రూబుల్: అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ రష్యా కరెన్సీ విలువ ఎలా పెరుగుతోంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్రిస్టీనా జే ఆర్గాజ్
- హోదా, బీబీసీ న్యూస్
డాలర్‌తో మారకపు విలువలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా మెరుగుపడుతున్న కరెన్సీగా రష్యా రూబుల్ నిలుస్తోంది. రష్యాపై ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ రూబుల్ బలపడుతోంది.
యుక్రెయిన్‌పై దాడి తర్వాత ప్రపంచ దేశాలు రష్యాపై ముందెన్నడూ లేని రీతిలో ఆంక్షలు విధించాయి.
అయితే, రూబుల్ నానాటికీ బలపడుతుండటంతో పశ్చిమ దేశాల ఆంక్షలు రష్యాపై ప్రభావం చూపలేకపోతున్నాయనే వాదన వినిపిస్తోంది.
రెండు నెలల క్రితం వరకు రూబుల్ విలువ ఇలా పెరుగుతుందని ఎవరూ ఊహించలేదు. నిజానికి రెండు నెలల క్రితం రూబుల్ విలువ దారుణంగా పతనమైంది. అయితే ఆ తర్వాత యూటర్న్ తీసుకుంది.
మార్చి 7న రికార్డు స్థాయిలో ఒక డాలరుకు రూబుల్ విలువ 0.007కు పడిపోయింది. అయితే, ఆ తర్వాత 15 శాతం వరకు మారకపు విలువ మెరుగుపడింది. ప్రస్తుతం ఇది 0.016కు పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా-యుక్రెయిన్ యుద్ధం..
యుక్రెయిన్‌పై దాడి మొదలైన తర్వాత తమ కరెన్సీ రూబుల్ లావాదేవీలను నియంత్రించేదుకు రష్యా తీసుకున్న కఠిన చర్యల వల్లే పరిస్థితులు మెరుగుపడ్డాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
యుద్ధం ప్రారంభ సమయంలో రష్యన్లలో ఒకరమైన ఆందోళన కనిపించింది. ఏటీఎం యంత్రాల ముందు డబ్బులు తీసుకోవడానికి ప్రజలు బారులుతీరారు.
మరోవైపు తమ ప్రజలు రూబుల్ ఉపయోగించి విదేశీ కరెన్సీలు కొనకుండా రష్యా ఆంక్షలు విధించింది.
రష్యా ప్రభుత్వ చర్యలను కుటిల యుక్తులుగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు.
రష్యా చర్యల వల్ల విదేశీ మారకపు విలువలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. దీంతో మార్కెట్‌లో రూబుల్ విలువ క్రమంగా బలపడింది.
ముఖ్యంగా యుద్ధానికి అవసరమైన కీలక వనరులు సమకూర్చుకోవాల్సిన సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మరోవైపు యుద్ధం కూడా ముందుగా ఊహించిన దానికంటే ఎక్కువ రోజులు కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
టర్కీ, అర్జెంటీనాలు ఇలానే..
ప్రస్తుతం రూబుల్ బలపడే దిశగా రష్యా తీసుకున్న చర్యలు తరహాలోనే ఒకప్పుడు టర్కీ, అర్జెంటీనా కూడా చర్యలు తీసుకున్నాయి.
అయితే, రూబుల్ తరహాలో లీరా(టర్కీ), పెసో (అర్జెంటీనా)లు బలపడలేదు. చర్యల వల్ల ఈ రెండు కరెన్సీలు మరింత పతనమయ్యాయి.
అంతర్జాతీయ ఆంక్షలు విధిస్తారని అంచనాలు వెలువడిన వెంటనే రష్యా చర్యలను మొదలుపెట్టింది.
ముఖ్యంగా రష్యాలోని కొత్తతరం పౌరులు ఇలాంటి చర్యలను ఊహించలేదు. ముఖ్యంగా సోవియట్ కాలంనాటి పరిణామాలను చూడనివారికి ఈ చర్యలు చాలా కొత్తగా అనిపించి ఉండొచ్చు.
‘‘పశ్చిమ దేశాల ఆంక్షల నడుమ రూబుల్ లావాదేవీలను నియంత్రించేందుకు రష్యా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను భారీగా పెంచింది’’అని ఫైనాన్షియల్ సంస్థ ఇ-టోరోలో గ్లోబల్ మార్కెట్ వ్యవహారాల నిపుణుడు బెన్ లాండ్లెర్ చెప్పారు.
‘‘ప్రస్తుతం రష్యాలో వడ్డీ రేట్లను రెట్టింపు చేశారు. ఇవి 20 శాతం వరకు పెంచారు. రష్యా ఎగుమతిదారులను కూడా 80 శాతం ఆదాయాన్ని రూబుల్ లేదా తాము సూచించిన అతికొద్ది కరెన్సీలలోనే తీసుకోవాలని ఆంక్షలు విధించారు. విదేశాలకు డబ్బులు పంపే పరిమితిపైనా నిబంధనలు విధించారు’’అని బెన్ చెప్పారు.
రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలతో విదేశాల్లోని రష్యన్ల బ్యాంకు ఖాతాలు కూడా స్తంభించిపోయాయి.
