Mushroom Farming: ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే

ఫొటో సోర్స్, ANIRBAN NANDY
- రచయిత, ప్రీతి గుప్తా, బెన్ మోరిస్
- హోదా, ముంబయి
ఫుల్రిదా ఎక్కా భర్త మూడేళ్ల కిందట చనిపోయాడు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి సమీపంలోని ఒక గ్రామంలో నివసించే ఫుల్రిదా తేయాకు తోటల్లో ఆకులు సేకరించే పని చేసేవారు. కానీ కుటుంబ పోషణకు ఆ ఆదాయం సరిపోయేది కాదు.
జీవనోపాధికి కొత్త మార్గాల కోసం అన్వేషించారామె. అప్పుడే పుట్టగొడుగుల పెంపకం గురించి ఆమెకు తెలిసింది. 'లివ్ లైఫ్ హ్యాపీలీ' అనే ఒక గ్రామీణాభివృద్ధి సంస్థ సాయంతో ఫుల్రిదా పుట్టగొడుగుల సాగు ప్రారంభించారు.
ఇప్పుడామె ప్రతి రోజూ రెండు, మూడు సంచుల పుట్టగొడుగులు అమ్ముతున్నారు. నెలకు సుమారు 7,000 రూపాయలు ఆదాయం పొందుతున్నారు.
ఈ తెల్లటి పుట్టగొడుగులను.. పైకప్పు నుంచి వేలాడదీసిన పెద్ద సంచుల్లో పెంచుతారు. ఫుల్రిదా ఇంట్లో సాధారణంగా 10 సంచులు ఉంటాయి. వాటి ద్వారా నెలకు సుమారు 48 సంచుల పుట్టగొడుగుల ఉత్పత్తి లభిస్తోంది.
''ఈ పుట్టగొడుగులు పెరుగుతుండటం చూసినపుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను, నా కుటుంబం ఖాళీ కడుపుతో పడుకోవాల్సిన అవసరం లేదు'' అన్నారామె.
పుట్టగొడుగుల పెంపకం ఫుల్రిదా జీవితంలో చాలా మార్పు తెచ్చింది. అయితే.. భారత వ్యవసాయ రంగానికి ఈ పంట మరింత ఊతమివ్వాలని కొందరు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, LIVE LIFE HAPPILY
''పుట్టగొడుగుల పెంపకంలో సూపర్ పవర్ కావటానికి అవసరమైన అన్ని అంశాలూ భారతదేశానికి ఉన్నాయి'' అని రవూఫ్ హమ్జా బోడా పేర్కొన్నారు. ఆయన గత 20 ఏళ్లలో జమ్ముకశ్మీర్‌లో 100 రకాల పుట్టగొడుగులను గుర్తించారు.
''భారతదేశంలో అడవి పుట్టగొడుగుల్లో విస్తారమైన భిన్నత్వం ఉంది. భారీ స్థాయిలో కంపోస్ట్ వనరులున్నాయి. చౌకయిన శ్రమ శక్తి ఉంది. విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి'' అని ఆయన వివరించారు.
ఈ సానుకూల పరిస్థితులు ఉన్నా కూడా.. ప్రపంచ పుట్టగొడుగల ఉత్పత్తిలో భారతదేశం వాటా కేవలం 2 శాతంగానే ఉంది. అదే పొరుగు దేశమైన చైనా 75 శాతం వాటాతో ఈ మార్కెట్‌లో అగ్రగామిగా ఉంది.
భారతదేశంలో ఎక్కువ మంది జనం పుట్టగొడుగులు తినటానికి ఇష్టపడకపోవటం ఇందుకు ఒక కారణమని బోడా అంటారు. ఇవి అపాయకరమని కొందరు భయపడతారని ఆయన చెప్పారు.
''అడవి పుట్టగొడుగుల రకాల్లో తినటానికి అనువైనవి ఏవి అనే అంశాలపై పెద్ద పరిశోధనలు జరగలేదు'' అని బోడా పేర్కొన్నారు.
