అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకునేది లేదన్న త్రివిధ దళాల అధిపతులు, ఇంకా ఏమన్నారంటే...

భారత త్రివిధ దళాధిపతులు

ఫొటో సోర్స్, ANI

సైన్యంలో నియామకాలకు సంబంధించిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలను తగ్గించడానికి భారత త్రివిధ దళాల అధిపతులు ప్రయత్నించారు. సైన్యంలోని మూడు విభాగాలకు చెందిన అధిపతులు ఆదివారం దిల్లీలో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిపథ్ పథకానికి సంబంధించిన అనేక విషయాలపై స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నించారు.

ఇందులో రక్షణ శాఖ మిలిటరీ వ్యవహారాల అదనపు కార్యదర్శి, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురీ, వాయుసేన నుంచి ఎయిర్ మార్షల్ ఎస్కే ఝా, నేవీ నుంచి వైస్ అడ్మిరల్ డీకే త్రిపాఠిలతో పాటు ఆర్మీ అడ్జుటెంట్ జనరల్ బన్సీ పొన్నప్ప పాల్గొన్నారు.

దీనికంటే ముందు అగ్నిపథ్ పథకానికి సంబంధించి ఆదివారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికీ త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. సైన్యంలో నియామకాలకు సంబంధించిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోబోమని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అనిల్ పురీ స్పష్టం చేశారు. దేశ రక్షణ కోసం ఇది ఒక ప్రగతిశీల చర్య అని ఆయన అభివర్ణించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మార్చేందుకు 1989 నుంచే కసరత్తు జరుగుతోందని, గతంలో దీన్ని చేయలేకపోయామని ఇది ఇప్పుడే సాధ్యమైందని ఆయన చెప్పారు.

భారత సైన్యంలో చేరాలంటే క్రమశిక్షణే పునాది కాబట్టి అల్లర్లు, విధ్వంసాలకు పాల్పడేవారికి ఆర్మీలో చోటు లేదని ఆయన స్పష్టం చేశారు.

ఎవరైనా అభ్యర్థిపై ఎఫ్ఐఆర్ నమోదై ఉంటే వారు ఎప్పటికీ ఆర్మీలో భాగం కాలేరని అన్నారు.

''ఆర్మీలో అగ్నివీర్‌లుగా చేరాలనుకునేవారు... తాము ఎలాంటి ప్రదర్శనలు, విధ్వంసకాండలో పాల్గొనలేదని పేర్కొంటూ ఒక పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ లేకుండా ఎవరూ సైన్యంలో చేరలేరు. కాబట్టి నిరసన తెలుపుతోన్న విద్యార్థులంతా సమయాన్ని వృథా చేసుకోవడం మానేయాలి'' అని ఆయన సూచించారు.

ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత విద్యార్థుల్లో ఆగ్రహావేశాలను రేకెత్తించడానికి సంఘవిద్రోహ శక్తులతో కలిసి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు పని చేశాయని సైన్యాధికారులు ఆరోపించారు.

అగ్నిపథ్ పథకం పట్ల యువతలో ఇంత ఆగ్రహం చూడాల్సి వస్తుందని ఊహించలేదని వారు అన్నారు.

త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

సర్వీస్ తర్వాత అగ్నివీర్‌ల పరిస్థితి ఏంటి?

నాలుగేళ్ల సర్వీస్ తర్వాత సైన్యం నుంచి బయటకు వచ్చే జవాన్లు ఏం చేస్తారన్న ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

''ప్రతీ ఏడాది సుమారు 17,600 మంది సర్వీస్ ముగియకముందే రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. వారిని ఇలా అడిగేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తారని ఎవరూ వారిని అడగలేదు. ఇంకో మాట ఏంటంటే నాలుగేళ్ల తర్వాత 25 శాతం మంది అగ్నివీర్‌లు సైన్యంతో పాటే ఉంటారు. మిగిలినవారిని ఇతర విభాగాల్లో నియమించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ మేరకు రక్షణ, హోం మంత్రిత్వ శాఖ నుంచి కీలక ప్రకటనలు కూడా వచ్చాయి. దీని కోసం నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతున్నాం. కాలక్రమేణా ఈ దిశగా చాలా మార్పులు జరుగుతాయి. పోలీసు రిక్రూట్‌మెంట్‌లో అగ్నివీర్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సూచించింది. నాలుగు రాష్ట్రాలు హామీ కూడా ఇచ్చాయి. కాలక్రమేణా మిగతా రాష్ట్రాలు కూడా ఇదే పని చేస్తాయని ఆశిస్తున్నా'' అని ఆయన చెప్పారు.