అయితే, ఈ సమయంలో తమ దేశం నుంచి చమురు, సహజ వాయువులను కొనుగోలుచేసే యూరోపియన్ దేశాలు కేవలం రూబుల్‌లోనే చెల్లించాలని రష్యా సూచించింది. డాలర్లు లేదా యూరోల్లో లావాదేవీలపై ఆంక్షలు విధించింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతీకార చర్యలా?
రష్యా నుంచి వచ్చే గ్యాస్‌పై యూరోపియన్ దేశాలు ఎక్కువగా ఆధారడుతుంటాయి. అయితే, యుద్ధం నడుమ, యూరోపియన్ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నాయి.
రష్యా నుంచి గ్యాస్ కొనుగోళ్లను క్రమంగా తగ్గిస్తామని ఇప్పటికే చాలా యూరప్ దేశాలు వెల్లడించాయి. అయితే, కొన్ని దేశాలు రష్యా షరతులకు అంగీకరిస్తున్నాయి.
రష్యా ప్రభుత్వ సంస్థ గ్యాజ్‌ప్రోమ్ నుంచి భారీగా గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్న దేశాల్లో జర్మనీ ఒకటి. రూబుల్‌లోనే లావాదేవీలు జరపాలన్న ఆంక్షలకు ఇప్పటికే జర్మనీ అంగీకారం తెలిపింది.
‘‘యూరోపియన్ యూనియన్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి రష్యా వ్యూహాత్మక విధానాలను అనుసరిస్తోంది. ముఖ్యంగా గ్యాస్ విషయంలో యూరప్ దేశాలు తమపై ఆధారపడటాన్ని రష్యా అవకాశంగా మలుచుకుంటోంది’’అని ఫైనాన్షియల్ సంస్థ స్కోప్ రెటిజెన్స్‌లో సీనియర్ విశ్లేషకుడిగా పనిచేస్తున్న లెవోన్ కెమెరియన్ చెప్పారు.
‘‘మొత్తానికి ఈ చర్యల వల్ల రష్యా లాభపడుతోంది. గ్యాస్, చమురుల ధరలు పెంచడంతో యూరోపియన్ దేశాలు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. అంటే ఎక్కువ రూబుల్స్‌ను రష్యాకు ఆయా దేశాలు అప్పగించాల్సి వస్తోంది’’అని ఆయన విశ్లేషించారు.
తాత్కాలిక ఉపశమనమేనా?
అయితే, నగదు లావాదేవీల విషయంలో కఠిన ఆంక్షలు విధించడం, వడ్డీ రేట్లను పెంచడం, చమురు, గ్యాస్ ధరలను పెంచడంతో రష్యాకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే దక్కుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను ఈ చర్యలు మరింత దిగజారుస్తాయని చెబుతున్నారు.
‘‘రూబుల్ విలువ దేశీయంగా ఒక్కసారిగా పెరిగింది. దీనివల్ల ఎగుమతిదారులకు, వస్తూత్పత్తి దారులకు కష్టాలు తప్పవు’’అని బ్లూమ్‌బర్గ్ ఎకనామిక్స్‌లోని రష్యా ఆర్థిక వ్యవహారాల నిపుణుడు స్కాట్ జాన్సన్ వివరించారు.
రూబుల్ నానాటికీ బలపడటాన్ని చూస్తుంటే పశ్చిమ దేశాలపై రష్యా ఆంక్షలు ప్రభావం చూపడం లేదా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి.
‘‘బయట నుంచి చూసేవారికి రూబుల్ బలపడుతున్నట్లు కనిపించొచ్చు. ఆంక్షల ప్రభావం కూడా ఏమీలేదని అనుకోవచ్చు. కానీ, అది నిజం కాదు’’అని స్కాట్ జాన్సన్ అన్నారు.
‘‘రూబుల్ బలపడటానికి ప్రధాన కారణం రష్యా ఎగుమతులను రూబుల్‌లొకి మార్చడమే. మరోవైపు నగదు లావాదేవీలపైనా ఆంక్షలు విధించారు. అంతేకానీ, ఆంక్షలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడంలేదని అనుకోకూడదు’’అని ఆయన వివరించారు.
‘‘ఇలా రూబుల్ విలువను పెంచుకోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో రష్యా ఎగుమతులు విలువ పడిపోతుంది. మరోవైపు రష్యా రుణాలు మరింత పెరుగుతాయి. ఫలితంగా రుణాలు ఎగవేసే ముప్పు పెరుగుతుంది. చివరగా ఇది రష్యా ఆర్థిక వ్యవస్థకే ముప్పు’’అని బెన్ కూడా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ముస్లిం అని తెలిస్తే జైల్లో వేసేస్తున్న చైనా.. మత తీవ్రవాదాన్ని పెంచుతున్నారంటూ వీగర్లపై ఆరోపణ
- మీ సెల్‌ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకోవడం ఎలా... హ్యాక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- సైబర్ మాయగాళ్లు వేసే ఎరలు ఎలా ఉంటాయి? వాటికి చిక్కుకోకుండా ఉండడం ఎలా : డిజిహబ్
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













