ఒలిగార్క్: రష్యా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న పుతిన్ సంపన్న స్నేహితులు

ఫొటో సోర్స్, Getty Images
రష్యా, యుక్రెయిన్, పశ్చిమ దేశాల మధ్య సంక్షోభం పెరిగిన తర్వాత ఒలిగార్క్ (Oligarch) గురించి మళ్లీ జోరుగా చర్చ మొదలైంది.
పశ్చిమ దేశాల మీడియా తరచూ ఇలాంటి వారిని పుతిన్ 'క్రోనీజ్' అంటే ప్రాణ స్నేహితులుగా వర్ణిస్తుంటుంది.
యుక్రెయిన్ మీద దాడుల తర్వాత పశ్చిమ దేశాలు రష్యా మీద విధించిన ఆంక్షల్లో వీళ్లు కూడా లక్ష్యంగా మారారు.
ఒలిగార్క్ అంటే ఎవరు?
ఒలిగార్క్ అనే పదానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అయితే ప్రస్తుతం సమయంలో దానికి ఒక ప్రత్యేక అర్థం వచ్చింది.
సంప్రదాయ నిర్వచనం లేదా నమ్మకాల ప్రకారం ఒలిగార్క్ అంటే ఒలిగార్కీ (ప్రభుత్వంపై కొందరు ధనికులు కలిసి చూపించే ఆధిపత్యం) సభ్యులు లేదా సమర్థకులు. అంటే అలాంటి రాజకీయ వ్యవస్థలో భాగంగా ఉంటారు.
ఇప్పుడు ఈ మాటను ఎక్కువగా రష్యాలోని అత్యంత సంపన్న వర్గాన్ని వర్ణించడానికి ఉపయోగిస్తున్నారు.
1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత అక్కడ ఈ వర్గం వేగంగా పెరిగింది.
'ఒలిగార్క్' మాట గ్రీకు పదం ఒలిగోయీ(Oligoi) నుంచి వచ్చింది. దానికి 'కొన్ని' అని అర్థం. 'ఆర్కీన్'(Arkhein) అనే మాటకు 'పాలించడం' అని అర్థం.
ఈ ఒలిగార్కీ అనేది రాచరికం (ఒకే వ్యక్తి పాలన) లేదా ప్రజాస్వామ్యం (ప్రజల పాలన)కు భిన్నంగా ఉంటుంది.
ఇందులో ఒక ఒలిగార్క్ మతం, ఆర్థిక హోదా, భాష ఏదైనా సరే వారు అదే మతం, భాష మాట్లాడే వారికంటే భిన్నంగా ఉంటారు. వారు పాలించే గ్రూపులో భాగంగా ఉంటారు.
ఇలాంటి వారు తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పాలిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒలిగార్క్ అంటే అత్యంత ధనికుడు అనే అర్థంలో తీసుకుంటున్నారు
ఈమధ్య ఒలిగార్క్ అనే మాటను అత్యంత ధనికుడు అనే అర్థంలో తీసుకుంటున్నారు. అంటే ఇలాంటి వారు ప్రభుత్వాల సహకారంతో వ్యాపారాలు చేస్తూ అపార సంపద పోగేసి ఉంటారు.
ప్రపంచంలో రష్యా అత్యంత ప్రముఖ ఒలిగార్క్‌లలో బ్రిటన్‌కు చెందిన రోమన్ అబ్రమోవిచ్ ఒకరు. ఆయన చెల్సీ ఫుట్‌బాల్ క్లబ్ యజమాని. ఆయన ప్రస్తుత ఆస్తి విలువ 14.3 బిలియన్ డాలర్లని ఒక అంచనా. సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రభుత్వ ఆస్తులను కొనుగోలు చేసిన ఆయన ఆ తర్వాత వాటిని విక్రయించి సంపద కూడబెట్టారు.
