భారత్: క్వాడ్ ‘టోక్యో సదస్సు’ లక్ష్యం చైనాయేనా

క్వాడ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వికాస్ పాండే
    • హోదా, బీబీసీ న్యూస్

జపాన్ రాజధాని టోక్యోలో క్వాడ్ దేశాల నాయకులు మంగళవారం భేటీ అవుతున్నారు. ఇటీవల కాలంలో ఇది అత్యంత ముఖ్యమైన భేటీల్లో ఒకటని విశ్లేషణలు వస్తున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రత, భౌగోళిక-రాజకీయ పరిణామాలపై ఈ భేటీ ప్రభావం చూపే అవకాశముంది.

ఈ క్వాడ్‌ కూటమిలో జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, భారత్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. కోవిడ్-19 సంక్షోభం, రష్యా-యుక్రెయిన్ యుద్ధం తదితర పరిణామాల తర్వాత ఈ భేటీ జరుగుతోంది.

నాలుగు దేశాల ప్రధాన నాయకులు ఇలా చర్చలు జరపడం గత రెండేళ్లలో ఇది నాలుగోసారి. గత సెప్టెంబరులో వాషింగ్టన్‌లో వీరు చర్చలు జరిపారు. ఆ తర్వాత రెండు సార్లు వర్చువల్‌గా కలిశారు. దీనిబట్టీ క్వాడ్‌కు ఈ దేశాలు ఇస్తున్న ప్రాధాన్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా 2017లో క్వాడ్ గ్రూప్‌ను మళ్లీ పునరుద్ధరించాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భావించారు.

క్వాడ్

ఫొటో సోర్స్, Getty Images

మరోవైపు చైనాతో నానాటికీ దిగజారుతున్న క్వాడ్ దేశాల సంబంధాలు ఈ సదస్సు ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ అంశంపై బీబీసీతో విల్సన్ సెంటర్ థింక్ ట్యాంక్‌కు చెందిన మైఖెల్ కుజెల్‌మన్ మాట్లాడారు. ఈ సదస్సు ఇండో-పసిఫిక్ విధానాలపై ప్రధానంగా దృష్టిసారించే అవకాశముందని ఆయన అన్నారు.

‘‘కరోనా మహమ్మారి నుంచి పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. మరోవైపు యుక్రెయిన్‌ యుద్ధం విషయంలో భారత్ వైఖరిని కూడా ప్రపంచ దేశాలు అర్థం చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఇండో-పసిఫిక్‌లో స్వేచ్ఛా వాణిజ్యం, రవాణాపై ఈ కూటమి దృష్టి సారించే అవకాశముంది’’అని ఆయన అన్నారు.

యుక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాను నేరుగా విమర్శించేందుకు భారత్ నిరాకరించింది. అదే సమయంలో ప్రతి దేశం సార్వభౌమత్వాన్ని గౌరవించాలని భారత్ నొక్కిచెప్పింది.

భారత్ వైఖరి విషయంలో మొదట్లో అమెరికా సహా పశ్చిమ దేశాలు అసహనం వ్యక్తం చేశాయి. అయితే, నెమ్మదిగా భారత్ పరిస్థితిని ఆయా దేశాలు అర్థం చేసుకున్నాయి.

మరోవైపు గత ఏప్రిల్‌లో అమెరికా, భారత్‌ల మధ్య జరిగిన విదేశాంగ, రక్షణ మంత్రుల 2+2 సదస్సు కూడా పరిస్థితులను మెరుగుపరిచింది.

క్వాడ్

ఫొటో సోర్స్, Getty Images

రక్షణ ఉత్పత్తుల విషయంలో రష్యాపై ఆధారపడటం భారత్‌కు అనివార్యమనే సంగతిని కూడా అమెరికా అర్థం చేసుకుంది.

ఇలాంటి పరిస్థితుల్లో నాలుగు దేశాలను పీడించే సమస్యలపై క్వాడ్ దృష్టిసారించే అవకాశముంది. అంటే అది చైనా సమస్యేనని మనం భావించొచ్చు.

