత బిహార్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని యువకుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.

వీడియో క్యాప్షన్, ఏపీ: 'జవాన్ కాలేకపోయా..కానీ ఆయుధాలు తయారు చేస్తున్నా..'
लाइन

అగ్నిపథ్ పథకం క్లుప్తంగా

लाइन
  • 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువకులు అర్హులు
  • పది లేదా ఇంటర్మీడియట్ పాసవ్వాలి
  • ఉద్యోగ కాలపరిమితి: నాలుగేళ్లు
  • మొదటి ఏడాది ప్రతీ నెలా రూ. 30,000 వేతనం అందుతుంది
  • నాలుగో ఏడాది నెల జీతం రూ. 40,000గా ఉంటుంది
  • నాలుగేళ్ల తర్వాత ప్రదర్శనను సమీక్షించి 25 శాతం మందిని మాత్రమే రిటెయిన్ చేసుకుంటారు
  • బిహార్‌లోని అన్ని జిల్లాల్లో గురువారం నిరసనలు తీవ్రంగా జరిగాయని పాట్నాలోని బీబీసీ ప్రతినిధి సీతూ తివారి చెప్పారు.
लाइन

బక్సర్

రాష్ట్రంలోని బక్సర్, జహానాబాద్‌లో మొదట నిరసనలు మొదలయ్యాయి. సైన్యం ఉద్యోగాల నిబంధనల్లో మార్పును వ్యతిరేకిస్తూ బక్సర్‌లో విద్యార్థులు చేస్తోన్న నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి.

జాతీయ జెండాలతో ఉదయం బక్సర్ స్టేషన్‌కు చేరుకున్న యువకులు రైల్వేట్రాక్‌ను అడ్డగించారు. డుమ్రావ్ స్టేషన్‌ రైల్వే ట్రాక్‌కు నిప్పంటించారు.

రైళ్లపై రాళ్లు రువ్వారు. దీంతో రైలు అద్దాలు పగిలిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.

''నాలుగేళ్లు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం, నిరుద్యోగులను మోసం చేస్తోంది. ఆర్మీ భర్తీ ప్రక్రియ ముందున్నట్లుగానే ఉంచాలి. ఈ మార్పులు వద్దు'' అని ఆందోళన చేస్తోన్న విద్యార్థుల్లో ఒకరైన చందన్ కుమార్ చెప్పారు.

జహానాబాద్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, SEETU TIWARY/BBC

జహానాబాద్

జహానాబాద్‌లో కూడా గురువారం విద్యార్థులు రైల్వే ట్రాక్‌ను దిగ్బంధించారు. పాట్నా-గయా ప్యాసింజర్ రైలును ఆపేశారు.

''నాయకుల పదవీకాలం అయిదేళ్లు ఉంటుంది. సైనికులు నాలుగేళ్లే సైన్యంలో ఉంటే ఏం చేయగలరు? నాలుగేళ్ల తర్వాత మేం వచ్చి పని చేసుకునేందుకు బిహార్‌లో ఏ పరిశ్రమ ఉంది. మాకు పాత నిబంధనలే కావాలి. మీరు రిటైర్డ్ ఆర్మీ జవాన్ల సలహాను తీసుకోండి. వారు ఇది సరైన నిర్ణయమే అని చెబితే మేం కూడా ఈ కొత్త నిబంధనలను అంగీకరిస్తాం'' అని యువకులు అంటున్నారు.

నిరసన

ఫొటో సోర్స్, SEETU TIWARY/BBC

ఛప్రా

బిహార్‌లోని సరన్ జిల్లా నుంచి నిరసన వీడియోలు అత్యధికంగా బయటకు వచ్చాయి. ఇక్కడ విద్యార్థులు రెండో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై ఆగి ఉన్న ఛప్రా-ఫుల్వారియా ప్యాసింజర్ రైలుకు నిప్పు పెట్టారు.