ఇక బ్రిటన్‌కు చెందిన మరో ఒలిగార్క్ అలగ్జాండర్ లెబెదేవ్. ఆయన కేజీబీ మాజీ అధికారి, బ్యాంకర్. లండన్ నుంచి వెలువడే ప్రముఖ వార్తా పత్రిక ఈవెనింగ్ స్టాండర్డ్‌కు ఆయన కొడుకు ఎవగ్నీ లెబెదేవ్ యజమాని. ఎవగ్నీ లెబెదేవ్ బ్రిటన్ పౌరుడు. ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా కూడా చేశారు.
ఈ ఒలిగార్క్‌లు కేవలం రష్యాలోనే ఉండాలనేం లేదు. ప్రపంచంలోని మిగతా దేశాల్లో కూడా వీళ్లు ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ దీన స్థితికి వీళ్లూ ఒక కారణం
యుక్రెయిన్ ఆర్థికవ్యవస్థ, పరిశ్రమలు, రాజకీయాలు అన్నీ కుదేలవడానికి ఈ ఒలిగార్క్‌లే కారణమని కీయెవ్‌లోని స్వతంత్ర సంస్థ యుక్రేనియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఫ్యూచర్(యుఐఎఫ్) చెప్పింది.
సోవియట్ యూనియన్ పతనం తర్వాత లియోనిద్ కుచ్మా అధ్యక్షుడుగా ఉన్న సమయంలో దేశంలోని పాత ఒలిగార్క్‌లు చాలా అభివృద్ధి చెందారని తన రిపోర్టులో పేర్కొంది.
ఒలిగార్క్ సంపద ఎలా ఆర్జించారు
యుఐఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్టర్ ఆండ్రూసివ్ వాషింగ్టన్‌లో 2019లో జరిగిన ఒక కార్యక్రమంలో ఒలిగార్క్‌ల గురించి మాట్లాడారు.
"ఒలిగార్క్‌లు అంటే ప్రత్యేక వర్గానికి చెందిన వారు, ప్రత్యేక విధానంలో వ్యాపారం చేసేవారు. వారి దగ్గర జీవించడానికి, ఇతరులను ప్రభావితం చేయడానికి ప్రత్యేక విధానాలు కూడా ఉంటాయి" అని ఆయన వివరించారు.
"నిజానికి వారు వ్యాపారవేత్తలు కారు. వాళ్లు సంపన్నులు అయ్యారు. కానీ వారు అలా ఎలా సంపద ఆర్జించారు అనేది ఒక పెట్టుబడిదారీ దేశంలో ఉన్నట్లుగా ఉండదు" అన్నారు ఆండ్రూసివ్.

ఫొటో సోర్స్, Getty Images
రష్యాలో ఇంతమంది ఒలిగార్క్‌లు ఎలా?
ఇప్పుడు అందరూ రష్యాలోని ఒలిగార్క్‌ల గురించి మాట్లాడుకుంటున్నారు. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత జరిగింది దీనికి కారణమయ్యింది.
1991లో క్రిస్మస్ రోజున అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ సోవియట్ యూనియన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, బోరిస్ ఎల్సిన్‌కు అధికారం అప్పగించారు.
అయితే, ఆ సమయంలో అక్కడ కమ్యునిస్టు పాలన ఉండేది. అప్పట్లో ఎవరికీ ప్రైవేటు ఆస్తులు ఉండేవి కావు. కానీ, ఆ తర్వాత రష్యా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ సమయంలో దేశంలో భారీ స్థాయిలో.. ముఖ్యంగా పారిశ్రామిక, ఇంధన, ఆర్థిక రంగాల్లో ప్రైవేటీకరణ జరిగింది.
90వ దశకంలో ప్రారంభమైన ఈ ప్రైవేటీకరణ ఫలితంగా చాలా మంది సంపన్నులైపోయారు.
