NATO Warning: 'యుక్రెయిన్ యుద్ధం ఏళ్ల పాటు సాగుతుంది' - నాటో హెచ్చరిక

నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్
    • రచయిత, లియో సాండ్స్
    • హోదా, బీబీసీ న్యూస్

రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏళ్ల పాటు సాగే ఈ యుద్ధంలో యుక్రెయిన్‌కు మద్దతును కొనసాగించేందుకు పశ్చిమ దేశాలు సిద్ధం కావాలని ఆయన హెచ్చరించారు.

యుద్ధానికి అయ్యే వ్యయం ఎక్కువగా ఉందని అయితే, తన మిలిటరీ లక్ష్యాలను సాధించేందుకు మాస్కోను అనుమతిస్తే దాని వల్ల జరిగే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

దీర్ఘకాలం పాటు సాగే ఈ సంఘర్షణను తట్టుకొని నిలవాల్సిన అవసరం ఉందని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా హెచ్చరించారు. జాన్సన్ తర్వాత జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.

మరింత ఎక్కువగా ఆయుధాలను పంపించడం వల్ల యుక్రెయిన్ గెలిచే అవకాశం ఉందని వారిద్దరూ అన్నారు.

''ఇది మరికొన్నేళ్లు సాగుతుందనే వాస్తవానికి తగిన విధంగా మనం సిద్ధమవ్వాలి. యుద్ధ ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ యుక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడాన్ని వదిలేయకూడదు'' అని జర్మన్ వార్తా పత్రిక బిల్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటో చీఫ్ చెప్పారు.

మరింత అధునాతన ఆయుధాలను పంపించడం వల్ల రష్యా నుంచి దోన్బస్ ప్రాంతానికి విముక్తి కలిగించే అవకాశాలు యుక్రెయిన్‌కు పెరుగుతాయని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, రష్యా విమానాలను అడ్డుకున్న తర్వాత బీబీసీతో మాట్లాడిన నేటో పైలట్లు

యుక్రెయిన్ తూర్పు ప్రాంతమైన దోన్బస్ అధిక భాగం రష్యా నియంత్రణలో ఉంది.

యుక్రెయిన్ తూర్పు భూభాగంపై నియంత్రణ కోసం గత కొన్ని నెలలుగా రష్యా, యుక్రెయిన్ బలగాలు పోరాడాయి. ఇటీవలి వారాల్లో రష్యా అక్కడ నెమ్మదిగా పట్టు సాధిస్తోంది.

యుక్రెయిన్‌ను క్రూరంగా నలిపివేయడానికి ప్రయత్నిస్తున్నారని సండే టైమ్స్‌కు రాసిన కథనంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోపణలు చేశారు.

''నాకు భయంగా ఉంది. దీర్ఘకాలిక యుద్ధం కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాలానిదే కీలక పాత్ర. దాడి చేసే సామర్థ్యాన్ని రష్యా పునరుద్ధరించుకునే కంటే వేగంగా... యుక్రెయిన్ తమ నేలను కాపాడుకునే సామర్థ్యాలను పెంచుకుంటుందా లేదా అనేది కాలంపైనే ఆధారపడి ఉంది.’’

యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ను శుక్రవారం బోరిస్ జాన్సన్ సందర్శించారు.

రష్యా దళాలను ఓడించాలంటే తమ దేశానికి ఆయుధాల సరఫరాను పెంచాల్సిన అవసరం గురించి యుక్రెయిన్ అధికారులు ఈ మధ్యే మాట్లాడారు.

వీడియో క్యాప్షన్, తూర్పు యుక్రెయిన్‌లోని డోన్‌బాస్ ప్రాంతంపైన మరింత పట్టు బిగించిన రష్యా

యుక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెస్నికోవ్ బుధవారం బ్రస్సెల్స్‌లో యుక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్‌ గ్రూపులోని 50 దేశాలను మరిన్ని ఆయుధాలు, మందుగుండు సామగ్రి పంపాలని కోరారు.

యుక్రెయిన్‌కు పశ్చిమ మిత్ర దేశాలు భారీగా ఆయుధాలను, యుద్ధ సామగ్రిని అందించాయి. అయితే, తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన దానిలో కొంతభాగమే అందాయని, ఇంకా భారీ ఆయుధాలు కావాలని అడుగుతున్నామని యుక్రెయిన్ చెప్పింది.

యుక్రెయిన్‌కు నాటో సైనిక మద్దతును ఇవ్వడాన్ని రష్యా తరచుగా విమర్శిస్తుంది.

''యుక్రెయిన్‌ను నాటోలోకి లాగడం నేరపూరిత చర్య అని పశ్చిమ దేశాలకు వివరించడానికి మాకు వేరే మార్గం లేదు. అందుకే, మేం ప్రత్యేక సైనిక చర్యను ప్రకటించాం'' అని బీబీసీతో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు.

యుక్రెయిన్‌, నాటో సభ్య దేశం కాదు. నాటోలో చేరాలని యుక్రెయిన్ కోరుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)