''పుట్టగొడుగుల వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయనే అంశం మీద, వాటిని సాగు చేయటం ఎంత చౌక అనే విషక్ష్ మీద అవగాహన లేకపోవటం వల్ల వీటి వినియోగం పెరగటం లేదు'' అని వివరించారు.

ఫొటో సోర్స్, LEENA'S MUSHROOM FARM
కాబట్టి ఈ రంగంలోకి అడుగు పెట్టటానికి సిద్ధపడే పారిశ్రామిక వేత్తలకు చాలా అవకాశాలున్నాయి.
నాలుగేళ్ల కిందట లీనా థామస్, ఆమె కొడుకు జితు కలిసి జితు పడక గదిలో పుట్టగొడుగులు పెంచే ప్రయోగం చేశారు.
ప్లాస్టిక్ బాటిల్‌లో పుట్టగొడుగులను పెంచటాన్ని ఇంటర్నెట్‌లో చూసి కేవలం ఆసక్తి కొద్దీ ఈ ప్రాజెక్టును ప్రారంభించానని జితు చెప్తున్నారు.
అది సఫలం కావటంతో అతడు పుట్టగొడుగుల పెంపకం గురించి అధ్యయనం చేయటం, కోర్సులు పూర్తి చేయటం చేశారు. జితు హాబీ వెంటనే మంచి వ్యాపారంగా మారిపోయింది.
ఇప్పుడు కేరళలోని ఈ తల్లీకొడుకులు 'లీనాస్ మష్రూమ్' అనే కంపెనీ పేరుతో 2,000 మష్రూమ్ బెడ్స్ సాగు చేస్తున్నారు. రోజుకు 100 కిలోల దిగుబడి సాధిస్తున్నారు.
''పుట్టగొడుగుల సాగులో చాలా సానుకూలతలున్నాయి. అవి పెరిగే కాలం చాలా తక్కువగా ఉండటం అందులో ఒకటి'' అని జితు వివరించారు.
''కానీ ఇది సులభమైన పనేమీ కాదు. ఈ పంట చాలా సున్నితమైనది. వాతావరణంలో అతి చిన్న మార్పు వల్ల చీడపీడలు మొదలై మొత్తం పంట నాశనమైపోవచ్చు'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, LEENA'S MUSHROOM FARM
ఈ సంస్థకు చెందిన గ్రీన్‌హౌస్‌లో.. ఫ్యాన్ల ద్వారా బయటి గాలిని ఈ మష్రూమ్ ప్యాడ్ల మీదకి మళ్లిస్తారు. తద్వారా ఉష్ణోగ్రత, గాలిలో తేమ అవసరమైనంత స్థాయిలో ఉండేలా చూస్తారు. కార్బన్ డయాక్సైడ్ స్థాయిని కూడా నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.
ఇంత కష్టపడటం వల్ల ఫలితం ఉంటుందని. మష్రూమ్స్‌కు మంచి ధరలు లభిస్తాయని జితు చెప్పారు.
''తాజాగా కోసిన పుట్టగొడుగులను అదే రోజు నేరుగా రిటైల్ విక్రయదారులకు అమ్ముతాం. మధ్యవర్తులెవరూ ఉండరు'' అని తెలిపారు.
పరిమళ్ రమేశ్ ఉద్గవే భిన్నమైన పని చేపట్టారు. ఫంగీకల్చర్ గురించి లోతైన అవగాహనను పెంపొందించటానికి మైక్రోబయాలజీ చదివారాయన.
పరిమళ్ 2019లో బయోబ్రిట్ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. ఈ కంపెనీ పుట్టగొడుగులను పెంచటంతో పాటు వాటిని ఎండబెట్టి, వాటితో పొడులు, హెల్త్ సప్లిమెంట్లు తయారు చేస్తోంది.
ఈ వ్యాపారం విజయవంతమైనా కూడా.. పుట్టగొడుగులను పెంచటం సులభం కాదని ఆయన అంటారు.