మంచి పరిచయాలు ఉంటే, తమ కాంటాక్ట్స్ ద్వారా రష్యా పరిశ్రమల్లో ఎక్కువ భాగాన్ని సొంతం చేసుకోవచ్చు. అలా వారు ముడి పదార్థాల సరఫరాలో, ఖనిజాలు లేదా సహజ వాయువు, చమురు పరిశ్రమలో తరచూ చురుగ్గా ఉండేవారు. ఎందుకంటే వీటన్నింటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉండేది.
ఆ తర్వాత ఆ పనిలో తమకు సాయం చేసిన అధికారులను తగిన రీతిలో సత్కరించి, వారికి డైరెక్టర్ లాంటి పదవులు ఇచ్చారు.
ఒలిగార్క్ దగ్గర మీడియా, చమురు బావులు, ఉక్కు పరిశ్రమలు, ఇంజనీరింగ్ కంపెనీలు లాంటివి ఉండేవి. వారు తరచూ తమ వ్యాపారానికి సంబంధించి చాలా తక్కువ పన్నులు చెల్లించేవారు.
అలాంటి వారే బోరిస్ ఎల్సిన్‌కు కూడా తమ మద్దతు ప్రకటించారు. 1996లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనకు ఆర్థిక సాయం అందించారు.
పుతిన్ పాలనాకాలంలో...
వ్లాదిమిర్ పుతిన్.. బోరిస్ ఎల్సిన్ వారసుడు అయినప్పుడు ఆయన ఒలిగార్క్‌లకు కళ్లెం వేయడం మొదలెట్టారు. అయితే ఆయనకు సన్నిహితంగా ఉంటూ వచ్చిన వాళ్లు మాత్రం విజయవంతంగా ముందుకెళ్లారు.
బ్యాంకర్ బోరిస్ బెరెజోవ్‌స్కీ లాంటి ప్రముఖులు ఆయనతో చేతులు కలపడానికి ఒప్పుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది.
ఒకప్పుడు రష్యా సంపన్నుడుగా భావించిన మిఖాయిల్ ఖోదార్‌కోవ్స్కీ కూడా ఇప్పుడు లండన్లో ఉంటున్నారు.
ఒలిగార్క్‌ల గురించి ప్రశ్నించినపుడు "ఇప్పుడు మా దగ్గర ఒలిగార్క్ ఎవరూ లేరు" అని వ్లాదిమిర్ పుతిన్ 2019లో ఫైనాన్షియల్ టైమ్స్‌తో అన్నారు.
అయితే పుతిన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నవారు ఆయన పాలనాకాలంలో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడంలో విజయం సాధించారు.
అలాంటివారిలో బోరిస్ రోటెన్‌బర్గ్ ఒకరు. పుతిన్, ఆయన చిన్నతనం నుంచి కలిసి ఒకే జూడో క్లబ్‌లో ఆడేవారు. పుతిన్‌తో సన్నిహిత సంబంధాలున్న ముఖ్యమైన వ్యాపారవేత్త రోటెన్‌బర్గ్ అని బ్రిటన్ ప్రభుత్వం చెప్పింది. ఫోర్బ్స్ మ్యాగజీన్ వివరాల ప్రకారం రోటెన్‌బర్గ్ సంపద విలువ దాదాపు 1.2 బిలియన్ డాలర్లు.
పుతిన్ తూర్పు యుక్రెయిన్ దోన్యస్క్, లుహాన్స్క్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు 'పీపుల్స్ రిపబ్లిక్' హోదా ఇచ్చినపుడు బోరిస్, ఆయన సోదరుడు అర్కాడీ కూడా బ్రిటన్ ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
బ్రిటన్‌తోపాటూ యుక్రెయిన్, అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, జపాన్ కూడా రష్యా ఒలిగార్క్ మీద ఆంక్షలు విధించాయి. యుక్రెయిన్ మీద రష్యా దాడి తర్వాత ఆంక్షలు మరింత తీవ్రం అయ్యాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