బరౌనీ-గోందియా ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌లను కూడా దగ్ధం చేశారు. రోడ్లపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు.

కైమూర్

ఫొటో సోర్స్, SEETU TIWARY/BBC

కైమూర్

కైమూర్‌లోని భభూవా రోడ్ రైల్వే స్టేషన్‌లో ఉదయం 10.30 గంటల సమయంలో గొడవ మొదలైంది.

కోపోద్రిక్తులైన విద్యార్థులు రైల్వే ట్రాక్‌కు నిప్పంటించారు. పాట్నా-భభువా ఇంటర్‌సిటీ రైలు సీట్లకు నిప్పు పెట్టారు.

దాదాపు మూడు గంటల పాటు విద్యార్థులు ఆందోళనలు చేశారు. రైల్వే స్టేషన్‌ను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. దీని కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

''విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించారు. కానీ వారు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు గాలిలో కాల్పులు జరిపి పరిస్థితిని నియంత్రించారు'' అని బీబీసీతో స్థానిక పాత్రికేయుడు వికాస్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

నవాదా

నవాదా రైల్వే ట్రాక్‌కు కూడా విద్యార్థులు నిప్పంటించారు. వారిస్లీగంజ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరుణా దేవిపై ఆందోళనకారులు దాడి చేశారు.

ఈ ఘటన గురించి అరుణా దేవి ఫోన్‌లో బీబీసీతో మాట్లాడారు. ''ఒక కేసు విషయంలో కోర్టుకు వెళుతుండగా కొందరు మాపై దాడి చేశారు. మా కారు రైల్వే గేట్ నంబర్ 3 సమీపంలోకి రాగానే వాహనంపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. వాహనంపై మోదీజీ స్టిక్కర్, బీజేపీ జెండా ఉన్నాయి. నా డ్రైవర్‌తో పాటు నాకు కూడా గాయాలయ్యాయి. వాహనానికి చాలా నష్టం జరిగింది'' అని చెప్పారు.

అగ్నిపథ్

ఫొటో సోర్స్, SEETU TIWARY/BBC

సమస్తిపూర్

సమస్తిపూర్‌లోని దల్సింగ్‌సరాయ్ స్టేషన్‌లో అవధ్-అస్సాం రైలును విద్యార్థులు గంటల తరబడి అడ్డుకున్నారు.

రైలు ప్యాంట్రీ కారును ధ్వంసం చేశారు.

ప్యాంట్రీ కార్ మేనేజర్ రాజ్‌కుమార్ ఆ వివరాలు తెలిపారు. ''ఆందోళనకారులు మాకు నీళ్లు కావాలని అడిగారు. నీళ్లు ఇచ్చాం. కానీ, తర్వాత రైలు అద్దాలను పగులగొట్టారు. మా వస్తువులను కూడా తీసుకెళ్లారు'' అని చెప్పారు.

ఆరా

ఆరా రైల్వే స్టేషన్‌లోని రైల్వే బుకింగ్ కార్యాలయాన్ని విద్యార్థులు ధ్వంసం చేశారు.

విద్యార్థులతో పాటు బయటి వ్యక్తులు కూడా ప్రవేశించి రైల్వే స్టేషన్‌లోని దుకాణాలను దోచుకున్నట్లు ఇక్కడ వార్తలు వచ్చాయి.

ఉదయమే పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన విద్యార్థులు రైల్వే ట్రాక్‌ను జామ్ చేసి రైలుపై రాళ్లు రువ్వారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అగ్నిపథ్

ఫొటో సోర్స్, SEETU TIWARY/BBC

రాష్ట్రంలోని ఈ జిల్లాల్లోనే కాకుండా ముంగెర్, మధుబని, సహర్సా, సీతామఢీ, సివాన్ తదితర నగరాల్లో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.