''పుట్టగొడుగుల వ్యాపారాన్ని వేగంగా డబ్బు సంపాదించటానికి ఒక మార్గంగా జనం భావిస్తారు. కానీ ఇందుకు సాంకేతిక నైపుణ్యాలు కూడా అవసరం'' అని ఆయన పేర్కొన్నారు.
చాలా స్టార్టప్ మష్రూమ్ వ్యాపారాలు విఫలమవుతున్నాయని పరిమళ్ చెప్పారు.

ఫొటో సోర్స్, BIOBRITTE
అయితే పుట్టగొడుగుల మార్కెట్‌లో చిన్నపాటి వ్యాపారులకు విస్తృత అవకాశాలున్నాయని.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గ్రామీణాభివృద్ధి పరిశోధకుడు అనిర్బన్ నాందీ, ఆయన భార్య పౌలోమి చాకీ నాందీ అభిప్రాయపడుతున్నారు.
వారు నిర్వహిస్తున్న ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ లివ్ లైఫ్ హ్యాప్పిలీ.. పశ్చిమ బెంగాల్‌లో 8,000 మందికి పైగా మహిళలకు సొంతంగా పుట్టగొడుగులు పెంచి లాభాలు పొందటం ఎలా అనేది నేర్పించారు. వారిలో ఫుల్రిదా ఎక్కా ఒకరు.
''ఈ మహిళలు పేదవాళ్లు. వారికి భూమి కానీ, జీవనోపాధి దారి కానీ లేదు'' అన్నారు అనిర్బన్.
గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది మహిళలు.. భర్తలు చనిపోయిన తర్వాత ఆర్థిక ఒత్తిళ్లలో కూరుకుపోతున్నారు. తేయాకు తెంపటం ద్వారా వీరు కుటుంబ పోషణకు అవసరమైన ఆదాయం పొందలేకపోతున్నారు.
''పుట్టగొడుగుల పెంపకం నేర్చుకోవటం సాధ్యమైన, నిర్వహించగల పని. ఈ మహిళలు పొలాల అవసరమేమీ లేకుండా తమ ఇళ్లలో ఒక మూలన కూడా పుట్టగొడుగులను పెంచవచ్చు. పార్ట్ టైమ్ పనిలాగా పెట్టుకోవచ్చు'' అని అనిర్బన్ వివరించారు.
అలాగే వినియోగదారుల నుంచి కూడా చాలా డిమాండ్ ఉందని చెప్తున్నారు. ''ప్రత్యేకించి డార్జీలింగ్ వంటి కాస్మొపాలిటన్ ప్రాంతాల్లో ఎక్కువ డిమాండ్ ఉంది. దీనివల్ల వేగంగా ఆదాయం లభిస్తుంది'' అని పేర్కొన్నారు.
పుట్టగొడుగుల పెంపకంతో వచ్చే ఈ అదనపు ఆదాయం జీవితాన్ని నిజంగా మార్చేయగలదు.
''ఈ మహిళలు తమ ఇంట్లో తమ మాటకు విలువదక్కేలా బలం పొందారు. నిర్ణయాత్మకంగా మారారు. ఒక ఉదంతంలో.. ఓ మహిళ తన కూతురుకు చిన్న వయసులో పెళ్లి చేయటానికి నిరాకరించారు. ఎందుకంటే పుట్టగొడుగుల పెంపకం ద్వారా ఆమె తన కూతురు చదువుకు కావలసిన డబ్బులు సమకూర్చుకోగలుతున్నారు'' అని పౌలోమి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఈ కుక్కలను కొనొద్దని పశు వైద్యులు ఎందుకు చెబుతున్నారు
- భారత ఆర్మీ: అగ్నిపథ్ పథకం అంటే ఏంటి? జీతం ఎంత? ఎవరు అర్హులు?
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- కసార్ దేవి: హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రపంచం నలుమూలల నుంచి మేధావులు ఎందుకు వస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











