హోమ్ లోన్ ఈఎంఐ కట్టలేనప్పుడు ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రుజుతా లుక్‌తుకే
- హోదా, బీబీసీ మరాఠీ
‘‘ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఎలాగైనా తన ఇంటిని కోల్పోకూడదని ప్రతి ఒక్కరూ అనుకుంటారు’’ అని 50ఏళ్ల అంజలి దేశ్‌ముఖ్ అన్నారు. ఇంటి గురించి మాట్లాడేటప్పుడు ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
ఎందుకంటే, ఇటీవల ఆమె మూడు బెడ్‌రూమ్‌ల ఇల్లును అమ్మేశారు. పుణెలోని సహకార్‌నగర్‌లో ఎంతో ఇష్టపడి ఆమె ఈ ఇంటిని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆమె అదే పరిసరాల్లోని ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
హోమ్ లోన్ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు కట్టలేక ఆమె ఇంటిని అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఆమె భర్త అజయ్ దేశ్‌ముఖ్ వృత్తిరీత్తా ఇంజినీర్. 2006లో ఐఐటీ ముంబయి నుంచి డాక్టరేట్ కూడా అందుకున్నారు. ఆయనకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే మొదట ఆయన ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఆయన మహారాష్ట్రలోని ఓ కాలేజీకి ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నారు. అయితే, కోవిడ్-19 వ్యాప్తి నడుమ ఆర్థిక ఇబ్బందులతో ఆయన సతమతం అయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
పెరిగిన ఇన్‌స్టాల్‌మెంట్లు
2012లో రూ.75 లక్షల విలువైన ఇంటిని అజయ్ దేశ్‌ముఖ్ కొన్నారు. మరమ్మతులకు మరో రూ. 2 నుంచి రూ.3 లక్షలు ఖర్చుపెట్టారు.
అయితే, 2016లో ఆయన పనిచేస్తున్న కాలేజీకి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఆ తర్వాత కోవిడ్-19 వ్యాప్తి నడుమ ఈ ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఆయన కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా గాడితప్పింది.
అప్పట్లో పరిస్థితులు ఎలా ఉండేవో అంజలి బీబీసీతో మాట్లాడారు.
‘‘కాలేజీలో జీతాల బిల్లులు పెండింగ్ ఉండిపోయాయి. ఏడాది పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ నడిచింది. అప్పుడు డబ్బులు మొత్తం మేమే పెట్టుకోవాల్సి వచ్చింది. ఎలాగోలా ఇంటిని కాపాడుకుంటాం అని అనుకున్నాం. కానీ అలా జరగలేదు’’అని ఆమె వివరించారు.
ఇటీవల కాలంలో అంజలి దేశ్‌ముఖ్‌లా చాలా మంది తమ సొంత ఇంటిని కోల్పోయారు. ఆర్థిక పరిస్థితి దిగజారడమే దీనికి కారణం. ఏటా ఈఎంఐలు ఎగవేస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తాజా నివేదిక వెల్లడించింది. 2020తో పోలిస్తే, ప్రస్తుతం హోమ్ లోన్ ఎగవేసిన వారి సంఖ్య 20 శాతం పెరిగినట్లు పేర్కొంది.
ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ సమాచారం ప్రకారం.. రూ.10 లక్షల కంటే తక్కువ రుణాన్ని ఎగవేస్తున్న వారు 4.44 శాతం ఉండగా, రూ. 75 లక్షలలోపు రుణాన్ని దాదాపు 3 శాతం మంది ఎగవేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాదకరంగా..
రుణాలను ఎగవేస్తున్న వారిలో 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. 35 నుంచి 45ఏళ్ల మధ్య వయసున్న వారు ఆ తర్వాత స్థానంలో ఉన్నారు.
హోమ్ లోన్ రంగంలో మోహిత్ గోఖలే పనిచేస్తున్నారు. రుణాల ఎగవేతలపై ఆయన బీబీసీతో మాట్లాడారు.
‘‘నేటి యువత ఆశలు, ఆకాంక్షలు చాలా గొప్పగా ఉంటున్నాయి. పెద్ద ఇల్లు కొనాలని వారు కలలు కంటున్నారు. కానీ, ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా మారిపోతోంది. వడ్డీరేట్లలో తేడాల వల్ల కొందరి ఇన్‌స్టాల్ మెంట్లు పెరుగుతున్నాయి. దీన్ని చెల్లించడం చాలా మందికి కష్టం అవుతోంది’’అని ఆయన చెప్పారు.
ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించడానికి మనం పక్కా ప్రణాళిక వేసుకోవాలని ఆయన అన్నారు.
‘‘మీరు ఒక ఇన్‌స్టాల్‌మెంట్ మిస్ అయితే, ప్రమాదకర సైకిల్‌లోకి వెళ్లిపోతారు. ఎందుకంటే ఇంటి ఖర్చులు, పిల్లల ట్యూషన్ ఫీజులు ఇలా అన్ని ఖర్చులూ అలానే ఉంటాయి. ఒక్కోసారి ఈఎంఐల కోసం కొత్త పర్సనల్ లోన్లు తీసుకోవాల్సి ఉంటుంది. అది మరింత ప్రమాదకరం’’అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ తర్వాత ఏం జరుగుతుంది?