ఇప్పటివరకు, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన 16 పీఎస్‌యూలు తమ ఉద్యోగాలలో 10% అగ్నివీర్లకు రిజర్వ్ చేస్తామని ప్రకటించాయి.

సెంట్రల్ పారామిలిటరీ బలగాలు, అస్సాం రైఫిల్స్ ఉద్యోగాల్లో కూడా అగ్నివీర్లకు 10% రిజర్వేషన్లు అమలు చేస్తామని హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్‌లో కూడా అగ్నివీర్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.

ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు

''ఆర్మీలో నాలుగేళ్లు పని చేసి బయటకు వచ్చే నాటికి అగ్నివీర్ల వయస్సు 21.5 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుంది. రిటైర్మెంట్ ప్యాకేజ్ కింద రూ. 11.71 లక్షలు లభిస్తాయి. వారికి బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు లభించేలా ఏర్పాట్లు చేస్తాం. సొంతంగా ఏదైనా వ్యాపారాలు నడుపుకోవచ్చు. శారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు వారు అనేక రకాల శిక్షణ తీసుకొని ఉంటారు. మీరే చెప్పండి 25 ఏళ్లకే ఎంతమందికి ఉద్యోగం దొరుకుతుంది'' అని ఆయన ప్రశ్నించారు.

''వికలాంగులుగా మారితే ప్యాకేజీ ఇవ్వాలనే నిబంధన తెచ్చాం. దేశసేవలో ప్రాణత్యాగం చేసిన అగ్నివీరులకు కోటి రూపాయల పరిహారం అందుతుంది. సియాచిన్‌లో పనిచేసే సైనికులకు ఇచ్చే అలవెన్సులు, సౌకర్యాలు అగ్నివీర్‌లకు కూడా లభిస్తాయి. సైన్యం నిబంధనల ప్రకారం అగ్నివీరులపై ఎలాంటి భేదభావం చూపట్లేదు. సర్వీస్ నుంచి బయటకు వచ్చే అగ్నివీరులను మరింత నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కోర్సులు కూడా ఏర్పాటు చేయనున్నాం'' అని తెలిపారు.

भारतीय सेना

ఫొటో సోర్స్, Getty Images

1989 నుంచే కసరత్తు

నియామకాల్లో ఈ మార్పును అమలు చేయడం గురించి గత కొన్నేళ్లుగా చాలా చర్చలు జరుగుతున్నాయని లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురీ తెలిపారు.

అన్ని దేశాల సైనిక నియామక ప్రక్రియను అధ్యయనం చేసి దీన్ని రూపొందించారని, దీనికి తుదిరూపు తీసుకు రావడంలో త్రివిధ దళాలతో పాటు భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ కూడా పనిచేశారని చెప్పారు.

''ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మార్చేందుకు 1989 నుంచి కసరత్తు జరుగుతోంది. కార్గిల్ యుద్ధం తర్వాత ఏర్పడిన కమిటీ కూడా దీన్ని సిఫార్సు చేసింది. జవాన్ల సగటు వయస్సు తక్కువగా ఉండాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. అందువల్లే గత రెండేళ్లుగా చాలా చర్చించి, అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టాలని సైన్యం నిర్ణయించింది. జూన్ 14న ప్రభుత్వం రెండు ముఖ్యమైన ప్రకటనలు చేసింది. మొదట కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 10.5 లక్షల ఉద్యోగాలను ప్రకటించారు. తర్వాత అగ్నిపథ్ పథకం కింద 46 వేల అగ్నివీర్ల నియామకానికి సంబంధించిన ప్రకటన వచ్చింది. కానీ, మీడియా కారణంగా అందరి దృష్టి అగ్నిపథ్ వైపు మళ్లింది'' అని ఆయన చెప్పుకొచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

సమతూకం

భారత సైన్యంలో యువకులు, అనుభవజ్ఞుల మధ్య సమతూకం తీసుకురావాల్సిన అవసరం ఉందని చాలా కాలంగా భావిస్తున్నట్లు పురీ చెప్పారు. ఈ కొత్త రిక్రూట్‌మెంట్ పథకంతో ఈ సమతూకం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

''కాలంతో పాటు సాంకేతికత కూడా మారుతోంది. ఆధునిక యుద్ధాలను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న యువకులు మాకు అవసరం. ఎందుకంటే యువత, సాంకేతికతను త్వరగా అందిపుచ్చుకుంటుంది. వయస్సు విషయంలో అగ్నిపథ్ పథకంలో ఎలాంటి మార్పు చేయలేదు. కరోనా మహమ్మారి వల్ల నష్టపోయిన వారికి మేలు చేసేందుకు ఈసారికి వయో పరిమితిని 23 ఏళ్ల వరకు పెంచాం'' అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)