బెంగాల్ మోనిటర్ లిజార్డ్: ఉడుముపై అత్యాచారం జరిపారన్న అనుమానంతో నలుగురి అరెస్ట్

బెంగాల్ మోనిటర్ లిజార్డ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, స్వాతి పాటిల్
    • హోదా, బీబీసీ కోసం

మహారాష్ట్రలోని సహ్యాద్రి పులుల అభయారణ్యంలో బెంగాల్ మోనిటర్ లిజార్డ్ (ఉడుము)పై అత్యాచారం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ ఘటనకు సంబంధించి నలుగురిపై అటవీ అధికారులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

మార్చి 31న చందోలి నేషనల్ పార్క్‌లోకి నలుగురు అక్రమంగా ప్రవేశించారు. ఈ పార్కు సహ్యాద్రి అభయారణ్యం పరిధిలోకి వస్తుంది.

మహారాష్ట్రలోని సతారా, సాంగ్లి, కొల్హాపుర్, రత్నగిరి జిల్లా పరిధిలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది.

రత్నగిరి జిల్లాలోని గోఠనే గ్రామ పరిధిలో తాజా ఘటన చోటుచేసుకుంది.

బెంగాల్ మోనిటర్ లిజార్డ్

ఫొటో సోర్స్, Getty Images

అసలేం జరిగింది?

చందోలి నేషనల్ పార్క్‌లో పులులను లెక్కించేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటుచేశారు. వీటిని పరిశీలిస్తున్న సమయంలో గోఠనే గ్రామానికి సంబంధించిన కెమెరా కనిపించకుండా పోయినట్లు అధికారులు గుర్తించారు.

అయితే, ఆ కెమెరాకు పరిసరాల్లో ఏర్పాటుచేసిన మరొక కెమెరాలో కొందరు వేటాడటానికి ఉపయోగించే ఆయుధాలతో అనుమానాస్పదంగా కనిపించారు.

ఈ ఘటన తర్వాత అటవీ జంతువుల సంరక్షణ చట్టం-1972 కింద గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదుచేశారు.

ఈ కేసుకు సంబంధించి జంతువులను వేటాడారనే ఆరోపణలపై హాతివ్ గ్రామానికి చెందిన ఒకర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదే కేసులో రత్నగిరిలోని మారల్ గ్రామానికి చెందిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇదే జిల్లాలో మరొకరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు.

వీడియో క్యాప్షన్, నాలుగేళ్లు తోడుగా ఉన్న నెమలి చనిపోవడంతో, రెండో నెమలి ఏం చేసిందంటే

మొబైల్ ఫోన్‌లో వీడియో

అరెస్టైన వారి మొబైల్ ఫోన్లను అటవీ అధికారులు పరిశీలించారు. దీంతో కుందేళ్లు, జింకలు, పాంగోలిన్ లాంటి జంతువులను వీరు వేటాడినట్లు వెలుగులోకి వచ్చింది.

అయితే, ఈ వీడియోల్లో నాలుగున్నర అడుగుల పొడవున్న ఉడుమును అసాధారణంగా హింసించిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది.

నలుగురు వ్యక్తులు ఆ ఉడుముపై రేప్‌కి పాల్పడినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

ప్రస్తుతం అరెస్టైన వారే ఆ ఘటనకు పాల్పడినట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, తాము ఆ పని చేయలేదని చెబుతున్నట్లు చందోలి నేషనల్ పార్క్ ఫారెస్ట్ రేంజన్ నంద్‌కుమార్ నల్వాడే బీబీసీతో చెప్పారు.

ఈ వీడియోలోని దృశ్యాల పరిశీలనకు దీన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించామని నంద్‌కుమార్ వివరించారు.

అడవిలోకి అక్రమంగా ప్రవేశించారని రుజువైతే వారికి గరిష్ఠంగా 5 లక్షల జరిమానాతోపాటు ఏడేళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశముందని అధికారులు తెలిపారు.

మరోవైపు ఉడుముపై అకృత్యాలకు పాల్పడినట్లు రుజువైతే ఐపీసీలోని సెక్షన్ 377 కింద పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని వివరించారు.

ఈ నలుగురు నిందితులను దేవ్‌రుఖ్ కోర్టులో అధికారులు ప్రవేశపెట్టారు. వీరిని 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

అనంతరం వారికి షరతులపై బెయిల్ మంజూరు చేశారు.

వీడియో క్యాప్షన్, మ్యూజియంలో చిన్న తిమింగలం ఎంత ఉందో, పెద్ద తిమింగలం తల అంత పెద్దగా ఉంటుంది

చట్టాలు ఏం చెబుతున్నాయి?

అటవీ జంతువులను అక్రమంగా ఉంచుకోవడం, విక్రయించడం, వేటాడటాన్ని నేరాలుగా అటవీ జంతువుల సంరక్షణ చట్టం-1972లో పేర్కొన్నారు.

అయితే, జంతువులపై క్రూరత్వాన్ని ప్రదర్శించేవారిని కఠినంగా శిక్షించేలా ఈ చట్టంలో ఎలాంటి నిబంధనలూ లేవని రాష్ట్రంలోని జంతు సంరక్షణ విభాగం పేర్కొంది.

‘‘మనుషులపై క్రూరత్వం ప్రదర్శిస్తే అందరూ మాట్లాడతారు. అదే జంతువుల గురించి ఎవరూ పట్టించుకోరు. తాజా ఘటనలో అటవీ అధికారులు ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారో తెలియడం లేదు’’అని జంతు సంరక్షణ నిపుణుడు, న్యాయవాది బసవరాజ్ హోస్‌గోడర్ అన్నారు.

జంతువులపై క్రూరత్వాన్ని చూపించే వారికి విధించే శిక్షలు చాలా తక్కువని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, చిరుత: ప్లాస్టిక్ డబ్బాలో తలపెట్టి ఇరుక్కుని రెండు రోజులు తీవ్ర అవస్థలు

జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టం-1960 ప్రకారం.. పెంపుడు జంతువులను హింసించడం, చంపడం లాంటి చర్యలకు కేవలం మూడు నెలల జైలు శిక్ష మాత్రమే విధించే అవకాశముంది.

అదే అటవీ జంతువుల విషయంలో అయితే, ఈ శిక్ష మూడు నుంచి ఏడేళ్ల వరకు విధిస్తారు. గరిష్ఠంగా రూ.25,000 వరకు జరిమానా కూడా విధించే అవకాశముంది.

ఈ జరిమానాతోపాటు శిక్షలను పెంచాల్సిన అవసరముందని బసవరాజ్ అన్నారు. గత కొన్నేళ్లుగా జంతువులను హింసిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. వీటికి అనుగుణంగా చట్టాల్లోనూ మార్పులు చేయాలని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)