ఒక హోమ్ లోన్ ఇన్‌స్టాల్‌మెంట్ కట్టడం నిలిపివేస్తే, ఆ తర్వాత సాధారణంగానే మిగతా ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టొచ్చు. కానీ, వరుసగా మూడు ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టడం ఆపేస్తే అసలు సమస్య మొదలవుతుంది. అప్పుడు సదరు బ్యాంకు మనల్ని రుణం ఎగవేసిన వారిగా గుర్తిస్తుంది.
ఎగవేసిన రుణాలను వసూలు చేసేందుకు బ్యాంకు తరచూ నోటీసులు పంపిస్తుంటుంది. అదే సమయంలో సిబిల్ స్కోర్ కూడా తగ్గిపోతోంది. దీని వల్ల తర్వాత రుణాలు ఇచ్చే అవకాశం తగ్గుతుంది. మరోవైపు రికవరీ ఏజెంట్లు కూతా తమవైన పద్ధతుల్లో వసూలు చేసేందుకు చర్యలు మొదలుపెడతారు.
ఒకవేళ ఇకపై మన నుంచి డబ్బులు వసూలు చేయడం కుదరదని భావిస్తే.. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్‌ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్సియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటెరెస్ట్ యాక్ట్ (సర్ఫేసీ) కింద చర్యలు తీసుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
సర్ఫేసీ చట్టం కింద మీకు 60 రోజుల ఫైనల్ నోటీసు పంపిస్తారు. రుణం మొత్తాన్ని కట్టాలని దీనిలో సూచిస్తారు. అప్పటికీ రుణం చెల్లించకపోతే, తనఖాపెట్టిన వస్తువులను బ్యాంకులు నియంత్రణలోకి తీసుకుంటాయి. లేదా రుణానికి పూచీకత్తు ఇచ్చిన వారి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటాయి.
అందుకే పరిస్థితి ఇంతవరకు రాకముందే అజయ్ దేశ్‌ముఖ్ చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇంటిని అమ్మేసి ఆయన రుణాన్ని కట్టేశారు. ఇప్పుడు ఆయన కొన్ని కాలేజీల్లో లెక్చర్లు కూడా ఇస్తున్నారు. కొన్ని పుస్తకాలపై కూడా పనిచేస్తున్నారు.
‘‘కొన్నింటికి చాలా సమయం పడుతుంది. మనం ప్రశాంతంగా వేచి చూడాలి. మనం ఏవైపు అడుగులు వేస్తున్నామో కూడా చూసుకోవాలి. ఆర్థికంగా పరిస్థితులు బాగోలేనప్పుడు, పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు మనం సిద్ధంగా ఉండాలి’’అని ఆయన అన్నారు.
తాను సరైన సమయంలోనే చర్యలు తీసుకున్నట్లు దేశ్‌ముఖ్ చెప్పారు. బ్యాంకు స్వాధీనం చేసుకునే వరకు ఎదురుచూస్తే, పూర్తిగా అన్నింటినీ కోల్పోయేవరకు పరిస్థితి వచ్చి ఉండేదని ఆయన అన్నారు.
ఇన్‌స్టాల్‌మెంట్లు తగ్గితే?
హోమ్ లోన్ అనేది ఇటు బ్యాంకులు, అటు రుణాలు తీసుకునేవారికి ఇద్దరికీ మంచి అవకాశం లాంటిది. ఎందుకంటే మధ్యలో ఇల్లు తనఖా ఉంటుంది.
ముఖ్యంగా ఉద్యోగం, జీతం లాంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే ఈ లోను ఇస్తుంటారు. అయితే, ఇటీవల ఉద్యోగాల కోతలు ఎక్కువయ్యాయి. దీంతో లోను చెల్లించేందుకు ప్రత్యేక ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటుంది.
అజయ్ దేశ్‌ముఖ్‌లానే సకాలంలో చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని బ్యాంకింగ్ నిపుణుడు దేవీదాస్ తుల్జాపుర్కార్ చెప్పారు.
‘‘ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టడం కష్టమవుతుందని మీకు అనిపించినప్పుడు వెంటనే బ్యాంకు అధికారులతో మాట్లాడాలి. గడువుల గురించి వారిని అడగాలి. ఆ తర్వాత ఆలస్యం చేకుండా తగిన చర్యలు తీసుకోవాలి’’అని ఆయన చెప్పారు.
బ్యాంకులతో మనం మాట్లాడటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోగా వడ్డీ రేటు పెరిగిపోతుంటుంది. మరోవైపు ఇంటిని అమ్మేయాలని అనుకున్నా.. కొన్ని చిక్కులు కూడా వచ్చిపడుతుంటాయి.
అందుకే, లోనును రీస్ట్రక్చర్ చేసుకోవడం చాలా మంచిపని అని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే బ్యాంకు అధికారుల సాయంతోనే ఆ ఇంటిని అమ్మేయడం ఉత్తమం అని చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ ఆర్థిక పరిస్థితి మళ్లీ గాడిన పడేలా చూసుకోవడం చాలా అవసరమని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మనుషులు సెక్స్ ఎందుకు కోరుకుంటారు... లైంగిక సంబంధాల్లో విప్లవం రాబోతోందా?
- ఈ కుక్కలను కొనొద్దని పశు వైద్యులు ఎందుకు చెబుతున్నారు
- అగ్నిపథ్: ఇలాంటి సైనిక నియామకాల పథకం ఏఏ దేశాల్లో ఉంది? అక్కడి నియమ నిబంధనలు ఏమిటి
- విజయవాడలో బిల్డర్లకు అక్రమంగా లైసెన్సులు ఇస్తున్నారా... ఫ్లాట్స్ కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి?
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