ఈ ప్రాంతంలో చైనా తన శక్తిని చాటిచెప్పేలా చర్యలు తీసుకుంటోంది. భారత్‌తోపాటు చాలా దేశాలకు చైనాతో సరిహద్దు వివాదాలున్నాయి. మరోవైపు దక్షిణచైనా సముద్ర వివాదం ఏళ్ల నుంచీ నడుస్తోంది.

నావికా దళంపై చైనా విపరీతంగా ఖర్చుచేస్తోంది. తాజాగా సొలోమన్ దీవులతోనూ రక్షణ రంగ సహకారంపై ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో ఆస్ట్రేలియాలో ఆందోళనలు పెరిగాయి.

ఆ ఒప్పందానికి చెందిన ఒక ముసాయిదా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. అది నిజమైనదేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. ఆ ఒప్పందం కార్యరూపం దాలిస్తే చైనా యుద్ధ నౌకలను సొలోమన్ దీవుల్లో మోహరిస్తారు. ముఖ్యంగా శాంతి, భద్రతల పరిరక్షణ పేరుతో ఈ చర్యలు తీసుకుంటారు.

ఈ ముప్పులను తొలగించేందుకు ఆస్ట్రేలియా కొత్త ప్రధాన మంత్రి ఆంటొనీ ఆల్బనీస్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో, క్వాడ్ సదస్సులో ఆయన ఈ విషయాన్ని ఎలా ప్రస్తావిస్తారో ఇప్పుడు చూడాలి.

మరోవైపు జపాన్ కూడా చైనా నావికా దళ ‘‘చొరబాట్ల’’ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇండో పసిఫిక్ ప్రాంతంలో తమ సదుపాయాలకు రక్షణ కల్పించుకోవడమే లక్ష్యంగా అమెరికా అడుగులు వేస్తోంది.

తాజాగా ఇండో-పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్) పేరుతో ఇటీవల 13 దేశాలతో కలిపి అమెరికా ఒక కూటమిని కూడా ఏర్పాటుచేసింది. ముఖ్యంగా ప్రాంతీయ భద్రతే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పాటుచేస్తున్నట్లు అమెరికా పేర్కొంది.

క్వాడ్

ఫొటో సోర్స్, Getty Images

ఇటీవల వాషింగ్టన్‌లో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్ (ఏసియాన్) దేశాల నాయలకులతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల భేటీఅయ్యారు.

ఆ భేటీని గమనిస్తే, ఈ ప్రాంతానికి అమెరికా ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే సముద్ర మార్గాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. మలక్కా జల సంధి గుండా ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 30 నుంచి 40 శాతం ప్రయాణిస్తుంది. చమురు నుంచి చమురు ఉత్పత్తుల వరకు చాలా వస్తువులను ఈ మార్గం గుండా రవాణా చేస్తారు.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆల్బనీస్, జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిద, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీ అయినప్పుడు వీరు నేరుగా చైనా గురించి ప్రస్తావింకపోవచ్చు. కానీ, ప్రాంతీయ భద్రతపై వీరు ప్రధానంగా దృష్టిసారిస్తారు.

క్వాడ్

ఫొటో సోర్స్, Getty Images

క్వాడ్‌లో కొన్ని వర్కింగ్ గ్రూపులు ఉన్నాయి. వీటిని సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్యం, మౌలిక పెట్టుబడులు, విద్య తదితర రంగాలపై ఏర్పాటుచేశారు. అయితే, రక్షణ రంగంలో సహకారంపై క్వాడ్ కూటమి బహిరంగంగా మాట్లాడటం లేదు.

కానీ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా అక్రమ చేపల వేటకు కళ్లెం వేయడంపైనా సంయుక్తంగా ఒక వ్యూహాన్ని వీరు ప్రకటించే అవకాశముంది.

