Dog: ఈ బ్రీడ్ కుక్కలు కొనొద్దని పశు వైద్యులు ఎందుకు చెబుతున్నారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హెలెన్ బ్రిగ్స్
- హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి
పొట్టిగా, బుజ్జిగా కనిపించే బుల్‌డాగ్‌లను కొనొద్దని పశువైద్యులు, జంతు ప్రేమికులు సూచిస్తున్నారు.
మిగతా కుక్కలతో పోల్చినప్పుడు ఈ బుల్‌డాగ్‌కు రోగాలు చుట్టుముట్టే ముప్పు రెండు రెట్లు ఎక్కువని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
ఈ బ్రీడ్‌లో మార్పులు చేయాల్సిన అవసరముందని, అప్పటివరకు వీటిని పెంచుకోకపోవడమే మంచిదని లండన్‌లోని రాయల్ వెటర్నరీ కాలేజీ నిపుణులు సూచించారు.
ఇంగ్లిష్ బుల్‌డాగ్‌లతోపాటు ఫ్రెంచ్ బుల్‌డాగ్, పగ్‌లను కూడా ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువగా చుట్టుముడుతున్నాయని, వీటి బ్రీడింగ్‌లో మార్పులు చేయాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు.
అప్పటివరకు ఈ కుక్కలను కొనుగోలు చేయొద్దని, సోషల్ మీడియాలో వీటికి లైక్‌లు కొట్టడం, పోస్టులు పెట్టడం లాంటివి కూడా తగ్గించాలని సూచిస్తున్నారు.
గత పదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఈ బుల్‌డాగ్‌లకు విపరీతమైన ఆదరణ పెరిగింది. ధైర్యం, ఓర్పుకు వీటిని ప్రతీకగా భావిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
వీటి ముఖం బల్ల పరుపుగా ఉంటుంది. చర్మం అంతా ముడతలుముడతలుగా ఉండే ఈ బుల్‌డాగ్‌లు చాలా పొట్టిగా కనిపిస్తాయి. ఈ లక్షణాలే వీటిలో అనారోగ్య సమస్యలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
''పెద్దపెద్ద కళ్లు, ఫ్లాట్‌గా కనిపించే ముఖాలతో ఇవి చాలా ముద్దుగా ఉంటాయి''అని రాయల్ వెటర్నరీ కాలేజీకి చెందిన డా. డాన్ ఓనీల్ చెప్పారు. ''ఈ లక్షణాలు బుల్‌డాగ్ పిల్లలకు ఎక్కువగా వచ్చేలా కొన్ని ఎంపికచేసిన బుల్‌డాగ్‌లతో బ్రీడింగ్ చేయిస్తున్నారు. ఈ బ్రీడ్ పతనానికి ఇలా సెలెక్టివ్ బ్రీడింగ్ చేయడమే కారణం''అని ఆయన అన్నారు.
''చాలా బుల్‌డాగ్‌ల్లో అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. వీటిని తగ్గించడంలో ప్రజలు ప్రధాన పాత్ర పోషించగలరు''అని ఆయన వివరించారు.

''ఈ శునకాల ఫోటోలను ఆన్‌లైన్ షేర్ చేయడం, లైక్‌లు కొట్టడం వల్ల వీటిని కొనుగోలు చేసేందుకు మరింత మంది ఆసక్తి చూపించే అవకాశముంది''అని ఆయన చెప్పారు.
''ప్రజల్లో ఈ బుల్‌డాగ్‌లకు ఉండే ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఇవి చూడటానికి పసిపిల్లల్లా కనిపిస్తాయి. మనతో ప్రేమగా ఉంటాయి. అయితే, మనం వాటి కోణంలోనూ ఆలోచించాలి. మనకు ముద్దుగా కనిపిస్తున్నాయని చెప్పి, వాటిని జీవితాంతం బాధపెట్టకూడదు''అని ఆయన అన్నారు.
కొన్ని దేశాల్లో ఆంక్షలు
బుల్‌డాగ్‌ల బ్రీడింగ్‌పై కొన్ని దేశాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నాయని నిపుణులు చేస్తున్నారు.
''ఇప్పటికే ఆ కుక్కలను కొనుగోలు చేస్తే.. వాటి ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాటి శ్వాస తీసుకునే విధానం ఎలా ఉంది? చర్మ వ్యాధులు ఏమైనా ఉన్నాయా? లాంటి అంశాలను పరిశీలించాలి. ఏదైనా అవసరమైతే వెంటనే పశు వైద్యులను సంప్రదించాలి''అని లండన్ కింగ్స్ కాలేజీకి చెందిన అలిసన్ స్కిప్పర్ అన్నారు.
''చాలా వ్యాధులకు ఈ బుల్‌డాగ్స్ ఆకారమే కారణం. బ్రీడింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం లాంటి చర్యలతో ఈ సమస్యలను పరిష్కరించొచ్చు''అని ఆమె చెప్పారు.
''ఆకారం చూసి కుక్కలను కొనకూడదు. బ్రీడింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించే వారి దగ్గర నుంచి వీటిని కొనుగోలు చేయడం ద్వారా కొంత వరకు ఈ సమస్యను పరిష్కరించొచ్చు''అని ద కెన్నెల్ క్లబ్ అధికార ప్రతినిధి బిల్ లాంబర్ట్ చెప్పారు.
వేల సంఖ్యలో ఇంగ్లిష్ బుల్‌డాగ్‌లపై చేపట్టిన అధ్యయనంలో మిగతా కుక్కలతో పోలిస్తే, వీటికి అనారోగ్య ముప్పు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని కెనైన్ మెడిసిన్ అండ్ జెనెటిక్స్ జర్నల్‌లో ఒక అధ్యయనం ప్రచురించారు.
ఒక ఏడాదిలోనే ఇంగ్లిష్ బుల్‌డాగ్‌లకు ఒకటికంటే ఎక్కువ వ్యాధులు సోకే ముప్పు రెండు రెట్లు ఎక్కువని దీనిలో పేర్కొన్నారు.
ఇతర శునకాలతో పోల్చినప్పుడు చర్మం ముడతల మధ్య ఇన్ఫెక్షలు (38 రెట్లు ఎక్కువ), కంటి సమస్యలు (26 రెట్లు ఎక్కువ), కింద దవడ జారిపోవడం (24 రెట్లు ఎక్కువ), శ్వాస సమస్యలు (19 రెట్లు ఎక్కువ) లాంటి అనారోగ్య సమస్యలు ఈ బుల్‌డాగ్‌లకు ఎక్కువగా వస్తున్నట్లు వెల్లడైంది.
ఇవి కూడా చదవండి:
- సమాచార హక్కు చట్టాన్ని నీరుగారుస్తున్నారా
- ప్రయాగ్‌రాజ్ హింస: బుల్డోజర్లతో కూల్చేసిన ఈ ఇంటిలో ఉండే జావెద్ మొహమ్మద్ ఎవరు?
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- కసార్ దేవి: హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రపంచం నలుమూలల నుంచి మేధావులు ఎందుకు వస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