కేంద్రం, అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. గతం తరహాలోనే సైన్యం నియామకాలను జరపాలని కోరుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా అగ్నిపథ్ పథకంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

''ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు దాటిన తర్వాత ఇప్పుడు ఏడాదిన్నర కాలంలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడుతోంది'' అని ఆయన ట్వీట్ చేశారు.

బాడ్‌మెర్‌లో నిరసన ప్రదర్శనలు

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/BBC

ఫొటో క్యాప్షన్, బాడ్‌మెర్‌లో నిరసన ప్రదర్శనలు

రాజస్తాన్‌లోనూ నిరసనలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై రెండోరోజూ కూడా వ్యతిరేకత కొనసాగుతుందని జైపూర్ నుంచి బీబీసీ హిందీ ప్రతినిధి మోహర్ సింగ్ మీనా చెప్పారు

ఈ పథకానికి నిరసనగా రాష్ట్రీయ లోకతాంత్రిక్ పార్టీ కన్వీనర్, నాగౌర్ ఎంపీ హనుమాన్ బేనివాల్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలకు పిలుపునిచ్చారు.

నిరసన

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/BBC

దీని తర్వాత జైపూర్, బాడ్‌మెర్, సీకర్, జోధ్‌పూర్, అజ్మీర్‌ సహా అనేక జిల్లాల్లో నిరసనలు జరిగాయి.

బాడ్‌మెర్‌లో రైలు ట్రాక్‌పై టైర్లను తగులబెట్టి రైలును ఆపేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు.

జైపూర్‌లోని కోట్‌పుత్లీ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ ఎక్కి కొందరు యువకులు నిరసన వ్యక్తం చేశారు.

గ్వాలియర్‌లో నిరసన ప్రదర్శనలు

ఫొటో సోర్స్, SHURAIH NIYAZI/BBC

ఫొటో క్యాప్షన్, గ్వాలియర్‌లో నిరసన ప్రదర్శనలు

మధ్యప్రదేశ్‌లో కూడా

బీబీసీ హిందీ ప్రతినిధి సురైహ్ నియాజీ ప్రకారం... మధ్యప్రదేశ్‌ రాష్ట్రం గ్వాలియర్ నగరంలో చాలామంది యువకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

గ్వాలియర్‌కు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. ఆ వీడియోల్లో యువత, రైల్వే ట్రాక్‌పై నడుస్తున్నట్లు కనిపిస్తుంది.

యువకులను అదుపు చేసేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

హరియాణాలో యువకుడి ఆత్మహత్య

ఫొటో సోర్స్, SAT SINGH/BBC

హరియాణాలో యువకుడి ఆత్మహత్య

రోహ్‌తక్‌లో ఉన్న బీబీసీ హిందీ ప్రతినిధి సత్‌ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాలోని పల్వల్, రేవాడీ, రోహ్‌తక్, చర్కీ దాద్రీతో సహా అనేక జిల్లాల్లో యువకులు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు.

పల్వల్‌లో ఇది హింసాత్మకంగా మారింది. డిప్యూటీ కమిషనర్ కార్యాలయం, నివాసంపై రాళ్లు రువ్వడంతో పాటు నాలుగు వాహనాలను ఆందోళనకారులు తగులబెట్టారు.

దీంతో గుంపును చెదరగొట్టేందుకు హరియాణా పోలీసులు లాఠీచార్జి చేశారు.

ఇదిలా ఉంటే, అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా రోహ్‌తక్‌లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

రోహ్‌తక్ డీఎస్పీ మహేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ''తన కుమారుడు ఉద్యోగం కోసం చూస్తున్నాడని, మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని సచిన్ అనే యువకుడి తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు'' అని ఆయన చెప్పారు.

ఆ యువకుడి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ''గత ఏడాదిన్నరగా సైన్యంలో చేరేందుకు సిద్ధమవుతున్నాడు. కొత్త పథకం గురించి తెలుసుకున్న తర్వాత తన శ్రమ వృథా అయిందని ఆవేదన చెందాడు'' అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)