ఈ వ్యూహం చాలా ముఖ్యమైనదని కుజెల్‌మన్ అన్నారు. ‘‘ఎందుకంటే ఉపగ్రహ చిత్రాలు, నిఘా సమాచారం బదిలీ తదితర వివరాలు ఈ దేశాలు పంచుకునే అవకాశముంది. ఫలితంగా ప్రాంతీయ భద్రతపై ప్రభావం పడొచ్చు’’అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, పెర్ల్ హార్బర్: అమెరికాపై జపాన్ దాడికి 80ఏళ్లు.. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది?

రక్షణ సహకారం లేదని చెప్పలేం..

అయితే, క్వాడ్ కూటమిలో రక్షణ సహకారం లేదని చెప్పలేం. ఈ నాలుగు దేశాలూ మలబార్ విన్యాసాల్లో పాల్గొన్నాయి. మరోవైపు అఫ్గానిస్తాన్ సంక్షోభం, ఉత్తర కొరియా అణ్వాయుధాలపైనా చర్చలు జరిపాయి. తైవాన్‌పై చైనా దాడి చేస్తే, తాము జోక్యం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా తాజాగా చెప్పారు.

‘‘అయితే, క్వాడ్‌తోపాటు ఆసియా దేశాలకూ చైనాతో భారీగా వాణిజ్య సంబంధాలు పెనవేసుకుని ఉన్నాయి. దీంతో నేరుగా చైనాను డీకొట్టేందుకు ఈ దేశాలేవీ సాహసం చేయకపోవచ్చు. కానీ, ఈ ప్రాంతంలో భద్రత కోసం ఈ కూటమి ఉపయోగపడే అవకాశముంది’’అని కుజెల్‌మన్ అన్నారు.

మరోవైపు భారత్‌ కూడా భిన్న వేదికలపై చైనాతో కలిసి పనిచేస్తోంది. బ్రిక్స్ కూటమి దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీనిలో రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, భారత్, బ్రెజిల్ సభ్యదేశాలుగా ఉన్నాయి.

‘‘క్వాడ్ ఇప్పటికే చాలా దూరం ప్రయాణించింది. అయితే, ఇంకా చేయాల్సింది చాలా వుంది. దీనికి సచివాలయం కూడా లేదు’’అని కుజెల్‌మన్ అన్నారు.

మరోవైపు చైనాతో రష్యా బంధాలు కూడా నానాటికీ బలపడుతున్నాయి. భారత్‌కు ఇది అసలు మంచి పరిణామం కాదని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, డెడ్‌లైన్ కెఫె: ఇక్కడికి వస్తే మీ పని పూర్తి చేయాల్సిందే

యుక్రెయిన్ యుద్ధంతో..

యుక్రెయిన్ యుద్ధం వల్ల చైనాకు రష్యా మరింత చేరువైందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇండో పసిఫిక్‌లో క్రియాశీల పాత్ర పోషించేలా రష్యాను చైనా ఒప్పించే అవకాశముందని కూడా చెబుతున్నారు.

ఒకవేళ అదే జరిగితే, భారత్-రష్యా సంబంధాలు దెబ్బతినే ముప్పుంది. రక్షణ ఎగుమతుల విషయంలో భారత్ భారీగా రష్యాపై ఆధారపడుతోంది.

‘‘ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. కానీ, ఇలా జరగదని మనం చెప్పలేం. ఎందుకంటే క్వాడ్‌ను రష్యా కూడా తప్పుపడుతూ వస్తోంది’’అని కుజెల్‌మన్ అన్నారు.

క్వాడ్‌ ఎలాంటి ప్రభావమూ చూపదని, ఇది కేవలం సముద్రం నీటిపై నురుగ లాంటి కూటమని చైనా వ్యాఖ్యానించింది. అయితే, తర్వాత కాలంలో దీన్ని ఆసియా నాటోగా అభివర్ణించింది.

తాజా సదస్సుపై ఆదివారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ స్పందించారు. చైనాకు కళ్లెం వేసేందుకే ఈ కూటమి ఏర్పాటైందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)